సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 427వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 60వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకరోజు ఉదయం త్వరగా లేచి నా పళ్ళసెట్టు నేను పెట్టిన స్థానంలో లేనట్లు గమనించాను. అందువల్ల భౌతికమైన బాధ ఉత్పన్నమైంది. పూజగదిలో శ్రీసాయి మహారాజు, భగవాన్ శ్రీకృష్ణ చిత్ర పటాల ఎదురుగా కూర్చున్నాను. అక్కడ, “రెండు రూపాయిలు దక్షిణ ఇవ్వు. వెంటనే నీకు పళ్ళసెట్టు లభిస్తుంది” అన్న స్వరం వినిపించింది. రెండు రూపాయలు తీసుకుని సాయి మహారాజు ఎదుట పెట్టాను. క్రింద చెత్త తీస్తున్న కళావతికి మెట్ల క్రింద పడిఉన్న ఆ పళ్ళసెట్లు రెండూ లభించాయి. ఆమె త్వరత్వరగా వచ్చి వాటిని నాకిచ్చింది. దీంతో, కొన్నిసార్లు కార్యసిద్ధి కోసం కేవలం భక్తే కాక దక్షిణ కూడా అవసరమన్న విశ్వాసం కలిగింది. ఒకరోజు ఉదయం ప్రార్థన, స్తోత్రాదులు పఠించకుండా పూజగది దగ్గర హాయిగా కూర్చున్నాను. అప్పుడు సహజంగానే దానంతట అదే భగవంతుడి నామోచ్ఛారణ జరుగుతుండటం విన్నాను. ‘అదేమిటి?’ అన్న ఆలోచన వచ్చినప్పుడు, “మనిషి స్వస్థ ఆత్మస్తుడైనప్పుడు శుద్ధమైన సంస్కారాన్ని అనుసరించి భగవంతుడి పేరును ఉచ్ఛరించకుండానే సహజంగానే అది వినిపిస్తుంది. దీన్నే 'అనాహతనాదం' అంటారు” అనే సూచన వచ్చింది.

అప్పుడప్పుడు ఆరతి చేసే సమయంలోనూ, ధూపం వేసే సమయంలోనూ అక్కడ పెట్టబడిన శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమలోనూ, మహనీయుల చిత్రపటాల్లోనూ పాఠశాల విద్యార్థీ విద్యార్థినులు, అధ్యాపకులు, అధ్యాపకురాళ్ళు కనిపించేవారు. దీన్ని గురించి ఆలోచించిన మీదట "గురుమహారాజు సర్వవ్యాపకుడు” అన్న నిర్ణయానికొచ్చాను. ఇది తెలుసుకుని ఆయనకు నేను ఆరతి ఇస్తుంటే దానికో పరిణామం కలిగింది. “మూలప్రతిమల స్థానంలో కనిపించిన విద్యార్థీ విద్యార్ధినులంతా నేనేనని తెలుసుకోవాలని నా స్థానంలో నీకు వాళ్ళనే కనిపింపచేస్తున్నాను” అని గురుమహారాజు నాకు ప్రబోధించాలనుకుంటున్నారని అనిపించింది. అందువల్ల అందరితోపాటు జరుగబోయే వ్యవహారం నాతో పాటు జరుగబోయే వ్యవహారంలాగా ఆదరణీయం కావాలి.

మాం చ యోవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే |
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ||

(భగవద్గీత అధ్యాయం 14, శ్లో 26)

“అవ్యభిచార భక్తి యోగంతో నన్ను సేవించేవాడు బ్రహ్మత్వం కోసం గుణాలకు అతీతంగా వెళ్ళి యోగ్యుడౌతాడు”.

ఒకసారి గాణుగాపూర్ స్టేషనులో (22 మే 1948) రజాకార్లు ఆ స్టేషనుమాస్టర్ని కట్టి ఉంచిన స్తంభాన్ని సేట్ (రతీలాల్ చిమన్‌లాల్) నాకు చూపించాడు. రజాకార్లు స్టేషన్ బయట శస్త్రాలతో సహా నిలబడి ఉన్నారు. బండి (మద్రాసు మెయిల్) స్టేషన్లోకి వచ్చీ రావటంతోనే దానిమీద పడి పెట్టెల్లోకి ఎక్కి ప్రయాణీకులను లూటీ చేయటం ప్రారంభించారు. ఆ వాతావరణమంతా భయమూ, ఆందోళనా, హంగామా, కోలాహలం, కొట్టి చంపటాలతో వ్యాపించిపోయింది. రతీలాల్ సేట్, వారి అనుచరులూ, రెండవక్లాసు పెట్టెలో కిటికీలూ, తలుపులూ మూసేసి భగవంతుడ్ని స్మరిస్తూ తమకు ఏమౌతుందోనన్న చింతతో కూర్చుని ఉన్నారు. కానీ ఆశ్చర్యం! ఆ రజాకార్లకు ఆ పెట్టె కనిపించనేలేదు. కిటికీ సందులోంచి చూసి వెనుకనున్న పెట్టెలన్నిట్లో అత్యాచారం జరుగుతోందని సేట్ రతీలాల్ తెలుసుకున్నాడు. అతని అనుచరులు, యాత్రికులు అది సాయిస్మరణ ప్రభావమేనని తెలుసుకున్నారు. అదే అతను వారందరికీ చెపుతున్నాడు.

1916వ సంవత్సరం నుంచి నాకు సన్యాసం తీసుకోవాలని కోరిక. కానీ ఆ కోరిక చాలాకాలం వరకు నేరవరలేదు. ఒకప్పుడు సన్యాసం తీసుకోవలసిన నమయం వచ్చిందని అనిపించింది. మా అమ్మగారి మృతి తరువాత ఆమె కర్మకాండ అంతా పూర్తిచేసి సంవత్సరీకం చేసిన తరువాత సన్యాసం తీసుకోవాలని నా ఆలోచన. కానీ సాయిమహారాజు పుస్తకంలో వ్రాసిన దానిప్రకారం శ్వేతవస్త్రాలు ధరించి చేయగల గురుసేవ, ప్రజాసేవలకు అనుకూల్యత అనేది సన్యాసం తీసుకొన్న తరువాత సంభవించదన్న ఆలోచనతో సన్యాసం తీసుకోవటం చాలారోజుల వరకూ ఆగిపోయింది. మిగిలిన జీవితవు చరమాంకంలో సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. 1951లో సంసారాన్ని త్యజించి సన్యాసం తీసుకోవాలన్న నా ఇచ్ఛనూ, ఆవశ్యకతనూ కుముద్ బెహన్‌తో చెప్పి, దానిగురించి ఆమెతో చర్చించాను. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ, "శ్రీసాయిమహారాజు “బాబు” ఎలా ఉంటాడు? ఫకీర్లకే ఫకీరుగా ఉంటాడు” అన్నది.  

కుముద్ బెహన్ చెప్పిన పై మాటలనే రాధాకృష్ణమాయి పదేపదే ఉచ్ఛరిస్తూండటం గురొచ్చింది. పదకొండు నెలలు శిరిడీలో ఉండి నేను ఇంటికి తిరిగి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆమె ఎంతో ఏడ్చింది. ఒకసారి నేను శిరిడీలో ఉండకుండా ముంబాయి తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఆమె స్వగతంలో, “నేను కార్చే ఈ కన్నీళ్ళన్నీ వృథాయేనా? బాబా నిన్ను “బాబూ” అని పిలుస్తారు. అది కూడా వ్యర్థమేనా?” అంటూ ఇలా మరెన్నో అనుకున్నది. దీనితో రాధాకృష్ణమాయి చెప్పింది స్పష్టమైంది. అదలా ఉంటే, సన్యాసం తీసుకోవాలన్న నా కోరిక మాత్రం మళ్ళీ వాయిదా పడింది.

తరువాత 1953 జ్యేష్ఠ మాసంలో జూన్ 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం రణ్‌ఛోడ్‌రాయ్ మందిరంలో కేశవలాల్ అనే బ్రాహ్మణుడు నన్ను కలిశాడు. సన్యాసం కోసం 1953 ఆషాఢ శుద్ధ పాడ్యమి, ఆదివారం, జులై 12న ముహూర్తం ఉందనీ, ఒకవేళ అది అనుకూలం కాకపోతే చాతుర్మాస్యం తరువాత కార్తీక, మార్గశిర మాసం వరకూ ఎదురుచూడాలని చెప్పాడాయన. ఆ సమయంలో నాకు బాబా స్వరం, అలాగే రణ్‌ఛోడ్ స్వరం కూడా, “వెంటనే సన్యాసం తీసుకో! ఇప్పుడు ఆలస్యం చేయకు” అని వినిపించింది. అందువల్ల కేశవలాల్‌తో, “నేను సన్యాసం తీసుకోవటం నిశ్చయం” అని చెప్పాను. కానీ నాకు ఇతరులని గురువుగా చేసుకోవాలని లేదు. ఎందుకంటే, ఆచార్యులవారు మహావాక్యంలో చేసే ఉపదేశాన్ని నా గురువు నాకు మొదటే ప్రసాదించారు. ఆయన ఈ జ్ఞానాన్ని అనుభవంతో సహా ప్రసాదించినందువల్ల ఇప్పుడు వేరేవారిని గురువుగా చేసుకోను. ఒకవేళ ఈ విధంగా అయితే జరుగవలసిన విధిని జరిపించవలసి ఉంది. కేశవలాల్‌తో పాటు ఉన్న శుక్ల అనే వ్యక్తి సూచనను అనుసరించి కేశవలాల్ ఈ షరతుపై సన్యాస విధి జరిపించటానికి ఒప్పుకున్నాడు. ఆ కార్యక్రమానికి కొంత డబ్బు అవసరమైంది. అప్పటికప్పుడు అహ్మదాబాదు వెళ్ళి డబ్బు తీసుకువచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఇబ్బంది సమయంలో బాబా ఎంతోమందికి ప్రేరణ కలిగించి ఈ సమస్యను సులువుగా పరిష్కరించారు. చివరికి 1953 జులై 14న, శాస్త్రోక్తంగా నేను సన్యాస దీక్ష స్వీకరించాను.

సమాప్తం.....

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    సర్వే జనా సుఖినోభవంతు.
    సర్వే సుజనా సుఖినోభవంతు.
    🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    ఓం శాంతి శాంతి శాంతిః!!

    ReplyDelete
  2. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    సర్వే జనా సుఖినోభవంతు.
    సర్వే సుజనా సుఖినోభవంతు.
    🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    ఓం శాంతి శాంతి శాంతిః!!

    ReplyDelete
  3. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo