సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయిచూపే తొలిమెట్టు! మన ఎఱుకే మలిమెట్టు!



సాయిచూపే తొలిమెట్టు!
మన ఎఱుకే మలిమెట్టు!

“Look to me and I look to you!” అన్నది శ్రీ సాయిబాబా ఉపదేశాలలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన ‘సూక్తి’. “తు మఝకడె అనన్య పాహి! పాహీ తుఝకడె తైసాచా మీహీ!” అని బాబా మరాఠీలో చెప్పిన మాటకు పూజ్యశ్రీ బి.వి.నరసింహస్వామిగారు Sri Sai Baba’s Charters & Sayings అన్న గ్రంథంలో చేసిన ఆంగ్లానువాదం: “Look to me and I will look to you!” అని. ఒక వాక్యాన్ని సూక్తీకరించి చెప్పేటప్పుడు అది ఏ సందర్భంలో చెప్పబడిందో వివరించేందుకు అవకాశముండదు. తాత్త్వికసంబంధమైన ఒక వాక్యాన్ని సూక్తీకరించి అనువదించేటప్పుడు భాషాంతరంలో కొంత భావ అస్పష్టత కలగడం సహజం. ఆ ‘కొంత’కు తోడు, ఆ తరువాత ఎవరో భక్తుడు ఆ అనువాదంలోని రెండు విడివిడి వాక్యాలను కలుపుతున్న ‘and’ అనే coordinating conjunction స్థానే ‘if’ ప్రత్యయం (subordinating conjunction)చేర్చి, “If you look tome, I look to you!” అని ప్రచురించటం జరిగింది. దానితో మూలానువాదంలో అస్పష్టంగా తొంగిచూస్తున్న ‘షరతు’ (condition)విస్పష్టమై అపార్థాలకు దారితీసింది! ఆ సూక్తి యొక్క ఆంగ్లానువాదాల్లో మూలానువాదాన్ని అనుసరించి కొందరు, “నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను” అని తెలుగులోకి అనువదిస్తే, మరికొందరు రెండవ అనువాదాన్ని దృష్టిలో ఉంచుకొని, “నాపై ఎవరు దృష్టి నిలుపుతారో, వారియందే నా కటాక్షము” అని అనువదించారు. ఈ వాక్యంలో వ్యక్తమయ్యే భావం దృష్ట్యా, “బాబా కటాక్షవీక్షణాలు ఆయనను పూజించే వారి మీద మాత్రమేనా? మిగిలిన వారి మీద ప్రసరించవా?” అనే సందేహం కొందరికి కలగడం సహజం; సమంజసం కూడా! ఆ విపరీతార్థం కేవలం అనువాదలోపం వల్ల కలిగిందే కాని, అది బాబా మాటల్లోని ఆంతర్యం కాదని శ్రీసాయిచరిత్ర-బోధనలు పరిశీలిస్తే ఇట్టే బోధపడుతుంది.

మమత సమతల హేల!

మనకు కలిగిన పై సందేహానికి సమాధానమా అన్నట్లు, ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు: “నా అనుగ్రహం లేక ఆకైనా కదలదు. నేనందరిని సమానదృష్టితో చూస్తాను!” (“I look equally on all! Not a leaf moves except by my grace. I look on all with equal eye.”) అంతేకాదు! బాబా మరో సందర్భంలో ఇలా అన్నారు, “ఈ ప్రపంచము చాలా వింతైనది. అందరూ నా వాళ్ళే. అందరిని నేను సమానంగా చూస్తాను. కానీ అందులో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగిందేముంది?”. బాబా కటాక్షవీక్షణాలనే అమృతధారలు ఎప్పుడూ అందరిమీద కుండపోతగా వర్షిస్తూనే ఉన్నాయి. కానీ, మన అజ్ఞానమనే గొడుగు ఆ అనుగ్రహధారలు మనమీద పడకుండా అడ్డుకొంటున్నది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని, ఒకసారి కళ్ళుతెరచి ‘చూస్తే’, శ్రీసాయి అనుగ్రహవీక్షణాలు ఎప్పుడూ మనమీద ఉన్నాయని గ్రహిస్తాము. అలా శ్రీసాయి దృష్టి సదా మనమీదున్నదన్న గుర్తే (ఎఱుకే) మనకు గురువై మనలను రక్షించి తరింపజేస్తుంది. ఆ ఎఱుకను(గుర్తును) సాధ్యమైనంతగా నిరంతరం నిలుపుకోవడమే సాధన! ఆ ఎఱుకలో నిలవడమే అనన్యభావంతో సద్గురువుకు శరణాగతి చెందడం. ఈ ప్రయత్నం మనవైపు నుండి జరగవలసిన క్రియ. “గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయన్ను గురువుగా గుర్తించవలసింది నువ్వే!” అని బాబా స్పష్టం చేసేవున్నారు. ముందు మనం బాబావైపు చూస్తే, ఆపైన బాబా మనలను కటాక్షించడం కాదు జరిగేది. బాబా అనుగ్రహం ఎప్పుడూ మనమీదున్నది. “అనుగ్రహించడమే నా పని!”(My business is to give blessings) అని బాబానే తమ అవతారకార్యాన్ని వెల్లడించారు. బాబా తమ రక్షణను, అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధులై వున్నా, మూర్ఖత్వంతో మనమే దానిని స్వీకరించలేకున్నాము. “రండి! బస్తాలకొద్దీ ఊదీ మోసుకుపోండి! ఈ మసీదుతల్లి భాండాగారాన్ని బండ్లకొద్దీ తీసుకుపోండి!” అని బాబా ఎలుగెత్తి ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ, బాబా ‘రక్షణ’ అనే ఊదీని, ‘జ్ఞాన’మనే భాండాగారాన్ని స్వీకరించేవారే లేరు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ బాబా, “అడిగిన వారికి అడిగినంత సమృద్ధిగా ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కాని నా మాటలు చెవినబెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరచిపెట్టి ఉంచాను. కానీ, ఆ సంపదను తీసుకొని పొయ్యేవారే లేరు! ప్రజలు ఊరకే నావద్దకొచ్చి ‘ఇవ్వు, ఇవ్వు!’ అంటారు. నేను ‘తీసుకో’మంటాను. కానీ, తీసుకొనేవారేరి!” అని ఎన్నోసార్లు వాపోయేవారు.

బాబా గురించి ఎవరిద్వారానో వినటం వల్లనో, ఆయన్ను గురించి ఎక్కడో చదవడంద్వారానో, ఆయనను గూర్చి తెలుసుకొని, ఎప్పుడో ఏదో కష్టం వచ్చినప్పుడు అది తీర్చమని ఆయనను ప్రార్థించి, అది తీరడంతో సాయిభక్తులమై ఆయన్ను ఆరాధిస్తున్నామని సామాన్యంగా మనం భావిస్తాం. ఆయనను ముందు మనం పూజించడం జరిగిన తరువాతే, ఆయన కృపాదృష్టి మనమీదపడి ఆయన మహిమ మనకు ప్రకటమౌతున్నదని భ్రమిస్తాము. అయితే, అది కేవలం మన భ్రమేనని “నా భక్తుని నేనే ఎన్నుకొంటాను!” అని బాబా అన్న మాటతో తేలిపోతున్నది. ఆయన కృపాకటాక్షం మనమీద లేకపోతే భక్తితో మన దృష్టి ఆయనమీద నిలపడమన్నది అసంభవం! ఈ సత్యం కొంతమంది విషయంలో అనుభవపూర్వకంగా ఎఱుకలోకొస్తుంది; ఎక్కువమంది విషయంలో రాదు. బాబా పేరు కూడా వినని ఎందరో భక్తులకు బాబానే ముందుగా (స్వప్నంలో) దర్శనమిచ్చి, నిదర్శనమిచ్చి ‘తనవారిగా’ చేసుకొన్న సంఘటనలు ఆయన చరిత్రలో కోకొల్లలు. ఆ లీలలను ఈ దృష్ట్యా విశ్లేషించి చూస్తే ఈ సత్యం మరింత స్పష్టంగా అవగతం కాగలదు.

ఋణానుబంధలహరి!

అయితే, ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది! బాబా కృపాదృష్టి అందరిమీదా సమానంగా ప్రసరిస్తుంటే, కొంతమందిని మాత్రమే ఆయన తనభక్తులుగా ఎంపిక చేసుకోవడమేమిటి? - అని. ఆ ‘ఎంపిక’కు కారణం బాబానే వివరించారు– ‘ఋణానుబంధమ’ని! ఆ ఋణానుబంధానికైనా మొదట ఏదో కారణముండాలి కదా? అది కొంతమందితోనే ఏర్పడి, మరికొంతమందితో ఏర్పడకపోవటానికి కారణమేమిటనే ప్రశ్న మళ్ళీ మన మనస్సులను తొలచక మానదు! ఈ ప్రశ్నకూ బాబానే సమాధానమిచ్చి వున్నారు, “వెనుక ఎన్నో జన్మలలో మీతో వున్నాను. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకొంటాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసకు నేను అల్లాకు లెక్కచెప్పుకోవాలి” అని. భగవంతుడు జీవులనుద్ధరించడానికి – వారి వారి సంస్కారాలకనుగుణంగా – వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తాడని శాస్త్రాలు, తత్త్వదర్శనులైన మహాత్ములు చెప్పే వున్నారు. శ్రీసాయిబాబా రూపంలో అవతరించిన ఆ భగవత్తత్త్వం ఆ ప్రాతిపదికపైనే తనకు (ఆ రూపానికి) కేటాయించబడ్డ జీవులను సద్గతినొందిస్తుంది. ఆ జీవులనే బాబా తన సహజ నిగూఢరీతిలో “తనకు అప్పజెప్పబడ్డ పైసలని చెప్పారు. ఇలా, బాబా వివిధసందర్భాలలో చెప్పిన మాటలవల్ల, అసంఖ్యాకమైన ఆయన లీలా ప్రబోధాలవల్ల మనకు తెలిసేదేమిటంటే, బాబా దృష్టి ఎల్లప్పుడు అందరిమీద సమంగానే ప్రసరిస్తున్నదనీ, బాబాతో మనకు గల జన్మజన్మల ఋణానుబంధం ఫలితంగా కలిగిన సంస్కారం వల్ల ఆ కృపను సరిగా సద్వినియోగం చేసుకొని రక్షింపబడతామని!

ఈ సత్యం యొక్క వెలుగులో మొదట పేర్కొన్న “నాపై నీ దృష్టి నిలుపు; నీపై నా దృష్టి నిలుపుతాను!” అన్న బాబా సూక్తిని, బోధను పరిశీలిస్తే, “నాపై నీ దృష్టి నిలుపు; నా దృష్టి ఎప్పుడూ నీ మీదనే ఉన్నదని గ్రహిస్తావు!” అనేది బాబా మాటలకు సరైనా భావానువాదం అవుతుంది. ఆ సూక్తికి సంబంధించి పైన పేర్కొన్న సందేహం ఏ అనువాద లోపంవల్ల కల్గినా, అది ఒక విధంగా సంతోషించవలసిన విషయం! ఎందుకంటే, ‘అనన్యాః చింతయంతోమాం...’ (‘ఎవరయితే నా గురించే అనన్యంగా చింతన చేస్తారో... వారి యోగక్షేమాల బాధ్యత నేను వహిస్తాను’) అన్న భగవద్గీతా శ్లోకాన్ని తరతరాలుగా వింటున్నా కలగని సందేహం, జిజ్ఞాస ఈ బాబా సూక్తిపట్ల కలిగిందంటే అది శ్రీసాయిభక్తులకు శ్రీసాయి కరుణపట్ల, సర్వసమత్వంపట్ల గల ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నది కదా? అదే నిర్జీవమైన శాస్త్రవాక్యానికి, సజీవమైన సద్గురువాక్యానికి గల తేడా! కేవలం శాస్త్రం మనిషి ఆలోచనను యాంత్రికం చేస్తే, సద్గురువాక్యం మనలో దైవం పట్ల జిజ్ఞాసను, విచారణను రేకెత్తించి తరింపుకు బాట వేస్తుంది!

ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరొక విషయమేమిటంటే, శ్రీసాయిభక్తి సాధనకు సంబంధించిన యే సందేహానికైనా సమాధానం - శ్రద్ధగా వెతికితే - బాబా మాటల్లోనే మనకు లభిస్తుంది. మన జీవితమనే గ్రంథాన్ని అర్థవంతంగా, రసవత్తరంగా చదువుకునేందుకు అవసరమైన అంశాలపై బాబా చెప్పక విడచిన విషయం లేదు! శ్రీసాయిబోధ సమగ్రమైనదే; మన అవగాహనే సమగ్రం కావలసి ఉంది! అందుకనే కాబోలు బాబానే అన్నారు, “నా మాటల అర్థం మీకు సరిగ్గా బోధపడడం లేదు!” అని.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

3 comments:

  1. om sai ram today is my amma birthday.please bless sai.with health.long life

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo