సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 475వ భాగం....



ఈ భాగంలో అనుభవం:
  • బాబాపై పూర్తి విశ్వాసముంటే చాలు - ఏ గ్రహాల గురించీ చింతించనవసరంలేదు

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ మేజిక్ లా జరిగింది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. బాబా మన కుటుంబసభ్యులతో బంధాలని బలపరుస్తూ అదే సమయంలో మన ఆధ్యాత్మిక పురోగతిని కూడా చూసుకుంటారు. ఈ అనుభవంతో బాబా నాకు ఆ అవగాహనను ఇచ్చారు. ఇక నా అనుభవంలోకి వెళ్దాం.

వీసా ఇంటర్వ్యూ అన్న ప్రతిసారీ అందులో నేను సెలెక్ట్ అవుతానా లేదా అని చాలా ఆందోళనపడుతుంటాను. ఈ భయాలు నన్నెప్పుడూ వదలవు. వీసా ఇంటర్వ్యూకు ఇంత భయం ఎందుకు అని ఎవరైనా అనుకోవచ్చు. అందుకు నా గతంలో జరిగిన కొన్ని తప్పులే కారణం. ఆ భయం మా గ్రీన్ కార్డ్ షెడ్యూల్ తేదీ సమీపించే సమయానికి మరీ అధ్వాన్నంగా మారింది. ఇది జరగడానికి చాలాకాలం ముందు యు.ఎస్.ఏ లో ఒకసారి వార్షిక సాయి పల్లకి సేవ జరిగింది. మొదటిసారి నేను ఈ సేవలో పాల్గొన్నప్పుడు ఒక గొప్ప మహనీయుణ్ణి కలవడం అనే మంచి అనుభవాన్ని బాబా ఇచ్చారు. అతని ద్వారా బాబా తన భక్తులకు ఆశీస్సులు అందజేస్తుంటారు. అప్పటినుండి నేనెప్పుడు ఒత్తిడికి లోనైనా, పరిస్థితులు చక్కబరుచుకోలేకపోయినా బాబా ఆశీస్సుల కోసం ఆ వ్యక్తికి ఇ-మెయిల్ పెడుతూ ఉంటాను.

మా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తరువాత మేము ఒక న్యాయవాదిని నియమించుకున్నాము. కొన్నిరోజుల ముందు అతని నుండి మద్దతుకోసం, మార్గదర్శకత్వం కోసం అతన్ని కలిసినప్పుడు, గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ ప్యానెల్లో ఒక స్పెషల్ అధికారి చాలా కఠినంగా ఉంటారని, ఆమె సాధారణంగా చాలా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారని, దాదాపు 30 నిమిషాల నుండి 1 గంట సమయం తీసుకుంటారని అతను చెప్పాడు. దానితో నేను చాలా చాలా ఆందోళన చెందాను. నా సమస్యను బాబాకు చెప్పుకుని సహాయం చేయమని ప్రార్థించాను. నేను రోజువారీ పారాయణ, మహాపారాయణ గ్రూపులలో ఉన్నందువలన రోజూ సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. అయితే నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఒకరు చెప్పినందువల్ల నేను ఇంటర్వ్యూకి ఐదురోజుల ముందునుండి నాకిష్టమైన కొన్ని స్తోత్రాలను, మూడురోజుల ముందు నుండి విష్ణుసహస్రనామం, హనుమాన్ చాలీసా చదవడం మానేశాను. పారాయణ మాత్రం చేస్తుండేదాన్ని.

