సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 483వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తోడు ఉన్నానని మరోసారి ధైర్యాన్నిచ్చిన బాబా
  2. బాబా నా ప్రార్థనలు విన్నారు

తోడు ఉన్నానని మరోసారి ధైర్యాన్నిచ్చిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు ఓం సాయిరామ్! ఈ బ్లాగును ‘ఆధునిక సాయి సచ్చరిత్ర’ అనవచ్చు. నాకు బాబా మీద శ్రద్ధ లోపించిన ప్రతిసారీ ఈ బ్లాగ్ నాలో ధైర్యాన్ని, బాబా మీద నమ్మకాన్ని పెంచుతుంది. నేను గతంలో కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఆర్థిక, మానసిక సమస్యలు అలాగే ఉన్నప్పటికీ, ఈ కష్టకాలంలో ‘బాబా నాకు తోడుగా ఉన్నారు’ అని ప్రతిసారీ నిదర్శనం ఇస్తూనే ఉన్నారు. 

రెండు వారాల క్రితం, అంటే 24 జూన్ 2020 తేదీన బాబా చరిత్ర సప్తాహపారాయణ పూర్తి చేశాను. మామూలుగా నేను సాయిసచ్చరిత్ర గానీ లేదా సాయిలీలామృతం గానీ పారాయణ చేస్తుంటాను. కానీ సమయం చాలక, ఇంట్లో సమస్యలతో ఏకాగ్రత కుదరక ఈసారి బొమ్మకంటి వారు రాసిన బాబా సచ్చరిత్ర పారాయణ చేశాను. నా బద్ధకంతో బాబాను అశ్రద్ధ చేస్తున్నాననే అపరాధ భావన నాలో అలాగే ఉంది. కానీ ఏం చెయ్యను? లాక్ డౌన్ కష్టాలు మా కుటుంబంలో శాంతి లేకుండా చేశాయి మరి. 

25వ తేదీ తెల్లవారుఝామున బాబా పెద్ద పాలరాతి విగ్రహం రూపంలో నాకు కలలో దర్శనమిచ్చారు. నేను నిరంతరం బాబా గురించి చదువుతున్నాను కనుక బాబా అలా దర్శనమిచ్చారేమో అనుకున్నాను. ఆ సాయంత్రం నేను, మావారు లాప్ టాప్ బాగుచేయించటానికి కారులో బయటకు వెళ్ళాం. అనుకోకుండా ఒక మిత్రురాలిని కలిశాము. తరువాత ఆ దారిలో వెళుతుండగా బాబా గుడి కనిపిస్తే, మా పిల్లలు చిన్నవాళ్ళు కావటం వల్ల కోవిడ్ పరిస్థితుల్లో గుడిలోకి అనుమతి ఉండదని కారులోనుంచే బాబాకు నమస్కారం చేసుకున్నాం. తిరిగి వచ్చే దారిలో నేను మళ్ళీ బాబా గుడికి నమస్కారం చేస్తుంటే, మావారు నన్ను ‘గుడిలోకి వెళ్లి బాబా దర్శనం చేసుకుని రమ్మ’న్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఆనందంతో గుడిలోకి వెళ్ళాను. నాకు కలలో కనిపించినట్టే గుడిలో బాబా తెల్లని దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఆయన వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు వంద అడుగులు వేస్తారు. లాక్ డౌన్ కారణంగా మావారు బాబా గుడిలోకి వెళ్ళటానికి కోప్పడతారనుకుంటే ఆయనే స్వయంగా వెళ్ళమన్నారు. అదొక ఆశ్చర్యమైతే, బాబా నాకు కలలో కనపడిన విధంగానే గుడిలో దర్శనమిచ్చారు, అదొక ఆనందం. ఆ ఆనందంలో తృప్తిగా బాబాను దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చాను.

దేవుడిచ్చిన అన్నయ్య విషయంలో స్పర్థలు అలాగే ఉన్నాయి. మావారి ఉద్యోగంలోనూ, నా ఉద్యోగంలోనూ సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ, ఒకటే నమ్మకం - మన సుఖాల్లో దైవం మన పక్కనే నడిస్తే, కష్టాల్లో మనల్ని ఎత్తుకుని నడుస్తాడు. కానీ, అహం, చంచలమనస్సు ఆ విషయం గుర్తురానివ్వవు. ఇదే అనుభవం మొన్న గురుపూర్ణిమ నాడు నాకు కలిగింది. 

ఒకసారి నా చెవితమ్మెలు ప్రమాదవశాత్తూ తెగిపోయాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెవితమ్మెలకు కుట్లు వేయించాలనుకున్నాము. కానీ పిల్లల ఫీజులకు, ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది కలుగుతుందని ఆగాల్సి వచ్చింది. గురుపూర్ణిమనాడు మావారు, “పిల్లలు ఇంట్లోనే ఉండి బోర్ ఫీలవుతున్నారు. మిత్రులతో కలిసి సరదాగా బయటకు వెళదాం” అన్నారు. కానీ నేను, “వద్దు, తెగిన నా చెవితమ్మెలు చూసి అందరూ నవ్వుకుంటారు, నేను రాను” అని మావారితో పోట్లాడాను. కానీ చివరికి వెళ్ళక తప్పలేదు. మావారి స్నేహితుని భార్య నన్ను పెద్దగా గమనించలేదు. నాతో మామూలుగానే మాట్లాడారు. ఆ విధంగా బాబా నేను అవమానపడకుండా కాపాడారు.

అదేరోజు ఇంటికి వచ్చి ఫోన్ చూసుకోగానే సంధ్య హారతి సమయంలో బాబా ఆకుపచ్చని శాలువాలో దర్శనమిచ్చిన ఫోటోలు మా బాబా వాట్సాప్ గ్రూపులో కనిపించాయి. బాబా ఫోటో క్రింద, “నాకు పూజాతంతు అక్కర్లేదు, భక్తి ఉన్న చోటే నా నివాసము” అన్న బాబా సందేశం ఉంది. బాబా ఆకుపచ్చని దుస్తుల్లో కనిపిస్తే నాకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం. ఆ రకంగా నాకు తోడు ఉన్నానని బాబా మరోసారి ధైర్యాన్నిచ్చారు

ఈ సందర్భంగా నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి - బాబా తన భక్తులకు అవమానం జరగనివ్వరు. రెండు - బాబా చరిత్ర పారాయణ చేసేటప్పుడు అవి చిన్న కథలైనప్పటికీ పారాయణలో శ్రద్ధ ముఖ్యం, అంతేగానీ తంతు లేదా తొందరపాటు కూడదు.

త్వరలోనే నాకు దేవుడిచ్చిన అన్నయ్య నాతో మాట్లాడతాడని, ఆ అనుభవాన్ని కూడా ఈ బ్లాగులో పంచుకుంటానని నాకు నమ్మకం కలుగుతోంది. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. ఓం సాయిరామ్!

బాబా నా ప్రార్థనలు విన్నారు

సాయిభక్తురాలు శ్రావణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సభ్యులకు, తోటి సాయిభక్తులకు నా నమస్కారములు. నా పేరు శ్రావణి. సాయిబాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

మొదటి అనుభవం: 

ఇది ఒక స్థలానికి సంబంధించినది. మా ఇంటి ప్రక్కన ఉండేవాళ్ళు మా తప్పేమీ లేకుండానే మాతో ఏ విషయమూ చెప్పకుండా మా పైన కంప్లైంట్ ఇచ్చారు. నేను చాలా బాధపడ్డాను. బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి” అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఎలాంటి గొడవలూ జరగకుండా బాబా మమ్మల్ని కాపాడారు. సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం: 

మా నాన్నగారు పని చేస్తున్న ఆఫీసులో ఇటీవల అందరికీ కరోనా పరీక్షలు చేశారు. అందులో ఒక సభ్యుడికి పాజిటివ్ అని వచ్చింది. మా నాన్నగారి రిపోర్టు రాలేదు. మాకు చాలా భయమేసి, "రిపోర్టు నెగటివ్ గా రావాల"ని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. రిపోర్టులు నెగటివ్ అని వచ్చాయి. “థాంక్యూ సో మచ్ బాబా!” అందరికీ బాబా ఆశీస్సులు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


7 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo