ధీఘేని “నా బిడ్డ” అని సంబోధించిన బాబా
శ్రీధరరావు జనార్దన్ ధీఘే ముంబాయిలో నివాసముండేవాడు. ఒకసారి అతను తన అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఉన్న బాబా చిత్రపటాన్ని చూశాడు. అతను బాబాపట్ల ఆకర్షితుడై, "ఈ ఫకీరు ఎవరు?” అని అడిగాడు. అప్పుడు అతని అంకుల్ బాబా యొక్క దైవత్వం గురించి ధీఘేకు వివరించాడు. ఆ మాటలు ధీఘేపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. తరువాత ధీఘే తన స్వగ్రామమైన మహ్సలేకి వెళ్ళాడు. అక్కడున్న ఒక పెద్ద ఔదుంబర వృక్షం క్రింద కూర్చుని, బాబాకు ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖలో, ‘తాను శిరిడీ దర్శించి, వారి ముందు సాష్టాంగపడాలని ఆరాటపడుతున్నట్లు' వ్రాశాడు. ఆ లేఖను చెట్టుక్రింద ఒకచోట పూడ్చిపెట్టాడు. తరువాత ప్రతిరోజూ అతను ఆ చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తుండేవాడు.
ఇలా కొన్నిరోజులు గడిచిన తరువాత అతని అంకుల్ ఆ గ్రామానికి వచ్చాడు. 'తాను శిరిడీ వెళ్తున్నానని, తనతోపాటు రమ్మని' ధీఘేను కోరాడతను. పట్టరాని ఆనందంతో దీఘే అందుకు అంగీకరించాడు. స్వచ్ఛమైన మనస్సుతో తన గురువును కలవాలని అతను ఆరాటపడ్డాడు, తన గురువైన బాబా అందుకు అవకాశాన్ని కల్పించారు. తరువాత ఇద్దరూ శిరిడీ ప్రయాణమయ్యారు. వారు ద్వారకామాయిలో అడుగుపెడుతూనే బాబా సూటిగా ధీఘే అంకుల్ వైపు చూస్తూ, "నువ్వు నా బిడ్డను నీతోపాటు తీసుకొచ్చావా?" అని అడిగారు. ఆ మాటలతో 'తన లేఖ గురించి బాబాకు తెలుసున'ని గ్రహించి ధీఘే ఆనందపరవశుడయ్యాడు. బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. బాబా అతనిని ఆశీర్వదించారు.
రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1988 (దీపావళి సంచిక)
Source: Baba’s Divine Symphony by Vinny Chitluri.