ఇంటర్వ్యూ ముందురోజు నా మానసిక ఒత్తిడి దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక ఏమాత్రం భరించలేకపోయాను. అందువలన ఇంటర్వ్యూ గురించి, నా కుటుంబం గురించి బాబా ఆశీస్సుల కోసం పైన పేర్కొన్న ఆ మహనీయునికి ఒక ఇ-మెయిల్ పంపాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా అతను ఇ-మెయిల్స్‌కి ప్రత్యుత్తరం ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అందుకు కొన్నిరోజుల సమయం పడుతుంది. అయితే అది ఖచ్చితంగా బాబా ఆశీర్వాదమవుతుంది. ఎందుకంటే, బాబా నుండి సందేశం అందుకున్నాకే అతను ప్రత్యుత్తరం ఇస్తారు. గతంలో నా అనుభవమది. నేను ఇంటర్వ్యూ ముందురోజు సాయంత్రం 4 గంటలకు అతనికి ఇ-మెయిల్ పంపి ఆ రాత్రయినా, మరుసటిరోజు ఉదయమైనా నాకు సమాధానం వస్తే, నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తానని అనుకున్నాను. రాత్రి భోజనం చేశాక నేను నా మెయిల్స్ చూసుకుని ఆశ్చర్యపోయాను. నా ఇన్‌బాక్స్‌లో, "మీరు ఇంటర్వ్యూను చక్కగా పూర్తిచేస్తారు. గ్రీన్ కార్డ్ గురించి చింతించకండి" అని అతని సమాధానం ఉంది. అది చూశాక నా ఇంటర్వ్యూ విజయవంతం అవుతుందనే నమ్మకంతో నా మనస్సు నెమ్మదిగా శాంతించింది. నాలాంటి వ్యక్తిపై దయతో బాబా ఎంత సహాయం చేస్తున్నారో అని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. 'ఇంత చేస్తున్న ఆయనకి ప్రతిగా నేను ఏమి చేయగలను? అన్నీ తానై, అంతా తానై ఉన్న ఆయనకు నేనేమి ఇవ్వగలను?' అని ఆలోచిస్తూ నేను నా వాట్సాప్ తెరిచి, నా రోజువారీ పారాయణ గ్రూపులో పారాయణ చేసినట్లు నేను రిపోర్ట్ చేశానా లేదా అని చూసాను. అందులో నేను "24వ అధ్యాయం ఎవరైనా చదువుతారా?" అనే సందేశాన్ని చూశాను. వెంటనే నేను చదువుతానని గ్రూపు నిర్వాహకురాలికి మేసేజ్ పెట్టాను.

ఆ అధ్యాయంలోని ఈ క్రింది పంక్తులు చదివి నా హృదయం పూర్తిగా శాంతిని పొంది, చాలా సంతృప్తికరంగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా అనిపించింది

"పంచేంద్రియములకంటే ముందే, మనస్సు, బుద్ధి విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో, అది కూడ ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియందభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఈవిధంగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ ఆభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో నా వస్తువు ననుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధిపొందును. శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినపుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మనకానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేద భావములన్నిటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి, ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యే వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సునకు ఈవిధముగా శిక్షణనిచ్చినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్యానమెన్నోరెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును".

ఇది చదివిన తరువాత నేను గ్రూపు నిర్వాహకురాలికి మరుసటిరోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పాను. ఆమె, "ఆల్ ది బెస్ట్! మీరు ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ పొందుతారు!" అని బదులిచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఇంకో విషయం గురించి చెప్పాలి. ఇంటర్వ్యూకి రెండు వారాల ముందు నా జాతక ఉంగరంలోని కెంపు స్టోన్ ఊడిపోయింది. నిజానికి కొన్నినెలల క్రితమే మేము ఆ ఉంగరాన్ని సరిచేయించాము. అయినప్పటికీ మళ్ళీ ఇలా జరిగింది. దానికి తోడు జాతకరీత్యా నాపై శని ప్రభావం నడుస్తోంది. అందువలన ఇంటర్వ్యూకి ముందే నా ఉంగరం నాకు ఎలాగైనా కావాలని నా భర్తతో చెప్పాను. మొత్తానికి ఆ ఉంగరంలో కెంపు స్టోన్ పెట్టి బుధవారం ఇచ్చారు. నేను దాన్ని వంటగదిలో ఉన్న ఒక సొరుగులో ఉంచాను. ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి నిద్రపోయేముందు మర్చిపోకుండా ఉంగరాన్ని ధరించాలని అనుకున్నాను. కానీ నేను దానిని ధరించడం మరచిపోయాను. మరుసటిరోజు యు.ఎస్.సి.ఐ.ఎస్ భవనంలో ఇంటర్వ్యూ గది ముందు కూర్చున్నాకగానీ నాకు నా ఉంగరం విషయం గుర్తురాలేదు. అది గుర్తుకొచ్చాక భయంతో నేను నా మనస్సులోనే, "బాబా! ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే ఏ భద్రత లేదు" అని ప్రార్థించాను.

తరువాత నేను నా ఫోన్లో బాబాను చూస్తూ ఉన్నాను. షెడ్యూల్‌ సమయానికి  ఏడెనిమిది నిమిషాల ముందు మమ్మల్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఇంటర్వ్యూ అధికారి అక్కడ కూర్చుని ఉన్నాడు. అతను పూర్తి పేరు, జన్మ వివరాలు, మరికొన్ని అవును/కాదు అని బదులిచ్చే చాలా ప్రాథమిక ప్రశ్నలను మాత్రమే అడిగాడు. నా భర్తకు, నాకు కలిపి కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నాడతను. ఉదయం 10:45 కి అసలు షెడ్యూలు సమయమైతే 10:55 కల్లా మేము భవనం బయట ఉన్నాము. మా న్యాయవాది, నా భర్త, నేను మా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అంత తేలికగా జరిగిందంటే నమ్మలేకపోయాము. ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో ఉన్న సాయి మందిరం వద్ద ఆగాము. నేను కారులో ఉండగా నా భర్త మందిరం లోపలికి వెళ్లి బాబాకు కృతజ్ఞతలు చెప్పారు. తరువాత ఇంటికి వెళ్తూ నా భర్త కొన్నివారాల క్రితం ఇంటర్వ్యూకు హాజరైన తన స్నేహితుడికి ఫోన్ చేసారు. అతను తన చిరునామాతో సహా USAలో ముందు ఎక్కడ ఉన్నారు, ఉపాధి గురించి వివరాలు ఇలా చాలా ప్రశ్నలు అడిగారని చెప్పాడు. అలాంటిది బాబా ఆశీర్వాదం వల్ల మా ఇంటర్వ్యూ చాలా తేలికగా జరిగిందని అనుకున్నాము. ఇంటికి వచ్చిన తరువాత నేను మా ఇంటర్వ్యూ ఎలా జరిగిందో తెలియజేస్తూ పైన పేర్కొన్న ఆ మహనీయునికి, నా రోజువారీ పారాయణ గ్రూపు నిర్వాహకురాలికి మెయిల్ పెట్టాను. డైలీ పారాయణ గ్రూపు నిర్వాహకురాలు, "వావ్.. బాబా మీరు తనపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని, ఏ గ్రహాల గురించీ చింతించకూడదని కోరుకుంటున్నార"ని బదులిచ్చారు. 

ఈ అనుభవంతో నేను చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. నా విధి, నా ప్రార్థనలు(స్తోత్ర పఠనం), నా మనస్సు, మధ్యవర్తులు, జాతక ఉంగరాలు నా విధిని మార్చడానికి సరిపడవని తెలుసుకున్నాను. నన్ను రక్షించగల ఏకైక దైవం, గురువు శ్రీ శిరిడీ సాయిబాబా. ఆయన నడిపించినట్లు నడుచుకోవడమే మనం చేయాల్సింది. ఎల్లప్పుడూ ఆయన దయను గుర్తుంచుకుని కృతజ్ఞత కలిగి ఉండాలి. 

నన్ను ఆశీర్వదించినవారికి (గ్రూపు నిర్వాహకురాలు/పూజారులు), ఆ మహనీయునికి నా శతకోటి ప్రణామాలు. "బాబా! నేను మీ వల్లనే బతికి ఉన్నాను, నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. ఈ విశ్వమంతటిని మించినది మీ దయ. మీ దయను వివరించడానికి నాకు పదాలు దొరకడంలేదు. బాబా! మీ కృపకు ధన్యవాదాలు అన్న మాట చాలా చిన్నది. అయినా మీకు లెక్కలేనన్నని ధన్యవాదాలు. శ్రీ శిరిడీ సాయినాథ మహారాజా! నా సాష్టాంగ ప్రణామాలు స్వీకరించండి".

source: http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2606.html


8 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
    వ్"యద్భావం తద్భవతి"
    మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అదే సాయి లీలామృతం. సాయి సంధ్య హారతి లో కూడా చివరగా త్రికరణశుద్ధిగా మనం పాడుకుంటా తన్మయత్వం చెందుతాం.
    🌺🌷🌺🏵️🌷🌺🏵️🌷🌺🌸🏵️🌸🌺🌸
    కరచరణ కృతం వాక్కాయ జంకర్మజంవా
    శ్రవణనయనజం వామానసంవా పరాధం
    విదిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ
    జయజయ కరుణాబ్ధే శ్రీప్రభోసాయినాధ

    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
    రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై🙏🌹🙏

    ReplyDelete
  2. It is wonderful.we must trust in baba only not grahas.we must change our thinks about baba.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. sai cure my son health
    always be with him

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete
  6. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhāvyā srēē

    ReplyDelete
  7. Haa email emanna ikkada ivva galara na life asalu emi ardam kavatla entha hardwork chesina no use.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo