నేను సాయి భక్తురాలిని. నేను, నా భర్త ఇండియాకు చెందినవాళ్ళమయినా, ప్రస్తుతం యు.ఎస్.ఏ, పోర్ట్‌లాండ్ లోని ఒరెగాన్ లో ఉంటున్నాము. నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవం 2018 జూలై నెలలో మేము శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు జరిగింది.
జూలై నెల, ఒక వారాంతంలో పర్యటన నిమిత్తం మేము పోర్ట్‌లాండ్ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఆ పర్యటనలో చివరిరోజు ఉదయం 10 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విన్ పీక్స్ చూడటానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేముందు అటునుంచి అటే ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిపోయే ఉద్దేశ్యంతో మేముండే చోటు ఖాళీ చేసి బ్యాగులతో సహా ఆ చోటు చేరుకున్నాము. బ్యాగులు నేలపై పెట్టి, అక్కడి అందాలు చూస్తూ ఆనందంలో మునిగిపోయాము. ఆ బ్యాగుల్లోనే నా పర్సు, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కొంత క్యాష్, బాబా ఊదీ, పాస్‌పోర్ట్స్.. ఇలా చాలా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి. బ్యాగుల మీద ఓ కన్నేసి గమనిస్తూనే ఫొటోలు తీసుకుంటున్నాము. కాసేపు తరువాత హఠాత్తుగా చూసేసరికి బ్యాగులు అక్కడ లేవు. నేను గట్టిగా అరచి, అక్కడున్న ఇతర పర్యాటకులను మా బ్యాగులు ఎవరైనా చూశారా అని అడిగాము. ఒకామె, "ఒక వ్యక్తి బ్యాగులు తీసుకుని కారులో వెళ్ళిపోతున్నట్టు చూశాను" అని చెప్పి, "ఈ చోట కెమెరాలు ఉన్నాయి. మీరు వెంటనే పోలీసులకి తెలియజేయండి" అని చెప్పింది. మావారు కార్డ్స్ బ్లాక్ చేసే పనిలో బిజీ కాగా, నేను బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను."బాబా! డబ్బులు పోతే పోయాయి కానీ, నా పాస్‌పోర్ట్ తో ఆ దొంగ ఏం చేసుకుంటాడు? అతనికి దానితో పనేమీ లేదు. మాకు మాత్రం ఆ పాస్‌పోర్టులు చాలా అవసరం. ఎందుకంటే సాయంత్రం మాకు ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్ ఉంది. పాస్‌పోర్ట్ తప్ప ఇంకే ఐడెంటిటీ మా దగ్గర లేవు. ఇక్కడ లోకల్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసి, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇస్తామన్నారు. కానీ దానికి సమయం పడుతుంది. మీ కృపవలన పాస్‌పోర్ట్స్ దొరికినట్లైతే 9 గురువారాలు సాయి వ్రతం చేస్తాను" అని మొక్కుకున్నాను. నాకు ఎంత బాధగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా బాబా ఊదీ ప్యాకెట్ కూడా అందులోనే ఉండిపోయింది. దాన్ని నేను చివరిసారి శిరిడీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. దాన్ని నేను బాబా ఆశీర్వాదచిహ్నంగా భావిస్తాను. నాకు దిగులుగా ఉన్నప్పుడు ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి ఉపశమనం పొందుతాను. మేము పోలీసులకి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ, వాళ్లు "సమయం పడుతుంది. ఎంత సమయం అన్నది చెప్పలేము" అని చెప్తున్నారు. ఇంక లాభంలేదని, ఫిర్యాదు చేయడానికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. మేము పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు ఇచ్చే లోపల మాకు ఫోన్ వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎవరైతే మాకు ఆతిథ్యం ఇచ్చారో ఆ ఇంటినుండి వచ్చిన ఫోన్ అది. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే, తను "ఎవరో ఒక యువతి ఇంటికి వచ్చి మీ రెండు బ్యాగులు ఇచ్చి వెళ్ళింది" అని చెప్పారు. అసలు సంగతి ఏమిటంటే, ఆ దొంగ మా బ్యాగులు ఒకచోట విసిరేస్తే, ఆ యువతి బ్యాగులో ఉన్న పేపర్స్ ఆధారంగా ఆ అడ్రసుకి వచ్చి బ్యాగులు ఇచ్చి వెళ్ళింది. నేను ఆ విషయం పోలీసులకు చెప్తే, 'ఇది మిరాకిల్' అన్నారు. అవును, నాకు తెలుసు, అది సాయిబాబా మిరాకిల్. శాన్‌ఫ్రాన్సిస్కో చాలా పెద్ద నగరం. ఈ సంఘటనలు జరిగిన స్థలాల మధ్య చాలా దూరం ఉంటుంది. బాబా కృపవలన రెండు గంటలలోపే మేము పోగొట్టుకున్న బ్యాగులు దొరికాయి. నిజంగా ఇది అద్భుతం! మేము వెంటనే అక్కడకు చేరుకుని బ్యాగులో చూస్తే క్యాష్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. కానీ బాబా కృప వలన ఊదీ, పాస్‌పోర్ట్స్ దొరికాయి, అది చాలు. ఇక మేము సంతోషంగా శాన్‌ఫ్రాన్సిస్కో నుండి సాయంత్రం ఫ్లైట్ కి వచ్చేసాం. ఇంటికి చేరుకున్నాక మా ఫోటోలు చూస్తూనే ఆ దొంగ ఆనవాళ్ళతో ఉన్న వ్యక్తి మా వెనుకే ఉన్నాడు. మేము ఆన్లైన్ లో ఆ దొంగ గురించి ఫిర్యాదు చేసాం. కానీ నిజంగా బాబా మమ్మల్ని ఆ దారుణమైన పరిస్థితి నుండి కాపాడారు. లేకుంటే యు.ఎస్.ఏ లో పాస్‌పోర్ట్ దొరకడం, వీసా స్టాంపింగ్ చేయించుకోవడం పెద్ద తలనొప్పితో కూడుకున్న పని. నేను మ్రొక్కుకున్నట్లుగానే వ్రతం మొదలుపెట్టాను.
సాయి నమ్మ ని వారు ఏదో రూపంలో వచ్చి సహాయం చేస్తారు
ReplyDelete🕉 sai Ram
ReplyDelete