సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 801వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:


  1. 'మీ భారములు నాపై వేయండి, నేను మోసెదను'
  2. 'బాబా' అని పిలువగానే బాధను తొలగిస్తారు బాబా

  3. ప్రశంసలతోపాటు ప్రమోషన్ ప్రసాదించిన బాబా 


'మీ భారములు నాపై వేయండి, నేను మోసెదను'


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు శిరీష. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా మా నాన్నగారికి జరిగిన అనుభవాన్ని తెలియజేస్తాను. ఈమధ్యకాలంలో మా తమ్ముడి వైవాహిక జీవితంలో బాబా చూపిన గొప్ప అనుభవంతో మా నాన్నగారు బాబాను ఎంతగా నమ్ముతున్నారంటే, 'ఏమి జరిగినా అంతా బాబా చూసుకుంటారు. మనం దేనికీ భయపడాల్సిన అవసరంలేదు' అనేంతగా. అంతటి భరోసాను బాబా మా నాన్నగారికి ప్రసాదించారు. ఇకపోతే, మా నాన్నగారికి ఇటీవల జరిగిన అనుభవానికి వస్తే...


మాది కిరాణా షాపు. షాపు, ఇల్లు రెండు కలిసే ఉంటాయి. అంటే, ముందుభాగంలో షాపు ఉంటుంది. ఈమధ్య విద్యుత్ శాఖకు సంబంధించిన విజిలెన్స్ డిపార్టుమెంట్ వాళ్ళు అన్ని షాపులు చెక్ చేస్తూ మా షాపుకి కూడా వచ్చారు. అన్నీ పరిశీలించిన మీదట, అంతా సరిగా ఉందంటూ సీల్ వేసి వెళ్ళిపోతూ ఎలా పరిశీలించారో, ఏం జరిగిందో తెలియదుగానీ ‘షాపులో ఉన్న ఫ్రిడ్జ్ ఇంటి కరెంట్ మీటర్ మీద నడుస్తోందనీ, ఇంటి కరెంటుని షాపుకి వాడుకుంటున్నారనీ’ అభియోగం మోపి, జరిమానా కట్టమని అన్నారు. మేము ఏ తప్పూ చేయలేదని మా నాన్నగారు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. కంగారులో నాన్నగారు అసలు ఇంటి కరెంట్ మీటర్ ఆన్‌లో ఉందో లేదో చూడలేదు, కనీసం రెండోసారి చెక్ చేయిద్దామన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. మావారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడంతో నాన్నగారు మావారికి ఫోన్ చేశారు. మావారు, "వాళ్ళు ఎంత చెప్పినా వినరు మావయ్యగారూ, మీరు విద్యుత్ బిల్లు ఎప్పటికప్పుడు కట్టారు కాబట్టి, ఆ డిఫరెన్స్ అమౌంటును జరిమానాగా వేస్తార”ని చెప్పి, తనే డిఫరెన్స్ లెక్కపెట్టి, “సుమారుగా 20,000 నుంచి 25,000 వరకు జరిమానా వేస్తార”ని చెప్పారు. నాన్నగారు ఆరోజు సాయంకాలం అదివరకు ఇన్వర్టర్ వైరింగ్ చేసిన ఎలక్ట్రీషియన్‌ని పిలిపించి, సమస్య గురించి చెప్పి, వైరింగులో ఏమైనా పొరపాటు జరిగిందేమో చూడమని చెప్పారు. అతను అంతా పరిశీలించి, "నేను వైరింగులో ఏ విధమైన పొరపాటూ చేయలేదు. అసలు ఇంట్లో కరెంటు ఆన్‌లో లేదు. మరి ఆ సమయంలో మాత్రం ఎలా ఆన్‌లో ఉంటుంది? వాళ్ళు ‘ఇంటి కరెంట్ మీద ఫ్రిడ్జ్ నడుస్తోంది’ అన్నప్పుడు మీరు మీటర్ ఆన్‌లో ఉందో, లేదో  చెక్ చేసుకోకుండా జరిమానా కట్టడానికి ఎలా ఒప్పుకున్నారు? అనవసరంగా మీరిప్పుడు జరిమానా కట్టవలసి వస్తుంది కదా. వాళ్లు దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు జరిమానా వేస్తారు" అని చెప్పాడు. దాంతో మా నాన్నగారికి చాలా భయం వేసింది. తర్వాత మా షాపు వద్దకొచ్చిన కరెంట్ ఆఫీసులో పనిచేసే ఒక అతను కూడా ‘లక్షరూపాయలు జరిమానా వేస్తారు’ అని చెప్పారట. కానీ మా నాన్నగారికి బాబా మీద అపారమైన నమ్మకం. ఆయన నాతో, "నేను ఏ తప్పూ చేయలేదు. కాబట్టి ఆ బాబానే నన్ను రక్షిస్తారు" అని అన్నారు. తరువాత ఆయన బాబా దగ్గరకు వెళ్లి, "నేను తప్పూ చేయలేదు, అది మీకు తెలుసు కదా బాబా! ఇక మీరు ఎలా దయచూపుతారో!" అని వేడుకుని ఇంటికి వచ్చారు. పదిరోజుల తర్వాత వాళ్ళు పంపిన జరిమానా బిల్లు మాకు చేరింది. జరిమానా ఎంత వేశారో తెలుసా? కేవలం 3,120 రూపాయలు. అది తీసుకొచ్చిన లైన్‌మ్యాన్, "మీకేనండీ ఇంత తక్కువ జరిమానా వేసింది. అందరికీ వేలల్లోనూ, అంతకంటే ఎక్కువ కూడా వచ్చింది. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పాడు. మా నాన్నగారు ఆనందంతో వెంటనే నాకు ఫోన్ చేసి, "నువ్వు బాబా గురించి ఎప్పుడూ చెప్పేది ఎంత సత్యమమ్మా! ('ఎటువంటి సమస్య వచ్చినా వాటంతటవే తొలగిపోయేలా సమస్యకి పరిష్కారం చూపుతారు బాబా' అని నేనెప్పుడూ చెప్తుంటాను) జరిమానా కేవలం మూడువేల నూట ఇరవై రూపాయలు వేశారు” అని చెప్పారు. ఈ అనుభవం ద్వారా బాబాపట్ల ఆయనకున్న నమ్మకం ఎన్నో రెట్లు అధికమైంది. "ధన్యవాదాలు బాబా! అమ్మానాన్నలను సదా మీ సంరక్షణలో క్షేమంగా ఉండేలా చూసుకో తండ్రీ".


రెండవ అనుభవం: ఊదీ మహిమ


ఈ మధ్య మావారికి బాగా జలుబు చేసింది. జలుబు తగ్గాక దగ్గు మొదలైంది. బాబా దయవల్ల అది కూడా చాలావరకు తగ్గిపోయింది. కానీ హఠాత్తుగా ఒకరోజు రాత్రి నిద్రపోయిన తరువాత చాలా తీవ్రంగా దగ్గు వచ్చి మావారు ఉక్కిరి బిక్కిరి అయిపోసాగారు. నేను వెంటనే బాబా ఊదీ తీసుకుని మావారి నుదుటిపై పెట్టి, మరికొంత నీళ్లలో కలిపి ఇచ్చాను. ఎంత అద్భుతం జరిగిందంటే, కేవలం ఐదు నిమిషాలలో దగ్గు ఆగి, ఆయన సుఖంగా నిద్రపోయారు. అంతటితో దగ్గు పూర్తిగా తగ్గిపోయింది.


మూడవ అనుభవం: 


మా అమ్మ ఆరోగ్య విషయంలో నేను చవిచూసిన ఒక అద్భుతమైన ఊదీ మహిమను ఇప్పుడు మీతో పంచుకుంటాను. కొన్ని రోజుల క్రితం మా అమ్మకి లో-ఫీవర్ వచ్చి, ఏమీ తినాలని అనిపించక మూడురోజులపాటు ఆహారం తీసుకోలేదు. దాంతో ఆమె చాలా నీరసించిపోయింది. నేను ఫోన్ చేస్తే మాట్లాడే స్థితిలో కూడా ఆమె లేదు. అప్పుడు నాకు శ్రీసాయిసచ్చరిత్రలోని 34వ అధ్యాయంలో 'ఒక భక్తుడు తన కూతురికి జ్వరం వస్తే, తన వద్ద ఊదీ లేకపోవడంతో నానాసాహెబ్ చందోర్కరును సంప్రదించడం, ఆ సమయంలో నానా వద్ద కూడా ఊదీ లేకపోవడంతో తాను నిలుచున్న చోటనే కొద్దిగా ధూళిని చేతిలోకి తీసుకుని దాన్నే ఊదీగా భావించి బాబాను ప్రార్థించి తన భార్య నుదుటన పెట్టడం, తరువాత ఆ భక్తుడు ఇంటికి చేరుకునేసరికి తన కూతురి జ్వరం తగ్గి ఉండటం' అనే ఊదీ మహిమ గుర్తొచ్చి, "బాబా! నాకు కూడా ఆ అద్భుతమైన ఊదీ మహిమను ప్రసాదించు" అని వేడుకున్నాను. తరువాత కొద్దిగా ఊదీని తీసుకుని నా నుదుటన పెట్టుకుని, "బాబా! అమ్మ ఆరోగ్యాన్ని బాగుచేయండి" అని వేడుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగటం మొదలుపెట్టాను. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి! రెండవరోజు అమ్మ లేచి కొద్దికొద్దిగా తినడం ప్రారంభించింది. నీరసం కూడా నెమ్మదిగా తగ్గసాగింది. నా ఆనందానికి అవధులు లేవు. సచ్చరిత్రలో చదివిన లీల ఏదైనా మన విషయంలో నిజమైనప్పుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా. ఇంకా అమ్మకి కొద్దిగా నీరసం ఉంది. బాబా దయవల్ల అది తొందరలోనే తగ్గిపోతుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


నేను భక్తులకు ఒక విషయాన్ని తెలపాలని అనుకుంటున్నాను. ఒకసారి బాబాను మనస్ఫూర్తిగా నమ్మిన తరువాత ఎంతటి కష్టం ఎదురైనా ఆ కష్టం నుండి మనల్ని బయటకు లాగేవరకు సాయితండ్రి మన చేయి వదిలిపెట్టరు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన భారాన్ని ఆయన మీద వేసి శ్రద్ధ, సబూరీలతో వేచివుండటమే. "మీ భారములు నాపై వేయండి. నేను మోసెదను" అన్న బాబా మాట అక్షర సత్యం.


చివరిగా ఈ బ్లాగును నిర్వహిస్తూ అనేకమంది సాయిభక్తులకు తమ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పిస్తూ, భక్తులలో శ్రద్ధ, సబూరీలను పెంపొందింపజేస్తున్న సాయికి నా ధన్యవాదాలు.


'బాబా' అని పిలువగానే బాధను తొలగిస్తారు బాబా


సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు నళిని. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ఎన్నోవిధాలుగా అండగా ఉంటూ సదా రక్షణనిస్తున్నారు. నాకు ఏ చిన్న బాధ కలిగినా 'బాబా' అని పిలువగానే బాబా నా బాధను తొలగిస్తారు. ఒకరోజు మా కజిన్ రెండు సంవత్సరాల చిన్నబాబు దగ్గుతో బాధపడుతూ నిద్రపోవట్లేదు. అప్పుడు నేను, "బాబా! ఈ చిన్నబాబుకి మీ రక్షణనివ్వండి. ఈ దగ్గు తగ్గి, తను హాయిగా నిద్రపోతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అలా వేడుకున్న కొద్దిసేపట్లోనే బాబా దయవల్ల బాబు హాయిగా నిద్రపోయాడు. "ధన్యవాదాలు బాబా". ఇలా ఎన్నో చిన్న చిన్న ఇబ్బందులను బాబా తొలగించారు.


2021, ఫిబ్రవరిలో ఒకరోజు నేను నా కళ్ళకు శస్త్రచికిత్స చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాను. అయితే వాళ్ళు ‘నాకు శస్త్రచికిత్స చేయడం కుదరద’ని చెప్పేశారు. అప్పుడు నేను బాబాపై నమ్మకముంచి, "ఎలాగైనా నాకు శస్త్రచికిత్స జరిగేలా చూడండి బాబా. శస్త్రచికిత్స జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. అంతలో డాక్టరు వచ్చి, "మళ్ళీ ఒక స్కాన్ చేయాలి" అని అన్నారు. ఆ స్కాన్ చేశాక, 'నా కంటికి శస్త్రచికిత్స చేయవచ్చు' అని రిపోర్టు ఇచ్చారు. దాంతో నాకు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు బాబా దయవల్ల నాకు చాలా బాగుంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. థాంక్యూ సో మచ్ బాబా".


ఇంకో చిన్న అనుభవం:


ఒకసారి నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి చేయాలని అనుకున్నారు. అప్పుడు నేను నా బాధను బాబాతో చెప్పుకున్నాను. బాబా నాపై ప్రేమతో ఆ పెళ్లి జరగకుండా తప్పించారు. "థాంక్యూ సో మచ్ బాబా. నా మనసులో ఏముందో మీకు తెలుసు బాబా. ఆ కోరికను నెరవేరుస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాబా".


ప్రశంసలతోపాటు ప్రమోషన్ ప్రసాదించిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. ఈ బ్లాగును నడుపుతున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. ఇంతకుముందు నేను కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఇంకొక అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకు నా ప్రణామాలు. 


2021, మార్చి 25 నుండి మా ఇంట్లో సాయి నామజప ఉత్సవం జరుగుతుండగా ఒకరోజు మా అమ్మాయి చాలా ఆందోళనగా ఉంది. నేను పూజ హడావిడిలో ఉండి అంతగా గమనించలేదు. మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే తను రానంది. అప్పుడు నేను, "ఏమయింది?" అని అడిగితే, తను ఏమీ చెప్పలేదు. కానీ ఏదో ఆఫీసు టెన్షన్ అని నాకు అర్థమైంది. తరువాత నేను రెండు, మూడుసార్లు అడిగాక విషయం చెప్పింది. తన మేనేజర్, మరో వ్యక్తి తన చేత చాలా పని చేయించుకుంటూ ఉంటారట. ఒక్కోసారి వాళ్ళ పనిని కూడా మా అమ్మాయి చేత చేయిస్తారట. ఇంత పని చేశాక కూడా వాళ్లు మా అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగాలేదనీ, ఇంకా ఏదో అన్నారట. అందుకని తను చాలా బాధపడింది. నేను తనతో, "బాబా చూసుకుంటారు. నువ్వు బాధపడకు" అని సర్దిచెప్పి అన్నం తినిపించాను. తరువాత నేను, "బాబా! తను కష్టపడి పనిచేస్తుంది. వాళ్లు కావాలని తనను ఏడిపిస్తున్నారు. పనంతా చేయించుకుని ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నారో? వాళ్లకు బుద్ధి వచ్చేలా చేయండి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. ఒక వారం గడిచిన తరువాత మా అమ్మాయికి అమెరికా హెడ్ ఆఫీసు నుంచి, "నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నీకు అవార్డు ఇస్తున్నాము" అని మెసేజ్ వచ్చింది. మా అమ్మాయి చాలా సంతోషించి, "అమెరికన్స్ నుండి అలాంటి ప్రశంస రావడం చాలా అరుదు" అని నాతో చెప్పింది. అది వినగానే నాకు కూడా చాలా సంతోషం, మరోవైపు ఆశ్చర్యం కలిగాయి. ఇదంతా సాయి మహిమ. బాబా వాళ్లకు అలా బుద్ధి చెప్పారు.


తరువాత, ఏప్రిల్ మొదటివారంలో ఆ మేనేజరువాళ్ళు మా అమ్మాయితో, "నీకు ఈ ఏడాది ప్రమోషన్ రాదు" అని చెప్పారు. మా అమ్మాయి బాధపడి, 'ఈ ఏడాది ప్రమోషన్ ఇచ్చే సమయం కూడా అయిపోయింది, ఇక ప్రమోషన్ రాదు' అనుకుంది. నేను మాత్రం బాబాను వదల్లేదు. "బాబా! మా అమ్మాయికి అర్హత ఉంటే ప్రమోషన్ వచ్చేలా చూడు" అని దండం పెట్టుకున్నాను. కొన్ని రోజులు బాబాకు 108 ప్రదక్షిణలు చేశాను. ఒకరోజు మా అమ్మాయి సీనియర్ మేనేజర్ తనకు ఫోన్ చేసి, "నీకు ప్రమోషన్ వచ్చింది" అని చెప్పారు. అది విని మా అమ్మాయి, నేను ఆనందం పట్టలేకపోయాము. బాబా మంచిని గెలిపించారు. బాబా పైన పూర్తి విశ్వాసం ఉంచితే, అంతా ఆయనే నడిపిస్తారు. ఆయన మన నుండి కోరేది శ్రద్ధ, సబూరీలను మాత్రమే. మన బ్రతుకు పగ్గాలు ఆయనకు అప్పగిస్తే, ఇక మనకి ఏ లోటూ ఉండదు. "కోటి కోటి ప్రణామాలు బాబా. మీ అనుగ్రహం మాకు ఎప్పుడూ ఉండాలి బాబా".


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!



9 comments:

  1. Today is your day nice you saves your devotees.if we trust you with saburi and shraddha.it is magic you have power.om sai ram, om sai ram❤❤❤❤

    ReplyDelete
  2. Om sai ram please bless my family. ❤❤❤💕

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. Om sairam
    Om sairam
    Om sairam
    🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరాం

    ReplyDelete
  6. 🙏🙏 ఓం సాయిరాం🙏🙏
    💐🌺💐🌺💐🌺💐🌺💐💐

    ReplyDelete
  7. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  8. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  9. Baba santosh ki salary hike avali day shifts ravali

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo