సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

హరిభావు విశ్వనాథ్ చౌబాల్ & శంకర్ హరిభావు చౌబాల్


1911లో హరిభావు విశ్వనాథ్ చౌబాల్ మొదటిసారి బాబాను దర్శించుకోవడానికి శిరిడీ బయలుదేరాడు. అప్పుడతని తండ్రి బాబాను ఉద్దేశిస్తూ, "అతనొక ముస్లిం ఫకీరు, మసీదులో ఉంటాడు, గ్రామంలో సేకరించిన భిక్షపై తన జీవనాన్ని సాగిస్తుంటాడు. అతన్నెందుకు నువ్వు కలవాలనుకుంటున్నావు? అమాయక ప్రజలను మోసం చేసే డాంబికులు ప్రపంచంలో అనేకులున్నారు. కాబట్టి నువ్వక్కడికి వెళ్లి నీ సమయాన్ని వృధా చేసుకోకు" అని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఏదేమైనప్పటికీ హరిభావు అవేమీ పట్టించుకోకుండా శిరిడీ వెళ్ళాడు. బాబా అతనిని చూస్తూనే, అతని తండ్రి చెప్పిన అవే మాటలను పునరావృతం చేస్తూ అతనికి స్వాగతం పలికారు. దాంతో అతను 'బాబా సర్వవ్యాపకుడని, ఆయనకు కొన్ని మైళ్ళ దూరంలో ఏమి జరిగిందీ తెలుసున'ని గ్రహించాడు. 

అతను నాలుగురోజులు శిరిడీలో ఉండి, బాబా యొక్క దైవత్వాన్ని చూసి ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అప్పటినుంచి అతను తరచూ శిరిడీ సందర్శిస్తుండేవాడు. ప్రతిరోజూ బాబాను చూడాలని, ఆయనకు నమస్కరించుకోవాలని ఆరాటపడుతుండేవాడు. అందువల్ల శిరిడీ వెళ్లి ఎక్కువకాలం అక్కడ గడపాలని నిర్ణయించుకున్నాడు. 1914లో అతను తన కుటుంబంతో శిరిడీ వెళ్లి 4 నెలలు ఉన్నాడు. ఆ సమయంలో అతడు అప్పాషింపీతో కలిసి ఉండేవాడు. మళ్ళీ 1917లో అతను కుటుంబంతో వెళ్లి అబ్దుల్ బాబా కుటీరం వెనుక ఉన్న ఒక పెద్ద ఇంట్లో బస చేశాడు. ఈసారి కూడా అతను 4 నెలలపాటు శిరిడీలో ఉన్నాడు.


హరిభావు విశ్వనాథ్ చౌబాల్ కుమారుడైన శంకర్ హరిభావు చౌబాల్ థానే జిల్లాలోని దహనూలో తేదీ.13-8-1910న జన్మించాడు. హరిభావు 1914లో తన కుటుంబంతో కలిసి శిరిడీలో ఉన్నప్పుడు శంకర్ మొదటిసారిగా బాబాను చూశాడు. అయితే అప్పటికి అతను చాలా చిన్నవయస్సులో ఉన్నందున అప్పటి సంగతులేవీ తనకి గుర్తులేవు. కానీ 1917లో రెండవసారి హరిభావు శిరిడీలో ఎక్కువరోజులు ఉన్నప్పుడు శంకర్‌కు 7 సంవత్సరాల వయసు. అప్పటి సంగతులు చాలావరకు తనకి గుర్తున్నాయి.

ఒకరోజు మధ్యాహ్న ఆరతి ప్రారంభించడానికి కొద్దిసేపటి ముందు శంకర్ సభామండపంలోని అడ్డుగోడ పైకి ఎక్కాడు. ఆ గోడపై నిలబడి ఉన్న శంకర్‌ని చూసి హరిభావుతో బాబా, "అరే, నీ బిడ్డ అక్కణ్ణించి క్రిందపడితే దెబ్బలు తగులుతాయి. వెళ్లి తనని తీసుకొచ్చాక ఆరతి మొదలుపెట్టండి" అన్నారు. పిల్లవాడిని అక్కడినుంచి క్రిందికి దించిన తరువాతే ఆరోజు ఆరతి ప్రారంభమైంది.

ప్రతిరోజూ కాకడ ఆరతి ముగిసిన తరువాత శంకర్ తల్లి ఇంటికి వెళ్లి బాబా కోసం ఝుణకా భాకరి తయారుచేసేది. ఎందుకంటే, బాబా వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చేవారు. బాబాకు భిక్ష ఎవరు ఇవ్వాలనే విషయంలో పిల్లలు వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకునేవారు. ఈ సమస్యను, పిల్లలందరికీ ఒకరి తరువాత ఒకరికి బాబాకి భిక్ష వేసే అవకాశం వచ్చే విధంగా ఆమె పరిష్కరించింది. బాబా భిక్షకు వెళ్లి తిరిగి వచ్చే లోపల శంకర్ ద్వారకామాయికి పరుగున వెళ్ళి వేచి ఉండేవాడు. బాబా ప్రేమగా తనని దగ్గరకు తీసుకుని, కాసేపు ఒడిలో కుర్చోబెట్టుకుని, గట్టిగా హత్తుకుని ముద్దుచేసేవారు. చాలా తరచుగా తన ముక్కు తుడిచేవారు. తాము తెచ్చుకున్న భిక్షనుండి రుచికరమైన పదార్థాలను తనకి ఇచ్చిన తరువాత వెళ్ళి ఆడుకోమని చెప్పేవారు బాబా. 

ఒకసారి శ్యామా శంకర్‌ను పిలిచి, "బాబూ! నువ్వు రోజూ ఇక్కడికి వచ్చి నిలుచుంటావు. బాబా నిన్ను దగ్గరకు తీసుకుని నీ ముక్కు తుడుస్తూ ఉంటారు. నువ్వు చూస్తే చాలా మురికిగా ఉంటావు. రేపటినుంచి ఇక్కడకి వచ్చి నిల్చోవద్దు" అని కాస్త గట్టిగా మందలించాడు. మరుసటిరోజు శంకర్ ద్వారకామాయికి వచ్చి సభామండపంలో మౌనంగా కూర్చున్నాడు. బాబా ఒక భక్తుణ్ణి పిలిచి, శంకర్‌ని తమ దగ్గరకు తీసుకురమ్మని పంపించారు. కానీ శ్యామా బాబా ప్రక్కనే ఉండడంతో బాబా దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించాడు శంకర్. అదే విషయం ఆ భక్తుడు బాబాకు చెప్పగా, బాబా మళ్ళీ వెళ్లి తనని తీసుకునిరమ్మని చెప్పారు. కానీ ఈసారి కూడా శంకర్ నిరాకరించగా, ఆ భక్తుడు శంకర్‌ని ఎత్తుకుని తీసుకెళ్లి బాబా ముందు ఉంచాడు. శంకర్‌ని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని మృదుస్వరంతో, "భావూ! ఈరోజు నా మీద కోపంగా ఉన్నావా? నాకు దూరంగా ఎందుకు కూర్చున్నావు?" అని అడిగారు బాబా. అప్పుడు శ్యామా తనతో అన్న మాటలు బాబాకు చెప్పాడు. అప్పుడు బాబా శ్యామాతో, "అరే శ్యామా! నువ్వు ఎలాగైతే నా బిడ్డవో, అలాగే భావూ కూడా. నా బిడ్డలను నేను దగ్గరకు తీయకుంటే, మరెవరు తీసుకుంటారు? కాబట్టి అతని మీద కోప్పడకు" అని శ్యామాను సమాధానపరిచారు. అప్పటినుండి బాబా దగ్గరకు వెళ్ళడానికి శంకర్‌కు అభ్యంతరం చెప్పలేదు శ్యామా.

శంకర్ ఇలా చెప్పాడు: "నాకు స్పష్టంగా గుర్తుంది. ఒకరోజు ఎవరో ఫోనోగ్రామ్ తెచ్చి సభామండపంలో ఉంచారు. దానిని ఆన్ చేసి అందరూ తమను తాము మరచి ఆనందించారు. అదేరోజు సర్కస్ శిరిడీకి వచ్చింది. దాని యజమాని బాబా దర్శనం కోసం ఒక ఏనుగును తీసుకువచ్చాడు. బాబా ముందు ఏనుగు మ్రోకరిల్లడాన్ని చూడటానికి పిల్లలందరూ అక్కడ గుమిగూడారు. బాబా నన్ను 'భావూ' (సోదరుడు) అని పిలిచేవారు. ఆయన నా పట్ల చాలా దయతో ఉండేవారు. నేను పెద్దయ్యాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతిదశలో బాబా నాకు అండగా ఉంటూ సహాయం అందించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నేనెప్పటికీ ఆయనకు కృతజ్ఞుడినై ఉంటాను".

 సోర్స్: సాయిలీలా మ్యాగజైన్ - మే 1986.
Baba's Divine symphony by Vinni Chitluri

3 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo