బాబా విగ్రహం వెనుక దాగివున్న లీల - మొదటి భాగం.. అక్టోబర్ నెలలో ప్రచురించాం. దానికి సంబందించిన మరికొంత సమాచారం లభించడంతో రెండవ భాగంగా ఈరోజు ప్రచురిస్తున్నాము. చదివి ఆనందించండి....
1954వ సంవత్సరంలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని చెక్కుతున్న బాలాజీ తాలిమ్ తన పనివాళ్ళతో చివరిదశ పనులు చేయిస్తున్నారు. అయితే ఆ చివరి సమయంలో సాయిబాబా విగ్రహం యొక్క ఎడమ మోకాలి క్రింది భాగంలో కొంచెం గాలి చేరినట్లు (ఒక చిన్న గాలిబుడగ ఉన్నట్లు) గుర్తించారు. అది తొలగించాల్సిన అవసరం వచ్చింది. కానీ పూర్తవుతున్న స్థితిలో విగ్రహంనుండి గాలి ఉన్న రాతి భాగాన్ని తొలగించాలంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లే. ఎందుకంటే, ఆ భాగంతో పాటు దాని చుట్టూ ఉన్న భాగం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పోనీ అలా ఉంచేద్దామంటే, విగ్రహం పగిలిపోయి ఇక పూజించడానికి పనికిరాకుండా పోతుంది. అందువలన బాలాజీ తాలిమ్ గాలి చేరుకున్న భాగాన్ని తీసివేయడానికి భయపడి ఏమి చేయాలో అర్థంకాక పని ఆపివేశాడు. కానీ తన శ్రమ, సమయం అంతా వృధా ఐపోతుందని చాలా ఆందోళనలో పడ్డాడు. ఆ స్థితిలో, "బాబా! నా మీద కరుణ చూపండి. మీ మూర్తి మొత్తం తయారుగా ఉంది. దయచేసి కరుణ చూపండి బాబా!" అని ప్రార్థించాడు. మరుక్షణంలో, "బాలాజీ! కొనసాగించు" అని ఒక కంఠధ్వని వినిపించింది.
వెంటనే తాలిమ్, "పని కొనసాగించండి. గాలి చేరుకున్న రాతిభాగాన్ని చెక్కి తొలగించండి" అని పనివాళ్లను ఆదేశించాడు. కానీ పనివాళ్ళు మోకాలి భాగమంతా పడిపోతుందన్న భయంతో పని చేయడానికి నిరాకరించారు. ఇక తప్పనిసరై, స్వయంగా బాలాజీ భయపడుతూనే ఉలిని, సుత్తిని చేతిలోకి తీసుకుని, "బాబా! సహాయం చెయ్యండి" అని ప్రార్థిస్తూ మోకాలి క్రింద ఉన్న అదనపు భాగంపై ఒక చిన్న దెబ్బ వేసాడు. ఆశ్చర్యం! అద్భుతం! ఆ అదనపుభాగం మాత్రమే క్రింద పడింది, మిగతా బాబా విగ్రహం చెక్కు చెదరకుండా వుంది. అది చూసిన అతను కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలుతుండగా బాబా ముందర సాష్టాంగపడ్డాడు. తరువాత పట్టలేని ఆనందంతో నృత్యం చేస్తూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. అంతటి అద్భుతమైన సాయి లీలను బాలాజీ పొందాడు.
పూర్తైన 5.5 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఉత్సాహంతో గ్రామంలో ఉరేగిస్తూ వేడుక చేసారు. సజీవకళ ఉట్టిపడుతున్న బాబా విగ్రహాన్ని చూసి, బాబాను సజీవంగా ఉన్నప్పుడు దర్శించుకున్న స్వామి శ్రీసాయిశరణానంద, లక్ష్మీబాయి వంటి భక్తులు బాబా విగ్రహరూపంలో తిరిగి వచ్చారని ఎంతగానో ఆనందించారు.
1954 అక్టోబర్ 7, విజయదశమి రోజున పాలరాతితో తయారుచేయబడిన సాయిబాబా సజీవ మూర్తిని సమాధి వెనుక పశ్చిమభాగంలో ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వామి సాయిశరణానంద చేతులమీదుగా నిర్వహించారు.
బాబా విగ్రహాన్ని తయారుచేస్తున్న సమయంలో ఒకసారి శ్రీ బాలాజీ తాలిమ్‌కు బాబా దర్శనమిచ్చి, "పనిని పూర్తి చెయ్యి, భవిష్యత్తులో నువ్వు ఏ విగ్రహాన్నీ చేయవు" అని చెప్పారు. అందువలన తాలిమ్ బాబా విగ్రహం చేసిన తరువాత మరే విగ్రహం చెయ్యలేదు. చివరిగా తాలిమ్ తన 82 సం౹౹ వయస్సులో 1970, డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.
🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me