సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 323వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా జ్వరం తగ్గించారు - శిరిడీకి రప్పించారు 
  2. బాబా - నా సాయిబాబా

సాయిబాబా జ్వరం తగ్గించారు - శిరిడీకి రప్పించారు 

ఓం సాయిరాం!

నా పేరు మల్లూరు చంద్రశేఖర్. ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం నివాసినైన నేను సి.ఐ.టి.యు. లీడర్‌ని. మరోసారి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. "నా అనుమతి లేనిదే ఎవరూ శిరిడీ రాలేరు" అన్నది బాబా మాట. నా విషయంలో అది అక్షరసత్యం. ఎందుకంటే ప్రతిసారీ నేను శిరిడీ వెళ్ళడానికి ముందు ఏదో ఒక రీతిన బాబా సందేశం అందుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టే అన్నీ సమకూరుతాయి. అలా శిరిడీ వెళ్లినప్పుడల్లా మార్గమధ్యంలో మొదటిసారి శిరిడీ సందర్శిస్తున్న సాయిభక్తులు నాకు పరిచయం అవుతున్నారు. బహుశా బాబాయే పరిచయం చేయిస్తున్నారు. వాళ్ళకి బాబా దర్శనం చేయించి, శిరిడీలోని ప్రదేశాలను చూపిస్తూ, వివరిస్తూ ఉండేవాడిని. గత ఏడాది(2019)లో బాబా పిలుపుతో దాదాపు ప్రతి నెలా శిరిడీ వెళ్ళాను. డిసెంబరులో కూడా వెళ్ళాను. అయితే 2020 జనవరిలో బాబా పిలుపు రాలేదు, అందువలన నేను శిరిడీ వెళ్ళలేదు. నిజానికి ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను కూడా శిరిడీ వెళ్ళకూడదని బలంగా అనుకున్నాను. ఈ నెలలో కూడా నేను శిరిడీ వెళ్లకూడదని అనుకుంటున్న సందర్భంలో, నా ఒక్కగానొక్క ముద్దుల కుమార్తె సత్యసృజన (11 సంవత్సరాల వయస్సు) ఉన్నట్టుండి జ్వరంతో అనారోగ్యం పాలైంది. ఆ జ్వరం వస్తోంది, తగ్గుతోంది కానీ పూర్తిగా తగ్గేది కాదు. దాంతో తను తీవ్రంగా నీరసించిపోయింది. అప్పటివరకు చక్కగా ఉత్సాహంగా ఆడుకున్న నా చిట్టితల్లి అలా నీరసంగా ఉండేసరికి స్థానికంగా ఉన్న గ్రామీణ వైద్యుని వద్దకు పాపను తీసుకెళ్లాను. ఆ వైద్యుడు అది సాధారణ జ్వరమేనని చెప్పి మందులు ఇచ్చాడు. ఆ మందులు వాడినా జ్వరం తగ్గలేదు. ఆ తరువాత మరో వైద్యుని వద్దకు పాపను తీసుకెళితే, అది 'సంధి' అని చెప్పి ఇంజక్షన్ చేసి, తరువాత ఏదో ఇచ్చి నల్ల మొలత్రాడుకు అమర్చి పాపకి కట్టమన్నాడు. అలా చేసినా జ్వరం తగ్గలేదు. సత్తుపల్లి పట్టణంలోని మరో పిల్లల వైద్యుడి వద్దకు పాపను తీసుకెళ్లింది నా సహధర్మచారిణి. అక్కడ డాక్టర్ పాపకు రక్త, మూత్ర పరీక్షలు చేసి టైఫాయడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి మందులు ఇచ్చాడు. ఆ మందులు వాడినా కూడా జ్వరం తగ్గలేదు. ఇదంతా చూసి నాకు చాలా దుఃఖం వచ్చింది. "బాబా! నీవే నా బిడ్డను కాపాడు తండ్రీ! నా చిట్టితల్లి వెంటనే లేచి తిరిగేలా చేయి బాబా!" అని మనసులో బాబాను ఆర్తిగా వేడుకొన్నాను. "పాపకి జ్వరం తగ్గి మునుపటిలా హుషారుగా ఉంటే ఈ నెలలో శిరిడీ వస్తాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన కొద్ది క్షణాలలోనే నా బిడ్డ జ్వరం తగ్గిపోయింది. తను ఎంతో హుషారుగా, "నాన్నా, సాయిబాబా నా జ్వరం తగ్గించారు" అని చిరునవ్వుతో చెప్పింది. "నేను బాబాను కోరుకున్నాను నాన్నా, నువ్వు శిరిడీ వెళ్ళు" అని చెప్పింది. బాబా తన భక్తులను సదా కాపాడుతుంటారనేది నా విషయంలో ఋజువైంది. నేను అనుకున్న విషయాన్ని నా బిడ్డ నోటితో బాబా పలికించి, 'వైద్య సాయిబాబా' అని నిరూపించారు. వెంటనే ఫిబ్రవరి 5వ తేదీన బయలుదేరి శిరిడీ వెళ్ళాను. అక్కడ మొట్టమొదటిసారి బాబా దర్శనానికి అనంతపురం నుండి వచ్చిన హేమంత్ అనే 25 ఏళ్ళ కుర్రవాడు పరిచయమయ్యాడు. అతను బాబా తనకి ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం ఇచ్చారని, అక్కడికి వెళ్ళబోయే ముందు బాబాను దర్శించుకోవటానికి శిరిడీ వచ్చానని చెప్పాడు. తనకు సమాధిమందిరం దర్శనం, పల్లకీ సేవ చూపించమని బాబా నాకు అవకాశం కల్పించారు. అతనికి పల్లకీ ఉత్సవం చూపించి, తరువాత బాబా దర్శనం చేయించాను. నేను బాబాని కనులారా దర్శించుకొని, నా చిట్టితల్లికి ప్రేమతో ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు బాబాకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సాయంకాలం ద్వారకామాయిలో ధూప్ ఆరతికి భజన చేయించారు బాబా. బాబా దర్శనంతో మనసంతా ఆనందాన్ని నింపుకొని 7వ తేదీన ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాను.

బాబా - నా సాయిబాబా

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను గత 11 సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. ఏమి జరిగినా నా నోటికి వచ్చే మొదటి మాట - 'సాయిబాబా'. బాబా నా సమస్యలను ఎన్నింటినో పరిష్కరించారు. నా సమస్యలన్నిటినీ పరిష్కారం చేసే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఆరోజు నేను నిజంగా సంతోషంగా ఉంటాను.

మాకు 18 నెలల పాప ఉంది. ఈమధ్య తనకి తామర సోకింది. నేను తన అలెర్జీకి కారణమయ్యే ఆహారపదార్థాల విషయంలో జాగ్రత్త తీసుకోవడంతోపాటు, తనకి పూర్తిగా నయం అయ్యేందుకు అవసరమైనవన్నీ చేయాలనుకున్నాను. USAలో అయితే స్టెరాయిడ్లు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆయుర్వేద చికిత్స కోసం తనని భారతదేశానికి తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ నా భర్తకు కొన్ని వీసా సమస్యలు ఉన్నందున తను మాతోపాటు రాలేని పరిస్థితి. అందువల్ల నేను ఒంటరిగా మా పాపని తీసుకుని భారతదేశానికి వెళ్లాల్సి వచ్చింది. నేను భయంతో చాలా ఆందోళనపడ్డాను. బాబాకి చెప్పుకుని పాపని తీసుకుని బయలుదేరాను. బాబా దయామూర్తి, నాకు చాలా సహాయం చేశారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటినుండి చివరివరకు ప్రతీది సజావుగా సాగేలా చేసారు. సెక్యూరిటీ చెక్ వద్ద నేను ఒంటరిగా ప్రయాణిస్తున్న మరో మహిళను కలిశాను. తొందరగానే మా మధ్య స్నేహం ఏర్పడింది. ప్రయాణమంతటా మేము కలిసే ఉన్నాము. మా పాప కూడా పెద్దగా ఏడవలేదు. ఇదంతా బాబా వల్లనే సాధ్యమైంది. 14 గంటల విమాన ప్రయాణంలో ఆయన మాకు మూడు సీట్ల సోఫాను ఇచ్చారు. సర్వశక్తిమంతుడైన బాబా దయవల్ల మా పాప హాయిగా నిద్రపోయింది. అడుగడుగునా బాబా నాతో, మా పాపతో ఉంటూ ప్రతీది సజావుగా ప్లాన్ చేశారు. బాబా నాతో ఉన్నందుకు నేను ధన్యురాలిని.

నేను క్షేమంగా భారతదేశం చేరుకుని నా సోదరి ఇంటికి వెళ్ళాను. ఇక అప్పటినుండి మా పాప అస్సలు నిద్రపోలేదు. బలవంతంగా నిద్రపుచ్చితే, కాసేపట్లోనే లేచి నిద్ర చాలక ఏడుస్తుండేది. సరిగా తిండి కూడా తినేది కాదు. అలా రెండురోజులు గడిచినా సరే తను నిద్రపోవడానికి సిద్ధంగా ఉండేది కాదు. ఎల్లవేళలా ఆడుకోవడానికే ఆసక్తి చూపుతుండేది. ఒకానొక సమయంలో ఇంట్లోని ప్రతి ఒక్కరికి తనని సంభాళించడం చాలా కష్టమైంది. ఇక చివరికి తనని నిద్రపుచ్చడానికి నిద్రమాత్ర ఇవ్వాల్సి వచ్చింది. అలా చేయడానికి నేను చాలా కలవరపడ్డప్పటికీ నిద్రమాత్ర ఇవ్వక తప్పలేదు. అయినా కూడా తను నిద్రపోకుండా ఆడుతూనే ఉంది. అప్పుడు నేను, "మా పాప పదినిమిషాల్లో నిద్రపోయేలా చేయండి" అని సాయిని ప్రార్థించాను. నా దయగల సాయి నా కోసం నేనడిగింది చేశారు. కొద్దిసేపట్లో తను హాయిగా ప్రశాంతంగా నిద్రపోయింది. "ఓం సాయిరామ్! దయచేసి మా పాప  చర్మ సమస్యలను నయం చేయండి. తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా నేను చాలా బాధపడుతున్నాను బాబా. తను సరిగ్గా తినేలా కూడా చేయండి. దేవా! దయచేసి మా పాపపై మీ తల్లిప్రేమను చూపించండి".

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయినాథార్పణమస్తు!
శుభం భవతు!


source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2542.html


2 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo