సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1254వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండే బాబా  
2. బాబా దయవల్ల శ్రమలేకుండా పెళ్లి - ఉద్యోగం
3. బాబా ఉన్నారు - ప్రతిదీ వింటున్నారు

ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండే బాబా  


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నడిపిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు ద్వారా మనం బాబాకి చాలా దగ్గరవుతున్నాము. ప్రతిరోజూ బ్లాగులో వచ్చే అనుభవాలను నేను రోజూ రాత్రి నిద్రపోయేముందు చదివి పడుకుంటాను. ఇలా అనుభవాలను రోజు చదవడంవల్ల మనసుకి సంతోషంగా ఉంటుంది. ఇంత బాగా బ్లాగును నడుపుతున్న సాయికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంక నా అనుభవానికి వస్తే..


మాకు ఇద్దరు బాబులు. పెద్దబ్బాయి 2017లో పుట్టాడు. 2018లో తనకి బాగా వణుకు వస్తుంటే భయమేసి హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! డాక్టరు చెక్ చేసి బాబుకి ఏ సమస్యా లేదని చెప్తే, నేను టీ, కాఫీలు త్రాగడం మానేస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. డాక్టరు బాబుని చూసి, "అంతా బాగుంది, బాబుకి ఎలాంటి సమస్యా లేదు" అని చెప్పారు. అప్పటినుండి నేను టీ, కాఫీలు తాగడం మానేశాను. అయితే ఈమధ్య మళ్ళీ టీ, కాఫీలు తాగడం మొదలుపెట్టి రోజూ త్రాగుతున్నాను. అలా నడుస్తుండగా ఒకరోజు ఉదయాన నేను బ్లాగు తెరిచి బాబా వచనాలు చూస్తుంటే, అక్కడ, "నువ్వు త్రాగుడు మానాలి. లేకుంటే నిన్ను నీ కర్మకు విడుస్తాను" అన్న వచనం వచ్చింది. అది చదివాక, 'రోజూ తాగుతున్న టీ, కాఫీలు మానేయాల'ని సూచిస్తూ ఈ వచనం బాబా నాకోసమే పంపారని అనుకున్నాను. కానీ నేను కాఫీ, టీ తాగటం మానలేదు. ఇక అప్పుడు అసలు సమస్య మొదలైంది. నా భర్త హఠాత్తుగా బరువు తగ్గటం మొదలై, రెండు నెలల్లో నాలుగు కేజీలు బరువు తగ్గిపోయారు. ఆయన ఆహార నియమాలు పాటించడంగానీ, వ్యాయామాలు చేయడంగానీ చేస్తుండకపోవటంతో, మరి తనెందుకు అలా బరువు తగ్గిపోతున్నారో మాకు అర్థం కాలేదు. మావారిని చూసిన వాళ్ళందరూ, "ఏంటి ఇలా అయిపోయావు నువ్వు? నీ ఆరోగ్యం బాగుందా?" అని అడుగుతుండేవాళ్లు. దాంతో నాకు ఆందోళన బాగా ఎక్కువై, "ఒకసారి బాడీ చెకప్ చేయించుకోండి" అని మావారితో చెప్పాను. ఆయన సరేనని, సోమవారంనాడు మొదట ఒక హాస్పిటల్‍కి వెళ్లారు. అక్కడ వాళ్ళు థైరాయిడ్, షుగర్ టెస్టులు చేయించమంటే మంగళవారంనాడు మావారు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఆ సాయంత్రానికి రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. బుధవారం మావారు అపోలో హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు మరుసటిరోజు ఖాళీ కడుపుతో వచ్చి బాడీ చెకప్ చేయించుకోమన్నారు. నాకు భయమేసి, "బాబా! మీ దయతో రిపోర్టులో ఏ ప్రాబ్లమ్ లేదని వస్తే, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. గురువారం ఉదయం మావారు హాస్పిటల్‍కి వెళ్లారు. ఆరోజు గురువారం కావడం వల్ల నాకు కొంచెం ధైర్యంగా ఉన్నప్పటికీ రిపోర్టులో ఏమొస్తుందోనన్న భయంతో ఏడుస్తూ ఉంటే ఈ బ్లాగు ద్వారా బాబా, "ఏడవకు, నేను ప్రతిరోజూ నీ పేరు తలుచుకుంటూ ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు ఏడుస్తావు?", "నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్ని ఇచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు. అల్లా భలా కరేగా" అని నాకు ధైర్యం కలిగేలా మెసేజ్ పంపారు. తరువాత నా భర్త ఫోన్ చేసి, "కొన్ని రిపోర్టులు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన రిపోర్టులన్నీ బాగానే ఉన్నాయి" అన్నారు. దాంతో నాకు కొంచెం రిలాక్స్‌గా అనిపించింది. మిగతా రిపోర్టులు మరుసటిరోజు వస్తాయని, శుక్రవారం మళ్ళీ రమ్మన్నారు. ఆ విషయమై నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, ఈసీజీ, లివర్, లంగ్స్ రిపోర్టులు శుక్రవారం డాక్టరు చూస్తామన్నారు. మరుసటిరోజు మావారు హాస్పిటల్‍కి వెళ్లి, మధ్యాహ్నం కాల్ చేసి, "అన్ని రిపోర్టులు నార్మల్‍గానే ఉన్నాయి, కానీ కొంచెం కొలెస్ట్రాల్ ఉంది. జంక్ ఫుడ్ తీసుకోవద్దనీ, రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయమనీ చెప్పి, ఫైనల్‍గా, 'స్ట్రెస్ వల్ల బరువు తగ్గుతున్నార'ని చెప్పారు డాక్టరుగారు" అని చెప్పారు. నేను ఆ ఐదు రోజులు ఎంతలా టెన్షన్ పడ్డానో బాబాకి తెలుసు. ఆయన నా టెన్షన్ తీసేశారు. ఈ అనుభవం ద్వారా 'ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల'ని బాబా నాకు తెలియజేశారు. ఇకపై నేను టీ, కాఫీలు తాగకూడదని అనుకుంటున్నాను.


2022, ఫిబ్రవరిలో నా మనసుకి బాధకలిగించే సంఘటనలు రెండు జరిగాయి. నేను చాలా సెన్సిటివ్ అవటం వల్ల బాగా టెన్షన్ పడ్డాను. అప్పుడు, "చింతించవద్దు! వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో. నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది" అన్న బాబా సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని బాబా నాకోసమే పంపించారేమో అనిపించి వెంటనే బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆ మరుసటిరోజునుండి నా మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది.


మా పెళ్లిరోజునాడు నేను, మావారు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక సిల్లీ విషయం మీద మా ఇద్దరి మధ్య గొడవ అయింది. దాంతో ఆ రోజంతా మేము హ్యాపీగా లేము. ఆ సమయంలో, "ఇలాంటి భర్త దొరికినందుకు నువ్వు అదృష్టవంతురాలివి. ఎన్నడూ బాధపడే మాటలు నీ భర్తతో అనకు" అన్న బాబా వచనం వచ్చింది. అప్పుడు బాబా ఎంతలా మనల్ని కనిపెట్టుకుని ఉంటారో అర్థమైంది. ఈ అనుభవం జరిగినప్పటినుండి  నేను నా భర్తని బాధపడే మాటలు అనటం లేదు. "ప్రతిక్షణం మమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నందుకు చాలాచాలా ధన్యవాదాలు బాబా. నన్ను మంచి మార్గంలో నడిపించండి బాబా. అందరినీ చల్లగా చూడు బాబా".


బాబా దయవల్ల శ్రమలేకుండా పెళ్లి - ఉద్యోగం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బాగ్లును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఏ పని చేసినా బాబా నామసర్మణ చేయకుండా చేయను. బాబా తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంటారు. నేను రోజూ ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతూ ఉంటాను. అనుభవాలు చదువుతుంటే బాబా నాతోనే ఉన్నట్లు ఉంటుంది. ఆయన దయవల్ల మేము అనుకున్న పనులన్నీ పూర్తవుతున్నాయి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు ఈ  బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మేము మా పెద్దబ్బాయికి పెళ్ళి చేయాలని నిర్ణయించి సంబంధాలు చూసేముందు, "బాబా! మాకు ఎవ్వరూ లేరు. మీరే దగ్గరుండి మంచి సంబంధం కుదిర్చి బాబుకి పెళ్లి చేయాలి" అని ఎంతో ఆర్తితో నేను బాబాను వేడుకున్నాను. అలా బాబాను వేడుకున్న ఒక నెల లోపల మేము ఎక్కడికీ వెళ్ళకుండానే ఒక సంబంధం మా ఇంటికే వచ్చింది. ఆ మొదటి సంబంధమే కుదిరేలా బాబా అనుగ్రహించారు. ఆయన ఆశీస్సులతో మా పెద్దబాబు పెళ్లి ఎటువంటి సమస్యలు లేకుండా మంచిగా జరిగిపోయింది. ఇప్పుడు అదంతా ఒక కలలా అనిపిస్తుంది మాకు.


నేను మా చిన్నబ్బాయి ఉద్యోగ విషయంలో కూడా బాబాను, "బాబా! మాకు దగ్గరలో బాబుకి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా మా అబ్బాయికి దగ్గరలో ఒక మంచి ఉద్యోగం ప్రసాదించారు. బాబా దయవల్ల ఇప్పటికి నా అనుభవాలు పంచుకునే అవకాశం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీకు శతకోటి నమస్కారములు తండ్రీ. త్వరలో మేము ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము బాబా. ఆ కోరికను తొందరగా నెరవేర్చి ఆ అనుభవాన్ని కూడా పంచుకునేలా అనుగ్రహించు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబా ఉన్నారు - ప్రతిదీ వింటున్నారు


నేనొక సాయిభక్తురాలిని. ఈమధ్య నేను ఈ బ్లాగులో వచ్చే 'సాయిభక్తుల అనుభవాలు' చదివాక 'ఇంతమంది భక్తులకు బాబా ఇన్ని అనుభవాలు ఇస్తున్నారు కదా, మరి బాబా నన్నెందుకు పట్టించుకోవడం లేదు?నేనేం తప్పు చేశాను?' అని అనుకున్నాను. తరువాత నేను ఈమధ్య యూట్యూబ్‍లో సచ్చరిత్ర పారాయణ విన్నాను. నేను సచ్చరిత్రలో వారంరోజులకు విభజింపబడి ఉండే ఒక్కోరోజు పారాయణను ఒక్కోరోజు యూట్యూబ్‍లో వింటూ ఉండేదాన్ని. ఆ క్రమంలో 2022, జులై 9న యూట్యూబ్ ప్లేలిస్ట్‌లో 6వ రోజు పారాయణ వీడియో లేదని గమనించాను. దాంతో ఆరోజు ఉదయం నుంచి నేను 'ఆరవరోజు పారాయణ ఎలా?' అని చింతించాను. సాయంత్రం 5వ రోజు పారాయణ వింటున్నప్పుడు కూడా నా మనసులో మరుసటిరోజు పారాయణ గురించే ఆలోచన సాగుతోంది. అప్పుడు హఠాత్తుగా కొన్ని ఇతర ఛానెళ్ల గురించి సూచనలను చూశాను. వాటికోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా ఆరవరోజు పారాయణ వీడియో కనిపించింది. బాబా ఉన్నారు. ఆయన ప్రతిదీ వింటున్నారు. బాబా తప్పకుండా నేను ప్రయత్నిస్తున్న ఉద్యోగాన్ని నాకు ఇస్తారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


7 comments:

  1. Om Sai Ram 🙏🏼🙏🏼🙏🏼

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. OM SRISAI PREMA PRADAYA NAMAHA

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo