1. ఎన్ని సమస్యలున్నా మాతోనే ఉంటూ అడుగడుగునా కాపాడిన బాబా
2. శ్రీసాయినాథుని కృపతో పిల్లల పెళ్లిళ్లు
ఎన్ని సమస్యలున్నా మాతోనే ఉంటూ అడుగడుగునా కాపాడిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను బాబా భక్తురాలిని. బాబా ప్రేమ అపరిమితమైన వెన్నెల. ఎన్ని కథలు, లీలలు విన్నా తనివితీరని అమృతవాణి సాయిదేవుని మహిమ. నా జీవితమే ఆయన భిక్ష. ఎన్నో లీలలు, ఎన్నో శిక్షణలు, రక్షణలు, పర్యవేక్షణలు. "సాయీ! మిమ్మల్ని అందరిలోనూ చూసే బుద్ధిని మాకు ప్రసాదించండి. నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యానికి కారణమైన నా బద్ధకాన్ని మన్నించండి దేవా!". ఇక, సాయితండ్రి నాకు చూపించిన లీల విషయానికి వస్తే...
2022, జూన్ మూడో వారంలో కొన్ని రోజులు సరదాగా గడుపుదామని మేము, మా స్నేహితులిద్దరి కుటుంబాలు కలిసి ఒక ట్రిప్పుకు వెళదామని అనుకున్నాము. ప్రయాణానికి పది రోజుల ముందు నేను, మా బాబు బాగా గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందిపడ్డాము. ఎందుకైనా మంచిదని రెండుసార్లు కోవిడ్ టెస్టు చేయించుకుంటే, బాబా దయవల్ల నెగిటివ్ వచ్చింది. అయినా ఫ్రెండ్స్ ఇబ్బందిపడకూడదని, మా ప్లాన్ అప్సెట్ కాకూడదని ఏవో మందులు వేసుకుని, బాబా మీద భారం వేసి గురువారంనాడు ఇంటి నుండి బయలుదేరాం. మేము తిరిగి రాలేనంత దూరం, అంటే ఉన్న రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోయాక నా భర్త తన పర్సు ఇంట్లో మర్చిపోయారని తెలిసి ఇంక మాకు టెన్షన్ మొదలైంది. బాబా తమ భక్తులను అటువంటి స్థితిలో వదిలిపెడతారా? ఆయన ప్రేరణ వలన మా సిటీలో ఉంటున్న ఒక ఫ్రెండ్‌ని రిక్వెస్ట్ చేస్తే, తను వెంటనే మా ఇంటికి వెళ్లి, పర్సు ఒక్కరోజులో చేరేలా మాకు కొరియర్ చేశారు. అసలు అది సాధ్యమవుతుందని నేను అనుకోకపోయినప్పటికీ, ఎక్కడో 'బాబా దారి చూపిస్తార'ని ధైర్యంతో ఉన్నాను. అదే నిజమై ఆయన మా మొదటి సమస్యను గట్టెక్కించారు.
అలా ట్రిప్పు మొదలైన దగ్గరనుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ మానసిక సంఘర్షణ నడుస్తూ ఉండేది. నా భర్త కొంచెం సున్నిత స్వభావి. ఇతరులతో సర్దుకుపోయే సహనం ఆయనకి కొంచెం తక్కువ. నెమ్మదిగా ఆయన మా ఫ్రెండ్స్ చేసేవి నచ్చక ప్రతిదానికీ నా వద్ద ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి ట్రిప్పు మొదలైన దగ్గరనుండి నేను, "బాబా! గొడవలు ఏమీ అవకుండా మమ్మల్ని ఇంటికి చేర్చండి" అని బాబాకి మ్రొక్కుతూనే ఉన్నాను. కానీ ఒకరోజు ఫ్రెండ్స్‌తో మావారికి చిన్న డిస్కషన్ అవనే అయింది. సహజంగానే ఎన్ని ఉన్నా బయటికి తెలియకూడదనుకునే నేను 'బాబా ఇలా ఎందుకు చేశారో' అని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే అలా అనుకోవడం నా అహంకారమేమో! అది తెలియజేయడానికి బాబా అలా జరిగేలా చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా బాబా దయవల్ల మా ఫ్రెండ్స్ ఆ పరిస్థితిని చాలా బాగా అర్థం చేసుకుని నా భర్తతో మంచిగా మాట్లాడి సమస్యని పరిష్కరించారు. ఎన్ని సమస్యలున్నా బాబా మాతోనే ఉన్నారు, అడుగడుగునా కాపాడారు కాబట్టి మేమంతా క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నాము. అంతా బాబా దయ.
ఇకపోతే, నేను మామూలుగా, 'పొద్దున్న లేస్తూనే బాబా స్మరణతో రోజు ప్రారంభిస్తున్నప్పటికీ ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయ'ని అనుకుంటూ ఉంటాను. కానీ ఇదంతా నా కర్మఫలమేమో! అందుకే నాకు నిరంతర సంఘర్షణ తప్పట్లేదు. అయినా హేమాడ్‌పంత్ చెప్పినట్టు బాబా తల్లి తాబేలులా ఈ పిల్ల తాబేలును తమ దృష్టితో రక్షిస్తూనే ఉన్నారు, ఎల్లప్పుడూ దారి చూపిస్తూనే ఉన్నారు. ఆయన మన మార్గబంధువు. ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం. "నా తప్పుల్ని, అహంకారాన్ని మన్నించండి బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మీ అనుగ్రహాన్ని కురిపించండి దేవా. సదా మీ స్మరణలో ఉండేలా అనుగ్రహించండి బాబా".
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!
శ్రీసాయినాథుని కృపతో పిల్లల పెళ్లిళ్లు
సాయిబంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నడుపుతున్న సాయికి నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. నేను హైదరాబాద్ నివాసిని. నేను ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా కొన్ని అనుభవాలను సాయిబంధువులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. ముందుగా నా అనుభవాన్ని పంచుకోవడం చాలా ఆలస్యమైనందుకు శ్రీసాయినాథుడిని క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు పిఠాపురం, శ్రీక్షేత్ర గాణుగాపురం వెళుతూ ఉంటాను. అలాగే 2021, సెప్టెంబరులో నేను పిఠాపురం వెళ్లి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన్‍లో గురుచరిత్ర పారాయణ చేశాను. ఒకరోజు పారాయణ అయిన తర్వాత నేను లాకర్ రూములో కూర్చుని, "స్వామీ! మూడు, నాలుగు సంవత్సరాల నుంచి మా అబ్బాయి పెళ్లి విషయమై ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ తనకి ఏ సంబంధమూ కుదరడంలేదు. ఈ వారం పారాయణ పూర్తయ్యేలోగా మా అబ్బాయికి ఒక మంచి సంబంధం చూపించు తండ్రీ" అని స్వామిని కోరుకున్నాను. అదే లాకర్ రూములో మహారాష్ట్ర నుంచి వచ్చిన గురుపరంపరకి చెందిన శ్రీమద్ ప్రకాష్ మహారాజ్‌జీ అనే ఆయన ఉన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు ఆయనతో అంతకుముందు పరిచయం కూడా లేదు. అలాంటిది ఆయన నాతో, "నీకు మంచిరోజులు వచ్చాయి. నీవు ఏమి ఆశిస్తున్నావో ఆ పని త్వరలో పూర్తికానుంది. ఈరోజు, రేపు 11 ప్రదక్షిణలు చొప్పున మూడుసార్లు చేసి మీ ఇంటికి వెళ్లి, పూజగదిలో దేవునికి హారతివ్వు. వారం రోజులలో మీ అబ్బాయికి మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి శుభలేఖ అచ్చు వేసిన తర్వాత నాకు ఫోన్ చేయి" అని చెప్పి తమ ఫోన్ నెంబర్ ఇచ్చారు. శ్రీసాయినాథుడే ఆయన రూపంలో నాకు అలా సెలవిచ్చారు. ఆయన చెప్పినట్లుగా అన్నీ జరిగి 2022, ఫిబ్రవరి 11వ తేదీన మా అబ్బాయి పెళ్లి చేయడానికి నిశ్చయమైంది. మా అబ్బాయి బెంగళూరులో స్థిరపడ్డాడు. అమ్మాయిది కూడా బెంగుళూరే. పెళ్లి పనుల నిమిత్తం నేను, నా భార్య, మా చిన్నబ్బాయి హైదరాబాదు నుండి బెంగళూరుకి బయలుదేరే సమయానికి మా పెద్దబ్బాయికి జ్వరంగా ఉంది. మేము బెంగళూరు చేరుకున్న మరుసటిరోజుకి మా అందరికీ కూడా జ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే, అందరికీ కోవిడ్ అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఎవరు టెస్టు చేయించుకున్నా వాళ్లకి కోవిడ్ అని వస్తోంది. డాక్టరుని సంప్రదిస్తే, "వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్ళకి అట్లా వస్తుంది. ఏం భయపడవలసిన పనిలేదు" అని చెప్పారు. మాకు చాలా భయమేసి భారం శ్రీసాయినాథునిపై వేశాము. ఆయన దయవల్ల కేవలం నాలుగు రోజుల్లో మేమందరం కోవిడ్ నుండి కోలుకున్నాము. ఇక చకచకా పెళ్లి పనులు పూర్తిచేశాము. బాబా దయతో 2022, ఫిబ్రవరి 11, ఉదయం గం. 8:15 నిమిషాలకి పెళ్లి చాలా దివ్యంగా జరిగింది.
తర్వాత నేను శ్రీప్రకాష్ మహరాజుగారితో మాట్లాడినప్పుడు ఆయన మా రెండవ అబ్బాయి పెళ్లి కూడా త్వరలో జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే బాబా ఆశీస్సులతో ఉగాది తర్వాత 2022, ఏప్రిల్ 15వ తేదీన మా రెండవ అబ్బాయి పెళ్లి హైదరాబాదులో దివ్యంగా జరిగింది. ఆ పెళ్లిలో బంధువులు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సాయి ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్లి ఘనంగా జరిపించారు. మన సాయి ఉండగా భయపడవలసిన పనిలేదు. శ్రీసాయినాథుని దయవలన ఇప్పుడు అందరమూ చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన కృపతో త్వరలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా!"
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Ome sri sai ram🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete