సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - బాబాతో ఋణానుబంధం పెంచుకోవడమెలా?




బాబాతో ఋణానుబంధం పెంచుకోవడమెలా?
(నైవేద్య నియమం)

“ఋణానుబంధాన్ని విశ్వసించు!” అనేవారు బాబా. ఎవ్వరూ తమంతట తాముగ తన వద్దకు రారనీ, వారితో తనకు గల ఋణానుబంధం వల్ల తానే వారిని తన చెంతకు రప్పించుకుంటానని బాబా అనేక సందర్భాల్లో అన్నారు. అంటే, బాబాతో ఋణానుబంధమే లేకపోతే, మనమసలు సాయిభక్తులవడమే ‘తటస్థించ'దన్నమాట! శ్రీసాయి యొక్క సద్గురుకార్యం, ఆయన రక్షణ మనకనుభవమవడం యొక్క నేపథ్యంలో యీ ఋణానుబంధమనే సూత్రం దాగివుంది. అందువల్ల, ఈ కీలకసూత్రం యొక్క స్వరూపస్వభావాలను అవగాహనచేసుకొని, బాబాతో మనకు గల ఋణానుబంధాన్ని ‘ఇంకా’ పెంచుకొనే యత్నం చేయటం సాయిభక్తిసాధనలో అత్యంత ఆవశ్యకం కదా? మరి, ఆ ‘ఋణ’ సాధనకు మార్గాలేమిటి? ఆ సుళువులను కూడా బాబానే కరుణతో మనకందించి వున్నారు. వాటిలో ఒకటి, నైవేద్యనియమం! “ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను” అన్నారు బాబా. తమదైన బాణీలో బాబా సూత్రప్రాయంగా చెప్పిన ఈ ‘నివేదన’ నియమాన్ని పాటించడంలో ఎన్నో సూక్ష్మమైన అంశాలు ఇమిడి వున్నాయి. అవేమిటో చూద్దాం!

'తనకు సమర్పించిన ప్రతి పైసాకు తాను భగవంతునికి లెక్క చెప్పుకోవాలని, తనకు సమర్పించిన దానికి పదిరెట్లు తిరిగి వారికి ఇవ్వాల్సిఉంటుందని' బాబా అనేవారు. అంటే, మనం బాబాకు ఏం సమర్పించినా, తిరిగి దానికి పదిరెట్లు మనకు ‘చెల్లించి’, ఆ ఋణం తీర్చుకోవాల్సివుంటుందని బాబా భావం. ఇది ఆయన కరుణతో ఆనందంగా నెరవేర్చే అవతారకార్యం, దైవం ఆయనకప్పగించిన కర్తవ్యం. ఈ దృష్ట్యా ‘బానిసను’ అన్న బాబా పలుకులకు అర్థం – ‘ఋణగ్రస్తుడను’ అని! నిజానికి బాబాకు మనతో గల బంధాన్ని ‘ఋణానుబంధ’మనేకన్నా ఓ అవ్యాజ ‘కరుణానుబంధ’మనడం సమంజసం!

అయితే, సశరీరులుగా మన కంటికి కనబడని శ్రీసాయికి మనం తినబోయే ఆహారాన్ని సమర్పించడం ఎలా?- అనే ప్రశ్న ఇక్కడ ఉదయించడం సహజం. ఈ ప్రశ్నకు కూడా బాబా సమాధానమిచ్చే వున్నారు! “ఋణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో! నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చెయ్యక ఆదరించు! ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలులేని వారికి గుడ్డలు ఇవ్వు! భగవంతుడు సంప్రీతుడవుతాడు!” అని. సశరీరులై వున్నప్పుడు కూడా బాబా ఎన్నడూ దేహానికి మాత్రమే పరిమితమై లేరు. “ఎవరు నా యీ ఐదున్నర అడుగుల దేహాన్ని మాత్రమే ‘సాయి’ అని భావిస్తారో వారసలు సాయిని గుర్తించనట్లే!” అన్నారు బాబా. మరైతే, ‘అసలైన’ సాయి స్వరూపమేమిటి? “వివిధ రూపాల్లో (వివిధ ప్రాణుల రూపంలో) నేనే ప్రపంచమంతట సంచరిస్తున్నాను. పిల్లులేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి – అన్నీ నేనే! ఆకలిగొన్న ఏ ప్రాణికి ఆహారం పెట్టినా అది నాకు పెట్టినట్లే! సర్వప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి, ఆ గుర్తింపుతో ఎవరైతే నడచుకొంటారో వారు నాకెంతో ఆప్తులు” అని బాబా తమ విరాట్ స్వరూపాన్ని వాచా వివరించడమే కాదు; తామే అన్ని జీవుల రూపంలో వున్నామని ఎందరో భక్తులకు నిదర్శనాపూర్వకంగా నిరూపించారు కూడా! అంటే, బాబా సశరీరులుగా మన కంటికి స్థూలంగా కనిపించకపోయినా సకలజీవుల రూపంలో ఆయన తమ సన్నిధిని మనకెప్పుడూ ప్రసాదిస్తూనే వున్నారు. ఆ సన్నిధిని గుర్తించి ఆ గుర్తింపుకు తగిన విధంగా మసలుకోవటమే మనం చేయాల్సింది!

అయితే, రోజూ మనం భోజనం చేసే ముందు ఆకలిగొన్న ప్రాణులేవో తెలుసుకొని వాటికి అన్నం పెట్టాలా? అవి ఆకలిగొన్నాయన్న విషయం మనకెలా తెలుస్తుంది? ఇలా ప్రతిరోజూ, ప్రతిపూటా ఆచరించడం ఎంతవరకు సాధ్యం? - అనే ప్రశ్నలు వెంటనే మనకుదయిస్తాయి! ఈ ప్రశ్నలకు ఆచరణయోగ్యమైన పద్ధతిని బాబానే వివరించారు. ఒకసారి ఈ ప్రశ్నే అడిగిన శ్రీనానాసాహెబ్ చందోర్కర్‌తో “అతిథి అంటే అయిదున్నర అడుగుల మానవుడేనని, అందులో బ్రహ్మణుడేననా నీ భావం? వేళకు ఆకలిగొని వచ్చిన యే ప్రాణైనా సరే, పక్షి అయినా పురుగైనా అతిథే. ఆకలిగొన్నవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి. నిజమైన అతిథులను నువ్వు గుర్తించవు. భోజనంచేసే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా! వేటినీ పిలవొద్దు, తరమొద్దు! తినడానికి ఏ ప్రాణి వచ్చిందన్నదాన్ని గూర్చి అసలు ఆలోచించనే వొద్దు! అలా చేస్తే రోజూ లక్షలాది అతిథులను ఆదరించినట్లే!” అన్నారు. అంటే, ఆచారం పేరిట శాస్త్రానికి ఒక ముద్ద (కాకబలి) గడపవతల పెట్టి, కాకిలా “కా...కా...” అని అరవడం ఎంత అవివేకమైన తంతో బాబా చెప్పినదాన్ని బట్టి యోచిస్తే ఇట్టే తేటతెల్లమవుతుంది. ఆకలిగొన్న ప్రాణులు అవే సహజంగా ఆహారం కోసం అన్వేషిస్తాయి. ఆహారాన్ని వాటికందుబాటులో ఉంచడమే మనం చేయాల్సింది. ఆకలిగొన్న ఒక జీవికి ఆకలి తీరితే ఆ జీవిలో ప్రాణస్వరూపుడైవున్న ‘బాబా’ సంప్రీతుడవుతాడు. సర్వజీవస్వరూపుడయిన బాబా సంప్రీతుడయితే, సర్వప్రాణులకు అన్నం పెట్టిన ‘ఫలితం’ మనకు సహజంగానే వస్తుంది కదా! అదే, “రోజూ లక్షలాది అతిథులను ఆదరించినట్లే!” అన్న బాబా మాటల్లోని అంతరార్ధం!

భోజనం చేసేముందు బాబా చెప్పిన విధంగా చేయడం ఆచరణయోగ్యమేకానీ, ‘ఏది తినబోతున్నా’ అలా చెయ్యాలంటే మాత్రం అంత సులభం కాదు. అంతేకాదు! కొన్ని సందర్భాలలో భోజనం ముందుకూడా అలా చెయ్యడానికి వీలుపడకపోవచ్చు. అందుచేత ఏదయినా తినబోయేముందు, త్రాగబోయేముందు బాబాను మనసారా స్మరించి, ఆ పదార్థాలు కొంత బాబా ఆరగించి, శేషం ప్రసాదంగా మనకు పెట్టినట్లు భావించుకోవాలి.

పైన చెప్పిన అంశాలు రెండింటినీ, బాబా తనదైన శైలిలో, కొంత హాస్యం మేళవించి, చమత్కరించి బోధించిన సందర్భం ఒకటున్నది. అదేమిటో చూద్దాం!

శిరిడీలో ప్రతి ఆదివారం 'సంత' జరుగుతుంది. ఆ రోజున గ్రామస్థులు, చుట్టుప్రక్కల పల్లెప్రజలు శిరిడీ వచ్చి, వారానికి సరిపడా సరుకులు కూరగాయలు వెచ్చాలు మొదలైనవి కొనుక్కొనిపోతారు. ఆ పద్ధతి యీ నాటికీ కొనసాగుతోంది. అందువల్ల ఆదివారాలలో బాబా దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా వుండేది. ఒక ఆదివారంనాడు మిగిలిన భక్తులతో పాటు మసీదులో (‘శ్రీసాయి సచ్చరిత్ర’ గ్రంథకర్తయైన) శ్రీఅన్నాసాహెబ్ దాభోళ్కర్ (హేమాద్పంత్) కూడా కూర్చుని ఉన్నాడు. ఇంతలో హేమాద్పంత్ కోటు చేతి మడతలలో ఏదో పదార్థం ఇరుక్కొని వున్నట్లు షామా కంటపడింది. "ఏమిటది?" అంటూ షామా ఆ కోటుచేతి మడతలు విప్పేసరికి కొన్ని శనగలు జలజల రాలి క్రిందపడ్డాయి. కోటు మడతలనుండి శనగలు రాలడం చూచి మసీదులో వున్న భక్తులంతా ఘొల్లున నవ్వారు. అసలా శనగలు అక్కడికి ఎలా వచ్చాయని, హేమాద్పంతు అంతకు మునుపే బాబా పాదాలు కడుగుతూ వంగినపుడు కూడా క్రింద పడకుండా ఎలా వున్నాయనే ప్రశ్నలు బయలుదేరాయి. సరదాగా తలా ఒక జవాబు చెప్పారు. కానీ విషయం తేలలేదు. షామా అప్పుడు బాబాతో “దేవా! మీరు చెప్పండి! ఆ శనగలు అక్కడికి ఎలా వచ్చాయో” అని అడిగాడు. దానికి బాబా నవ్వుతూ, “ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిన వింతేముంది? ఇతడికి ఇతరులకు పెట్టకుండా ఒక్కడే తినే అలవాటుంది. ఈ రోజు సంత కదా! శనగలు కొని చాటుగా ఒక్కడే తింటున్నాడు. ఆ రాలిపడ్డ శనగలే, ఇతని దురలవాటుకు సాక్ష్యం!” అన్నారు. బాబా మాటలకు అక్కడున్న భక్తులంతా ఇంకా ఘొల్లున నవ్వారు. హేమాద్పంతు ఉడుక్కుంటూ, “బాబా, మీరిప్పుడు చేసిన అభియోగం మాత్రం శుద్ధ అబద్ధం. ఎప్పుడూ ప్రక్కవారికి పెట్టకుండా నేనొక్కణ్ణే ఏమీ తినననే విషయం మీకూ తెలుసు. అదీకాక నేనీరోజు బజారుకే (సంతకు) వెళ్ళలేదు. శనగలు అసలు కొనుక్కోనేలేదు. నా కోటు మడతల్లోకి ఆ శనగలు ఎలా చేరాయో కూడా నిజంగా నాకు తెలియదు. అటువంటప్పుడు నేను చాటుమాటుగా శనగలు తినడం ఎలా సంభవం?” అని లబలబలాడాడు. అప్పుడు బాబా, “నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా వుంటే వారికి పెడ్తావన్న మాట నిజమే. ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పుకాదు. అది సరే! కానీ, మరి నా మాటేమిటి? నేనెప్పుడూ నీతోనే వున్నాను కదా? నీవు తినబోయేది నాకెప్పుడయినా పెట్టావా?” అని అన్నారు!

((“దైవం అందరిలోకీ ఎక్కువగా అసహ్యించుకొనేదెవరినయ్యా అంటే, ప్రక్కవారికి పెట్టకుండా తానొక్కడే తినేవాణ్ణే”నని ‘కొరాన్-ఇ-మజాద్’ లోని వాక్యానికి, “ప్రేక్షతామ ప్రదాయ నభుంజీత!” (“ప్రక్కవారికి పెట్టకుండా (ఒక్కడే) తినకూడదు!”) అని పంచమవేదమైన ‘మహాభారతం’ చేసిన నిషేధానికి, పైన ఉదహరించిన బాబా లీలోపదేశాలు సజీవ వ్యాఖ్యానాలు.))

అంతేకాక, బాబా చేసిన ఉపదేశంలో జాగ్రత్తగా గమనిస్తేగానీ కనిపించని అంశం మరొకటున్నది. బాబా తనకోసం ప్రత్యేకంగా నైవేద్యం తయారుచేసి సమర్పించమనిగానీ, "ఫలం పుష్పం తోయం" అన్నట్లు ఏదో ఒకటి నిత్యపూజలో భాగంగా నివేదించమనిగానీ అడుగలేదు! బాబా అడిగింది మనం ఎటూ తినబోయే పదార్థాలనే (తినబోయే ముందు) మనఃస్ఫూర్తిగా నివేదించమని. ఇందులో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన మరొక రహస్యం కూడా ఇమిడివుంది.

ఆధ్యాత్మికసాధనలో మనోనిగ్రహం సంయమనం అత్యావశ్యకాలు. సంయమనం సాధించకపోతే, సంపూర్ణ శరణాగతి సున్న. మనోనిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో జిహ్వాచాపల్యాన్ని జయించడం చాలా కష్టమని యోగవిజ్ఞానం చెబుతున్నది. ప్రాణులు జీవించి ఉండాలంటే ఆహారం తప్పనిసరి. కళ్ళు గుడ్డివైనా, చెవులు చెవిటివైనా, లైంగికసుఖం లేకపోయినా మనిషి జీవించగలడు గానీ, ఆహారంలేకుండా మాత్రం జీవించలేడు. ఇంద్రియాలలో ఆహారానికి సంబంధం కలిగినది జిహ్వేంద్రియం. అందుకనే ఆ జిహ్వేంద్రియానికి కలిగే ‘చాపల్యాన్ని’ జయించడం కష్టసాధ్యం. జిహ్వాచాపల్యాన్ని జయించగలిగితే, మనోనిగ్రహం ‘చాలావరకు’ సాధించినట్లే! లేకపోతే, జిహ్వాచాపల్యం 'పెద్ద పట్టించుకోవలసిన' చాపల్యంగా అనిపించక, దృఢమైన మనోనిగ్రహాన్ని సాధింపనివ్వక, తద్వారా పరోక్షంగా మిగిలిన ఇంద్రియ చాపల్యాలను కూడా పెంచి, క్రమంగా సాధకుణ్ణి పతనం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీమద్భాగవతం ఇలా అంటున్నది: “నిరాహారులై మునులు అన్ని ఇంద్రియాలను జయించగలరేమోగానీ, రసనేంద్రియాన్ని మాత్రం గెలువజాలరు. నిరాహారునకు జిహ్వాచాపల్యం వృద్ధిచెందుతుంది. ఇతర ఇంద్రియాలనన్నీ గెలిచినా, రసనేంద్రియాన్ని గెలువనంతవరకు అతడు జితేంద్రియుడు కాడు. జిహ్వను జయిస్తే సర్వాన్నీ జయించినట్లే!” “జిహ్వా చాపల్యం బహు ప్రమాదమైనది. ఎక్కడ జిహ్వాలోలత్వం వుంటుందో అక్కడ అనర్ధం పొంచివుందని తెలుసుకో! నాలుకతోటి ఆట కోటి దుఃఖాల మూట!” అంటారు శ్రీఏకనాథ్ మహరాజ్. అందుకే, “రుచులకోసం ప్రాకులాడవద్దు!” అని శ్రీసాయిబాబా, “జిహ్వరుచుల చేత జీవుండు చెడునయా” అని యోగి వేమన హెచ్చరించారు.  ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చర్చించుకుందాం! 

జిహ్వకు రసనేంద్రియమని పేరు. ‘రస’మనే పదానికి ద్రవము, రుచి, సారము అనే అర్థాలున్నాయి. ఆహారం భుజించడం అనే క్రియ యొక్క అనుభవసారం ఆ ఆహారపదార్థాల రుచే! రుచిపచి లేని తిండిని మనం నిస్సారమైనదని (సారహీనమైనదని) అంటాం. ఏదైనా తినుబండారాన్ని చూచినప్పుడుగానీ, అది గుర్తుకొచ్చినప్పుడుగానీ, చటుక్కున మన మనసుకొచ్చేది ఆ పదార్థం యొక్క రుచిని గూర్చిన ఊహే! అలా ఊహ మనసులోకి రాగానే, నోటిలోని రసగ్రంథులకు ప్రేరణ కలిగి లాలాజలం(ఎంగిలి) ఊరుతుంది. అంటే పైన చెప్పిన 'రసం' యొక్క మూడు అర్థాలు – సారం, రుచి, ద్రవం - మూడు దశలుగ మనకు అనుభవమౌతున్నాయన్నమాట! అయితే, ఈ 'రసప్రక్రియ' మన అలవాట్లు ఆకలి ఆరోగ్యస్థితి ఇష్టాఇష్టాలు మొదలైన విషయాల వల్ల ప్రేరణ పొందుతూ మన అధీనంలో వుండదు. అలా అదుపు లేకపోవడంవల్ల మనస్సు నానారకాల రుచులను కోరుతూ, వివిధ రుచ్యపదార్థాలను ఊహిస్తూ, ఆ ఊహల వూపిరితో ఊరింపబడుతూ వుంటుంది. ఇలా ‘రుచుల’ను అనుభవించేందకు మనసుపడే చాపల్యమే జిహ్వాచాపల్యం. నానాపదార్థాలను రుచి చూడటంవల్ల కలిగే సుఖానుభూతి కోసం వ్యసనపడటము ఆ చాపల్య లక్షణం. సాధకుడు తాను పెట్టుకున్న లక్ష్యం పట్ల శ్రద్ధ, వివిధ ఇంద్రియానుభవాల తత్త్వం పట్ల అవగాహన పెంచుకుంటూ తనలో వ్యసనరూపంగా వుండే ఈ చాపల్యాన్ని తొలగించుకోయత్నిస్తే, క్రమంగా యీ చాపల్యం నశిస్తుంది. నానారుచుల కోసం అర్రులు చాచే బుద్ధి స్థిరత్వం పొందుతుంది. అప్పటివరకు భిన్నరుచుల ద్వారా మాత్రమే పొందగలిగే సుఖానుభూతిని గుర్తించి, ఇంద్రియానుభూతులకు అతీతంగా దానిని ఆస్వాదించే సూక్ష్మం పట్టుపడుతుంది. భిన్నరుచులు విభిన్న ప్రేరణలద్వారా కలిగించే ఆ రసానుభూతి ఒక్కటేననే అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఇక ఆ రసానుభవ ఆస్వాదనలో నిమగ్నమౌతాడు. ఆ ఏకరసాస్వాదన వల్ల కలిగే ప్రేరకం యొక్క స్థూలరూపంగా ఆ మహాత్ముని నోటిలో స్రవించే రసాన్ని(ఎంగిలిని) యోగశాస్త్ర పరిభాషలో అమృతమన్నారు! మనోచాపల్యం వల్ల కలిగే రసస్కలన రూపమైన ‘మృతి’ని తొలగించి, ఆత్మ’ధృతి’ని కలిగించే ‘అమృత’మది. ఆ స్థితినొందిన మహాత్ముడు సేవించే ఆహారం ఆయన సదా ఆస్వాదించే ఆ రసరూపమైన అమృతంతో కలిసి, అదీ అమృతప్రాయమౌతుంది. అందువల్ల ఆ మహాత్ముని భుక్తశేషం కూడా అమృతమై, దాన్ని ప్రసాదంగా భుజించే భక్తులకు (పైన వివరించిన) అమృతత్త్వాన్ని కలుగజేస్తుంది. మహాత్ముల ఉచ్ఛిష్టం మహామహిమోపేతమైనదని శాస్త్రాలు చెప్పేదిందుకే! దైవానికి నైవేద్యం పెట్టే సమయంలో “అమృతమస్తు! అమృతోపస్మరణమితి స్వాహా” “ఠం అమృతాత్మనే అమృతతన్మాత్రా ప్రకృత్యానందాత్మనే-అమృతాత్మకం నైవేద్యం సమర్పయామి!” అనే మంత్రాలను చెప్పడంలోని పరమార్థం ఇదే!

శ్రీసాయిబాబా నిత్యం భిక్షచేసి సేకరించిన రొట్టె కూర పులుసు మొదలైన భక్ష్యాలనన్నింటినీ ఒకటిగా కలిపి భుజించేవారు. భగవాన్ రమణమహర్షి కూడా తన విస్తరిలో వడ్డింపబడిన వివిధ పదార్థాలను – అన్నం సాంబారు రసం కూర పచ్చడి మొదలైన వాటినన్నిటిని – ఒకటిగా కలిపి భుజించేవారు. అలా ఎందుకు చేస్తారని ప్రశ్నించిన ఒక భక్తునితో, “మీకు భిన్నత్వంలో రుచి; నాకేమో ఏకత్వంలో రుచి!” అని చమత్కరించారు. ఇంతకు మునుపు వివరించిన ఏకరసాస్వాదనతత్త్వం యొక్క వెలుగులో చూస్తేగానీ, ఆ మహాత్ముల చర్యలలోని అగాధమైన అంతరార్థాలు అవగతం కావు.

నానారకాల తినుబండారాలు తినాలని ఉబలాటపడడం జిహ్వాచాపల్యం యొక్క స్థూలరూపం మాత్రమే! ఏదయినా పదార్థాన్ని చూచినప్పుడు గానీ, దాని పేరు విన్నప్పుడుగానీ, అప్రయత్నంగా ఆ పదార్థం యొక్క రుచిని మనస్సు ‘ఊహించడం’ అన్నది జిహ్వాచాపల్యం యొక్క సూక్ష్మరూపం. ఉదాహరణకు ఆవకాయపచ్చళ్ళు పులుసులు ఊరగాయలు మొదలైన రుచికరమైన వంటకాల పేర్లు వినగానే మన నోళ్ళూరుతాయి. అంటే ఆ పదార్థాలు గుర్తుకు రాగానే, మన మనస్సు ఆ పదార్థాల రుచిని ఊహించి ఆస్వాదిస్తున్నదన్నమాట! ఎంత రుచికరమైన పదార్థాన్ని చూచినా, వాటి గురించి విన్నా మన మనస్సుకు లేశమాత్రం కూడా వాటి రుచి ఊహకు రానట్లయితే జిహ్వాచాపల్యాన్ని చాలావరకు జయించినట్లే!  

నైవేద్యం సమర్పించినపుడు భగవంతుడు స్వీకరించేది ఆ నివేదించబడ్డ పదార్థం యొక్క స్థూలరాశిని కాదు; భక్తుని మనస్సులో ఆ పదార్థం యొక్క ‘జ్ఞాపకంగా’ (ఎఱుక రూపంలో) వుండే సూక్ష్మరూపాన్నే! ఆ ‘జ్ఞాపకమే’ మనము ఒక పదార్థాన్ని చూచినప్పుడు గాని, లేదా అది గుర్తుకొచ్చినప్పుడు గాని, దాని అనుభవసారమైన రుచిని మానసికంగా నెమరువేసుకొనేలా చేస్తుంది. నైవేద్యం యొక్క రుచిని ఊహించడమంటే, మానసికంగా ఆ నైవేద్యాన్ని ఎంగిలి చేసినట్లే కదా? న+వేద్యం, ఒక వస్తువు యొక్క రుచి లేదా దాని అనుభవసారమైన జ్ఞాపకం (జ్ఞానం) లేకపోవడమే – నైవేద్యం. అందుకే, ముఖ్యంగా దేవాలయాలలో, నైవేద్యానికి ముందు నివేదింపబడే పదార్థాలను రుచి చూడకూడదనేకాక, మానసికంగా కూడా ‘ఎంగిలి’ చేయకుండా నైవేద్యం వున్న పాత్రలపై గుడ్డ కప్పడం, మూతపెట్టడం, నైవేద్య సమయంలో విగ్రహం ముందు తెర వేయటం వంటి ‘జాగ్రత్తలను’ ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. దైవానికి సమర్పించబోయే పూలను కూడా వాసన చూడకూడదనే నియమం అందుకే విధించబడింది. నిత్యనైవేద్యంలోని యోగరహస్యం ఇదే! ఈ నైవేద్య నియమాన్ని ‘సరైన రీతిలో’ ఆచరిస్తూ, మనం తినబోయే పదార్థాలనన్నింటిని బాబాకు ‘మనస్ఫూర్తిగా’ నివేదించగలిగితే మనలోని మనోచాపల్యాలు నశించి మనస్సుపై అద్భుతమైన ‘అదుపు’ సాధించగలం. మనం ఏదైనా తినబోయే ముందు ‘ఆ తినబోయే పదార్థాన్నే’ తమకు సమర్పించమని బాబా కోరడంలోని అంతరార్థం ఇదే!

(అయితే, నైవేద్యం వండేటప్పుడు, దాన్ని నివేదన చేసేముందు తప్పనిసరిగ అర్చకులు ఆ నైవేద్యాన్ని చూడక తప్పదు కదా? - అనే సందేహం కొందరికి కలుగవచ్చు. అందుకే జితేంద్రియుడైన ఉత్తమ సాధకుడే అర్చకత్వానికి అర్హుడని ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి(“అర్చకస్య తపోయోగాత్...” “అర్చకస్తు హరి సాక్షాత్ చరరూపేన సంశయః”) పైన వివరించిన అవగాహన లోపించడంతో నైవేద్యం తదితర యోగసాధనపరమైన ఆగమనిర్దేశాలు క్రమంగా కులప్రాతిపదికపై పాటింపబడే ‘మడి’ వంటి ‘మూఢా’చారాలుగ దిగజారాయి!)

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo