కొంకణదేశం నుండి శిరిడీ వెళ్ళిన ఒక కుటుంబం బాబాను సేవించుకొన్నారు. తిరుగు ప్రయాణమై శలవు తీసికొనేందుకు మసీదుకు వెళ్ళిన వారితో సాయి, “మీరు ప్రయాణిస్తున్న రైలుపెట్టెలోకి ఎక్కి, మీ దగ్గరకు వచ్చి, 'మీ బిడ్డను వడిలో కూర్చోబెట్టుకొని నాకు ఒక జానెడు స్థలం ఇవ్వగలరా?' అని అడిగిన వానికి ఇదిగో! ఈ ఊదీ పొట్లాన్ని అందజేయండి” అని చెప్పారు. ఆ కుటుంబ పెద్ద ఆ ఊదీ పొట్లాన్ని అందుకొని భద్రపరిచాడు. రైల్లో ప్రయాణిస్తున్న ఆ కుటుంబీకులు బాబా చెప్పిన సంఘటన కొరకు ఎదురు చూడసాగారు. చాలాకాలం గడిచింది. మెయిల్ కళ్యాణ్ స్టేషన్ దాటింది. వాళ్ళు దిగవలసిన చోటు దగ్గర పడింది. అప్పటివరకు బాబా సూచించిన సంఘటన జరుగలేదు. ఎవ్వరూ వచ్చి జానెడు స్థలం కోరలేదు!
ఠాణా స్టేషన్ నుండి మెయిల్ బయలుదేరి పోతూవుండగా హడావుడిగా ఒక ప్రయాణీకుడు వాళ్ళున్న పెట్టెలోకి ఎక్కి వాళ్ళ దగ్గరకు వచ్చి, “మీ బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకొని, నాకు ఒక జానెడు స్థలం ఇవ్వగలరా?” అని నమ్రతగా అడిగాడు. ఆ కుటుంబీకులలో చైతన్యం కలిగింది. ఎదురుచూస్తున్న సన్నివేశం జరగడంవల్ల వారికి బాబా మహిమపై అపారమైన విశ్వాసం కుదిరింది. ఆ ప్రయాణీకుణ్ణి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. బాబా ఇచ్చిన ఊదీ పొట్లాన్ని అతని చేతిలో ఉంచి, "మేము శిరిడీ నుంచి వస్తున్నాము. బాబా మీకీ పొట్లాన్ని అందించమని, మీరిప్పుడు పలికిన మాటలే సంకేతంగా మాకు చెప్పారు. మీ భక్తి అనన్యమైనది గనుకనే మీరున్న చోటుకే బాబా ఊదీ ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వచ్చాయి” అని అన్నారు. అది విన్న అతడు ఆనందభాష్పాలు రాలుస్తూ, “నాపేరు జోషి నా కుటుంబంవారంతా సాయి భక్తులే". ఆయన మహిమను ఏదో విధంగా స్వానుభవం పొందిన తర్వాతనే సాయిని దర్శించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎదురు చూస్తున్నాను. నేటికి అనుగ్రహించారు. అపరిచితులైన మీరు శ్రద్ధవహించి ఊదీని ఇచ్చినందుకు నా ధన్యవాదాలు” అని పలికాడు. వారి అందరి మనస్సుల్లో “నా సంకల్పం లేకుండా ఆకైనా కదలదు!” అన్న సాయి వాక్యాలు ప్రతిధ్వనించాయి. మన ఎఱుక లేకపోయినా మన ప్రతి కదలిక, మాట సాయి సంకల్పాను సారమే జరుగుతుంటాయనీ, అందరిలోనూ ఉండి నడిపించే ఆ చైతన్యమే సాయి అని ఈ లీలద్వారా వారికి గోచరించింది. ఎవరు ఏమి పలికినా పలికించేవాడు సాయినాథుడే!
సోర్సు : సాయిపథం వాల్యూం - 1