సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గజానన్ ప్రధాన్


దీర్ఘకాలికంగా బాధించిన వాపు, నొప్పితో కూడుకున్న రాచపుండు గజానన్ రామచంద్ర ప్రధాన్‌ని 1910వ సంవత్సరంలో శిరిడీకి రప్పించింది. యుక్తవయస్సులో ఉన్న గజానన్ ముంబాయిలో నివాసం ఉండేవాడు. 1910లో అతని కుడికాలి చీలమండకు వాపు వచ్చింది. ఒక ఆయుర్వేద వైద్యుడు అతని కాలుని పరీక్షించి చికిత్స చేసాడు. తరువాత ఒక హకీమ్(ఫిజీషియన్)  కూడా వైద్యం చేసాడు. గజానన్ పద్ధతి ప్రకారం మందులన్నీ తీసుకుంటూ, సూచించిన పులియబెట్టిన ఔషధాలు కూడా త్రాగాడు. అయినా కూడా అతనికి ఉపశమనం కలగలేదు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాపు ఉన్న చోట అతడు పిండికట్టు వేసుకున్నా ఆ రాచపుండు పగలకపోగా గుండ్రంగా, గట్టిగా తయారయ్యింది. అనతికాలంలోనే ఆయుర్వేద వైద్యుడు, హకీం తమ ప్రయత్నాలను విడిచిపెట్టారు. అయితే గజానన్ చీలమండ వాపు, విపరీతమైన నొప్పి అలానే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు అతన్ని అల్లోపతి వైద్యుడికి చూపించారు. ఆ వైద్యుడు కొన్ని గుళికలు ఒక వారంరోజులపాటు వాడమని ఇచ్చి, "ఈ మందులతో వారం లోపల స్వస్థత చేకూరకపోతే ఆపరేషన్ చేసి రాచపుండును తొలగిస్తాను" అని చెప్పాడు. అయితే వాపు రోజురోజుకీ పెరగసాగింది. అతని తల్లి శ్రీమతి ప్రధాన్ దిగజారుతున్న బిడ్డ పరిస్థితికి ఏం చేయాలో అర్థంకాక చాలా చింతించసాగింది.

అలా ఉండగా ఒకరోజు సాయంత్రం అనుకోకుండా వాళ్ళ కుటుంబ స్నేహితుడు ఒకతను వచ్చి, "శిరిడీ వెళ్ళి అక్కడ రెండువారాలపాటు ఉండమ"ని సలహా ఇచ్చాడు. ఇంకా ఇలా చెప్పాడు: "అక్కడొక అద్భుతమైన సత్పురుషుడుగా పిలవబడే సాయిబాబా నివసిస్తున్నారు. ఆయన ఎంతోమంది అసాధారణమైనటువంటి జబ్బులను నయం చేసారు. కాబట్టి మీరు కూడా బాబా సహాయాన్ని అర్థిస్తే, ఆయన తప్పక గజానన్‌కి నయం చేస్తారు" అని. ఆ స్నేహితుని సలహాను శ్రీమతి ప్రధాన్ అనుసరించాలని నిర్ణయించుకుంది. మరుసటిదినమే గజానన్, అతని తల్లి, ఆమె తమ్ముడు నానా శిరిడీ ప్రయాణమయ్యారు. శిరిడీ చేరుకున్నాక వాళ్ళకి ధర్మశాల(పిలిగ్రిమ్స్ ఇన్)లో గది దొరికింది. గదిలో గజానన్ విశ్రాంతి తీసుకుంటుండగా అతని తల్లి, నానా గ్రామంలో విచారించి సరుకులతో గదికి తిరిగి వచ్చి, వంట తయారు చేసుకున్నారు.

గ్రామంలో చాలా చిన్న చిన్న మందిరాలున్నాయి. అక్కడకు వెళ్ళి వీళ్ళు కూర్చున్నారు. "బాబా ఎక్కడ ఉంటారు?" అని గ్రామస్థులను విచారించి 'మసీదులో ఉంటార'ని తెలుసుకున్నారు. అటువైపు నడుస్తుండగా వాళ్ళకు ఆరతి పాట వినిపించి, ఆ వైపుగా నడుచుకుంటూ వెళ్లి కొద్దిసేపట్లోనే ద్వారకామాయిలో అడుగుపెట్టారు. అక్కడ బాబాను పూజిస్తూ, ఆరతి ఇస్తున్నారు. ఆరతి ముగిసిన తరువాత శ్రీమతి ప్రధాన్, నానా వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకున్నారు. బాబా వాళ్ళను ఆశీర్వదించి, "అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు" అని అన్నారు. వాళ్ళు ఆనందంతో పొంగిపోయారు. గదికి తిరిగి వచ్చిన తరువాత గజానన్‌కు అక్కడ జరిగినదంతా చెప్పారు. అది విన్న అతను వ్యాకులతతో, "నేను ఎప్పుడు బాబాను కలవగలను? ఆరోజు నా జీవితంలో అతిముఖ్యమైన రోజు" అని అన్నాడు.

మరుసటిరోజు ద్వారకామాయిలోని గంటల మోత విని గజానన్‌ను గదిలోనే విడిచి శ్రీమతి ప్రధాన్, నానా మధ్యాహ్న ఆరతికి హాజరు కావడానికి వెళ్ళారు. ఆరతి ప్రారంభం కావడానికి కాస్త ముందు వాళ్ళు ద్వారకామాయిలో అడుగుపెట్టారు. బాబా వాళ్ళను చూసి, "ఏ భక్తుడు ధర్మశాలలో ఉంటూ ఆరతికి రాలేదు?" అని అడిగారు. అప్పుడు శ్రీమతి ప్రధాన్, "బాబా! నా బిడ్డ గజానన్ ఆరతికి హాజరయ్యే స్థితిలో లేడు. తన చీలమండ వాచి, బాగా నొప్పిగా ఉంది. అందువలన తను నడవలేడు బాబా" అని చెప్పింది. అప్పుడు బాబా, "వెంటనే వెళ్ళి అతనిని ఆరతికి తీసుకుని రండి" అని అరిచారు. వెంటనే శ్రీమతి ప్రధాన్, నానా గదికి తిరిగి వచ్చి, గజానన్‌ను ద్వారకామాయికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. వారిద్దరి సహాయంతో గజానన్ కుంటుకుంటూ అతికష్టంమీద మసీదుకు చేరుకున్నాడు. అప్పటికి ఆరతి ముగిసింది. భక్తులు బాబా పాదాలకు నమస్కరించుకుంటున్నారు. అకస్మాత్తుగా బాబా ఒక రాయి తీసుకుని గజానన్ కుడికాలి చీలమండపై విసిరారు. గజానన్ నొప్పితో కేకపెట్టి క్రిందపడిపోయాడు. ఆ రాచపుండు పగిలి చీము, రక్తం బయటకు వచ్చాయి. శ్రీమతి ప్రధాన్ అక్కడ పడివున్న ఆకులు, పువ్వులతో తుడిచి, పుండు ఉన్నచోట ఊదీ వ్రాసారు. తొందరలోనే పుండు నయమై, గజానన్ ప్రతీరోజు అన్ని ఆరతులకు హాజరు కాగలిగేవాడు. తరువాత బాబా ఆశీర్వాదాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. కొంతకాలానికి గజానన్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చింది.

తీవ్రంగా వేధించిన నొప్పినుండి విముక్తి కలిగించినందుకు గజానన్ బాబాపట్ల ఎంతో కృతజ్ఞత కలిగివుంటూ, తన ఇంట్లో బాబా చిత్రపటాన్ని పెట్టుకుని భక్తితో పూజిస్తుండేవాడు. బాబా మహాసమాధి చెందేలోపు రెండు, మూడుసార్లు శిరిడీ సందర్శించాడు. నిత్యం విరామం లేకుండా 8 గంటల సమయం సచ్చరిత్ర పారాయణ చేసేవాడు. ఆ అభ్యాసాన్ని తాను చనిపోయేవరకు కొనసాగించాడు.

భక్తులకు శిరిడీ సందర్శించే కారణాలు వేరుగా ఉండవచ్చు. కానీ, బాబా తమ దృష్టి వాళ్ళ మీద నిలిపి ఖచ్చితంగా వాళ్ళను తమ పాదాల చెంతకు లాక్కుంటారు.

Ref : సాయిప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1999.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri.

5 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om sai ram, amma nannalu bagunde la chudandi tandri, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri pls

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo