సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1251వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా, గురువుగారి రక్షణ
2. కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబా
3. అడిగినంతనే నా కోరిక తీర్చిన బాబా

బాబా, గురువుగారి రక్షణ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!!


నా పేరు ప్రియాంక. మాది తాడికొండ. నా వయస్సు 25 సంవత్సరాలు. బాబా, గురువుగారు మాపై చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా అమ్మగారికి 2022, మార్చి నుండి ఎడమ కంటి చూపు తగ్గింది. చూపు తగ్గినప్పటికీ మా అమ్మగారు తన దినచర్యను శ్రీసాయిసచ్చరిత్ర, సాయిదీవెన గ్రంథాల పారాయణతోనూ, సాయినామంతోనూ ప్రారంభిస్తుండేది. మే నెల రెండు నెలలపాటు గురువుగారి ఫోటో చూస్తున్న ప్రతీసారీ అమ్మకు గురువుగారు ఒక కన్ను మూసుకొని కనిపిస్తుండేవారు. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎప్పుడు గురువుగారి ఫోటో చూసినా అలాగే కనిపిస్తుండటంతో, “మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? గురువుగారికి నచ్చని పని మనమేమన్నా చేస్తున్నామా? ఎందుకు గురువుగారు నన్ను ఒక కన్నుతో మాత్రమే చూస్తున్నారు?” అని మా అమ్మగారు నన్ను అడగసాగారు. ఇది ఇలా ఉండగా, నాకు ఒకరోజు ఒక గర్భిణీ స్త్రీకి గ్రుడ్డిపిల్లలు పుట్టినట్లుగా స్వప్నం వచ్చింది. ఆ సమయంలో తాడికొండలోని గురుబంధువులలో ఒకరు గర్భిణీగా ఉండడంతో నేను ఎవరితోనూ ఆ స్వప్నం గురించి చెప్పుకోలేదు. ఒకరోజు మా అమ్మగారికి నిద్రలేవడంతోనే ఎడమకన్ను చిన్నదిగా అయ్యి, తీవ్రమైన తలనొప్పి రావడంతో, తెలిసినవారి దగ్గర చూపించగా, “కంటి నరం డ్యామేజ్ అయివుండవచ్చు. కొంచెం పెద్ద హాస్పిటల్లో చూపిస్తే మంచిది” అని చెప్పారు. దాంతో మా అమ్మగారిని మధురై(తమిళనాడు)లోని కేవలం కంటికి సంబంధించిన హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్లు మా అమ్మగారికి కొన్ని టెస్టులు చేసి, “కంటి నరం డ్యామేజ్ అయింది. ఒక నెలరోజులు టాబ్లెట్స్ వాడిన తరువాత మళ్ళీ చెక్ చేసి సర్జరీగానీ లేదా ఇంజెక్షన్స్‌గానీ చేస్తాము. నిజానికి ఆ డ్యామేజ్ అయిన నరాన్ని బాగుచేయలేము. కాకపోతే ఆ నరం మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మాత్రమే ఈ సర్జరీ అయినా లేదా ఇంజెక్షన్స్ అయినా” అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు మాకు అర్థమైంది, గురువుగారు ఎందుకు మా అమ్మకి ఒక కంటితో మాత్రమే చూస్తున్నట్లు కనిపించారో, నాకు స్వప్నంలో గ్రుడ్డిపిల్లలు కనిపించేలా చేశారో. అమ్మకి రాబోయే సమస్య గురించి ఆ విధంగా గురువుగారు మమ్మల్ని ముందుగానే హెచ్చరించారన్నమాట. అయితే, మధురై నుండి తిరిగి వచ్చినప్పటినుండి గురువుగారు రెండు కన్నులతో చూస్తున్నట్లుగా మా అమ్మగారికి కనిపిస్తున్నారు. కొన్నిరోజులకి, ‘చిత్తూరులో సాయినామసప్తాహం జరుగుతుంది’ అన్న విషయం మాకు తెలిసింది. మా అమ్మగారు చిత్తూరు వెళదామని అంటే, “డాక్టర్స్ ఎక్కువ ప్రయాణం చేయవద్దు అన్నారు కదా! ఈసారికి వద్దులే. చిత్తూరు నామసప్తాహంలో జరిగే సాయినామం టెలిగ్రామ్‌లో వినిపిస్తున్నారు, మనం ఇంట్లో ఉండే విందాం” అని చెప్పి టెలిగ్రామ్‌లో సాయినామం పెట్టాను. బాబా నామం వింటుండగా మా అమ్మగారు గట్టిగా ఏడ్చేసి, “ప్లీజ్, నన్ను చిత్తూరు నామసప్తాహానికి తీసుకుని వెళ్ళమ”ని బ్రతిమిలాడారు. దాంతో, ‘ఏది ఏమైనా గురువుగారు చూసుకుంటారు’ అని అనుకుని, అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని చిత్తూరు నామసప్తాహానికి వెళ్ళాము. పల్లకీ ఉత్స్తవం జరుగుతుండగా, ‘మా అమ్మగారిని బ్లెస్ చేయమ’ని బాబాను, గురువుగారిని ఆర్తిగా అడిగాను. నామసప్తాహం చివరిరోజున నేను కళ్ళుమూసుకొని బాబా నామం చెప్పుకుంటూ ఉండగా, గురువుగారు మా అమ్మగారి ప్రక్కన నిలుచుని తన తలపైన చేయి ఉంచి ఆశీర్వదిస్తునట్లుగా నాకు కనిపించారు. అప్పటివరకు మా అమ్మగారి కంటి గురించి బాధపడుతున్న మాకు ‘ఇంక అంతా గురువుగారే చూసుకుంటారు’ అన్న నమ్మకం వచ్చింది. చిత్తూరు నుండి వచ్చిన రెండురోజులకి నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను మూడు నెలలకి సరిపడా టాబ్లెట్స్ కొంటున్నాను. బిల్లు మొత్తం మూడు వేల రూపాయలు అయింది. ఇదిలా ఉండగా ఒక వారంరోజులకి మా అమ్మగారు మధురై వెళ్లారు. టెస్టులు చేయించుకొని, డాక్టర్ని కలిసి మాట్లాడిన తరువాత నాకు కాల్ చేసి, “ప్రస్తుతానికి సర్జరీగానీ, ఇంజక్షన్‌గానీ ఏమీ అవసరం లేదు. మూడు నెలలపాటు వాడమని టాబ్లెట్స్ ఇచ్చారు” అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు నా స్వప్నం గుర్తుకువచ్చి, “బిల్లు మొత్తం మూడు వేలు అయిందా?” అని అడిగితే, మా అమ్మగారు, “ఆ, అవును. బిల్లు మొత్తం 2,800 రూపాయలు అయింది. నీకెలా తెలుసు?” అన్నారు. అప్పుడు నాకు వచ్చిన స్వప్నం గురించి తనతో చెప్పాను. మా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. బాబా, గురువుగారి రక్షణ ఎలా ఉంటుందో మాకు మరోసారి అనుభవం అయింది. వారి అనుగ్రహం వల్ల ఇప్పుడు మా అమ్మగారికి అంతకుముందులా కన్ను చిన్నగా అవడంగానీ, తలనొప్పిగానీ ఏమీ లేవు. ఇంతటి అనుగ్రహాన్ని మాపై చూపిన బాబాకి, గురువుగారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి పేరుపేరునా ధన్యవాదాలు. ముందుగా నా అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా బాబాకి క్షమాపణలు చెప్పుకుంటూ నా అనుభవాలు పంచుకుంటున్నాను. మావారు ఒక డ్రైవరు. ఆయనకి కరోనాకాలంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే కలకత్తా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు డ్యూటీ వేస్తుండేవారు. మా ఆర్థిక పరిస్థితి కారణంగా తప్పనిసరై మావారు ఆయా ప్రాంతాలకు డ్యూటీ మీద వెళ్తుండేవారు. అయినప్పటికీ బాబా మమల్ని కరోనా బారినపడకుండా, మా ఇంటి ఓనర్స్ ఏమీ అనకుండా కరోనా కాలమంతా బాబా మమ్మల్ని కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు


కరోనా కాలంలో ఒకసారి హఠాత్తుగా మా అమ్మకి జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు వచ్చాయి. అప్పుడు నేను ఏడ్చుకుంటూ, "బాబా! అమ్మకి జ్వరం తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ రాత్రి గం.1:20నిమిషాలకి లేచి చూస్తే  అమ్మకి నార్మల్గా ఉంది. మళ్ళీ జ్వరం రాలేదు. అది మొదలు నేను మా ఆయనకి, బాబుకి ఏ చిన్న అనారోగ్యం ఉన్నా బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకుంటున్నాను. "ఏవైనా పంచుకోవడం మర్చిపోయి ఉంటే క్షమించండి బాబా".


ఒకసారి మా చిన్నబావగారు జారి పడటం వల్ల కాలు బెణికి ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్క, "నా భర్తకి నార్మల్ అయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుంది. బాబా దయవలన అతను కొద్దిరోజుల్లో నెమ్మదిగా నడవడం, బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టారు. "ధన్యవాదాలు బాబా. నాకు కోపం ఎక్కువ బాబా. దాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండేటట్లు అనుగ్రహించండి".


అడిగినంతనే నా కోరిక తీర్చిన బాబా

 

సాయి భక్తులకు, బ్లాగును విజయవంతంగా నిర్వహిస్తున్న వారికి నా నమస్కారం. నా పేరు అంకోజు స్వాతి. నేను సాయి భక్తురాలిని. నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తున్నారు. బాబా అనుగ్రహం వల్ల 2019లో మాకు ఒక బాబు పుట్టాడు. తనకి మేము 'సాయి సామ్రాట్' అని పేరు పెట్టుకున్నాము. మావారికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. మేము ఈసారి పాప పుట్టాలన్న కోరికతో సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో నేను రెండోసారి గర్భం దాల్చాలి" అని బాబాను కోరుకుని, "ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. నేను, మావారు ఇద్దరమూ సాయి స్తవనమంజిరి 15 రోజుల పారాయణ చేసాము. బాబా దయతో 2022, జూన్ 16న నేను ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. మా సంతోషానికి అవధులు లేవు. అడిగినంతనే బాబా నా కోరిక తీర్చారు. "ధన్యవాదాలు బాబా. మీ కృప, దయ, కరుణలు ఎల్లప్పుడూ మాపై ఉండాలి తండ్రి".


7 comments:

  1. Om sai ram
    First experience is very nice, baba and guruvugaru mee Krupa Maa meeda kuda sada varshinchalani korukuntunnanu

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. మొదటి అనుభవం చాలా బాగుంది. సాయి ని నమ్మకం పెట్టుకుంటే మన ఆరోగ్యం ఆ తండ్రి చూసుకుంటారు. నా కు జీర్ణ సమస్యలు వస్తే ఆ బాబా గారే కాపాడేరు.మా అబ్బాయి డాక్టర్ నన్ను బాగా చూశుకుని వైద్య సేవలు అందించాడు. చాలా బాధ పడాల్సి వచ్చింది. ఆ సాయి దయ వలన తగ్గింది

    ReplyDelete
  4. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Ome sri sai ram🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo