సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శంకర్ బల్వంత్ కొహోజ్కర్




సాయిభక్తుడు శంకర్ బల్వంత్ కొహోజ్కర్ మహారాష్ట్రలోని థానా నివాసి. కాయస్థ ప్రభు కులానికి చెందిన ఇతను ముంబాయి కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేశాడు. అతని తండ్రి కీర్తిశేషులు బల్వంత్ సి. కొహోజ్కర్ మామల్తదారుగా రిటైర్ అయ్యాడు. 1911వ సంవత్సరంలో బల్వంత్ సాయిబాబాను దర్శించాడు. బాబా పితృవాత్సల్యంతో అతనిని ఆదరించి, ప్రేమతో అతని వీపు తట్టారు. తరువాత బాబా అతనితో, "నీవు మఠంలో(శిరిడీలో) ఉంటావా?" అని అడిగారు. అతను శిరిడీలో సుమారు ఏడు రోజులు బస చేశాడు.

ఆ సమయంలో దత్తజయంతి వచ్చింది. ఆరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో బాబా భక్తులతో మసీదులో కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా బాబా, "నాకు పురిటినొప్పులొస్తున్నాయి, బాధ భరించలేకపోతున్నాను. నేను ప్రసవించబోతున్నాను!" అని అన్నారు. ఆవిధంగా ఆయన దత్తాత్రేయుని తల్లి అనసూయమాతతో తాదాత్మ్యం చెంది, దత్తాత్రేయునికి జన్మనిచ్చే సమయంలో ఆమె పడుతున్న పురిటినొప్పులను తాము అనుభవిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేశారు. కొద్దిసేపటికి సంధ్యాసమయంలో అకస్మాత్తుగా బాబా భక్తులందరినీ బయటకి తరిమేశారు. కొంత సమయం గడిచాక మళ్ళీ ఆయనే అందరినీ లోపలికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా చాలా ఆనందంగా ఉన్నారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది ఆ సమయంలోనే. భక్తులందరూ మశీదు లోపలికి వెళ్తున్నారు. వారిలో బల్వంత్ కూడా ఉన్నాడు. అతడు మశీదులోకి వెళ్ళగానే బాబా కూర్చునే ఆసనం మీద బాబాకు బదులు మూడు శిరస్సులతో బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. అతడు మళ్ళీ చూసేసరికి దత్తాత్రేయుని బదులు మునుపటివలె కఫ్నీధారియైన బాబానే కనిపించారు. ఆ సంఘటనతో బాబా దత్తస్వరూపులని అతడు గ్రహించాడు. 

తరువాత ఒకరోజు అతడు తన తిరుగు ప్రయాణానికి సిద్ధమై సెలవు తీసుకొనేందుకు బాబా దగ్గరకి వెళ్ళినప్పుడు బాబా అతనితో, "నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను" అని అన్నారు. ఆ తరువాత అతడు బాబా వద్ద ఊదీ, సెలవు తీసుకొని బయలుదేరాడు. మశీదు నుండి ప్రధాన రహదారి వరకు ఉన్న వీధులు, ఇళ్లు దాటుకుంటూ కొంతదూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని బలంగా తోచి, మరలా బాబాను ఒక్కసారి చూడాలనిపించింది. అలా అనిపించిన మరుక్షణంలో అతడు లెండీ వైపు చూశాడు. అద్భుతం! లెండీ కంచెలోంచి బాబా తొంగి చూచి, "వెళ్తున్నావా? మంచిది, వెళ్ళు!" అన్నారు. అతడు అంతకుముందే బాబాను మశీదులో దర్శించి వచ్చాడు. బాబా అతనితోగాని, అతనిని అనుసరిస్తూగాని రాలేదు. కానీ ఎప్పుడైతే సాయిబాబాని మరోసారి చూడాలన్న కోరిక అతని మనసులో జనించిందో, మరుక్షణంలో మశీదు నుండి 100-150 గజాల దూరంలో ఉన్న లెండీ వద్ద బాబా దర్శనమిచ్చారు. అతను బాబాను చూడటం అదే చివరిసారి. అప్పటినుండి 1936లో అతను మరణించేవరకు, ఏ ఆపదలు సంభవించినా బాబా అతనికి సహాయం అందించేవారు.

శంకర్ బల్వంత్ కొహోజ్కర్ తన తండ్రితో కలిసి శిరిడీ దర్శించలేదు. కానీ చిన్నవయస్సులో అతను ఒక చిన్న సాయిబాబా ఫోటోను తన జేబులో పెట్టుకొనేవాడు. అప్పటినుండి అతని చదువులో, జీవితంలో మంచి పురోగతి కనిపించింది. తరువాతి కాలంలో అతను ఆ ఫోటోను తన సోదరికి ఇచ్చాడు. అతను సాయిబాబాకు అంకిత భక్తుడు. క్రమం తప్పకుండా బాబాను పూజిస్తుండేవాడు.

1930లో శంకర్ విరోచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్ళు అనుకొని ఫినాయిల్ త్రాగేశాడు. అది పెనుప్రమాదానికి దారితీసింది. అతను నాలుగు రోజులపాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ అతను మరణిస్తాడేమోని భయపడ్డాడు. కానీ అద్భుతంగా నాలుగు రోజుల తరువాత శంకర్ కోలుకున్నాడు. స్పృహలోకి వస్తున్న సమయంలో అతనికొక దృశ్యం కనిపించింది. పహిల్వానులా కనిపిస్తూ గుండుతో ఉన్న ఒక ముస్లిం యువకుడు అతను చికిత్స పొందుతున్న గది గోడలను, నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. ఆ ఘటనతో, ‘నా దైవం శ్రీసాయిబాబానే వచ్చి నా ప్రాణాలు కాపాడార’ని అతను నిర్ధారించుకున్నాడు.

1934లో శంకర్‌కు శిరిడీ వెళ్ళి సాయిబాబా సమాధిని, ద్వారకామాయిని దర్శించుకోవాలని బలమైన ప్రేరణ కలిగింది. శిరిడీ వెళ్లి ద్వారకామాయిలో సాయిబాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తున్నట్లు అనుభూతి కలిగి అతని ఒళ్ళు జలదరించింది. అతను బాబా చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాడు. "భగవంతుడు ఇక్కడే ఉన్నాడు" అన్న భావనతో అతని మనసు నిండిపోయింది.

సమాప్తం... 

(Source: Devotees' Experiences of Sri Sai Baba, Volume I, II and III by Poojya B.V.Narasimha Swamiji)
http://www.saiamrithadhara.com/mahabhakthas/shankar_balwant_kohojkar.html

7 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
    🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo