సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 317వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా విన్నారు... అన్నీ ఆయన చూసుకున్నారు
  2. బాబా రాకతో నా జీవితంలో ప్రతీది మారిపోయింది

బాబా విన్నారు... అన్నీ ఆయన చూసుకున్నారు

సాయిభక్తురాలు శ్రీమతి సుచిత్ర తన ఆప్తురాలికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

ఒకరోజు మా ఇంట్లో బాబా భిక్ష ఏర్పాటు చేసాం. ఆ అనుభవాన్ని ఇదివరకే మీతో పంచుకున్నాను. ఆ కార్యక్రమానికి మేము కొంతమంది సాయిభక్తులను ఆహ్వానించాము. మా పక్కింట్లో ఉండే జ్యోతి అక్క ఆ కార్యక్రమానికి వచ్చింది. అందరూ బాబా పట్ల చూపిస్తున్న ప్రేమ తనకు ఎంతో నచ్చింది. ఆ తరువాత మాటల మధ్యలో నేను ప్రతిరోజూ బాబా ఫోటోలను, బాబా మాటలను, బాబా లీలలను నా వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేస్తూ ఉంటానని తెలిసి జ్యోతక్క తరచూ వాటిని చూసి ఆనందించేది. నేను ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్తుంటాను. అది తెలిసిన జ్యోతక్క ఒకరోజు నాకు ఫోన్ చేసి, "ఈ గురువారం నీతో పాటు బాబా మందిరానికి వస్తాను" అని చెప్పింది. అలాగే ఆ గురువారంరోజు ఇద్దరం కలిసి బాబా మందిరానికి వెళ్ళాము. మధ్యాహ్న ఆరతి అయిపోయాక బాబాకు నమస్కరించుకుని, ఇద్దరం ఒకచోట కూర్చున్నాము. అక్క ఎందుకో ఏడుస్తోంది. "ఏమైంది అక్కా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాను. దానికి అక్క, "మూడు సంవత్సరాల నుండి అమ్మకి పెన్షన్ రావడం ఆగిపోయింది. మావారికి జీతం సరిగా రావడం లేదు. మా కజిన్స్ అందరూ మా కుటుంబంపై అపవాదులు వేసి అందరికీ మాపట్ల విముఖత కలిగించారు. మేము ఉంటున్న ఇల్లు వాస్తు ప్రకారం లేదు, అందుకే మాకు ఈ కష్టాలు వచ్చాయి" అని చెప్పి బాధపడింది. "అక్కా! నువ్వేమీ బాధపడకు. నీ ప్రతి సమస్యను బాబా వింటున్నారు. అన్నీ బాబా చూసుకుంటారు, నువ్వు ధైర్యంగా ఉండు" అని తనని ఓదార్చి ధైర్యం చెప్పాను. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకు తను నాకు ఫోన్ చేసి, "సుచిత్రా! అమ్మ పెన్షన్ వచ్చింది. మావారి జీతం కూడా సగం వచ్చేసింది. మా కుటుంబం మీద ఉన్న అపవాదు కూడా తొలగిపోయింది" అని ఆనందంగా చెప్పింది. "బాబా నీ మాట విన్నారక్కా. ఒక్క నెలలోనే మీ సమస్యలన్నీ బాబా పరిష్కరించేశారు. నాకు చాలా ఆనందంగా ఉందక్కా" అని చెప్పాను. వెంటనే తను, "ఒక నెల కాదు, కేవలం ఒక్క వారంలోనే బాబా మా సమస్యలన్నీ తీర్చేశారు. నేను నీకు కాస్త ఆలస్యంగా చెప్తున్నానంతే" అని చెప్పింది. బాబా చూపిన ప్రేమకు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఈ ఆనందాన్ని నాలోనే దాచుకోలేక వెంటనే మన బ్లాగ్ ద్వారా మన సాయికుటుంబంతో పంచుకుంటున్నాను.

బాబా చూపుతున్న ప్రేమకు ఆనందభాష్పాలతో...

సుచిత్ర

బాబా రాకతో నా జీవితంలో ప్రతీది మారిపోయింది

కెనడాకు చెందిన ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయి అనుగ్రహం పొందడానికి శ్రద్ధ, సబూరి అనేవి రెండు తాళంచెవులు. నేను 2017 నుండి సాయిభక్తురాలిని. బాబా రాకతో నా జీవితంలో ప్రతీది మారిపోయింది. ఈరోజు సాయి నాతో, నా కుటుంబంతో సదా ఉంటున్నారు. నా ప్రార్థనలను వింటూ నాకు పూర్తి భరోసా ఇస్తున్నారు. జీవితంలో వచ్చే అన్ని అడ్డంకుల నుండి నాకు ఆయన ఆశ్రయం ఇస్తున్నారు. నేను ఆయనను అంతగా ప్రార్థించకపోయినా, ఆయన కలలో నాకు దర్శనం ఇవ్వకపోయినా నేను ఆయన ఉనికిని అనుభవిస్తున్నాను. నాకు ఏది మంచిదో అది అందిస్తూ నాపై కృప చూపుతున్న బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. ఇక నా అనుభవానికి వస్తే...

2017 ఫిబ్రవరి వరకు సాయిని తప్ప మిగతా దేవుళ్ళైన శివ, గణేశ, శ్రీకృష్ణ, లక్ష్మీ, దుర్గమ్మలను ప్రార్థిస్తూ సాగిపోయేది నా జీవితం. అకస్మాత్తుగా ఆ నెలలో నేను అనారోగ్యానికి గురవ్వడంతో పెద్ద శస్త్రచికిత్స జరిగింది. అదే సమయంలో నా భర్త ఒక ప్రమాదంలో చిక్కుకుని తన ఎడమచేతి రెండు వేళ్లను కోల్పోయారు. నా కొడుకు కూడా ఒక చిన్న ప్రమాదానికి గురయ్యాడు. ఇలా ఒకదాని తరువాత ఒకటి చెడు సంఘటనలు చోటుచేసుకుని జీవితం దుర్భరమైంది. నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నేను నా జీవితంలో శాంతి కోసం వెతుకుతూ ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థిస్తుండేదాన్ని. మార్చి నెలలో అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాను. అతను సాయిని ప్రార్థించడం మొదలుపెట్టమని, సాయిధామ్ ప్రార్థన గ్రూపులో, శిరిడీసాయి గ్రూపులో చేరమని సూచించాడు. అతను చెప్పినట్లే నేను సాయిని ప్రార్థించడం మొదలుపెట్టి సాయినామజపం గ్రూపులో చేరాను, ప్రతిరోజు సాయిసచ్చరిత్ర చదవడం కూడా మొదలుపెట్టాను. అలా సాయి వైపుకు నా ప్రయాణం ప్రారంభమైంది. నా జీవితంలో మార్పు మొదలైంది. వెలుగు అన్నదే కనిపించని చోట ప్రకాశవంతమైన కాంతి కనిపించినట్లైంది. నా భర్త ఆరోగ్యం కుదుటపడి తను తిరిగి ఉద్యోగంలో చేరారు. ఆయన చేయి సాధారణంగా పనిచేస్తోంది. నా ఆరోగ్యం కూడా బాగుపడింది. ఎప్పుడైనా తలనొప్పి లేదా మైకం వచ్చినట్లు అనిపిస్తే నేను బాబా ఊదీ వాడతాను. కొద్దిసేపట్లో నాకు ఉపశమనం కలుగుతుంది. 2018లో నేను శిరిడీ వెళ్లి సాయికి ‘ధన్యవాదాలు’ చెప్పుకున్నాను. మందిరంలో సాయి నాపై ఎంతో అనుగ్రహాన్ని కురిపించారు. తిరిగి నా జీవితం గాడిలోకి వచ్చింది. ప్రమోషన్, డ్రీమ్ హౌస్, వ్యాపారం వంటి నా కలలను నెరవేర్చమని సాయిని అడగడం ప్రారంభించాను. నేను ఇల్లు కొనుగోలు చేయగలిగితే నేను నా అనుభవాన్ని పంచుకుంటానని సాయికి వాగ్దానం చేసి 7 గురువారాలు సాయివ్రతం చేయడం ప్రారంభించాను. బాబా దృష్టి ఎల్లప్పుడూ నాపై ఉందని నాకు తెలుసు. ఆయన నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు. కలలో నుండి మేల్కొన్నట్లు ఉన్న ఇంటిని ఒక వారంలోనే అమ్మివేయడం, రెండు నెలల్లో నేను కలలుగన్న కొత్త ఇంటిని కొనుగోలు చేయడం అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి. ఆయన కృప లేకుండా ఇదంతా సాధ్యమని నేను అనుకోను. నా జీవితంలోకి సాయి వచ్చాక నేను దేనికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను సాయిని చూడగలిగితే (కనీసం కలలోనైనా)! అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2533.html


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo