సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 419వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - 52వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకరోజు మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతంలో నేను బాబా వద్దకు వెళ్ళాను. అప్పుడు బాబా తలపై క్రాస్ ముద్రింపబడివున్న ఎర్రని సిల్కురుమాలుని కట్టుకుని ధుని వెనుక ఉత్తరాభిముఖులై కూర్చుని ఉన్నారు. ఆయన స్వయంగా నాకేమీ చెప్పలేదుగానీ, నా వైపు చూసి, “నీ సమాచారం ఇవ్వటానికే నేను ముంబాయి వెళ్తున్నాను” అని అన్నట్లు నాకనిపించింది. ఆ సమయంలో ఆ మాటల్లో నాకేమీ విశిష్టత కనిపించలేదు. అయితే దాని తరువాత నేను విల్లేపార్లే వెళ్ళినప్పుడు మా అక్కయ్య నాతో, “ఒకరోజు మధ్యాహ్నం శరీరం మీద ఎర్రని కంబళి కప్పుకున్న ఒక ఫకీరు మనింటికి వచ్చి ‘నీ తమ్ముడు కులాసాగా ఉన్నాడ’ని చెప్పాడు” అని చెప్పింది. ఆయన అక్షింతలు, కుంకుమ తెప్పించి, ఆ సమయంలో అక్కడే నిలుచున్న పొరుగావిడకు దాన్ని ఇచ్చి, “ఈ పొట్లం ఫలానా రోజున తెరచి చూడు, అప్పుడు నా సత్యతకు ప్రమాణం లభిస్తుంది” అన్నాడట. కొన్నిరోజుల తరువాత ఆయన చెప్పిన విధంగా పొట్లాం విప్పి చూస్తే అందులో అక్షింతలకు బదులు రెండు చేతుల్లోకీ రెండు బంగారు ముక్కలొచ్చాయని చెప్పింది ఆవిడ. దీంతో అలాంటి చమత్కారం చూపగలవారు శ్రీ సాయిబాబానే అయివుండాలన్న దృఢనిశ్చయం నాకేర్పడింది. దీని తరువాత నేనొక మధ్యాహ్నం పైన చెప్పిన అనుభవాన్ని చెప్పినప్పుడు మా అక్కయ్య కూడా స్వయంగా బాబా నా చింతను దూరం చేయటానికి వచ్చారని అర్థం చేసుకుంది.

శ్రీసాయిబాబా వద్ద 21, 22 రోజుల శిరిడీ నివాసం తరువాత ముంబాయి విల్లేపార్లేలో ఒకటి రెండు రోజులుండి నేను మోతా గ్రామం వెళ్ళాను. అప్పుడు నా ఆరోగ్యం దృష్ట్యానూ, సొలిసిటర్ పరీక్షకు చదువుకోవాలనే దృష్టితోనూ 1917లో మార్చి వరకు మా అమ్మ దగ్గరున్నాను. ఆ కాలంలో మా ఇంటి ఎదురు వీధి చివరి ఇంట్లో ఉండే రంగుల వ్యాపారి శ్రీదేవశంకర్ హరిజీవన్ గోఖలే రామేశ్వర మందిరంలో మహారుద్రం చేశాడు. అది జరుగుతున్నప్పుడు ఓ సాయంకాలం ముగ్గురు సన్యాసులు ఆ యజ్ఞం చూడటానికి వచ్చారు. యజ్ఞం సమాప్తమైన మీదట వారికి భోజనం కోసమూ, బస కోసమూ ఏర్పాట్లు జరగకపోవటం వల్ల ఆరోజు వారు మా ఇంటికి వచ్చారు. ఆ ముగ్గురు సన్యాసులు ఉండటానికి నేను గ్రామం బయట దక్షిణదిశలోని నీలకంఠ మహాదేవ మందిరంలో బస ఏర్పాటు చేశాను. అలాగే ఒకటి రెండు గంటలలో భిక్షా భోజనం తయారవుతుందనీ, అప్పుడు వారిని ఇంటికి రమ్మనీ విన్నవించాను.

అమ్మ అనుమతితో మోఘీ అక్కయ్య హల్వా, పూరీ, పప్పు, అన్నం ఇత్యాదులతో భోజనం సిద్ధం చేసింది. ఆ ముగ్గురు సన్యాసులూ వచ్చి కాళ్ళు, చేతులు కడుక్కున్న తరువాత ఆదరపూర్వకంగా వారిని పీటలపై కూర్చోబెట్టి భోజనం వడ్డించి తినమని విన్నవించాము. వారిలో ఇద్దరు యథావిధిగా మంత్రోచ్ఛారణ చేశారు. అయితే మధ్యలో కూర్చున్న సన్యాసి, “చూడండి, నేను చేతిలో ఏదీ దాచుకోలేదు. నేను భిక్ష చేసేముందు ఎప్పుడూ సాలిగ్రామానికి నైవేద్యం అర్పించి, దాని తరువాతే భోజనం చేస్తాను. ఈ సాలిగ్రామాన్ని నేను నా తలమీద ముడిలో పెట్టి, భోజనానికి ముందు దాన్ని నోటిగుండా బయటికి తీసి, దానికి నైవేద్యం పెట్టిన తరువాతే నేను తింటాను” అన్నాడు. ఇలా చెప్పి అతను తన నోటినుండి నల్లని రాతి విష్ణువును తీశాడు. దాన్ని చేతిలో పెట్టుకొని యథావిధిగా దానికి స్నానం చేయించి, యధోచితంగా పూజ చేసి నైవేద్యం సమర్పించాడు. అప్పుడు ఇరుప్రక్కలా కూచున్న ఇద్దరు సన్యాసులూ సాలిగ్రామానికి మనసుతో వందనం చేశారు. తరువాత మధ్యలో కూర్చున్న సన్యాసి, “చూడు, నేను ఈ సాలిగ్రామాన్ని నా తలమీద దాని స్థానంలో ఉంచుతాను” అని చెప్పి ఆ సాలిగ్రామాన్ని నోట్లో పెట్టుకొన్నాడు. అప్పుడు భోజనం ప్రారంభమైంది. ఇది చూసి మిగిలిన ఇద్దరూ కూడా భోజనం ప్రారంభించారు. వారు ముగ్గురూ భిక్షను స్వీకరించటంతో, “ఈరోజు బాబా ముగ్గురు సన్యాసుల రూపంలో, అంటే గురు దత్తాత్రేయ రూపంలో భిక్షను స్వీకరించటానికి వచ్చార”ని అనిపించింది. అందులో ఒకరు తన ఇష్టదేవతను బహ్మరంధ్రంలో పెట్టి అందులోంచి తిరిగి తీయటాన్ని చూసి, పైన చెప్పిన త్రిగుణాత్మక త్రిమూర్తి విషయంలో శ్రద్ధ దృఢమైంది. అతను చెప్పిన మీదట నేనా రాత్రి భోజనం చేశాను. దానితో అతను ప్రసన్నతను వ్యక్తం చేశాడు. అప్పుడు మోఘీ అక్కయ్య నాకు వడ్డిస్తోంది. ఆమె వైపు చూసి, “ఈమె ఎవరు? నీ భార్యా ఏమిటి?” అని అడిగారు. “ఈమె నా అక్కయ్య, నా భార్య కాదు” అని వెంటనే నేను సమాధానమిచ్చాను. వారు మోఘీ అక్కయ్యను ఆశీర్వదించారని నాకిప్పుడు గుర్తొస్తోంది.

తరువాత వారు తాముండే ప్రదేశానికి వెళుతూ, "మా బస బావుంది. కానీ పడుకోవటానికి పరుపులుంటే బావుంటుంది” అన్నారు. నేను భోజనం చేసి, పనమ్మాయితో పరుపులూ, దిండ్లు తీసుకొని అక్కడకి వెళ్ళి, తరువాత పనమ్మాయిని పంపించి కొంచెంసేపు అక్కడే కూర్చున్నాను. 

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏ఓం సాయిరాం 🙏🌹🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo