సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దామోదర్ నారాయణ చందనే


సాయిభక్తుడు దామోదర్ నారాయణ చందనే మహారాష్ట్రలోని కళ్యాణ్ నివాసి. అతడు సాయిబాబాను సశరీరులుగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుని, కొద్దిరోజులు ఆయన సన్నిధిలో గడిపిన భాగ్యశాలి.

దామోదర్ నారాయణ చందనే మారుతికి అంకిత భక్తుడు. ఎవరినైనా పాముగానీ, తేలుగానీ కరిస్తే మంత్రజపం చేసి ఆ విషాన్ని తొలగించగలిగేవాడు. అతడు ఈ సేవను ఉచితంగా చేస్తుండేవాడు. ఆవిధంగా అతడు తనపై, తన కుటుంబంపై మారుతి చూపే కృపకు కృతజ్ఞతలు తెలుపుకుంటుండేవాడు. ఒకప్పుడు అతను ఒక వింత రోగానికి గురయ్యాడు. దాని కారణంగా అతని తలను నొక్కితే ముక్కు నుండి కుళ్ళిన చీము వచ్చేది. ఆ రోగం ఎంత భయానకంగా తయారైందంటే, నిద్రపోయేటప్పుడు వేసుకున్న తలగడ తగిలిన వత్తిడికి కూడా ముక్కు నుండి చీము వస్తుండేది. అన్నిరకాల వైద్యాలూ అతనికి ఉపశమనం కలిగించడంలో విఫలమయ్యాయి. చివరికి అతడు తనపై ఏదో తాంత్రికశక్తి  ప్రయోగించబడిందని భావించి బాబా పాదాలను ఆశ్రయించదలిచాడు.

1917వ సంవత్సరంలో అతడు తన పిల్లలు పాండురంగ, సీతాబాయిలను, సోదరి మంగూబాయిని వెంటబెట్టుకుని శిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్లంతా రైలులో కళ్యాణ్ నుండి బయలుదేరి కోపర్గాఁవ్‌లో దిగారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున అతని సోదరి కోపర్గాఁవ్‌లో ఒకరోజు విశ్రాంతి తీసుకుని తరువాత శిరిడీ వెళ్లాలని అనుకుంది. కానీ అతడు బాబాను కలవాలని చాలా ఆతృతతో ఉన్నాడు. అందువలన వెంటనే ఎడ్లబండి ఎక్కి శిరిడీకి ప్రయాణమయ్యారు. శిరిడీ చేరుకున్న వెంటనే గ్రామస్తులు అతనిని ద్వారకామాయికి తీసుకుని వెళ్ళారు. తమ ఆసనంపై కూర్చుని ఉన్న బాబా అతడిని చూస్తూనే, "నువ్వు ఇక్కడకి ఎందుకు వచ్చావు?" అని అరుస్తూ అసహ్యమైన పదజాలం వాడారు. దాంతో దామోదర్ భయపడిపోయాడు. మంగూబాయి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని, "బాబా మన సద్గురువు, మనం ఆయన భక్తులం. అందుకని మనం శాంతంగా, నిశ్శబ్దంగా ఉండి ఆయన చెప్పేది వినాలి. అంతా మంచి జరుగుతుంది" అని చెప్పింది. కాసేపటికి బాబా శాంతించి దామోదర్‌ని, "ఎక్కడనుండి వచ్చారు? ఎందుకు వచ్చారు?" అని అడిగారు. అతడు తన బాధనంతా బాబాతో చెప్పుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ ఊదీ ఇచ్చారు. తరువాత దామోదర్‌ని తమ దగ్గరకు రమ్మని పిలిచి, అతని ఒంటినిండా ఊదీ పూసి, "నా అనుమతి లేకుండా శిరిడీ విడిచి వెళ్ళవద్దు" అని చెప్పారు. తక్షణమే అతనికి తన పరిస్థితిలో మార్పు కనిపించి, అదివరకటి కంటే కాస్త మెరుగ్గా అనిపించింది. దుష్టాత్మలను ఉద్దేశించి బాబా అసభ్యకరమైన పదజాలాన్ని పలికి, చెడు ప్రభావాన్ని తరిమివేశారు.

దామోదర్, అతని కుటుంబం శిరిడీలో 8 రోజులు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఒక మట్టి గుడిసెలో బస చేశారు. ఆ గుడిసెలోని నేలంతా ఆవుపేడతో అలకబడి ఉంది. 8-10 సంవత్సరాల వయస్సున్న అతని పిల్లలు శిరిడీలో అద్భుతమైన సమయాన్ని గడిపారు. పాండురంగ ఇలా చెప్పాడు: "మేమందరం బాబా భిక్ష ద్వారా సేకరించిన ఆహారాన్ని తీసుకునేవాళ్ళం. మేము, పిల్లులు, కుక్కలు పాత్రనుండి ఆహారాన్ని తీసుకున్న తరువాత మిగిలిన చాలా కొద్ది ఆహారాన్ని బాబా తినేవారు. లక్ష్మీబాయి రోజూ భాక్రీ, కొన్ని కూరగాయలతో వండిన కూరలు బాబా కోసం తెచ్చేది. ఆమె శిరిడీ వచ్చే ఎంతోమంది భక్తుల అవసరాలు కూడా చూసుకునేది. భక్తులు మిఠాయిలు, కొబ్బరికాయలు, పండ్లు బాబాకు సమర్పించేవారు. వాటిని బాబా అందరికీ పంచేసేవారు. మేము తరచూ బాబాతో ఆడుకునేవాళ్ళం. ఆయన వీపుమీద ఎక్కేవాళ్ళం, ఆయన భుజాలపై కూర్చునేవాళ్ళం. ప్రతిరోజూ ఉదయం మేము ఆయన పాదాలను మర్దించేవాళ్ళం. ఆయన పాదాలలో ఎముకను నేను ఎప్పుడూ తాకి ఎఱుగను. ఆయన పాదాలు వెన్నలా మెత్తగా ఉండి చందన పరిమళాలు వెదజల్లుతుండేవి. బాబా భక్తుల బాధలను వేపచెట్టు క్రింద లేదా ద్వారకామాయిలో, కొన్ని సందర్భాలలో లెండీబాగ్‌లో వింటుండేవారు".

ఒకరోజు దామోదర్ కుటుంబం మసీదులో కూర్చుని ఉండగా ఒక అద్భుతమైన లీల జరిగింది. సంతానభాగ్యం లేని దంపతులు సంతానం కావాలని బాబాను వేడుకునేందుకు శిరిడీ వచ్చారు. ప్రయాణంలో ఆ స్త్రీ తన ముక్కుపుడకను పోగొట్టుకుంది. అప్పుడామె తన మనసులో, "నాకు పిల్లలు కలగకపోయినా పట్టించుకోను, కానీ నా ముక్కుపుడక తిరిగి వస్తే చాలు" అని ప్రార్థించింది. తరువాత వాళ్ళు ద్వారకామాయికి వచ్చి మౌనంగా బాబా ముందర కూర్చున్నారు. బాబా కూడా మీరెందుకు వచ్చారని వాళ్ళని అడగలేదు. కానీ, వారిని ఆశీర్వదిస్తూ ఒక కొబ్బరికాయను ఇచ్చి, దాన్ని తినమని చెప్పారు. ఆ దంపతులు తమ బసకు వెళ్ళాక కొబ్బరికాయను పగలగొట్టారు. ఆశ్చర్యం! పోయిన ముక్కుపుడక ఆ కొబ్బరికాయలో ఉంది. పట్టలేని ఆనందంతో కొబ్బరికాయను అక్కడే వదిలేసి, ముక్కుపుడకను పట్టుకుని వాళ్ళు బాబా వద్దకు వచ్చారు. బాబా వాళ్ళను చూసి కేకలేస్తూ, "మీరిద్దరూ ఇక్కడకు వచ్చి మౌనంగా కూర్చున్నారు. అయినా మీకు పిల్లలు లేరని, మీరు ముక్కుపుడకను పోగొట్టుకున్నారని నాకు తెలుసు. ఆ రెండూ అనుగ్రహించేందుకే నేను మీకు కొబ్బరికాయను ఇచ్చి ఆశీర్వదించాను. కానీ మీరు ముక్కుపుడక దొరకడంతో కొబ్బరికాయను అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే మీరు తిరిగి మీ బసకు వెళ్ళి కొబ్బరికాయ తినండి. దాంతో మీ సమస్యను మీరు అధిగమిస్తారు" అని అన్నారు.

దామోదర్ పూర్తిగా కోలుకున్నాక 8వ రోజు శిరిడీ నుండి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతినిచ్చారు. తరువాత బాబా గట్టిగా కేకలేస్తూ, "ఇప్పుడు నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, మళ్ళీ శిరిడీ రాకు" అని అన్నారు. బాబా తననెందుకు మళ్ళీ శిరిడీ రావద్దంటున్నారని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలకు గుండె బరువెక్కిపోగా అతడు, "సరే బాబా, మీరు చెప్పినట్లే నేను మళ్ళీ శిరిడీకి రాను. కానీ నేను వెళ్లేముందే పుష్కలంగా మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి" అని అన్నాడు. అప్పుడు బాబా, "అరే! నిన్ను, నీ వారసులను నేను కనిపెట్టుకుని ఉంటాను. నువ్వు, నేను ఎన్నో జన్మల నుండి సంబంధం కలిగివున్నాము" అని అన్నారు. తరువాత బాబా వాళ్లందరికీ చేతినిండా ఊదీ ఇచ్చారు. తరువాత వాళ్ళు తమ ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. ఒక సంవత్సరం తరువాత దామోదర్ బాబా మహాసమాధి చెందారని విన్నాడు.

(Source: Divine Symphony by Vinny Chituri & Shri Sai Leela Magazine 1988 Issue)
http://www.saiamrithadhara.com/mahabhakthas/damodar_narayan_chandane.html

3 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo