సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 524వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • "మనం సాయిని ఎన్నుకోము, ఆయనే మనల్ని ఎన్నుకుంటారు"

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

కొన్ని కారణాల రీత్యా నేను నా పేరు వెల్లడించకూడదని అనుకుంటున్నాను. అయినా పేరుదేముంది? బాబా ఇచ్చిన అనుభవం ముఖ్యమైనది. నేను, నా భర్త మాకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాము. మేము బెంగళూరు నివాసులం. నేను మొదటినుండి సాయిభక్తురాలిని కాదు. నేను చాలా అరుదుగా బాబా మందిరానికి వెళ్లేదాన్ని. అప్పటిలా ఇప్పుడు లేను. ఇప్పుడు బాబా అంటే ఎంతో ఇష్టం. ఈ మార్పు ఎలా జరిగిందో నేను పంచుకోబోయే అద్భుతం ద్వారా చెప్పబోతున్నాను.

నేను ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నాను. వివాహమైన కొత్తలో ముందుగా జీవితంలో స్థిరపడాలనుకుని రెండేళ్ళ వరకు పిల్లలు వద్దనుకున్నాము. రెండేళ్ల తరువాత మేము పిల్లలకోసం ప్రయత్నించాము. కానీ నేను గర్భం దాల్చలేదు. దాంతో మేము చాలా కలవరపడ్డాము. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలతో సమయం గడపడాన్ని చాలా ఆనందిస్తాను. నా భర్తకి కూడా పిల్లలంటే నాకన్నా చాలా ఇష్టం. అలాంటి మాకు ఈ సమస్య ఏమిటని చాలా చింతించాము. మేము ఒక మంచి వైద్యురాలిని సంప్రదించి, ఆమె సూచించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాము. రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. దాంతో మేము వైద్యుని జోక్యం లేకుండా పిల్లలకోసం చూద్దామని నిర్ణయించుకున్నాము. అయితే రోజులు గడుస్తున్నా నేను గర్భం దాల్చలేదు. అందువలన మరి కొంతమంది వైద్యులను సంప్రదించాము. ప్రతిసారీ రిపోర్టులు నార్మల్ గానే వచ్చాయి. అయితే ఎన్నో పరీక్షలు, ఎన్నెన్నో పద్ధతులు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి బదులు తగ్గించాయి. అయితే రిపోర్టులు నార్మల్ గానే ఉన్నాయి కాబట్టి సహజంగానే గర్భం దాల్చడం అంత కష్టం కాదని భావించి ఎక్కువ వైద్య జోక్యాన్ని వద్దని, ఆ మాత్రం పర్యవేక్షణ ఉంటే చాలని అనుకున్నాను. కానీ రోజులు గడుస్తూ మా ఇద్దరికీ 31 సంవత్సరాలు దాటడంతో ఇద్దరం చాలా ఒత్తిడికి గురయ్యాము.

మా వివాహమై ఏడేళ్లయింది. పిల్లల కోసం చూస్తూ ఐదేళ్లు గడిచిపోయాయి. మా విషయంలో అంతా మంచిగానే ఉన్నా పిల్లలు లేరన్న లోటు వేధిస్తుండేది. ఆ సమయంలో మేము నిరంతరం దేవుడిని ప్రార్థిస్తూ దేవాలయాలను సందర్శిస్తుండేవాళ్ళం. ప్రతి దేవుణ్ణీ పిల్లలకోసం వేడుకుంటూ ఉండేవాళ్ళం. మా జాతకాలను ప్రఖ్యాత జ్యోతిష్య పండితులకు చూపించాము. వాళ్ళు కొన్ని దోషాలున్నాయని, ఒక ఆలయంలో ఒక పూజ చేయిస్తే ఆ దోష నివారణ జరుగుతుందని చెప్పారు. సరేనని వాళ్ళు చెప్పినట్టు చేశాము. అయినా ఫలితం లేదు. ఒకరోజు నా భర్త మా ఇద్దరికీ మంచి పరిచయం, గౌరవం ఉన్న ఒకతనికి మా జాతకాన్ని చూపిద్దామని అన్నారు. అతను మా జాతకాలు పరిశీలించడానికి కాస్త సమయం తీసుకుని రెండురోజుల తరువాత నా భర్తకు ఫోన్ చేసి రమ్మన్నారు. "మీ జాతకాల్లో చాలా అంశాలు బాగున్నాయి. అయినప్పటికీ పిల్లల విషయంలో దోషముంది" అని అన్నారు. మునపటి పండితులు చెప్పిన పూజ గురించి చెప్పి, "ఆ పూజ చేశారా?" అని అడిగారు. నా భర్త చేశామని చెప్పారు. అలా అయితే సరేనన్నారు అతను. అంతలో అతని కోడలు అక్కడికి వచ్చింది. ఆమె ఆ సంభాషణలో కొంత భాగాన్ని విన్నది. మేము ఆమెకు తెలుసు. మేము ఎందుకు తన మామగారిని సంప్రదిస్తున్నామో కూడా ఆమెకు తెలుసు. ఆమె నా భర్త ఇంటికి చేరుకునే సమయం వరకు వేచి, తన భర్త వద్దనుండి మావారి నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. అప్పటికి నా భర్త అక్కడ జరిగిందంతా నాకు చెప్పారు. మా జీవితమంతా ఈ నిరాశను అనుభవించాల్సి ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మన విధి ఏమైనా ఎదుర్కోవలసిందే కాబట్టి ఇక మనం జాతకాన్ని మళ్లీ చూపించవద్దని నిశ్చయించుకున్నాము. అలా మాట్లాడుకుంటూ నేను చాలా ఏడ్చాను.

నేను ఏడవటం ఆపిన క్షణాన ఆమె ఫోన్ వచ్చింది. ఆమె గొప్ప సాయిభక్తురాలు. ఆమె పేరు గీత్. ఆమె ముందుగా మా వ్యక్తిగత విషయాలు మాట్లాడబోతున్నందుకు క్షమాపణలు చెప్పింది. మేము మొత్తం విషయం గురించి తనకి చెప్పాము. ఆమె నాతో, "సాయిబాబా గురించి మీతో చెప్పాలని బలంగా అనిపించింది. అందుకే ఫోన్ చేసాన"ని చెప్పింది. ఇప్పుడు గతం గురించి ఆలోచిస్తుంటే, "ఆమె కేవలం ఒక ఉపకరణం మాత్రమే; మా ఇంటిలో, మా హృదయాలలో ఆయనకు స్థానమిమ్మని బాబానే ఆమెతో ఫోన్ చేయించార"ని స్పష్టంగా తెలుస్తోంది. ఆ సమయంలో నాకు అది తెలియనప్పటికీ నేను బాబాను మా జీవితాలలోకి, మనస్సులలోకి అనుమతించాలని అనుకున్నాను. నా భర్త కూడా అదే భావించారు. తరువాత ఆమె బహుమతిగా ఇచ్చిన సాయి సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాము. దాంతో నా హృదయం తేలికపడింది. సంతాన విషయంలో ఆశలు చిగురించాయి.

ఒకరోజు నేను అల్పాహారం తింటుండగా శిరిడీ వెళ్లాలని బలంగా అనిపించింది. నేను రైల్వే వెబ్‌సైట్‌ తెరచి చూశాను. రానున్న నాలుగు నెలల వరకు సీట్లు అందుబాటులో లేవు. దాంతో నేను బాబా పిలుపు వచ్చేవరకు మేము వెళ్ళలేమని అనుకున్నాను. కానీ మేము శిరిడీకి వెళ్ళలేము అనే వాస్తవాన్ని తేలికగా తీసుకోలేకపోయాను. దాని గురించి నా భర్తతో చెప్పాను. ఆయన కూడా, "సాయి మనల్ని పిలిచేవరకు మనం వెళ్ళలేమ"ని అన్నారు. రెండురోజుల తరువాత మావారు తన ఆఫీసులో ఒక వ్యక్తిని కలిశారు. వాళ్ళు అనుకోకుండా రైలు ప్రయాణాల గురించి మాటల్లో పడ్డారు. అతను తన అంకుల్ టికెట్ ఏజెంట్ అని, రైలులో ఎక్కడికి వెళ్లాలన్నా సహాయం అవసరమైతే అడగమని అన్నాడు. నా భర్త ఆనందంతో శిరిడీ వెళ్లాలన్న మా కోరిక గురించి చెప్పారు. వెంటనే అతను తన అంకుల్‌తో మాట్లాడాడు. అతని అంకుల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ శుభవార్తను చెప్పడానికి మావారు నాకు ఫోన్ చేశారు. ఆ వార్త వింటూనే బాబా మమ్మల్ని శిరిడీకి పిలుస్తున్నారన్న ఆనందంతో నాకు కనీళ్ళు ఆగలేదు. వెంటనే మేము గీత్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి, "మీరు, మీవారు మాతో శిరిడీ వస్తారా?" అని అడిగాను. ఆమె ఎంతో ఆనందంతో 'వస్తాన'ని బదులిచ్చింది. ఇక బాబా దయవల్ల టిక్కెట్లు చకచకా బుక్ అయిపోయాయి.

మేము శిరిడీకి ప్రయాణమయ్యేరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. "భయపడవద్దు, అంతా బాగానే ఉంటుంది, మీరు రైలు అందుకుంటారు" అని బాబా చెప్తున్నట్లు దారిపొడుగునా బాబా చిత్రపటాలు కనిపిస్తున్నాయి. మేము 20 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్‌కి చేరుకున్నాము. అప్పటికింకా మేము ఎక్కాల్సిన రైలు ప్లాట్‌ఫారం మీద ఉంది. మేము పరుగున వెళ్లి ట్రైన్ ఎక్కాము. మేము ఎక్కిన తరువాత ట్రైన్ కదిలింది. గీత్ మరియు ఆమె భర్త కూడా బెంగళూరు ట్రాఫిక్‌లో వేరే ప్రాంతంలో ఇరుక్కున్నారు. వాళ్ళు మేము ఎక్కేచోట కాకుండా వేరే స్టేషన్లో ట్రైన్ ఎక్కనున్నారు. మేమంతా చాలా ఆందోళనపడినప్పటికీ బాబా కృపవలన అందరం ట్రైన్ అందుకోగలిగాము. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని మా ప్రయాణాన్ని కొనసాగించాము.

మా శిరిడీ అనుభవం చాలా అద్భుతమైనది. బాబా మమ్మల్ని ఓ కంట కనిపెడుతున్నట్లుగా అనిపించింది. ప్రతిక్షణం మేము ఆయనతో అనుసంధానమవుతూనే ఉన్నాము. చాలా చాలా ఆనందంగా అనిపించింది. మేము ఆరతికోసం సమాధి మందిరం లోపలికి అడుగుపెట్టిన క్షణాన బాబాను చూస్తూనే నాకు ఏడుపు వచ్చేసింది. నేనెప్పుడూ బహిరంగంగా అందరిముందు ఏడిచిందేలేదు. కానీ నాకు తెలియకుండానే నేను ఏడ్చేస్తున్నాను. ఆరతి అవుతున్నంతసేపు నా పరిస్థితి అదే. ఆరతి ముగిసే సమయానికి నేను చాలా తేలికపడినట్లుగా, మళ్ళీ నా జీవితంలో ఆశలు చిగురిస్తున్నట్లుగా అనుభూతి చెందాను. బాబాను చూసే అవకాశం ఎంతమందికి వస్తుంది? అందులో మేము కూడా ఉన్నాం కదా అనుకున్నాను. ఆయన దర్శనంతో ఆయనపై మాకున్న నమ్మకం మరింత బలపడింది. ఆ విశ్వాసంతో మేము ఇంటికి వచ్చాక మరికొన్ని నెలలు పిల్లలకోసం ప్రయత్నించాము. అప్పుడు 'బాబా ఊదీ' ఉపయోగించాలన్న ఒక ఆలోచన నా మనసుకు తట్టింది. దాంతో నేను ప్రతిరోజూ కొద్దిగా బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని తాగుతూ, మరికొంత ఊదీ నా కడుపుపై రాసుకుని, "బాబా! నేను మీ అనుగ్రహంతో గర్భం దాల్చాలి. నా బిడ్డ సురక్షితంగా ఉండాలి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. తరువాత నాకు రెండు నెలల వరకు నెలసరి రాలేదు. నేను గర్భం దాల్చానేమో అనుకున్నాను కానీ, అలా జరగలేదు. అయినా నేను నా విశ్వాసాన్ని కోల్పోలేదు, పైగా మరింత విశ్వాసంతో ఊదీ వాడటం కొనసాగించాను. 30 రోజులు దాటినా నెలసరి రాలేదు. అప్పుడు నేను, "సాయీ! నేను గొప్ప నమ్మకంతో మీ ఊదీని ఉపయోగిస్తున్నాను. నన్ను నిరాశపరచకండి, నాపై దయ చూపండి బాబా" అని ప్రార్థించాను. బహుశా బాబా నన్ను చూసి నవ్వుకుని ఉంటారు. అయితే బాబా దయచూపారు! ఈసారి గర్భనిర్ధారణ పరీక్షలో నేను గర్భవతినని తేలింది. మేము ఎంత సంతోషించి ఉంటామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేము బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. సాయి యొక్క ఉపకరణాలైన గీత్, ఆమె కుటుంబం కోసం మేము బాబాను ప్రార్థించాము. నేను గట్టిగా ఒక మాట చెప్పగలను - "మనం సాయిని ఎన్నుకోము, ఆయనే మనల్ని ఎన్నుకుంటారు". ప్రస్తుతం నా బిడ్డకు 5 నెలల వయస్సు. నేను తనని చూసిన ప్రతిసారీ బాబా మాకు తోడుగా ఉండటం ఎంత అదృష్టమో అని అనుకుంటూ ఉంటాను. "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు బాబా".



9 comments:

  1. "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. బాబా వారి కృప అమోఘం.జై సాయిరాం.

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. Om sai ram ma pyna daya chupandi baba

    ReplyDelete
  6. ఇంత అద్భుతమైన సాయి లీల మాకు అందించినందుకు ధన్యవాదాలు. గీత్ గారి ద్వారా సాయి మీ జీవితంలోకి ప్రవేశించడం ఖచ్చితంగా సాయి యొక్క ఆహ్వానం. బాబా చల్లని చూపు మీకు దక్కినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు జై సాయిరాం

    ReplyDelete
  7. 🏵🌼🌷Om sairam🌷🌼🏵

    ReplyDelete
  8. Om sai ram , nenu chala sarlu comments section lo message cheyadaniki try chesanu , but comment section lo login ayye process nanku complete avvaledhu, naku sariga kudharadam ledhu kooda.now nenu SaiThatha ni manasulo pray chesukuni nenu mee andharilaga message cheyalekapothunnanu, ippudayiya , naa message publish cheyadi Baba ani manasulo anukuni TRY chesanu , Adbutham Jarigindhi , naa message publish ayyindhi, Baba ni manam swachamayina manasutho korukunte , angeekaristharu❤🙏💐🥥🥥 OMSAIRAM💐

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo