సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 818వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎప్పుడూ మనల్ని కాపాడే బాబా ఉండగా మనకు భయమేల?
2. సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
3. ఊదీతో ఛాతీనొప్పి నుండి ఉపశమనం

ఎప్పుడూ మనల్ని కాపాడే బాబా ఉండగా మనకు భయమేల?


సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. రెండు నెలల క్రితం మా ఇంట్లో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా వదినావాళ్ళ అబ్బాయి కొంతకాలం క్రితం కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అప్పుడుప్పుడు తను కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగానే ఆరోజు కూడా పార్కింగ్ లాట్‌ నుంచి కారు బయటికి తీయడానికి రివర్స్ చేస్తూ ఉండగా అనుకోకుండా కారు విండ్ స్క్రీన్ గ్లాస్ పగిలిపోయింది. దాంతో మా అల్లుడు చాలా భయపడిపోయాడు. వెంటనే మా అత్తగారికి జరిగిన విషయం చెప్పాడు. ఆవిడ కూడా ‘ఇలా జరిగిందేమిటా’ అని బాధపడి, విషయం తెలిస్తే తన భర్త (మా మామయ్యగారు) ఏమంటారోనని చాలా కంగారుపడ్డారు. మా మామయ్యగారికి ఈ విషయం తెలిశాక ఆయన ఆ అబ్బాయిని బాగా కోప్పడ్డారు. “అసలు నువ్వెందుకు కారు బయటికి తీశావు? నాకు చెప్తే నేను తీసేవాడిని కదా? ఇప్పుడు చూడు ఏమయిందో, దానిని రిపేర్ చేయించటానికి లక్షరూపాయల దాకా ఖర్చవుతుంది” అని మండిపడ్డారు. రిపేరుకు అంత డబ్బు ఖర్చవుతుందని ఆయన అనగానే ఇంట్లో అందరూ కంగారుపడ్డారు. రెండు రోజుల తర్వాత షోరూమ్‌కి వెళ్ళి కారు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందని అడిగితే వాళ్ళు కూడా, “సార్, ఇన్స్యూరెన్స్ అమౌంట్ పోగా మీకు ఒక లక్షరూపాయలు అదనంగా ఖర్చవుతుందేమో!” అని అన్నారు. దాంతో, మా అత్తగారికి మళ్ళీ కంగారు మొదలైంది. వెంటనే ఆవిడ బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఎలాగైనా మీరే మా మీద దయ చూపించి, ఇన్స్యూరెన్స్ డబ్బు కాకుండా రిపేరు కోసం 25,000 రూపాయల లోపు మాత్రమే ఖర్చయ్యేలా అనుగ్రహిస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అలాగే, రిపేరు పూర్తయి కారు ఇంటికి వచ్చేదాకా రోజుకోసారి స్తవనమంజరి పారాయణ చేస్తాను” అని బాబాకు మ్రొక్కుకున్నారు. మా మావయ్యగారు కారును రిపేరుకు ఇచ్చారు. మా అత్తగారు బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ప్రతిరోజూ శ్రద్ధగా స్తవనమంజరి పారాయణ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక నెల రోజులు గడిచింది. తరువాత ఒకరోజు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసి, “కారు రెడీ అయింది, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పారు. మా మామయ్యగారు అక్కడికి వెళ్ళి ‘రిపేరుకు ఎంత అమౌంట్ అయింద’ని అడిగితే, “ఇన్స్యూరెన్స్ అమౌంట్ కాకుండా 19,000 అయింది” అని చెప్పారు. మా మామయ్యగారు ఇంటికి వచ్చి ఆ మాటను మా అత్తగారికి, మా అల్లుడికి చెప్పగానే వాళ్ళిద్దరూ, ‘ఇదంతా కేవలం బాబా అనుగ్రహమే’ అనుకుంటూ ఎంతో సంతోషంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడే బాబా ఉండగా మనకు భయమేల? “బాబా! మీకు చెప్పుకున్నట్టుగా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాము. కానీ కాస్త ఆలస్యంగా పంచుకుంటున్నందుకు మమ్మల్ని క్షమించండి బాబా”.


మరో అనుభవం:


మా వదినావాళ్ళ అబ్బాయి బి.టెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా ఈమధ్యకాలంలో అందరూ ఇంటి వద్ద నుంచే క్లాసులు అటెండ్ అవుతున్నారు కదా. దానికోసం ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి. 2021, మార్చి నెలలో శివరాత్రి మరుసటిరోజు ఆ అబ్బాయికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. కానీ శివరాత్రిరోజు సాయంత్రం నుంచి మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లంగా ఉంది. దాంతో ఆ అబ్బాయి, “అయ్యో, ఇదేంటి? ఇప్పుడు ఇంటర్నెట్ రాకపోతే రేపు ఉదయం పరీక్షకు హాజరవడం ఎలా?” అని ఆందోళనపడుతూ, “సరే, నెట్‌వర్క్ ఆఫీసుకి కాల్ చేసి ప్రాబ్లమ్ ఏమిటో తెలుసుకుందాం” అనుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇంటర్నెట్ వాళ్ళకి కాల్ చేశాడు. కానీ, ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మామూలుగా నెట్‌వర్క్ ఆఫీసు రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. కానీ, ఆరోజు శివరాత్రి అవటం వలన మధ్యాహ్నం 2 గంటలకే ఆఫీసు క్లోజ్ చేశారు. ఆ విషయం ఆ అబ్బాయికి తరువాత తెలిసింది. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ అబ్బాయి బాబాను వేడుకుని, “బాబా! రేపు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చేయగలరు. మీరు ఎలాగైనా నాకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేట్టు చేయండి బాబా. మీ దయవల్ల ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాడు. ఒక పదినిమిషాల తరువాత చూస్తే ఇంటర్నెట్ రూటర్ లైట్ ఆన్ అయివుండటం కనిపించింది. తనకు చాలా ఆశ్చర్యం వేసింది. ‘ఇందాక చూస్తే లైట్ వెలిగి లేదు. ఇంతలోనే ఎవరూ రిపేర్ చేయకుండానే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తోంది? ఇదంతా ఖచ్చితంగా బాబా దయే’ అని అనుకుని ఎంతో సంతోషంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. “ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి బాబా! ఈ కరోనాను త్వరగా తరిమివేసి అందరినీ కాపాడండి బాబా!” 


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జయహో!


సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు


సాయిబంధువులకు నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను హైదరాబాదులో నివసిస్తున్నాను. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. బాబా పట్ల ఉండే అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. "బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి".


నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి కూడా ఉన్నాయి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇటీవల మా అమ్మకి కరోనా వచ్చి తగ్గింది. కరోనా వచ్చిన సమయంలో మా అమ్మ 15 రోజుల పాటు క్వారంటైన్ అవడం వల్ల నేను అమ్మ దగ్గరకు వెళ్లలేకపోయాను. అయితే మా అమ్మ క్వారంటైన్లో ఉన్న 15 రోజులూ ఏమీ ఆహారం తీసుకోకపోవడం వల్ల అమ్మ పరిస్థితి విషమించింది. దాంతో తనను హాస్పిటల్‌కు తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే, ‘సాధారణంగా ఆడవారిలో 45 నుండి 90 యూనిట్లు ఉండాల్సిన సీరమ్ క్రియాటినైన్ (serum creatinine) అమ్మకు 10.5 యూనిట్లు ఉంద’ని చెప్పారు. అంత తక్కువ యూనిట్లు వస్తే మనిషి బ్రతకడం కష్టం. కానీ మేమంతా బాబా మీదే భారం వేసి, High Risk Consent పత్రంపై సంతకం చేసి, అమ్మకు డయాలసిస్‌ చేయడానికి ఒప్పుకున్నాము. అమ్మకి డయాలసిస్ చికిత్స ప్రారంభమైంది. “చికిత్స సమయంలో కూడా ప్రాణాపాయ పరిస్థితులు రావొచ్చు” అని డాక్టర్ ముందే చెప్పారు. కానీ బాబా అద్భుతం చేశారు. మా అమ్మకి ఇప్పటివరకు సుమారుగా 15 సార్లు డయాలసిస్ చేశారు. కానీ తనకు ఏ సమస్యా ఎదురవలేదు. బాబా ఆశీస్సులతో అమ్మ ఆరోగ్య సమస్య పరిష్కారం అయింది. అంతేకాదు, చికిత్స మధ్యలో మా భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేలా చేశారు బాబా. అమ్మకు ఆరోగ్యం చేకూరి, రిజిస్ట్రేషన్ పనులు సక్రమంగా జరిగితే నా అనుభవాలను మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవాలంటే ఏ విధంగా వ్రాయాలో ముందు నాకు అసలు తెలియలేదు. అలాంటిది బాబానే నాకు దారి చూపించారు. అలా నేను ఈరోజు మీ ముందు నా అనుభవాన్ని పంచుకోగలిగాను. ఇంకా కొన్ని కోరికలు తీర్చమని బాబాకు మ్రొక్కుకొని ఉన్నాను. బాబా దయతో అవి నెరవేరిన తరువాత ఆ అనుభవాలను కూడా ఈ బ్లాగులో పంచుకుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


నేను చెప్పేది నమ్మండి. అనారోగ్యానికి గురైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు సాయి మాతో ఉన్నారని మేము ఆయనపై విశ్వాసం ఉంచాము. ఈ పరీక్షలు మన కర్మల వల్లనే. ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుందని మేము నిజంగా నమ్మాము. కాబట్టి సాయిబాబా యందు విశ్వాసం, సహనం చెదరకుండా ఉంచుకోవాలి. మనం మంచి కర్మలు చేయటంలో దృష్టి పెడితే తదుపరి జన్మలో ఇలాంటి పరీక్షలు ఎదుర్కోకుండా ఉంటాము. మనం అంతటా సాయిని చూడాలి, మంచి జరగడం కోసం ఆయన బోధలను ఆచరించాలి. ఏ పని చేస్తున్నా సాయిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. "బాబా! మీ భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి. దయచేసి ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టకండి". 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


ఊదీతో ఛాతీనొప్పి నుండి ఉపశమనం


నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ముందుగా సాటి సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిభక్తులకు తమ అనుభవాలను పంచుకునే అద్భుతమైన అవకాశాన్నిచ్చిన సాయికి నా కృతజ్ఞతలు. బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. మా నాన్నగారికి 88 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన రోజుకు ఆరు గంటలకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రత్యేకించి సాయిబాబా పుస్తకాలు చదవడంలో గడుపుతారు. సాయి కృపవలన ఆయనకి చెప్పుకోదగ్గ పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవు. అయితే, 2021, మే 18న ఆయన తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారు. కోవిడ్ సమయంలో చిన్న సమస్య కూడా మానసికంగా చాలా కలవరపెడుతుంది. మేము వెంటనే  ఇంట్లో అందుబాటులో ఉన్న మందులు నాన్నకి ఇచ్చాము. ఆ మందులకంటే ఎక్కువగా మేము బాబా ఊదీని నమ్ముతాము. అందువలన కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి నాన్నకి ఇచ్చి, "బాబా! నాన్నకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉపశమనం ప్రసాదించినట్లయితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. మరుసటిరోజుకల్లా నాన్నకి చాలావరకు ఉపశమనం లభించింది. బాబా దయవలన ఆయన ఇప్పుడు బాగున్నారు. "సాయిప్రభూ! మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


13 comments:

  1. Om sai ram if any problem comes to us there is sai to take care about that
    Udi can cure any health problems.that is sai power. He takes care about us. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 27, 2021 at 4:31 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba barinchalenu thandri deni nundi upashanam kaliginchu thandri sainatha

    ReplyDelete
  7. Baba naa arogyam bagundali thandri

    ReplyDelete
  8. Baba santosh health bagundali thandri pleaseeee

    ReplyDelete
  9. Baba carrier bagundali thandri

    ReplyDelete
  10. Baba ma rendu kutubalanu challaga chudu thandri

    ReplyDelete
  11. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  12. 🌺🌼🏵🌺OM SRI SAIRAM🌺🏵🌼🌺 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    ReplyDelete
  13. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo