సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అడ్డంకులు తొలగించి తమ దర్శనాన్ని అనుగ్రహించే బాబా



థానే జిల్లాలోని సామంత్‌వాడికి చెందిన గణేష్ గోపాల్ మహాజని తరచూ అనారోగ్యానికి గురవుతుండటం వల్ల బాగా బలహీనంగా ఉండేవాడు. సాయిబాబా వంటి మహాత్ముల దర్శనంతో తన కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని అతని తల్లి ఆశించింది. మహాజని కూడా తల్లి అభిప్రాయంతో ఏకీభవించాడు. సాయిబాబా కీర్తి గురించి విన్న మహాజని వారి దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతను కేవలం 15 రూపాయల నెల జీతం మీద ఖటావ్ మిల్స్‌లో పనిచేస్తున్నాడు. ఆ డబ్బులు శిరిడీ వెళ్లి రావడానికే సరిపోతాయి. అందువలన అతనికి ఏం చేయడానికీ తోచలేదు. బాబా అతని కోరికను అనూహ్యరీతిన నెరవేర్చారు.

ఒకసారి శిరిడీలో నీటిపంపు చెడిపోవడంతో ఖటావ్ మిల్స్‌లో మేనేజరుగా పనిచేస్తున్న ఆర్.ఏ.తర్ఖడ్ ఆ పంపు మరమ్మతు నిమిత్తం ఒక ఇంజనీరును శిరిడీ పంపాలని అనుకున్నాడు. శ్రీమతి తర్ఖడ్ కూడా ఆ ఇంజనీరుతో కలిసి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ విషయం తెలుసుకున్న మహాజని వాళ్ల ద్వారా సాయిబాబా కోసం పూలదండ, పండ్లు పంపాలని తలచి అవి తీసుకొని, వాళ్ళు శిరిడీ ప్రయాణమయ్యేరోజున దాదర్ రైల్వేస్టేషనుకి వెళ్ళాడు. భార్యను రైలు ఎక్కించడానికని స్టేషనుకొచ్చిన తర్ఖడ్ మహాజనిని చూసి, "నువ్వు శిరిడీ వెళ్లాలనుకుంటున్నావా? మా కుటుంబంలోని ఒకరు శిరిడీ వెళ్ళలేకపోతున్నందున తనకోసం తీసుకున్న ఈ టికెట్ మీద నువ్వు శిరిడీ వెళ్తావా?" అని అడిగాడు. ఆ మాట వింటూనే మహాజని పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేశాడు.  థానేకు వెళుతున్న ఒక వ్యక్తి ద్వారా తన ఆకస్మిక ప్రయాణం గురించి తన తల్లికి కబురు పంపి శిరిడీ ప్రయాణమయ్యాడు. బాబా దర్శనం చేసుకొని ఎంతో ఆనందం పొందాడు.

రామచంద్ర విఠోబా విద్యార్థిగా ఉన్నప్పుడు తన స్నేహితుడు బాపూసాహెబ్ శీర్షతే కుమారుడైన దత్తు వలన అతనికి బాబా యందు విశ్వాసం ఏర్పడింది. ఒకసారి దత్తు శిరిడీ వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాడు. రామచంద్ర కూడా దత్తుతో కలిసి శిరిడీ వెళదామనుకున్నాడు. ఆ సమయంలో రామచంద్ర తల్లి తలేగాఁవ్‌లో ఉంది. ప్రయాణ ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు తనకిచ్చేందుకు వేరే ఎవరూ లేరు. ఆర్థిక పరిస్థితి కారణంగా శిరిడీ వెళ్లలేకపోతున్నందుకు రామచంద్ర చాలా బాధపడ్డాడు. ఆశ్చర్యంగా, దత్తు శిరిడీ ప్రయాణానికి బయలుదేరడానికి కొంత సమయం ముందు రామచంద్ర తల్లి అకస్మాత్తుగా ఇంటికి చేరుకుంది. శిరిడీ వెళ్ళాలన్న కొడుకు ఆత్రుత చూసి ప్రయాణానికి అవసరమయ్యే డబ్బులు ఇచ్చింది. దాంతో అతను సంతోషంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆ అనుభవం ద్వారా అతనికి బాబాపై విశ్వాసం మరింత దృఢపడింది.

బాబా సమాధి చెందాక వారి భక్తుడైన బాపూసాహెబ్ శీర్షతే తన కుటుంబంతో సహా శిరిడీ వెళ్లి బాబా సమాధి దర్శనం చేసుకోవాలని ఆశపడ్డాడు. ప్రభుత్వ అధికారిగా ఉన్న అతని కుమారులలో ఒకరు అతనితో పాటు వెళ్ళటానికి అంగీకరించాడు. కానీ బాబా యందు విశ్వాసం లేని అతని మరో కుమారుడు అందుకు నిరాకరించాడు. అందుకు బాపూసాహెబ్ చాలా బాధపడినప్పటికీ బాబా తన కుమారుడిని ఎలాగైనా తమ వద్దకు రప్పించుకుంటారని అనుకొని కుటుంబంతో శిరిడీ ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో బాబా యందు విశ్వాసం లేని కుమారుని భార్య అహ్మద్‌నగర్‌లో తన తల్లిదండ్రుల వద్ద ఉంది. అతను ఆమె వద్దకు అహ్మద్‌నగర్‌ వెళ్తూ ముందు స్టేషన్‌లో దిగి ప్లాట్‌ఫాంపై పచార్లు చేస్తుండగా ఆశ్చర్యంగా తన భార్య అక్కడ శిరిడీ వెళ్తూ కనిపించింది. దాంతో అయిష్టంగానే ఆమెతో కలిసి అతను కూడా శిరిడీ వెళ్ళాడు. క్రమంగా కొన్ని అనుభవాల ద్వారా అతనికి బాబా యందు విశ్వాసమేర్పడింది. 

కాందివిలీకి చెందిన ఆనందరావు డోలాస్ 1952, మార్చి 10న శిరిడీలోని శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని అనుకున్నాడు. ఆ విషయం అతను తన కార్యాలయంలోని హెడ్ క్లర్కుతో చెప్పి ఒక నెల ముందుగానే సెలవుకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనుకోకుండా ఆనందరావు అసిస్టెంట్ అనారోగ్యం పాలవడంతో అతనికి సెలవు మంజూరు కాలేదు. దాంతో అతనికి ఏమి చేయాలో తోచలేదు. రామనవమి సమీపిస్తుండగా అతను సాయిబాబాను, "ఎలాగైనా సెలవు మంజూరు అయ్యేలా చేయండి, లేకుంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. నన్ను రామనవమినాడు శిరిడీలో మీ దర్శనం చేసుకోనివ్వండి" అని ప్రార్థించాడు. ఇలా మనస్సులో నిశ్చయించుకొని మరుసటిరోజు కార్యాలయానికి వెళ్లి హెడ్ క్లర్కును తన సెలవు గురించి అడిగాడు. బాబా దయవల్ల ఆ క్లర్కు ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆనందరావుకు 15 రోజుల సెలవు మంజూరు చేశాడు. దాంతో ఆనందరావు శిరిడీ వెళ్లి తృప్తిగా బాబా దర్శనం చేసుకొని ఎంతో ఆనందం పొందాడు.

సోర్స్: 'సాయిబాబా' బై సాయి శరణానంద.

8 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om sai ram kapadu baba

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. ome sri sainadh maharaj ki jai

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo