సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

హైదరాబాద్ నుండి అర్చనగారు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నా ఉద్యోగ విషయంలో అడుగడుగునా బాబా సహాయం అందిస్తున్నారు. ఇంతకుముందు అలాంటి కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కంపెనీలో రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగుని బట్టి శాలరీ పెంచి, బోనస్ ఇస్తారు. నాలుగు సంవత్సరాలనుండి నేను ఇంటినుండి పనిచేస్తుండటం వలన రేటింగ్ తక్కువ ఇస్తూ, శాలరీ పెంచట్లేదు, బోనస్ కూడా ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా ఉండేది. ఇతరులు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేక చాలా ఇబ్బందిపడేదాన్ని. 2018లో మరీ దారుణమైన రేటింగ్ ఇచ్చారు. నేను వాళ్లతో ఎందుకు ఇంత తక్కువ ఇచ్చారని గట్టిగా వాదించేదాన్ని కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నన్ను పంపేసేవారు. అయితే 2018లో నేను వర్క్ బాగా చేసినందువల్ల 2019లో బాగానే ఇస్తారని ఊహించాను. కానీ హఠాత్తుగా డిసెంబర్ నెలలో నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసి కొత్త ప్రాజెక్ట్‌లో వేశారు. దానితో కొత్త మేనేజర్, "నేను రేటింగ్ ఇవ్వలేను, మీ పాత మేనేజరే ఇవ్వాలి" అని చెప్పారు. ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడే సరిగా ఇవ్వలేదు, ఇక బయటకి వచ్చాక అసలివ్వరని నాకు బాధతో పూర్తిగా నిరాశ కలిగింది. దానికి తోడు ఇంట్లో గొడవలు. మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. అలా ఉండగా 2019 ఫిబ్రవరి 15న రేటింగ్స్ ఇచ్చారు. నాతోపాటు, ముందు ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చిన కొంతమందికి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. దానితో నాకు ఇంకా టెన్షన్‌గా అనిపించింది. తరువాత నన్ను పిలిచారు. నేను బాబా విగ్రహంతో పాటు కాల్ లో జాయిన్ అయ్యాను. "నువ్వు 2018లో బాగా చేసావు. అందరితో పోలిస్తే నీ శాలరీ చాలా తక్కువ. కానీ ఇపుడు నీ శాలరీ పెంచలేము" అని చెప్పారు. నాకు ఏమీ అర్థం కావటంలేదు. చివరికి ఆయన మీడియం రేటింగ్ ఇచ్చి, కొంచెం శాలరీ పెంచి, బోనస్ కూడా ఇచ్చారు. ఆశ్చర్యం! కాల్ అయ్యాక నా సీటు దగ్గరకి వస్తుంటే, మూడుచోట్ల మూడు బాబా ఫొటోలు కనిపించాయి. నేను తరుచూ వెళ్లే దారే అది. కానీ నేనెప్పుడూ అంతకుముందు ఆ మూడు బాబా ఫోటోలను చూడలేదు. దానితో నాకు, 'ఈ రేటింగ్, బోనస్ ఆయన దయవల్లే' అని అర్థమైంది. ఒకవేళ దారుణమైన రేటింగ్ ఇస్తే, కొత్త మేనేజర్ దగ్గర నాకసలు విలువ ఉండేది కాదు. అమ్మలా బాబా నా మనస్సునెరిగి నన్ను క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడారు.

రెండవ అనుభవం:

నాకు బాధ వచ్చినా, ఆనందం వచ్చినా పంచుకోవటానికి బాబా ఉన్నారని నా నమ్మకం. కొన్ని విషయాలు మన సన్నిహితులకి కూడా చెప్పుకోలేము. కానీ సర్వం తెలిసిన బాబాకి మన మనసు కూడా తెలుసు. ఇంట్లో గొడవల కారణంగా మనశ్శాంతి ఉండేదికాదు. నన్ను అత్తగారు వాళ్ళు చులకన చేయటం వలన బయటవాళ్ళు కూడా లెక్కలేనట్లు మాట్లాడేవారు. అది నాకు చాలా కష్టంగా అనిపించి బాధపడేదాన్ని. కొన్నిసార్లు పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈమధ్య వారి మాటలు మరీ శృతి మించిపోవడంతో చాలా బాధపడ్డాను. కనీసం అమ్మా వాళ్ళకి కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒకరోజు పూజ చేస్తూ, "బాబా! నేను మీ కూతురినే అయితే నేనిలా బాధపడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండేవారా? చూడండి నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? మీ కూతురు బాధపడుతుంటే పట్టించుకోరా?" అని నా బాధలు చెప్పుకున్నాను. కొంతసేపటికి ఆఫీసుకి వెళ్తూ, దారిలో గుడిలో బాబా దర్శనం చేసుకుని వెళ్తుంటే, చాలా ట్రాఫిక్ జామ్ ఉంటే వేరే మార్గంగుండా వెళ్తున్నాను. హఠాత్తుగా ఒక కారు వెనుకభాగం చూసి ఆశ్చర్యపోయాను. ఆ కారు వెనుక భాగంపై ఒక బాబా బొమ్మ, దాని కింద 'తల్లి దీవెన' అని వ్రాసి ఉంది. అలా చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. అప్పటికి కొంతసేపటి క్రితమే పూజలో, "నేను నీ కూతుర్నే అయితే ఇలానే చూస్తావా?" అని బాబాని అడిగాను. అంతలోనే ఆయన, "నేను నీ తల్లి స్థానంలోనే ఉన్నాను" అని చెప్పారు. "లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!"

మూడవ అనుభవం:

అమ్మలా బాబా చూపే ప్రేమ గురించి చెపుతూ ఉంటే చిన్ననాటి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. అదేమిటంటే, నా చిన్నపుడు, బాబా గురించి అంతగా తెలియని సమయంలో ఒకసారి బాబాకోసం ఉపవాసం ఉన్నాను. ఆరోజు 9 గంటల సమయంలో బజ్జీలు తినాలనిపించింది. కానీ ఆ సమయంలో నాన్నని బయటకి పంపడం ఇష్టంలేక ఊరుకున్నాను. 10 గంటల సమయంలో నలతగా ఉందని అమ్మ పడుకున్నారు. నాకేమో బాగా ఆకలిగా ఉన్నా తనని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను. హఠాత్తుగా అమ్మ లేచి బయటకు వచ్చి, "అమ్మాయికి ఆకలి వేస్తుంటుంది, వెళ్లి బజ్జీలు తీసుకుని రండి" అని మా నాన్నతో చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే నాన్న వెళ్లి నాకోసం బజ్జీలు తెచ్చారు. కానీ ఆ వయస్సులో నాకు తెలియలేదు, నా సాయితల్లి అమ్మతో అలా చెప్పించి నా ఆకలి తీర్చిందని. "లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!"

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo