సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 487వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. నా జీవితంలో శిరిడీ సాయిబాబా ప్రవేశం - వారి ఆశీస్సులతో జరిగిన వివాహం
  2. కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబా

    నా జీవితంలో శిరిడీ సాయిబాబా ప్రవేశం - వారి ఆశీస్సులతో జరిగిన వివాహం

    సాయిభక్తుడు గోపాలకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

    ఓం సాయిరాం! నా పేరు గోపాలకృష్ణ. మాది జానకీపురం గ్రామం. సాయిభక్తులందరికీ నమస్కారం. అందరిపై ఆ శిరిడీ సాయినాథుని కృప సమృద్ధిగా ఉండాలని కోరుకొంటున్నాను. బాబా నా జీవితంలోకి వచ్చి నేటికి మూడు సంవత్సరాలు దాటింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో బాబా ఎన్నో రకాలుగా నన్ను ఆదుకున్నారు. అది 2017వ సంవత్సరం, అక్టోబరు నెల. నేను ఇంటి దగ్గర ఉండి బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఆ సమయంలో మా అక్క(బాబాయి కూతురు), బావగారు హైదరాబాదు నుండి మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో మా బావగారు నాతో, “నువ్వు హైదరాబాదు వచ్చి పరీక్షలకు ప్రిపేర్ అవచ్చు కదా” అని అన్నారు. నేను అందుకు అంగీకరించి కొన్నిరోజుల తరువాత హైదరాబాదు వెళ్లి మా అక్కావాళ్ళింట్లో కొన్ని నెలలు ఉన్నాను. ఆ సమయంలోనే బాబా నాకు దగ్గరయ్యారు.

    ఒకరోజు మా బావగారు నన్ను దిల్‌షుఖ్‌నగర్ లోని సాయిబాబా గుడికి తీసుకెళ్లారు. ఇద్దరం బాబా దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. మా అక్క, బావగారు ఇద్దరూ సాయిభక్తులు కనుక వాళ్ళింట్లో సాయిబాబా సచ్చరిత్ర నిత్యపారాయణ పుస్తకాన్ని చూశాను. ఆ పుస్తకం తీసుకుని మొదటి రెండు పేజీలు చదివాక మా అక్కను అడిగాను, ‘ఈ పుస్తకం ఎలా చదవాలి?’ అని. ‘సచ్చరిత్ర సప్తాహపారాయణ చేస్తే మంచిద’ని అక్క బదులిచ్చింది. నేను నా కోరికను మనసులోనే బాబాకు చెప్పుకొని పారాయణ మొదలుపెట్టాను. అలా పారాయణ చేస్తూ బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. మొదటి పారాయణ పూర్తయిన తరువాత మళ్ళీ రెండుసార్లు పారాయణ చేశాను. కానీ నాకు ఏ ఉద్యోగమూ రాలేదు. ‘బాబా నాకు ఏ ఉద్యోగాన్నీ ప్రసాదించలేద’ని చాలా బాధపడ్డాను. కానీ బాబాకి దూరం కాలేదు

    తరువాత నేను అక్కావాళ్ళింటినుండి హాస్టల్‌కి వెళ్ళాను. హాస్టల్‌కి వెళుతూ నాతో పాటు బాబా ఫోటోను తీసుకెళ్ళి నా రూములో గోడకు అంటించాను. అప్పటినుండి రోజూ స్నానం చేసిన వెంటనే బాబాకు నమస్కరించుకోవటం అలవాటుగా మారింది. తరువాత నేను బ్యాంకు ఉద్యోగాల కొరకు శిక్షణ ఇచ్చే ఒక సంస్థలో చేరి, మళ్లీ నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మూడు నెలలు గడిచిన తర్వాత అనుకోకుండా ఓరోజు మా ఇంటినుండి ఫోన్ కాల్ వచ్చింది, “ఒక పెళ్ళి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటావా?” అని. పెళ్ళి విషయం గురించి నా తల్లిదండ్రులు ఎప్పటినుండో నన్ను అడుగుతున్నారు. వాళ్ళడిగిన ప్రతిసారీ ‘నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు’ అని చెప్పేవాడిని. కానీ ఈసారి పెళ్ళికి అంగీకరించాను. నేను పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించేసరికి మావాళ్ళు చాలా సంతోషించారు. తరువాత బాబా ఆశీస్సులతో నాకు వివాహం నిశ్చయమైంది. మొదటి శుభలేఖ బాబా గుడికి వెళ్లి బాబాకు సమర్పించాను. ఇక వివాహ సమయంలో నా జీవితంలో నేను ఊహించలేనటువంటి సంఘటన జరిగింది.

    అదేమిటంటే, పెళ్లి జరిగేరోజు సాయంత్రం ఆకాశమంతా మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. నేను చాలా భయపడ్డాను. “బాబా! పెళ్ళికి బంధువులంతా వచ్చారు. ఒకవైపు వర్షం వచ్చేలా ఉంది. నువ్వే ఎలాగైనా వర్షం రాకుండా చూడు బాబా!” అని బాబాను మనసులోనే వేడుకుంటూ వివాహ వేదిక మీదికి ఎక్కాను. బాబా అద్భుతం చేశారు. వాతావరణమంతా చాలా చల్లగా ఉన్నప్పటికీ వర్షం ఏమీ రాలేదు. బాబా అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం ఎంతో వైభవంగా జరిగింది. మేము ఆహ్వానించిన వారంతా పెళ్లికి వచ్చారు. పెళ్ళికి వచ్చిన వారిలో ఒక సాధువు కూడా ఉండటం గమనించాను. బహుశా నన్ను ఆశీర్వదించటానికి బాబానే ఆ సాధువు రూపంలో పెళ్లికి వచ్చుంటారని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. బాబా నా జీవితంలో ప్రవేశించినప్పటినుండి ఏదో ఒక రూపంలో నన్ను ఆదుకుంటున్నారు.

    కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబా

    ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

    ఓం సాయిరామ్! నేను 18 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. ఎన్నో క్లిష్టసమస్యల నుండి సాయిబాబా నన్ను ఆదుకున్నారు, ఆదుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల మా కంపెనీ యజమాని తమ్ముడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న మా అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల గురించి నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ఎలాగైనా నన్ను ఈ కోవిడ్ బారినుండి కాపాడమని వేడుకున్నాను. తరువాత కోవిడ్ పరీక్షల రిపోర్టులు వచ్చాయి. నాకు నెగిటివ్ అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన నా ఆనందానికి హద్దులు లేవు. కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబాకు అనంతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే రక్షిస్తూ ఉండమని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.

    సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


    5 comments:

    1. 🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏

      ReplyDelete
    2. సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

      ReplyDelete
    3. Om Sai Ram 🙏🌹🙏
      ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
      ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

      ReplyDelete
    4. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

      ReplyDelete

    సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

    Subscribe Here

    బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

    Delivered by FeedBurner

    Followers

    Recent Posts


    Blog Logo