సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1264వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య సమస్యల నుండి బాబా ప్రసాదించిన ఉపశమనం
2. సాయితండ్రి అనుగ్రహం
3. తేలు నుండి కాపాడిన బాబా

ఆరోగ్య సమస్యల నుండి బాబా ప్రసాదించిన ఉపశమనం

 

'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు పద్మావతి. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. మా చిన్నమ్మాయి ఉద్యోగ విషయంలో తనకి ఉద్యోగం వస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని నేను అనుకున్నాను. అలా అనుకున్న రెండో నెలలోనే మా అమ్మాయికి మంచిది, అది కూడా నచ్చిన ఉద్యోగం వచ్చింది. వెంటనే జాయిన్ అవడం కూడా జరిగింది. ఇదంతా బాబా కృప. "థాంక్యూ బాబా". అంతేకాదు, తనకి కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలున్నాయి. ఫుడ్ ఎలర్జీ వల్ల తనకి ఎప్పుడూ UTI(urinary tract infections) సమస్య రావటమో, స్టమక్ అప్సెట్ కావటమో జరుగుతుంది. ఆ సమయంలో ఏ మందులూ పనిచేయవు, నొప్పి భరించలేనిదిగా ఉంటుంది, నార్మల్ అవడానికి పది, పదిహేను రోజులు పడుతుంది. ఆ విషయంలో కూడా నేను బాబాని, "బాబా! ఈ సమస్య నుండి అమ్మాయిని కాపాడండి" అని వేడుకున్నాను. అలా బాబాని వేడుకోగానే అమ్మాయి ఆరోగ్యం చాలావరకు మెరుగైంది. ఎప్పుడైనా తనకి సరిపడని ఆహార పదార్థాలు తీసుకుంటే, అలెగ్రా180 అనే మెడిసిన్ వేసుకోమని డాక్టరు ఇచ్చారు. అలా సమస్య రాకుండా మేనేజ్ చేసుకునే శక్తిని బాబానే ఇచ్చారు. "థాంక్యూ బాబా".


2022, ఫిబ్రవరిలో నాకు కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. డోలో-650 వేసుకుంటే జ్వరం తగ్గింది. అయితే మూడోరోజున నా చేతివేళ్ళు వంగలేదు. కొద్దిగా కీళ్లనొప్పి అనిపించింది. ఆ సమయంలో ఇంట్లో బంధువులున్నారు. మా కజిన్ ఒక డాక్టరు. తనకి ఫోన్ చేసి మాట్లాడితే, "యూరిక్ యాసిడ్, రా ఫ్యాక్టర్ టెస్టు చేయించమ"ని చెప్పింది. సరేనని టెస్టు చేయించుకుంటే, యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంది, రా ఫాక్టర్ 200 ఉంది. అప్పుడు డాక్టరు అది వైరల్ ఫీవర్ అని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇస్తే, వాటితో నాకు రిలీఫ్ వచ్చింది. కానీ 15 రోజులకి మళ్ళీ కీళ్లు గట్టిపడిపోయాయి (కీళ్ల పెడసరం, జాయింట్ స్టిఫ్నెస్). అప్పుడు డాక్టరు స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ మందుల ప్రభావం వలన తగ్గింది. కానీ మళ్ళీ ఒక నెలకి నొప్పి మొదలైంది. మా జనరల్ ఫిజీషియన్, "రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం). ఎక్కువ కాలం మందులు వాడాల"ని చెప్పారు. నేను బాబాకి మ్రొక్కుకుని, రుమటాలజిస్ట్ దగ్గరకు వెళ్లాను. ఆవిడ అన్ని టెస్టులూ చేసి, "ప్రస్తుతానికి మందులు అవసరం లేదు. మళ్లీ సమస్య వస్తే, చూద్దామ"ని అన్నారు. బాబా కృపవల్లే మందులు అవసరం లేకుండా పోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను ఆగస్టులో ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజన్ అయి నాకు విరోచనాలు అవడం, వికారంగా ఉండటం మొదలైంది. నాకు యాంటీబయాటిక్స్ పడవు, రియాక్షన్ వస్తుంది. అందువలన నేను బాబాని తలచుకుని, "టాబ్లెట్స్ అవసరం లేకుండా నాకు నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నా ఆరోగ్యం కుదుటపడింది. అలాగే, బెంగళూరులో ఉన్న మా పిల్లల దగ్గరకు క్షేమంగా వెళ్ళొస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటానని అనుకున్నాను. బాబా కృపవల్ల నాకు ఏ ఇబ్బందీ కలగలేదు. అంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఇదివరకు వెరికోస్ వెయిన్స్‌కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అది ఇప్పుడు మళ్ళీ ఇబ్బందిపెడుతోంది బాబా. ఆ సమస్య కూడా లేకుండా చూడండి బాబా. మా కుటుంబాన్ని సదా కాపాడండి బాబా".


సాయితండ్రి అనుగ్రహం


ముందుగా సాయిబంధువులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నమస్కారం. నేను సాయిభక్తురాలిని. సాయిని నమ్ముకున్న తరువాత జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనడానికి ఆ తండ్రి మనకు ప్రసాదించే అనుభవాలే ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇదివరకు నా మొదటి అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకున్నప్పుడు చాలా సంతోషించాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను కొంచెం కఠినమైన రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అప్లై చేసి, "అంతా మీ దయ బాబా" అని బాబాకి చెప్పుకుని, ఆయనపై నమ్మకంతో నా శక్తి వంచన లేకుండా ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. మొదటి పరీక్ష 2022, జూన్ 23న జరిగింది. మనసులో బాబాను తలుచుకుని పరీక్ష చాలా బాగా వ్రాశాను. 2022, జూన్ 24న జరిగిన రెండవ పరీక్ష పేపర్ చాలా కష్టంగా వచ్చింది. అప్పడు కూడా నేను మనసులో బాబాని తలచుకుని పరీక్ష వ్రాశాను. బాబా కృపవల్ల పేపర్ కఠినంగా ఉన్నప్పటికీ నేను బాగా వ్రాయగలిగాను. రిజల్ట్స్ వచ్చాక చూస్తే, నేను ఆ రెండు పరీక్షలలో పాస్ అయ్యాను. అంతా సాయితండ్రి అనుగ్రహం.


2022, జూన్‍లో మావారికి రక్త పరీక్ష చేస్తే, రిపోర్టులో కొన్ని వాల్యూస్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు వచ్చింది. డాక్టరు ఒక నెల మందులు వాడి, మరల టెస్ట్ చేయించుకుని కలవమన్నారు. ఆ సమయంలో నేను బాబాను ఎంతగానో వేడుకున్నాను. నెల తరువాత బ్లడ్ టెస్ట్ చేయిస్తే, రిపోర్ట్ నార్మల్‍గా వచ్చింది. ఇదంతా సాయితండ్రి మా మీద చూపించిన ప్రేమామృతం. ఈవిధంగా బాబా మాటల్లో చెప్పలేనంత ప్రేమను, దయను భక్తులందరి మీద చూపిస్తూ ఉంటారు. పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీసాయిబాబా. ఆయన కృపవలన గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన 41 రోజుల సాయి నామజప యజ్ఞంలో నేను కూడా పాలుపంచుకున్నందుకు ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లుగా నా అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను తండ్రి".


శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!


తేలు నుండి కాపాడిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు తిలోత్తమ. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకోబోతున్నాను. 2022, జులై 15, రాత్రి మారికి బాత్రూం దగ్గర ఒక తేలు కనిపించింది. ఆయన వెంటనే దాని మీద ఒక బకెట్ బోర్లించారు. కొన్ని క్షణాల తరువాత చూస్తే, బకెట్ కింద ఆ తేలు లేదు. దగ్గర్లో అంతా చూసినా తేలు కనిపించలేదు. దాంతో మేము బాత్రూం కన్నం గుండా అది వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాము. అయినా ఎందుకైనా మంచిదని ఎప్పుడూ నేల మీద పడుకునే మేము ఆరోజు మంచం మీద పడుకున్నాము. రాత్రి 2.30 అవుతుండగా ఒక్కసారిగా నాకు ఎందుకో మెలుకువ వచ్చి, "ఒకసారి లైట్లు వేద్దామ"ని మావారితో అన్నాను. అందుకాయన సరేనని లైట్ వేస్తే,  తేలు గదిలోనే  తిరుగుతూ కనిపించింది. బాబానే మెలుకువ వచ్చేలా చేసి ఆ తేలు మా కంటపడేలా చేసి మమ్మల్ని కాపాడారు. సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయంలో హేమాడపంత్ భుజం మీద పడిన తేలును రక్షించినట్లే బాబా మమ్మల్ని రక్షించారు. "బాబా! మీకు అనంతకోటి ధన్యవాదాలు. వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా మాకు ఇంకా సంతానం లేదు. దయతో మాకు త్వరగా సంతానం కలిగేలా ఆశీర్వదించండి. అలా జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను తండ్రి".


7 comments:

  1. ఓం సాయి తండ్రి నీకు శత కోటి నమస్కారాలు. తేలు అనుభవం బాగుంది. బాబా పాము ,తేలు నుండి రక్షణ యిచ్చెదరు.మీ సాయి సన్నిధి అభిమానిని.నా ,సాయి అనుభవాలు 5 ప్రచురించారు మీ రు. సాయి నాథ విథయ్ మే సదురుగురు సాయి నా థాయనమం

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Samardha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Seat ravali thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo