సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 150వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు.
  2. ఆటంకం లేకుండా ఫంక్షన్ జరిపించిన బాబా.

నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు.

విజయవాడ నుండి సాయి భక్తురాలు హారిక తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సద్గురు సాయినాధునికి నా సాష్టాంగ నమస్కారములు. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారములు. నాకు 20 ఏళ్లుగా బాబా గురించి తెలుసు. అయితే ఆయనకు ఒక నమస్కారం పెట్టడం, గుడికి వెళ్లడం, అప్పుడప్పుడు శిరిడీ వెళ్లడం అంతవరకే. అలాంటిది మా అబ్బాయి విషయంలో వచ్చిన ఒక సమస్య నన్ను బాబాకి చాలా దగ్గర చేసింది. బాబా లీలలు మనకు అర్ధంకావు. ఆయనెప్పుడూ మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తారో తెలీదు. ప్రతి సంఘటన వెనక ఒక పరమార్ధం ఉంటుంది. ఇక బాబాకు దగ్గర చేసిన అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అబ్బాయి వెల్లూరులో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి  నేను హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తను చదువుతున్న కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. "మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు, తాను చదువులో చాలా వెనకబడ్డాడు, ఇలాగే ఉంటే టి.సి. ఇచ్చి పంపేస్తాము" అన్నారు. ఆమాట వింటూనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, మా అబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో ముందుండేవాడు. అలాంటిది ఇలా అయిందంటే నేనస్సలు నమ్మలేకపోయాను. విషయం నావరకు వచ్చేసరికే తను చివరి సంవత్సరంలో ఉన్నాడు. ఏమి చేయాలో నాకు తోచలేదు. వెంటనే నేను కాలేజీ వాళ్లతో మాట్లాడుదామని వెల్లూరు వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక మా అబ్బాయితో చదువుతున్న ఒక అబ్బాయి తల్లితో నాకు పరిచయం అయ్యింది. ఆమె గొప్ప సాయి భక్తురాలు. ఆమె మాట్లాడిన ప్రతి మాటలో సాయి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాంటి తనతో పరిచయం బాబా ఇచ్చిన గొప్పవరం. తన పరిచయంతో నేను బాబాకు చాలా చాలా దగ్గరయ్యాను.

ఇక అసలు విషయానికి వస్తే, మా అబ్బాయి విషయంలో నేను చేయాల్సింది చేసిన తరువాత శిరిడీ వెళ్ళాను. నేను సమాధి మందిరంలో బాబా దర్శనానికి క్యూలో నిలబడి బాబాను చూస్తూ కన్నీళ్లతో మా అబ్బాయి సమస్య గురించి ఆయనకు చెప్పుకుని, "నా బిడ్డ భారం మీరు తీసుకున్నట్లైతే, మీరు సమాధి వద్దనుండి నాకు ఒక పుష్పాన్ని ఇవ్వండి. నేను మాత్రం ఎవరినీ ఏమీ అడగను" అని ప్రార్ధించాను. ఆశ్చర్యం! ఒక లేడీ సెక్యూరిటీ వచ్చి నా చేతిలో కాజు బర్ఫీ పెట్టింది. నేను నా మనసులో 'నేను అడిగింది పుష్పాన్ని కదా, మరి స్వీట్ ఇచ్చారేమిటి?' అనుకుంటున్నంతలో ఆమె మళ్ళీ వెనుకకు వెళ్లి సమాధి వద్దనుండి ఒక పుష్పాన్ని తెచ్చి నా చేతిలో పెట్టింది. సమాధికి నాకు మధ్య చాలా దూరం ఉంది. పైగా నాముందు చాలామంది ఉన్నారు. అందరినీ దాటుకుని నా చేతిలోనే ఆమె ప్రసాదం, పుష్పాన్ని పెట్టడం చాలా ఆశ్చర్యమనిపించింది. అలా నా బిడ్డ బాధ్యతను తాము స్వీకరిస్తునట్లుగా బాబా నాకు నిర్ధారణ ఇచ్చారు. ఇక ఆయనే అంతా చూసుకుంటారని నేను అనుకున్నాను. అయితే తల్లి మనస్సు అప్పుడప్పుడు ఆందోళనపడుతూ ఉండేది. మావారు, "బాబాపై విశ్వాసం ఉంటే, ఇలా ఆందోళన పడకూడదు" అంటుండేవారు. అది నిజమే కానీ నేను స్థిమితంగా ఉండలేకపోయేదాన్ని. అయితే బాబా తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. ఆయన కృపతో నా బిడ్డ ఒకటిన్నర సంవత్సరంలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఈ అనుభవం నా బిడ్డకి కూడా బాబాపట్ల విశ్వాసాన్ని పెంచింది.  

ఇకపోతే పై చదువులకోసం మా అబ్బాయిని జర్మనీ పంపమని తెలిసిన ఒకతను సూచించారు. ఆ విషయమై మేము హైదరాబాదులోని కన్సల్టెన్సీల ద్వారా చాలా ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకుండాపోయింది. అందరూ మా అబ్బాయి ప్రొఫైల్ ననుసరించి తనకి జర్మనీ వెళ్లే అవకాశం లేదని, ఆస్ట్రేలియా అయితే సాధ్యపడుతుందని అన్నారు. అప్పడు నేను "బాబా! అందరూ మా అబ్బాయికి జర్మనీలో అవకాశం లభించడం అసాధ్యమని అంటున్నారు. కానీ అది మీవల్ల సాధ్యమవుతుంది. అదేజరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్ధించాను. వెంటనే బాబా కృప చూపించారు. మా అబ్బాయి స్నేహితుని ద్వారా విజయవాడలో ఉన్న ఒక కన్సల్టెన్సీ గురించి తెలిసి, వెంటనే మేము ఆ కన్సల్టెన్సీని సంప్రదించాము. వాళ్ళు, "ఖచ్చితంగా జర్మనీలో అవకాశం లభించేలా చూస్తామ"ని చెప్పారు. తరువాత కొద్దిరోజుల్లోనే మా అబ్బాయికి జర్మనీలో అడ్మిషన్, వీసా వచ్చేలా బాబా అనుగ్రహించారు. ఇప్పుడు మా అబ్బాయి ఎంతో పద్దతిగా ఉంటున్నాడు. ఎందుకంటే వాడి భాద్యత బాబా తీసుకున్నారు కదా! ఇప్పుడు వాడికి ఉద్యోగం రావాల్సి ఉంది. ఆ భాధ్యత కూడా ఆయనదే. ఖచ్చితంగా ఆయన త్వరలో నా బిడ్డను మంచి స్థాయిలో స్థిరపరుస్తారని నా నమ్మకం. అందరికీ బాబా తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

ఓం సాయిరాం.

ఆటంకం లేకుండా ఫంక్షన్ జరిపించిన బాబా.

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 7 సంవత్సరాలకు పైగా శ్రీ సాయిబాబా భక్తురాలిని. రెండు నెలల క్రితం మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ మా ఇంటిలో ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది అతిథులను ఆహ్వానించాము. హఠాత్తుగా ముందురోజు సాయంత్రం మా అమ్మాయి జ్వరంతో అనారోగ్యానికి గురైంది. అది కాలానుగుణంగా వచ్చే ఫ్లూ జ్వరం. దానినుండి కోలుకోవడానికి కనీసం ఒక వారం పడుతుంది. కొద్దిరోజుల ముందు నా భర్త కూడా జ్వరంతో దాదాపు పదిరోజులు బాధపడ్డారు. అందువలన నేను చాలా టెన్షన్ పడి బాబాను ప్రార్ధించాను. మావారు తనని డాక్టరు వద్దకు తీసుకెళ్ళగా, డాక్టరు మందులు ఇచ్చారు. కానీ ఉదయానికి కూడా తనకి జ్వరం ఎక్కువగానే ఉంది. ఏం చేయాలో అర్ధంకాక కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబాని ప్రార్థించి ఫంక్షన్ ఏర్పాట్లు మొదలుపెట్టాము. బాబా కృపవలన మధ్యాహ్నానికి జ్వరం తగ్గింది. సాయంత్రం ఫంక్షన్ మొదలుపెట్టాము. తను ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 గంటలపాటు ఫంక్షన్‌లో నిలబడగలిగింది. మా అమ్మాయిని రక్షించింది బాబా మాత్రమే. జ్వరం తగ్గకుంటే ఏమి జరిగేదో నేను ఊహించలేను. నా ప్రార్థనలకు బాబా సమాధానమిచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". బాబా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo