సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నేను (శ్రీ అనంత జయదేవ్ చితాంబర్) ప్రత్యక్షంగా దర్శించుకున్న శ్రీసాయినాథ్ మహరాజ్.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అహ్మద్‌నగర్ నివాసియైన శ్రీఅనంత జయదేవ్ చితాంబర్ చిన్నతనంలోనే శ్రీసాయిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్యశాలి. వీరి తండ్రిగారైన శ్రీజయదేవ్ చితాంబర్ శిరిడీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 1912 సంవత్సరం నుండి 1927 సంవత్సరం వరకు పనిచేసారు. ఈ విద్యాశాలలోనే అంతకు పూర్వం మాధవరావు దేశ్‌పాండే (షామా) అధ్యాపకునిగా పనిచేసారు. అందువలన శ్రీఅనంత చితాంబర్‌గారి బాల్యం అంతా సాయి సమక్షంలోనే గడిచింది. ఆ సమర్థ సద్గురుని ప్రత్యక్ష సన్నిధి ప్రభావం పసిమనసులను కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో శ్రీఅనంత్‌గారు అందించిన మధురస్మృతుల ద్వారా తెలుసుకోవచ్చు. 1975 సంవత్సరంలో సాయిలీలా మాసిక్ (మరాఠీ)లో తన స్మృతులను ఉటంకిస్తూ శ్రీఅనంత్‌గారు వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా అనువదించి సాయిపథం పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాము.

- ఎడిటర్: పూజ్యశ్రీ  సాయినాథుని శరత్‌బాబూజీ.
శ్రీఅనంత జయదేవ్ చితాంబర్

నాకు 15 నెలల వయస్సున్నప్పుడు (1912వ సంవత్సరంలో) మా తండ్రిగారికి శిరిడీకి బదిలీ అయ్యింది. అప్పటినుండి 1927 వరకు శిరిడీలోని ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టరుగా సుమారు 14 సం||లు మా తండ్రిగారు పనిచేసారు. ఆ పాఠశాల మారుతి మందిరానికి సమీపంలో ఉండేది. నా బాల్యం అంతా శిరిడీలోనే గడిచిపోయింది. శ్రీసాయిబాబా 1918లో దేహత్యాగం చేసేనాటికి నా వయస్సు 8 సంవత్సరాలు. అంటే పూర్తిగా ఊహ తెలియని బాల్యదశ కాదు. నాకు 7-8 సంవత్సరాల వయస్సున్నప్పుడు నేను శ్రీసాయినాథ్ మహరాజ్‌తో గడిపిన క్షణాలు పూర్తిగా ఈరోజుకు కూడా గుర్తున్నాయి. ప్రతిరోజు నియమంగా ద్వారకామాయికి వెళ్ళి, ఆయన పాదాలమీద నా శిరస్సు ఉంచి నమస్కరించుకోవడం, అక్కడ జరిగే ఆరతులలో పాలుపంచుకుని ఆరతి పాటలు పాడటం నాకు అలవాటుగా ఉండేది. బాబా గ్రామంలో భిక్ష చేయడం, భక్తులకు దర్శనం ఇవ్వడం, లెండీకి వెళ్ళి తిరిగిరావడం లాంటి ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఆయన తమ సన్నిహిత భక్తులతో కలిసి ద్వారకామాయిలో కూర్చోవడం, చిలుము త్రాగడం మొదలైన దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతున్నాయి.

శ్రీదాసగణు మహరాజ్ ఆధ్వర్యంలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో శ్రీతుకారామ్ బువా ఆజ్‌గావ్‌కర్ చేసిన కీర్తన వినడం ఈరోజుకూ నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు శ్రీ బువాగారి వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు ఉండవచ్చు! (శ్రీతుకారామ్ బువాగారి మనవడు శ్రీధర్మాధికారి ప్రస్తుతం(1975) శిరిడీ సాయిబాబా సంస్థాన్‌లో పూజారిగా పనిచేస్తున్నారు.) శ్రీసాయినాథ్ మహరాజ్‌తో సన్నిహితంగా మెలిగిన భక్తులను నేను నా బాల్యంలోనే చూచాను. శ్రీయుతులు కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్, మాధవరావ్ దేశ్‌పాండే, తాత్యాకోతేపాటిల్, గోపాలరావు బూటీ, అబ్దుల్ బాబా, ధాబోల్కర్, పురంధరే, దాసగణు మహరాజ్ లాంటి భక్తులను సన్నిహితంగా దర్శించుకునే మహాభాగ్యం నాకు దొరికింది.

ఈ మహాభక్తులందరూ శ్రీసాయితో కలిసి  ద్వారకామాయిలో కూర్చోవడం, చావడిలో శేజారతిలో పాల్గొనడం మొ||న దృశ్యాలను ఇప్పుడు కూడా నా మనఃచక్షువులు దర్శనం చేసుకుని నన్ను కృతార్థుని చేస్తున్నాయి. ఇదెలా లభ్యమయింది? అనేక జన్మల సుకృత ఫలితంగా శ్రీసాయి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారేమో! నేను ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్న బాలుడిని. కాని నేను చేసుకున్న బాబా ప్రత్యక్ష దర్శనం ఫలితంగా, బాబా ఇచ్చిన ఆశీర్వాదం నా మనస్సులో ముద్రించుకుపోయినందువలన నేను ఎప్పటికీ పై సంఘటనలను మరువలేను. అవి చిరస్మరణీయమైనవి కావడం కోసమేనేమో బాబా దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకునే మహద్భాగ్యం బాబా నాకు ప్రసాదించి, ఎప్పటికీ ఆరని మధురస్మృతుల జ్యోతిని నా హృదయంలో వెలిగించారు. అది కేవలం శ్రీసాయికృప.

శిరిడీలో అవతరించి, అక్కడనుండి జగదోద్ధారణ గావిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తూ, వారి దుఃఖాలను హరించి వారి మనసులకు శాంతి ప్రసాదించారు శ్రీసాయిబాబా. ఇప్పటికీ సమాధిరూపంలో ఎందరో భక్తుల అనుభవాల సాక్షిగా శిరిడీలో నిత్యసత్యులై ఉన్నారు. సర్వహృదయాంతరస్థుడైన బాబా ప్రతి భక్తునిపై అనుగ్రహాన్ని ప్రసరింపచేసి, అద్భుత  అనుభవాలను ప్రసాదిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన దేహత్యాగం చేసి ఇప్పటికి 57 సం||లు కావస్తున్నప్పటికీ ఆయన సమాధిరూపంలో శిరిడీలోనే ఉన్నారన్నది నిత్యసత్యం. ఆయన కాలానికి అతీతుడు. మనల్ని వదలి ఆయన ఎక్కడకు వెళ్ళగలరు? ఆయన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆయనను స్మరించినంతనే వారితోనే బాబా ఉన్నారన్న విషయం అవగతమవుతుంది. వారి రక్షణకు ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయనపై మనకు గల భక్తి, ప్రేమలకు ప్రతిఫలం వెనువెంటనే లభిస్తుంది.

మా తల్లిగారు ప్రతిరోజు బాబా దర్శనం చేసుకునేవారు. ప్రతిసారి బాబా చరణాలపై పసుపు కుంకుమలను అద్ది నమస్కారం చేసుకునేవారు. ఒకసారి బాబాను “పసుపు, కుంకుమలను మీ పాదాలకు పూస్తే మీకు ఇష్టమేనా?” అని ఆవిడ అడిగింది. “భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే” అని బాబా సమాధానం ఇచ్చారు. బాబా అప్పుడప్పుడు మా తల్లిగారిని దక్షిణ అడిగేవారు. అప్పుడు ఆమె మా తండ్రిగారి వద్దనుండి నాలుగు అణాలు తీసుకుని బాబాకు దక్షిణ సమర్పించేవారు. మా తల్లిగారు బాబాకు చేసుకున్న సేవాఫలితంగా ఆమె అవసానదశలో ఆమె చిత్తం స్థిరమై, రామనామాన్ని జపిస్తూ ప్రాణం విడిచారు. 

బాబా ఆగ్రహం -భక్తులకు అనుగ్రహం!

బెత్తం దెబ్బకు పెరిగిన బత్యం!

మా తండ్రిగారికి కూడా బాబాపై అపారమైన భక్తిశ్రద్ధలుండేవి. ఆయన బాబాను సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించేవారు. ఒకరోజు ఉదయం ఆరతి అనంతరం బాబా చావడినుండి మశీదుకు బయలుదేరుతూ, తమ ప్రక్కనేవున్న మా తండ్రిగారి తలమీద సటకా (చేతికఱ్ఱ)తో కొట్టారు. మా తండ్రిగారి తలమీద చిన్న గాయం అయింది. కానీ, ఆయన దానిని బాబా ప్రసాదంగా స్వీకరించారు. బాబా ఊదీని ఆ గాయంపై పూయడంతో ఆ గాయం మానిపోయింది. తరువాత 15 రోజులలోనే మా తండ్రిగారి జీతం నెలకు రూ 15/- చొప్పున పెరిగింది. బాబా కోపాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించేవారు. దాన్ని నేను స్వయంగా చూసాను. బాబా కోపం భక్తుల ఉద్ధరణకే అన్న మాట అక్షరసత్యం.

శ్రీసాయి స్వయంభువు. ఆయన తమ సమాధి అనే అఖండజ్యోతి రూపంలో వెలుగుతూ సర్వమానవాళికి అనుభవాలనే ఆనందపు వెలుగులను సదా పంచి ఇస్తున్నారు. శ్రీసాయి సర్వశ్రేష్ఠమైన పరమాత్మ స్వరూపం. శ్రీమద్భగవద్గీతలో పరమపురుషుడు, సర్వగత పరబ్రహ్మల గురించి చేసిన వర్ణనలకు శ్రీసాయి సజీవసాక్ష్యమనే విషయం ఎందరో భక్తులకు అనుభవైకవేద్యం. బాల్యంలో దర్శించుకున్న ఆయన రూపం గుర్తుకు వచ్చినప్పుడు నేను మైమరచిపోతాను. ఆయన తత్త్వాన్ని ఆకళింపు చేసుకుని, ఆయన కృపాభిక్ష లభించే మార్గంలో సదా వసించాలనే సద్బుద్ధిని శ్రీసాయియే ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

'జయామని జైసాభావ, తయా తైసానుభవ' - అనే ఆరతి వాక్యాలు శ్రీసాయిభక్తులకు నిత్యానుభవాలు. ఏ దేవతామూర్తులను పూజించే భక్తులకైనా, వారి వారి ఆరాధ్యదైవాల రూపంలో బాబాయే దర్శనమిచ్చి, సకల దేవతాస్వరూపం తానే అను దృష్టాంతమిచ్చినట్లు ఎందరో భక్తుల అనుభవాలు నేను విన్నాను. స్వయంగా ఆ అనుభవాన్ని పొందాను. ఆ అనుభవమే మనకు జ్ఞానప్రకాశమిచ్చి మార్గదర్శకత్వం వహిస్తుంది. శ్రీసాయిని ఆశ్రయించిన తరువాత, అన్యయోగాలతో పనిలేదు. కారణం- సాక్షాత్తూ ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్ముడు కనుక.

శ్రీసాయి కృపవలన నాకు, మా కుటుంబానికి వచ్చిన అనుభవాలను ప్రచురించడానికి అనేక పేజీలు కావాలి. అనేక మతధర్మాలకు చెందిన భక్తులు శ్రీసాయిబాబా దర్శనానికి రావడం నేను స్వయంగా చూసాను. ఈరోజుకి కూడా అలానే వస్తున్నారు. ఇది బాబాయొక్క అగమ్యమైన లీల. బాబా పాదాలవద్ద జాతి, మతం, వర్ణం లాంటి వాటికి చోటులేదు. ఎవరైనా కొంతమంది కేవలం కుతూహలంకొద్దీ అయినా సరే ఆయన దర్శనం చేసుకుంటే, వారి పూర్వసంస్కారాలు మాయమై బాబాపై అపారమైన శ్రద్ధ కుదిరేది. శ్రీసాయిబాబా స్వరూపం అత్యంత గంభీరమైనది. ఆయన గంభీరత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. దర్శనానికి వచ్చే భక్తులు ఏ ధర్మానికి లేదా మతానికి చెందినవారైనా, ఉదాహరణకు హిందూ సన్యాసియైనా, ముస్లిం ఫకీరైనా, వారు శ్రీసాయిని దర్శించిన మరుక్షణం, వారెవరో వారే మరిచిపోయేవారు. శ్రీసాయిపట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే వారు తమకు తెలియకుండానే సచ్చిదానంద సద్గురుడైన ఆ సాయి చరణకమలాలకు శరణాగతి చెందుతారు. వారివారి మతధర్మాలపై వారికుండే అభిమానం (దురభిమానం) శ్రీసాయి సన్నిధిలో దూరంగా పారిపోతాయి.

శ్రీసాయిని ముస్లిం అందామంటే ఆయన నుదుటిమీద త్రిపుండ్రం కనిపించేది. ఎదురుగా అఖండ అగ్నిగుండం ఉండేది. భక్తులను “అల్లా అచ్ఛాకరేగా!” అంటూ ఆశీర్వదించే ఆ ఘటనాఘటన సమర్థునికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆరతులు జరిగేవి. ఈ రోజుకి కూడా జరుగుతూనే వున్నాయి. ఆయన హిందువా? ముస్లిమా? అనే విషయం ఈనాటికీ ఎవరికీ అంతుబట్టలేదు. ముస్లిములు ఆయన ముందు నమాజ్ చదివితే, వేదపండితులు వేదాన్ని వల్లించేవారు. ఇదంతా నేను చూసింది చెబుతున్నాను, విన్నది కాదు. పరబ్రహ్మతత్వం సగుణసాకారరూపంలో అవతరించిన ఆ రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవడం నా మహద్భాగ్యం. బ్రహ్మీస్థితి, జీవన్ముక్తావస్థ, విదేహిఅవస్థలాంటి వాటిని ఎవరయినా చిత్రించగలరా? ఆ ప్రశ్న శ్రీసాయిని దర్శించుకుంటే అదృశ్యమవుతుంది. శ్రీసాయిలాంటి సమర్థ సద్గురుని దర్శించుకుని ఆయనను సదా ధ్యానించుకోవడం వలన ఆయన స్వరూపం ఏమిటో బోధపడుతుంది. ఇది ఆయన యొక్క నిజమైన లీల. అటువంటప్పుడు శ్రీదాసగణు మహరాజ్ 'శిరిడి మాఝే పండరీపూర్, సాయిబాబా రమావర' అని వ్రాయడంలో ఆశ్చర్యం ఏముంది? శ్రీసాయినాథ్ మహరాజ్ ప్రత్యక్ష అవధూత. ఆరతిగీతంలో రచించిన 'దత్తావధూత, సాయి అవధూత' అనే వాక్యం అక్షరసత్యం. శ్రీదత్తదేవులు సద్గురు సాయిబాబా స్వరూపంలో శిరిడీలో నివసించారు.

ఆనాటి సంఘటనకు గుర్తుగా ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిన పులి విగ్రహం.

శ్రీసాయి మానవాళిని ఉద్ధరించడమే కాక తమ దర్శనానికి వచ్చిన ఒక పులిని కూడా ఆయన ఉద్ధరించారు. ఆ పులి ద్వారకామాయిలో బాబా ముందు మరణించడం శిరిడీలో నేను ప్రత్యక్షంగా చూసాను. బాబా నాపై కురిపించిన అనుగ్రహవర్షం వలననే జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు లభించింది. ఆ సంఘటన ఇలా జరిగింది.

ఒకరోజు బాబా ద్వారకామాయిలో మధ్యాహ్నహారతికి ముందు ఉదయంవేళలో మసీదు కఠడా (చేపట్టు) పై చేయివేసి కూర్చుని ఉండగా, క్రిందిప్రాంగణంలో ఎద్దులబండిలో కట్టి తీసుకువచ్చిన పులి తన ఆటను ప్రదర్శించింది. ఆట అయిపోగానే దానిని లోపలికి తీసుకువెళ్ళి బాబా చరణాలపై దాని శిరస్సు ఉంచాల్సిందిగా అక్కడ కూర్చుని ఉన్న భక్తులు ఆ పులి యజమానికి సలహా ఇచ్చారు. అందువలన ఆ యజమాని పులిని బాబా వద్దకు తీసుకువెళుతుండగా, దర్శనం కోసం మొదటిమెట్టు మీద మనిషిలాగానే తల ఆనించి నమస్కరిస్తుండగా, ఏమి ఆశ్చర్యం! పులి ఏరకమైన వేదన లేకుండా మరణించింది. బాబా దానిని ఆ దేహం నుండి విముక్తురాలను చేసారు. పులి చనిపోవటం చూసి, దానిని ఆటలాడిస్తూ పొట్టపోసుకునే దాని  యజమాని పెద్దపెట్టున ఏడవటం మొదలుపెట్టాడు. 'అరే, ఆ పులికి ముక్తి లభించింది. అది ఎంతో అదృష్టవంతురాలు. ఏడవవద్దు!' అని భక్తులు అతనిని ఓదార్చసాగారు. ఆ సమయంలో శ్రీసాయిని ఎవరూ, ఏమీ అడగలేకపోయారు. ఆ గాంభీర్యము, ఆ కరుణ ముల్లోకాలలో ఎక్కడ వెదికినా కనిపించదు. ఆయనవైపు చూస్తే ఏర్పడే ఆ భావం అనిర్వచనీయం. ఆ దృశ్యం చూసినపుడు నా వయస్సు చిన్నది కావడం వలన దానర్థం నాకప్పుడు బోధపడలేదు.

ఇప్పుడు నా మనస్సులో (ఆ పులిలాగే) శ్రీసాయి దర్శన భాగ్యం పొందుతుండగా తనువు చాలిస్తే ఎంత బాగుండునో కదా అని అనిపిస్తుంది. శ్రీసాయినాథ్ మహరాజ్ స్వయంగా పరమధామము. ఆయనే పురుషోత్తముడు, పరమాత్మ. భవసాగరాన్నుండి నన్ను తరింపచేసి, సదా నా హృదయంలో వసించే నా సద్గురువుకు వివేకపూర్వకమైన నమస్కారం చేస్తూ, ఆయన మహిమకు జయజయకారాలర్పిస్తూ, ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

శ్రీఅనంత జయదేవ్  చితాంబర్ (1976 మార్చి, సాయిలీలామాసిక్  సౌజన్యంతో) 

శ్రీసాయి సన్నిధిలో కన్నుమూసిన పులి గురించిన శ్రీచితాంబర్ జ్ఞాపకాలకు, యీ సంఘటన గూర్చి అధికారిక సాయిచరిత్రలలో గ్రంథస్థం చేయబడ్డ వివరాలకు కొంచెం తేడా కనిపిస్తున్నది. శ్రీ సాయిసచ్చరిత్రలో గ్రంథస్థం చేయబడిన ఈ లీల యొక్క పూర్తి వివరాలతో గూడిన వ్యాసం రేపటి భాగంలో.....

సోర్సు: సాయిపథం ప్రథమ సంపుటం.

5 comments:

  1. మీరు ఈ సమాచారం ఎక్కడ సేకరించారు చాలా బాగుంది.అంత పాత బుక్స్ మీ దెగ్గర వున్నాయా

    ReplyDelete
    Replies
    1. sai patham old magzines nundi sai. vatini bound books gaa chesi 5 volumes chesaru. shirdi loni sai patham lo andubatulo unnayi sai

      Delete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo