సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అండగా ఉంటూ పని పూర్తి చేయించారు బాబా.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయి భక్తురాలి అనుభవం. 

సాయిబంధువులందరికీ నమస్కారం!

ఒక ముఖ్యమైన విషయంలో ముందుగా బాబా నన్ను హెచ్చరించడమే కాకుండా నాకు తమ సహాయాన్ని అందిస్తూ సకాలంలో మా ప్లాట్స్ అమ్మకం జరిగేలా చేసారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

అసలు అనుభవం చెప్పే ముందు మేము కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి చెప్పాలి. మాకు ఒక సిటీలో రెండు ప్లాట్స్ ఉన్నాయి. మేము వాటిని కొనే సమయంలో మధ్యవర్తులు క్రమబద్ధీకరించిన (నియమాలకనుకూలంగా) పత్రాలంటూ నకిలీ పత్రాలు మాకిచ్చి మమ్మల్ని బాగా మోసం చేసారు. అదృష్టంకొద్దీ ఆ సమస్య తప్పితే వేరే ఇతర సమస్యలు లేవు. అసలు పత్రాలు సంపాదించుకోవడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. తరువాత ఆ రెండు ప్లాట్స్ అమ్మివేయాలని నిర్ణయించుకున్నాము. బాబా దయవలన వాటిని కొనేందుకు ఒకరు ఆసక్తి చూపడంతో రిజిస్ట్రేషన్ పని మీద మేము ఆ సిటీకి బయల్దేరాము. ప్రయాణసమయంలో నాకొక దుస్స్వప్నం వచ్చింది. అందులో నేను బాబా మందిరానికి వెళ్ళగా, అకస్మాతుగా అక్కడున్న బాబా విగ్రహం అదృశ్యమైపోయి ఆ స్థానంలో ఒక పాము కనిపించి, నన్ను వెంబడించి కాటు వెయ్యాలని ప్రయత్నిస్తోంది. దాంతో నాకు ఆందోళనగా అనిపించింది. ఆ తరువాత మేము బస చేసిన హోటల్‌లో కూడా మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. తరువాత మేము రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. మేము సంతకాలు చేసాక, ప్లాట్స్ కొనే వ్యక్తి మాకు డబ్బులు కూడా ఇచ్చిన తరువాత ప్లాట్స్‌కి సంబంధించిన లింక్డ్ డాక్యుమెంట్స్ లేవని గుర్తించాడు. కానీ మాకు అప్పటికి లింక్డ్ డాక్యుమెంట్స్ గురించి అసలేమీ తెలియదు. నిజానికి మేము ముందుగానే ప్లాట్స్‌కి సంబంధించి మా వద్ద ఉన్న పత్రాలన్నీ వాళ్ళకి ఇచ్చాం కానీ, వాళ్ళప్పుడు సరిగా చూసుకోకపోవడం వలన మాకు సమస్య ఎదురైంది. కొనుగోలు చేసే వాళ్ళలో ఒక వ్యక్తి, "ఇక రిజిస్ట్రేషన్ జరగదు. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాం. మా దగ్గర తీసుకున్న పైకం మొత్తం తిరిగివ్వండి" అని మాకు నేరుగానే చెప్పేసాడు. కొనడానికి వచ్చిన మరో వ్యక్తి మాత్రం ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డాడు. మేము అతనితో, "మీరేమీ ఆందోళనపడకండి. మరలా రిజిస్ట్రేషన్ మాపేరు మీద చేసుకొని, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామ"ని అతనికి హామీ ఇచ్చాం. దాంతో వాళ్ళు మా పేరుతో రిజిస్టర్ చెయ్యడానికి ముందుకు వచ్చారు. మొదటివ్యక్తికి 60,000 రూపాయలు ఇచ్చి మా పత్రాలు వెనక్కి తీసుకున్నాం. ఇక మా ప్లాట్ తిరిగి మా పేరు మీదకి రావాలంటే కొద్దివ్యవధిలోనే రెండవవ్యక్తికీ మొత్తం పైకం చెల్లించాల్సి వచ్చింది. అంత పెద్దమొత్తం సమకూర్చడానికి మేము చాలానే కష్టపడాల్సి వచ్చింది. బాబా దయవలన తక్కువ సమయంలోనే ఆ మొత్తానికి ఏర్పాటు చేయగలిగాము.

అలా జరిగిన కొంతకాలానికి మళ్ళీ మేము ఆ ప్లాట్స్ అమ్మడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, ఇంకోవైపు మా బంధువులు దాన్ని అతితక్కువ ధరకి(దాదాపు సగం ధరకే) తీసుకోవడానికి చూస్తున్నారని మాకు తెలిసింది. మాకెవరి అండా లేనందున అందరూ మమ్మల్ని మోసం చేయాలని చూసారు. దగ్గర స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా అతితక్కువ ధరకే కొనాలని చూస్తుండటంతో నేను చాలా వేదన అనుభవించాను. ఆ అనుభవంతో నాకు స్నేహితులు, బంధువులు అందరిమీదా నమ్మకం పోయింది. బాబా ఒక్కరే నాకు ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు, నా మేలు కోరేవారు.

కొన్ని నెలల తరువాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మొదటిసారి రిజిస్ట్రేషన్ వరకు వచ్చి ఆగిపోయిన సందర్భంలో కొనుగోలు చేయదలచిన రెండవవ్యక్తి  స్నేహితుడు ఒకతను నాకు ఫోన్ చేసి మా ప్లాట్స్ కొనడానికి తనకి ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. అతనికి ఆ ప్లాట్స్‌కి సంబంధించిన సమస్యలన్నీ తెలుసు, అయినప్పటికీ అతను ఆసక్తి కనబరచడంతో మేము కూడా అతనికే అమ్మాలని నిశ్చయించుకున్నాం.

రిజిస్ట్రేషన్‌కి ఇంక వారముందనగా నేను సాయి ప్రశ్నావళిలో బాబాని అడిగితే, “బంధువులు, స్నేహితులు ఎవరూ నీకు సహాయం చేయరు. నీ పనిని నీవే సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది సాధించాలంటే శ్రీసాయిని గుర్తుంచుకో!” అని వచ్చింది. బాబా నుండి అలా జవాబు రావడంతో ఆ సమయంలో నేను చాలా ఆందోళనపడ్డాను. కానీ నాకు ఎదురు కాబోయే సమస్యల గురించి ముందుగా బాబా సూచిస్తున్నారని నేనప్పుడు తెలుసుకోలేకపోయాను. తరువాత నాకొక స్వప్నం వచ్చింది. కలలో నేను మా మేనేజరుతో, "మా ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాల్సి ఉంది. అందువలన రెండురోజులపాటు ఇంటి నుండి వర్క్ చేసుకొనేందుకు అనుమతి ఇవ్వండ"ని అడుగుతున్నాను. ఆ స్వప్నం ద్వారా రిజిస్ట్రేషన్ సాఫీగా జరుగుతుందని బాబా హామీ ఇచ్చారు. కానీ ఆ విషయం కూడా నాకప్పుడు అర్థం కాలేదు.

నేను ముందుగా రిజిస్ట్రేషన్ జరగాల్సిన సిటీలో ఆన్లైన్ ద్వారా హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆరోజు వేకువఝామున ఫ్లైట్ లో సిటీ చేరుకున్నాను. మా అమ్మ, మా బంధువులు కారులో సిటీకి బయల్దేరారు. వాళ్ళు రాత్రికి తిరిగి వెళ్లిపోవాలని ముందుగా నిర్ణయించుకొన్నారు. నేను హోటల్‌కి వెళ్ళే మార్గంలో చుట్టుపక్కల అంతటా బాబా దర్శనమిస్తూనే ఉన్నారు. చివరికి హోటల్‌లో కూడా పెద్ద బాబా ఫోటో ఉంది. కానీ హోటల్‌లో నాకు ఎదురయిన ఒక చేదు అనుభవం వల్ల వెంటనే నేను ఆ హోటల్ నుండి బయటకి వచ్చేసి, దగ్గరలో మరో హోటల్‌కి వెళదామని ఆటో కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఒక్క ఆటో కూడా రాలేదు. నేను కొంతమంది బంధువులకి ఫోన్ చేసినా, ఎందుకోగాని ఫోన్లు కలవలేదు. నిస్సహాయస్థితిలో రోడ్డుపై నిలబడి ఉండగా కొంతసేపటికి ఒక ఆటో అతను నాకు హోటల్ చూపించడానికి ముందుకి వచ్చాడు. కానీ ఎక్కడా రూమ్స్ ఖాళీ లేవు. ఫోటోల రూపంలో బాబా దారంతా కనిపిస్తూనే ఉన్నారు. నేను "బాబా! ఎలా అయినా సహాయం చెయ్యండి" అని వేడుకుంటూనే ఉన్నాను. కానీ సిటీ అంతా తిరిగినా రూమ్ దొరకక మానసికంగా చాలా అలసిపోయాను. చివరికి బాబా దయవలన సిటీ బార్డర్ లో ఒక హోటల్ కనిపించింది. వెంటనే నేను మొదట బుక్ చేసిన హోటల్ రూమ్ కాన్సిల్ చేశాను. అదృష్టం కొద్దీ మొత్తం డబ్బులు రీఫండ్ నాకు వచ్చేసాయి. మా అమ్మ వాళ్ళు సిటీ చేరుకొని, రిజిస్ట్రేషన్ ఆఫీసు వైపు వెళ్తున్నారు. నేను చాలా దూరంలో ఉండడంతో నన్ను వాళ్ళ కారులో తీసుకొని వెళ్లే అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది.

నేను ఫ్రెష్ అయ్యి ఆటో లేదా క్యాబ్ కోసం చూస్తున్నాను. ఎందుకో నాకా సమయంలో మొదటిసారి రిజిస్ట్రేషన్ అనుకున్నప్పుడు ఎదురైన సమస్యలు గుర్తుకొచ్చి చాలా ఆందోళనగా అనిపించింది. ఆ ఆందోళనలో నేను రూమ్ తీసుకున్న హోటల్ పేరు మరచిపోయాను. అంతలో గడ్డంతో ఉన్న ఒక ముస్లిం ఆటోడ్రైవర్ వచ్చి, "ఆటో కావాలా?' అని అడిగాడు. ఆటోలో అప్పటికే ఇద్దరు వ్యక్తులు ఉండడంతో నేను 'వద్ద'ని సున్నితంగా చెప్పాను. అయినా కూడా అతను నన్ను ఆటో ఎక్కమని పలుమార్లు బలవంతం చేసాడు. కానీ నేను వద్దని చెప్పడంతో అతనక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక "అతను బాబా ఏమో! నా సహాయార్థం వచ్చారేమో!" అని నా మనసుకి అనిపించి కొంచెం బాధ కలిగింది. కానీ అప్పటికే ఆలస్యం అవుతుండటంతో ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకొని సిటీలో ఒక ప్రదేశం వరకు వెళ్లి అక్కడనుండి రిజిస్ట్రేషన్ ఆఫీసుకి ఆటోలో వెళదామని అనుకుని క్యాబ్ బుక్ చేశాను. అంతలో మొదట వచ్చిన ముస్లిం ఆటోడ్రైవర్ మరలా వచ్చి, "ఆటో ఎక్కమ"ని అడిగాడు. నేను "ఇతను నిజంగా బాబానా? లేకపోతే అతనెవరు? నన్నెందుకు తన ఆటో ఎక్కమని  బలవంతం చేస్తున్నాడు? నేను అతనిని నమ్మవచ్చా?" అని రకరకాల ప్రశ్నలతో గందరగోళంలో పడ్డాను. నిజానికి రిజిస్ట్రేషన్ ఆఫీసు సిటీ నుండి దూరంగా వుంది. అక్కడికే వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు ప్రయాణం చెయ్యడం అంత శ్రేయస్కరం కాదు. అందువలన నేను ఆటో ఎక్కడానికి అంతలా ఆలోచించాను. కానీ అతను నేను ఆటో ఎక్కేదాకా అక్కడనుండి కదిలేలాలేడని నాకనిపించింది. ఇక 'తను నా బాబానే' అని దృఢంగా విశ్వసించి, "బాబా! నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళు" అని ప్రార్థించి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తరువాత బుక్ చేసుకున్న క్యాబ్ రద్దు చేశాను. గమ్యం చేరేదాకా దారిపొడుగునా బాబా ప్రతిచోటా ఫోటో రూపంలో దర్శనమిస్తూనే ఉన్నారు. ఆటోడ్రైవర్ జాగ్రత్తగా నన్ను నా గమ్యం చేర్చాడు. అందువల్ల నేనతనికి 50 రూపాయలు అదనంగా ఇద్దామనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా నేను ఆటో దిగిన మరుక్షణం అతను 50 రూపాయలు అదనంగా ఇవ్వమని అడిగాడు. నేను సంతోషంగా అతనికి డబ్బులు ఇచ్చాను. తరువాత అతను, "మీరు ఇక్కడ పని పూర్తయ్యాక ఇంకెక్కడికైనా వెళ్తానంటే, నేను వేచి ఉంటాన"ని అన్నాడు. నేను, "అవసరం లేదు, మీరు వెళ్ళండ"ని చెప్పగా అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన మరుక్షణం “బంధువులు, స్నేహితులు ఎవరూ నీకు సహాయం చేయరు. నీ పనిని నీవే సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది సాధించాలంటే శ్రీసాయిని గుర్తుంచుకో!” అన్న బాబా మెసేజ్ గుర్తుకు వచ్చి, ఇలాంటి క్లిష్టపరిస్థితిలో బాబా మాత్రమే నా వెన్నంటి ఉండి నాకు సహాయం చేసారు. పైగా నా పని అయ్యేంతవరకు ఉండి నాకు తన సహాయం అందించేవారు. కానీ నేనే నా కోసం వచ్చిన బాబాని వెనక్కి పంపేసాను. ఏది ఏమైనా బాబా సదా మాతోనే ఉన్నారని ఋజువు చేసారు.

రిజిస్ట్రేషన్ ఆఫీసు లోపలికి వెళ్తున్నపుడు మళ్ళీ నాకు ఆందోళనగా అనిపించింది. డాక్యుమెంట్ ఆఫీసు లోపలికి వెళ్ళగానే పెద్ద ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చి మాకు అభయం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించి, బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబావలనే మేమంత దూరం రాగలిగాము. బాబా కృపే లేకుంటే మేము ఇంకా చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి వచ్చేది. మొత్తానికి బాబా కృపవలన రిజిస్ట్రేషన్ అనే పెద్ద సమస్య తీరిపోయింది. అయితే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది.

నేను బస చేసిన హోటల్ పేరు మర్చిపోయానని చెప్పాను కదా! అందువలన అక్కడికి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. ఆలోచించగా కొంచెంగా దారి గుర్తురావడంతో నేను, మా అమ్మ, మా బంధువులు కలిసి కారులో బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదు. ఇంకేమీ చేసేది లేక అడ్వాన్సుగా హోటల్ లో చెల్లించిన 2000 రూపాయలు, నా సామాన్లు అలానే వదిలేయ్యాలనే నిర్ణయానికి వచ్చేసాను. ఆ సమయంలో అమ్మ, "హోటల్ ఫోన్ నెంబర్ తీసుకోలేదా?" అని అడగడంతో నాకు ఉదయాన కాన్సిల్ చేసిన ఓలా క్యాబ్ సంగతి గుర్తుకు వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగో మొత్తానికి కాన్సిల్ చేసిన వివరాల నుండి హోటల్ పేరు తెలుసుకోగలిగాను. ఆ వివరాలతో హోటల్ కి ఫోన్ చేసి అక్కడి సిబ్బంది సహాయంతో హోటల్ చేరుకోగలిగాను. ఈ కారణం చేతనే బాబా ఓలా క్యాబ్ బుక్ చేయించి, కాన్సిల్ చేయించారని నాకర్థమైంది.

అప్పటికే బాగా పొద్దుపోవడంతో అమ్మను నావద్ద వదిలేసి, మా కజిన్ తన బ్రదర్ ఇంటికి వెళ్లారు. అమ్మ, మా కజిన్ వేకువఝామునే ఇంటికి బయలుదేరిపోదామని అనుకున్నారు. నేను మాత్రం హోటల్ నుండే వర్క్ చేసుకొని, ఆ తరువాత సిటీలోని నాకెంతో ఇష్టమైన బాబా మందిరాలు సందర్శించి బెంగళూరు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కానీ అమ్మ నన్ను తనతో నేటివ్‌ ప్లేస్‌కి రమ్మని చెప్పడంతో సందిగ్ధంలో పడ్డాను. అయితే మరోవైపు హోటల్ యజమాని ముందుగా నాకు 1700 రూపాయలకి ఒప్పుకొని, తరువాత ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని పోరు చేయడంతో అమ్మ వెళ్ళిపోయిన తరువాత నేనింకా అక్కడుంటే ఇంకెన్ని సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందో అని భయపడి నేను కూడా అమ్మతో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్లే మార్గంలో అంతా బాబా మాతోనే ఉన్నారు. కానీ సిటీలోని బాబా మందిరాలకి వెళ్ళలేకపోయానని బాధపడ్డాను. ఎందుకంటే మా ప్లాట్స్ అమ్మివేయడంతో ఇక ఆ సిటీకి వెళ్ళే అవసరం లేదు. ఏది ఏమైనప్పటికి అంతా బాబా ఇష్టప్రకారమే జరుగుతుంది.

3 comments:

  1. ఓం సాయి రామ్ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. గంగాధరMarch 20, 2024 at 5:04 AM

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ సాయినాధమహరాజ్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏 షిరిడీ సాయిబాబా కీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo