సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1263వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలేవైనా పరిష్కరించే బాబా
2. ఎంతమంది ఉన్నా తీరని సమస్య సాయిబాబాను నమ్మితే పరిష్కరింపబడింది

సమస్యలేవైనా పరిష్కరించే బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు ఉమ. మాది కృష్ణాజిల్లాలోని ఘంటసాల గ్రామం. నేను సాయిబాబా భక్తురాలిని. బాబా తమ భక్తులను పరీక్షిస్తారని అంటారు. ఇలాంటి అనుభవాలు నాకూ జరుగుతున్నాయి. 2022, జులై మొదటివారంలో నా బంగారం వస్తువులు కొన్ని కనపడలేదు. నేను ఎంతో కంగారుపడి అంతటా వెతికాను. కానీ, అవి ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను మనసులో బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! ఆ బంగారం వస్తువులు కనపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండు రోజుల్లో నా వస్తువులన్నీ కనిపించాయి. ఇలా బాబా ఒక సమస్యను ఇచ్చి, మరలా తామే పరిష్కరిస్తున్నారు. 2022, జూన్ నెల చివరివారంలో నేను తీవ్రమైన కడుపునొప్పితో మూడురోజులు చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి, "కడుపునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా ఎంతో దయతో నా కడుపునొప్పిని తగ్గించి తమ ఊదీ మహిమను నాకు తెలియజేశారు. నాకు మానసిక ఆనందాన్ని, ప్రశాంతతను ప్రసాదించారు.


2021, మే నెలలో మా తమ్ముడు కోవిడ్‌తో చనిపోయాడు. మరుసటినెల జూన్‌లో మా మావయ్యగారు అనారోగ్యంతో చనిపోయారు. వెంటవెంటనే కుటుంబంలోని ఇద్దరు చనిపోవడంతో మా కుటుంబమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. బాబాతో సహా ఎందరో దేవుళ్ళను మ్రొక్కుకున్నా ప్రయోజనం లేకపోయింది. దుఃఖం నుండి బయటపడటానికి మాకు కొంత సమయం పట్టింది. "పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించక తప్పద"ని బాబా అంటారు. అదే జరిగి ఉంటుంది. అప్పటినుంచి మేము ఒక సంవత్సరం పాటు ఏ గుడికీ వెళ్ళలేదు. 2022, జూన్ నెలతో మా మావయ్యగారు చనిపోయి సంవత్సరం పూర్తవడంతో నేను మొదటిసారి గురుపౌర్ణమి సందర్భంగా బాబా గుడికి వెళదామని అనుకున్నాను. కానీ, సరిగా అదే సమయంలో నాకు ఇబ్బందిరోజులు ఉండటం వలన గుడికి వెళ్ళడానికి కుదరదేమోనని భయమేసింది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల గురుపౌర్ణమినాడు ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను మిమ్మల్ని దర్శించుకుని కొంతమంది పేదలకు అన్నదానం చేసుకోగలిగితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన నాకు ఎలాంటి విఘ్నాలూ ఎదురుకాలేదు. సంతోషంగా గురుపౌర్ణమిరోజున బాబా దర్శనం చేసుకుని కొంతమంది పేదలకు అన్నదానం చేశాను. అంతేకాదు, బాబా కృపవలన ఆరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం, మరుసటిరోజు మా ఊరి గ్రామదేవత, మా కుటుంబ ఆరాధ్యదేవత అయిన శ్రీకోటముత్యాలమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నాను. నా మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. 


2022, జూలై మూడవవారంలో నేను తీవ్రమైన జలుబు, జ్వరంతో చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాకి నా బాధ చెప్పుకుని, ఊదీ నోట్లో వేసుకుని, "నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించి, నాకు నయం చేయండి" అని బాబాని వేడుకున్నాను. అప్పుడు నాకు నేను చేసిన పొరపాటు ఒకటి గుర్తుకొచ్చింది. వెంటనే బాబాకి నమస్కరించి, "జ్వరం తగ్గిన తరువాత నేను మర్చిపోయిన విషయాన్ని, మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజే నా జ్వరం తగ్గిపోయింది. ఇకపోతే, నేను మర్చిపోయిన విషయం ఏమిటంటే, గురుపౌర్ణమి ముందురోజు మా ఊరిలో, చుట్టుప్రక్కల గ్రామాలలో తుఫాన్ సమయంలోలాగా గాలి బాగా తీవ్రంగా వీచింది. ఆ గాలికి మా నాన్నవాళ్లకున్న గేదెల చావడి పడిపోతుందేమోనని భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఆ చావడి పడకుండా చూసి గేదెలను కాపాడండి" అని వేడుకున్నాను. బాబా దయచూపారు. ఈ విషయాన్ని నేను మర్చిపోయినప్పటికీ బాబానే గుర్తుచేసి మీతో ఇలా పంచుకునేలా చేశారు. నేను బాబాకి మ్రొక్కుకున్నట్లు నా అనుభవాలను ఇలా బ్లాగులో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. నేను చేసిన పొరపాటును క్షమించండి. ఇలా ఇంకెప్పుడూ మర్చిపోకుండా చూడండి బాబా. మా తమ్ముడు మరియు మా మామయ్యగార్ల ఆత్మలకు శాంతిని చేకూర్చండి బాబా. మా అన్నయ్యకి మంచి సంతానాన్ని ప్రసాదించండి బాబా. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడండి బాబా. తెలిసీతెలియక మేము చేసే తప్పులను మన్నించి అందరినీ చల్లగా చూడండి బాబా. త్వరలో మీ ఊదీ నాకు చేరేలా అనుగ్రహించండి బాబా".


ఓం సాయిబాబా నమో నమః!!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

సర్వం సాయిమయం!!!


ఎంతమంది ఉన్నా తీరని సమస్య సాయిబాబాను నమ్మితే పరిష్కరింపబడింది


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ఈ బ్లాగ్ నిర్వాహకులకు, తోటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు జయ. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. గత 25 సంవత్సరాల నుండి నేను సాయిభక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా నేను సాయిబాబానే ప్రార్థిస్తాను. సాయిబాబా నాకు అండగా ఉంటూ నాకెంతో ధైర్యాన్నిచ్చి నా సమస్యను పరిష్కరిస్తుంటారు. నాకు పెళ్ళయిన దగ్గరనుండి ఎప్పుడూ సమస్యలతోనే గడిచిపోయింది. మావారు తాను తప్పులు చేస్తూ నన్ను తప్పుపడుతుంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. మాకు ఒక బాబు, పాప. 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు మా బాబు, 'మా ఇంటికి పెద్దయ్య- సాయిబాబా తాతయ్య' అని పాడుతుండేవాడు. అది వింటుంటే నాకు చాలా చాలా సంతోషమేసేది. ఎక్కడా వినకుండా తనంతట తానే అలా మా బాబు పాడుతుంటే, బాబానే వాడి చేత అలా పలికించి, 'మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్తున్నార'ని అనిపించేది. అప్పటినుండి నేను కూడా బాబాను 'సాయిబాబా తాతయ్య' అనే అనుకుంటాను. ఈమధ్య నాకు, 'బాబు అంటే చిన్నవాడు, మరి నా వయస్సు 47 సంవత్సరాలు. నేను సాయిబాబాను తాతయ్య అనవచ్చో, లేదో' అని ఒక సందేహం వచ్చింది. దేరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో, ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం చనిపోయిన మా తాత మా ఇంట్లో మంచం మీద కూర్చుని ఉండగా ఎదురుగా గోడకు సాయిబాబా ఫోటో ఉంది. ఇంకా, ఆ కలలోనే నేను ఎవరితోనో సాయిబాబా ఫోటోను చూపిస్తూ, "నేను సాయిబాబాను మా తాత అనే అనుకుంటున్నాను" అని చెప్తున్నాను. ఇంకేముంది? నా సందేహం తీరిపోయింది. శ్రీసాయిబాబానే నేను తనను 'తాతయ్య' అని పిలవడానికి అనుమతి ఇచ్చినట్లుగా అనిపించి అప్పటినుండి నేను ఎప్పుడు సాయిబాబాను ప్రార్థించినా, "సాయిబాబా తాతయ్య" అనే ప్రార్థిస్తున్నాను. మాకున్న ఒక సమస్య విషయంలో నేను, "తండ్రీ! నాకు అండగా ఉండి నా సమస్యను పరిష్కరించయ్యా, నువ్వే నాకు దిక్కు" అని బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. శ్రీసాయిబాబాపై నమ్మకం ఉంచితే జరగనిదంటూ ఏదీలేదని సాయిభక్తులందరికీ అనుభవమే కదా. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినవాళ్ళు ఎంతమంది ఉన్నా తీరని ఆ సమస్యను సాయిబాబాపై నమ్మకముంచి, నపై భారం వేసి, "నువ్వే పరిష్కరించాలి తండ్రీ" అని ప్రార్థిస్తూ ఉంటే, బాబా నాకెంతగానో అండగా ఉండి, అడుగడుగునా ఎంతో ధైర్యాన్నిచ్చి, ఎన్నో అద్భుత లీలలు చేసి మా సమస్యను ఈమధ్యే పరిష్కారమయ్యేటట్లు చేశారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోను తండ్రీ? నా మనస్సులో కోరిక మీకు తెలుసు కదా బాబా. అది కూడా తీరేటట్లు చేయి తండ్రీ. అది నెరవేరిన వెంటనే బ్లాగులో పంచుకుంటాను. సాయిబాబా తాతయ్యా! సదా అందరినీ చల్లగా చూడయ్యా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


7 comments:

  1. Akhilanda koti brahmand nayaka rajadhiraj yogiraj parabrahm sri satchinanda sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Today my sister went for surgery and help her and bless her. Jai sairam

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo