సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 316వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నీడలో హాయిగా
  2. తప్పుడు కేసు నుండి బాబా నన్ను రక్షించారు

సాయి నీడలో హాయిగా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్‌కీ జై! 

ముందుగా, బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశాన్ని అందిస్తున్న 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా సాయితండ్రికి బిడ్డగా బ్రతుకుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా సాయి నీడలోనే నడుచుకుంటున్నాను. నా జీవితంలోకి బాబా వచ్చినప్పటినుండి అన్నీ అద్భుతాలే. ఆయన పాదాల చెంత నేనొక చిన్న ఇసుకరేణువును. నా కుటుంబాన్నంతా బాబానే చూసుకుంటున్నారు. ఇకముందు కూడా ఇలాగే బాబా నీడలోనే నడవాలని, బాబా మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ప్రేమగా చూసుకోవాలని నా కోరిక.

బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు మరువలేనివి. అన్నింటినీ ఒకేసారి పంచుకోలేను కాబట్టి, ఇటీవల జరిగిన అనుభవాలను కొన్నింటిని మీతో ఇప్పుడు పంచుకుంటాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. మావారు బిజినెస్ చేస్తున్నారు. నేను ఆశించిన దానికన్నా బాబా నాకు ఎక్కువే ఇచ్చారు. మా ఇద్దరు కోడళ్ళను బాబానే ఎంపిక చేశారు. వాళ్ళిద్దరూ మాకు కూతుళ్ల కంటే ఎక్కువే. 

మా మనుమరాలికి (పెద్దబ్బాయి కూతురు) మాటలు రావడం ఆలస్యం అవటంతో మేము చాలా ఆందోళనచెందాము. బాబానే చూసుకుంటారని ఆయన మీదే భారం వేసి, పాపకి త్వరగా మాటలు వచ్చేలా అనుగ్రహించమని ప్రతిరోజూ బాబాను వేడుకునేదాన్ని. బాబా అనుగ్రహంతో ఇప్పుడు పాపకి మాటలు వచ్చాయి. బాబా తన బిడ్డలను బాధపడనీయరు కదా! గతంలో మనం చేసిన చెడు కర్మల వలనే మనకు ఇలాంటి బాధలు వస్తాయని నేను అనుకుంటాను. పాప 'బాబా, బాబా' అంటుంది, తనకి ఊదీ పెట్టిన వెంటనే నోట్లో ఊదీ వేయమన్నట్లు నోరు చూపుతుంది. తననలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి ఎవరు వచ్చినా 'మీ ఇంట్లో బాబా తిరుగుతున్నారు' అని అంటారు. నాకు కూడా నిజమే అనిపిస్తుంది. 

మా చిన్నబ్బాయికి వివాహమైన చాలాకాలం వరకు సంతానం కలుగలేదు. ఆ విషయంలో మేమంతా ఎంతో ఆందోళన చెందాము. వారికి సంతానాన్ని ప్రసాదించమని బాబాను ఆర్తిగా వేడుకునేదాన్ని. బాబా ఎంతో కరుణతో అనుగ్రహించారు. ఇప్పుడు మా చిన్న కోడలు ప్రెగ్నెంట్. త్వరలో బాబానే పసిబిడ్డ రూపంలో మా ఇంటికి రాబోతున్నారు. డెలివరీ విషయం కూడా బాబానే చూసుకుంటారని మేము ధైర్యంగా ఉన్నాము. మా కోడలు బాబానే నమ్ముకున్నది. మా కోడలి ఆరోగ్యం బాగుంటే మా అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. "ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా! మా అందరినీ మీరే చూసుకోవాలి. మా కుటుంబం బాధ్యతంతా మీదే బాబా. మమ్మల్ని ఎన్నటికీ మరువకండి బాబా!" 

నా మేనకోడలు తన కాపురంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, "నువ్వు బాబానే నమ్ముకో! ప్రతిరోజూ మీవారికి బాబా ఊదీని ఇవ్వు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి" అని తనకు చెప్పాను. తను బాబాను ప్రార్థించి‌,  ప్రతిరోజూ తన భర్త తాగే 'టీ'లో బాబా ఊదీ వేసి ఇవ్వడం ప్రారంభించింది. అప్పటినుండి తన భర్తలో మార్పు రావడం మొదలైంది. కానీ ఇంకా మార్పు రావాలి. "అతనిలో మార్పు వచ్చి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేలా అనుగ్రహించండి బాబా!" 

కొన్ని రావలసిన బాకీలు, పరిష్కారం కావాల్సిన పొలాలు, ఫ్లాట్లు ఉన్నాయి. "బాబా! మీరే వాళ్ళ మనసులలో ఉండి మాకు రావాల్సిన వాటిని ఇప్పించండి. ఆ సమస్యలు తీరిన వెంటనే ఆ అనుభవాలను కూడా సాయిభక్తులతో పంచుకునేలా ఆశీర్వదించండి బాబా!"
  
ఇట్లు 
సాయిబిడ్డ

తప్పుడు కేసు నుండి బాబా నన్ను రక్షించారు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాధారణ సాయిభక్తుడినైన నేను ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని. ఒకసారి నాపై తప్పుడు అభియోగాలు మోపి, నాకు ఎటువంటి సంబంధం లేని క్రిమినల్ కేసులో నన్ను ఇరికించారు. జీవితంలో ప్రతి దశలో నేను ఎవరికైతే సహాయం చేశానో ఆ వ్యక్తులే ఆ కేసు పెట్టడం నేను అస్సలు జీర్ణించుకోలేని విషయం. నాపై ఐపిసి 306 ప్రకారం అభియోగాలు మోపబడ్డాయి. ఇది బెయిల్ ఇవ్వని క్రిమినల్ నేరం. దాంతో సీనియర్ ప్రభుత్వ అధికారిగా సమాజంలో గౌరవప్రదమైన స్థానం, నా జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. నా ఉద్యోగం, నా ప్రతిష్ఠ అన్నీ ప్రమాదంలో పడ్డాయి. అన్ని వార్తాపత్రికలు నా గురించి మసాలా జోడించి మరీ వార్తలు ప్రచురించాయి. ప్రజలు ఆ తప్పుడు వార్తలు చదివి చెవులు కొరుక్కుంటూ ఆనందిస్తున్నారు. ఆ పరీక్షా కాలంలో నేను, నా కుటుంబం అనుభవించిన మానసిక క్షోభ వివరించడానికి నా వద్ద పదాలు లేవు. ఏ దారీ కనిపించని నిస్సహాయస్థితిలో నేను బాబా పవిత్ర పాదాలకు పూర్తిగా శరణాగతి చెందాను.

ప్రపంచం మొత్తం మనల్ని విడిచిపెట్టిన సమయంలో సాయిబాబా మనల్ని తన ఒడిలోకి తీసుకుంటారు. ఆయన దయవలన పోలీసులు నాతో నీచంగా ప్రవర్తించలేదు. వాళ్ళు నన్ను గౌరవంగా చూశారు. దర్యాప్తులో నేను వాళ్ళకి పూర్తిగా సహకరించాను. ఐపిసి 306 వంటి క్రిమినల్ కేసులో ఉన్నప్పటికీ పోలీసులు నన్ను అరెస్టు చేయలేదంటే ఇప్పటికీ నమ్మశక్యంకాని విషయం. పైగా న్యాయస్థానం నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చివరికి బాబా అనుగ్రహం వలన నేను నిర్దోషిగా ఆ కేసు నుండి బయటపడ్డాను. నేను తలదించుకోకుండా బాబా కాపాడారు. బాబా పవిత్ర పాదాలను ఆశ్రయించాక వేరొకరి పాదాలు పట్టుకోవలసిన అవసరం లేదు. ఆయన తన భక్తులు తలెత్తుకునేలా ఉంచుతారు. బాబా తన భక్తులను పరీక్షించినా, వారు ఆ పరీక్షలో విజయం సాధించేలా కూడా చూస్తారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. మీరు నాకు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడనై ఉంటాను. లవ్ యు సాయినాథా! నేను మీ లీలను అంత అందంగా వ్యక్తపరచలేకపోయినందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను".


3 comments:

  1. లవ్ యు సాయినాథా!

    ReplyDelete
  2. ఓం సాయిరాం ,
    సాయి భక్తులందరికీ నా నమస్కారములు
    నాకు సాయిని నమ్మడం అంటే ఏమిటో తెలియడం లేదు.
    సాయి సాయి సాయి అనుకోవడం తప్ప పూజించడం నాకు చేత కావడం లేదు
    నాకు ఉన్న సమస్యలు ఎవ్వరు పరిష్కరించలేరు అని అనిపిస్తూ ఉంది'
    క్షణ క్షణ౦ నరకం లాగ ఉంది . ఏ మాత్రం ఇష్టం లేని జీవితం బ్రతుకు తున్నాను.
    ఈ నాటక రంగం నుండి నాకు విముక్తిని ప్రసాదించండి సాయి
    ఓం సాయినాథ్ , శ్రీ సాయినాథ్ , జయ జయ సాయినాథ్
    సర్వం శ్రీ సాయి నాథార్పణం .

    ReplyDelete
  3. Om Sai Ram 🙏 🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo