సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 814వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. “ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని గుర్తుంచుకో!”
2. తలనొప్పి తగ్గడంలో బాబా దయ
3. నాతోనే ఉన్నానని మరొకసారి నిరూపించిన మా బాబా

“ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని గుర్తుంచుకో!”


నా పేరు పల్లవి. నేను బెంగుళూరు నివాసిని. 2002 నుండి నేను బాబా భక్తురాలిని. నన్ను, నా కుటుంబాన్ని బాబా భక్తులుగా మలిచిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నా పుట్టినరోజు సందర్భంగా నా స్నేహితులలో ఒకరు సాయిబాబా ఫోటోను నాకు బహుకరించారు. ఆ సమయంలో నాకు గానీ, నా కుటుంబసభ్యులకు గానీ బాబా పట్ల నమ్మకం లేనందువల్ల, ‘బాబా ఫోటోను ఇంట్లో ఉంచవద్ద’ని మా అమ్మ నన్ను కోప్పడింది. కానీ నేను అమ్మతో, "కఠిన సమయాలలో బాబా ఎల్లప్పుడూ మనకు అండగా ఉండాలన్న కోరికతో అత్యంత ఆత్మీయులిచ్చిన బహుమతి ఇది. కనీసం అందుకోసమైనా ఈ ఫోటోను ఇంట్లో ఉంచుకుందాము" అని చెప్పి తనను ఎంతో బ్రతిమాలి బాబా ఫోటోను ఇంట్లో ఉంచుకోవటానికి ఒప్పించాను. ఆ తరువాత ఒకసారి మా నాన్నగారు వృత్తిరీత్యా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. దాంతో నేను, అమ్మ, 5 సంవత్సరాల మా తమ్ముడు మాత్రమే ఇంట్లో ఉన్నాము. సాధారణంగా మా తమ్ముడు రోజూ వ్యానులో స్కూలుకి వెళ్తాడు. డ్రైవరే తనను స్కూలుకి తీసుకెళ్లి, తిరిగి ఇంటివద్ద దింపుతాడు. అయితే ఒకరోజు తమ్ముడు రోజూ వచ్చే సమయానికి స్కూలు నుండి ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అందరమూ కంగారుపడి తనకోసం స్కూల్లోనూ, స్కూల్ పరిసరాలలోనూ వెతికాము. కానీ తన ఆచూకీ తెలియలేదు. దాంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. రాత్రి 8 గంటలైనా తను తిరిగి రాకపోవడంతో అమ్మ, నేను బాగా ఆందోళన చెందుతూ ఉన్నాము. అప్పుడు నేను బాబా ముందు దీపం వెలిగించి, చేతులు జోడించి బాబాకు నమస్కరించి ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టాను. "బాబా! మీ ఫోటోను ఇంట్లో ఉంచినందుకు అమ్మ నన్ను కోప్పడుతోంది. మీ ఫోటో కారణంగానే ఈ ప్రతికూల సంఘటనలు జరుగుతున్నాయని అంటోంది. కానీ నాకు మీ యందు నమ్మకముంది. దయచేసి తమ్ముడిని ఇంటికి తిరిగి తీసుకురావడంలో నాకు సహాయం చేయండి. మీరు నిజమైన సంరక్షకులైతే, దయచేసి నా తమ్ముడిని వీలైనంత త్వరగా ఇంటికి తీసుకొని రండి" అంటూ కనులు మూసుకుని హృదయపూర్వకంగా బాబాను అర్థిస్తుండగా, "అక్కా! ఇటు చూడు, నేను వచ్చేశాను" అన్న పిలుపు వినిపించింది. కళ్ళు తెరచి ఇంటి గుమ్మం దగ్గర ఉన్న తమ్ముడిని చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. బాబాను అర్థించిన కొన్ని క్షణాల్లో, కాదు.. కాదు, నిజానికి ఇంకా అర్థిస్తూనే ఉన్నాను, అంతలోనే ఇంటి గుమ్మం వద్ద నా కళ్ళెదురుగా ఉన్న తమ్ముడిని చూసి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలినయ్యాను. నాలో ఆనందం, కోపం, అప్పటివరకు పడిన ఆందోళన నుండి ఉపశమనం.. ఇలా పలురకాల భావాలు ముప్పిరిగొన్నాయి. ఇంతలో, తమ్ముడి ప్రక్కన ఖాదీ దుస్తులలో ఉన్న ఒక వృద్ధుడిని గమనించాను. ఆయన ఒక కుర్తా ధరించి, భుజానికి ఒక సంచి తగిలించుకొని ఉన్నారు. నేను కోపాన్ని అణచుకోలేక, "స్కూలు నుండి వేళకు ఎందుకు రాలేదు?" అంటూ మా తమ్ముడిని కొట్టసాగాను. ఇంతలో ఆ వృద్ధుడు అడ్డుపడి నా కోపాన్ని నియంత్రించుకోమని చెప్పాడు. నేను ఆయన్ని కూడా తిడుతూ, "కాలింగ్ బెల్ మ్రోగించి మా అనుమతి తీసుకోకుండా అసలు మీరెలా మా ఇంట్లోకి వచ్చార"ని అడిగాను. అందుకు ఆ వృద్ధుడు ఎంతో సౌమ్యంగా, "నీ తమ్ముడిని ఇంటికి తీసుకొని రమ్మని నువ్వు నన్ను అడిగావు. నేను తనను తీసుకువచ్చాను. ఇప్పుడేమో నువ్వే నన్ను తిడుతున్నావు" అన్నారు. కానీ, నేను ఆయన చెప్పేది పట్టించుకోకుండా ఎంతో కోపంతో, “ముందు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి" అని పెద్దగా అరిచాను. నేను అంతగా కోప్పడుతున్నప్పటికీ ఆ వృద్ధుడు చిరునవ్వు చిందిస్తూ, "నీకు, నీ కుటుంబానికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సహాయం చేయడానికి నేను ఉన్నానని గుర్తుంచుకో! భక్తులు హృదయపూర్వకంగా చేసే నిజమైన ప్రార్థనలను బాబా ఎల్లప్పుడూ వింటారమ్మా" అని అన్నారు. నేను మా తమ్ముడి చేయి పట్టుకుని లోపలికి లాగి, తలుపులు వేద్దామని ప్రక్కకు తిరిగాను. మళ్ళీ అంతలోనే, ఆ వృద్ధునికి కృతజ్ఞతలు చెప్పాలనిపించి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాను. వేసిన గేటు వేసినట్లే ఉంది, కానీ ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. గేటు తీయకుండా ఎవరూ బయటికి వెళ్లేందుకు అవకాశమే లేనందున నేను ఆత్రుతగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గేటు తీసి బయటకు వెళ్లి వీధిలో అన్నిచోట్లా వెతికాను. కానీ ఆ వృద్ధుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఇంటికి తిరిగొచ్చి, తమ్ముడిని దగ్గరకు తీసుకుని ఓదార్చి, "నిన్ను తీసుకొచ్చిన ఆ ముసలాయన ఎవరు?" అని అడిగాను. అందుకు తను, "నేను చాలాసేపటి నుండి ఒక బస్టాపులో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా ఈ ముసలాయన నా దగ్గరకు వచ్చి, 'బాబూ! మీ ఇంటికి వెళ్దాం పద. నువ్వింకా ఇంటికి రాలేదని అందరూ నన్ను తిడుతున్నారు. మీ అమ్మ, అక్క నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొని రావాలని ఎంతో ఆరాటపడుతున్నారు. అందుకని పద, వెళ్దాం’ అని చెప్పి, మళ్ళీ అంతలోనే నాకొక బిస్కెట్ ఇస్తూ, ‘బాబూ! నీకు ఆకలిగా ఉండి ఉంటుంది. ఇదిగో, ఈ పార్లే-జి బిస్కెట్ తిను. నిన్ను చూసేవరకు మీ అక్క ఏడుపు ఆపదు, త్వరగా పద!’ అని చెప్పి నన్ను ఇంటికి తీసుకొని వచ్చారు" అని బదులిచ్చాడు. తమ్ముడి మాటలు విన్న నేను కన్నీళ్లపర్యంతమయ్యాను. ‘నా తమ్ముడిని తిరిగి మా ఇంటికి తీసుకొచ్చి మా కుటుంబానికి సహాయం చేసింది సాయిబాబానే’ అని అర్థం చేసుకున్నాను. ఆరోజు నుండి నేను, నా కుటుంబం బాబాను నిత్యమూ పూజిస్తూ, ఆయన దయవలన సంతోషంగా జీవిస్తున్నాము.


తలనొప్పి తగ్గడంలో బాబా దయ

నా పేరు లక్ష్మి. బాబా ప్రసాదించే అనుభవాలను భక్తులకు తెలియజేస్తూ అందరికీ ఉపకారం చేస్తున్న 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. "బాబా! నన్ను క్షమించండి. మీరు ప్రసాదించిన అనుభవాన్ని ఒకరోజు ఆలస్యంగా పంచుకుంటున్నాను".

రెండు, మూడు సంవత్సరాల క్రితం పని ఒత్తిడి వల్ల నా తలలో ఎడమప్రక్క తీవ్రంగా నొప్పి వచ్చింది. ఆ నొప్పి గురించి నేను ఏ డాక్టర్ వద్దా చూపించుకోలేదు. ఒకసారి కంటి చెకప్‌కి వెళ్ళినపుడు మాత్రం వాళ్ళను నా తలనొప్పి గురించి అడిగితే, "కన్నులు పొడిబారిపోవడం వల్ల ఆ నొప్పి" అని చెప్పి, డ్రాప్స్ ఇచ్చారు. దాంతో తలనొప్పి కొంతవరకు తగ్గినా అప్పుడప్పుడు నొప్పి అనిపిస్తుండేది. అయితే ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోయేది. కానీ ఈమధ్య, అంటే 2021, మే మూడవవారంలో తలనొప్పి వచ్చినప్పుడు నాలుగు రోజులైనా తగ్గక నన్ను చాలా విసిగించింది. దాంతో నేను మే 18న, "బాబా! ఈ తలనొప్పి తగ్గించండి, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లోనూ, హేతల్ గారి ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లోనూ పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబాకు చెప్పుకున్న తరువాత ఆశ్చర్యంగా నా తలనొప్పి తగ్గిపోయింది. అయితే, అదేరోజు నేను నా అనుభవాన్ని పంచుకోలేదు. ఆరోజు రాత్రి నుండి మళ్ళీ తలనొప్పి మొదలైంది. ఆ రాత్రంతా తలలో ఎడమవైపు పైభాగమంతా నొప్పిగా ఉంది. ఉదయాన్నే లేచి బాబాకు చెప్పుకుని ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను. "బాబా! వెంటనే నా అనుభవాన్ని పంచుకోకుండా ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. అప్పటికీ మీరు వేరేవాళ్ళు తమ అనుభవం బ్లాగ్ అడ్మిన్‌కి పంపడానికి బదులు నాకు పంపేలా చేశారు. అయినా నా మట్టిబుర్రకి అర్థం కాలేదు సాయీ. ఈ నొప్పి ప్రమాదకరం కాకుండా చూడండి బాబా. నా కుటుంబానికి నేనే ఆధారం. అలాగే నాకు త్వరగా పెళ్లి అయ్యేలా అనుగ్రహించండి సాయీ. ఇప్పటికే చాలా ఆలస్యమై నాకు 30 నిండిపోతున్నాయి. కరుణించు సాయీ. ప్రతి అడుగులో నాకు అండగా ఉండు సాయీ. కోటి కోటి ధన్యవాదాలు సాయీ".


నాతోనే ఉన్నానని మరొకసారి నిరూపించిన మా బాబా


ముందుగా సాయిబాబాకు నా నమస్కారాలు. ఈ బ్లాగుని ఇంత చక్కగా నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా ధన్యవాదాలు. సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు ధనలక్ష్మి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. 2021, మే 18న నాకు 'లో ఫీవర్' వచ్చింది. దాంతోపాటు జలుబు చేసి ముక్కు నుండి నీరు కారడం మొదలైంది. అసలే ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఈ కరోనా సమయంలో ఏది వచ్చినా భయం వేస్తోంది. అందువలన నేను డోలో-650 టాబ్లెట్ వేసుకుని, బాబా ఊదీ పెట్టుకుని, బాబాకు నమస్కారం చేసుకుని నిద్రపోయాను. జ్వరం తగ్గింది కానీ, సాయంత్రానికి మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను, "రేపు ఉదయానికల్లా నాకు జలుబు, జ్వరం తగ్గిపోవాలి బాబా. నేను నార్మల్ అవ్వాలి. నేను మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను బాబా? ఎలాగైనా మీరు నాకు తగ్గించాల్సిందే! అలా జరిగితే నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని, టిఫిన్ తిని, టాబ్లెట్ వేసుకున్నాను. మరుసటిరోజు ఉదయం లేచేసరికి నేను నార్మల్‌గా ఉన్నాను. ఇది నా బాబా వల్లే సాధ్యమైంది. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా".



9 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Kothakonda SrinivasJune 23, 2021 at 10:13 AM

    ఓం సాయిరాం! సాయి లీలలు అద్భుతము.

    ReplyDelete
  3. Om Sairam
    Baba nu talusukunte work easy ga ipothundi.mother old age pension stop chesaru.two days nundi tiruguthunte ninna work inadi
    Baba gari asislu tho e month pension vasthundi.om Sairam

    ReplyDelete
  4. Om sai ram 1st sai leela is very nice. He brought her brother to her house. Her unlucky she didn't recognize baba. He came to her house.to give darshan.. Om sai ram❤❤❤
    C

    ReplyDelete
  5. Om sai ram first leela is very Nice

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh Carrier anitilo bagundali thandri

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo