శిరిడీలో 'శాశ్వత'నివాసం
తాత్యాసాహెబ్ నూల్కర్ పండరిపురంలో సబ్ జడ్జిగా పనిచేస్తుండగా అక్కడ పండరి విఠలుని ఆలయానికి సంబంధించిన 'ఆరతిహక్కుల' కేసొకటి అతనివద్దకొచ్చింది. నీతినిజాయితీని రెండుకళ్ళుగా భావించే నూల్కర్ ఎటువంటి ఒత్తిడులకూ లొంగక ఆ కేసుకు సంబంధించి న్యాయబద్ధమైన తీర్పునే చెప్పాడు. సంచలనాత్మకమైన ఆ కేసు పూర్తి ఐన తర్వాత సెలవుపై శిరిడీకి బయలుదేరివెళ్ళాడు. అతడిని చూడగానే బాబా “తాత్యాబా, వచ్చావా? బాగుంది, కానీ మరి ఎన్ని రోజులుంటున్నావు ఇక్కడ” అని అడిగారు దానికి నూల్కర్ వినయంగా, “బాబా! నాకిక ఎక్కడికి వెళ్ళాలనిలేదు. దయచేసి నన్నింక శిరిడీలోనే ఉండిపోనివ్వండి. కోర్టులో పాండురంగ ఆలయానికి సంబంధించిన కేసుకు ఒకదానికి తీర్పుచెప్పి వస్తున్నా, మళ్ళీ మామూలు మనుషుల కక్ష, కార్పణ్యాల కేసుల గొడవలపై తీర్పురాసేందుకు నన్ను కలం పట్టుకోనివ్వక ఆ దైవసంబంధమైన తీర్పే నా చివరి తీర్పుగా ఉండనివ్వండి” అని ప్రార్థించాడు. “అలాగేకానివ్వు" అన్నారు బాబా నవ్వుతూ. నూల్కర్ పదవీ విరమణ చేసి ఆపై శిరిడీలోనే ఉండిపోయాడు.
బాల్యమిత్రుల సమాగమం
శ్రీనూల్కర్, శ్రీబాబాసాహెబ్ నీలకాంత్ రామచంద్ర సహస్రబుద్దేలు పూనా హైస్కూల్ లో సహాధ్యాయులు. సన్నిహిత మిత్రులు. కానీ స్కూలు విడిచిన తర్వాత 25-30 సంవత్సరాలు వారు కలుసుకొనే అవకాశం లేకుండాపోయింది. ఇప్పుడు సహస్రబుద్దే మొదటిసారిగా చందోర్కర్, దీక్షిత్ ల ప్రోద్బలంతో శిరిడీ వచ్చాడు. సాఠేవాడాలో బసచేస్తున్న నూల్కర్ ను చూచి గుర్తుపట్టి పలకరించాడు. మిత్రులిద్దరు ఇంతకాలానికి కలుసుకున్నందుకు అమితంగా సంతోషించారు. నూల్కర్ తన స్నేహితుని అతిథిగా తన గదిలోనే వుంచుకున్నాడు. మరుసటిరోజు స్నేహితులిద్దరు బాబాను దర్శించారు. సహస్రబుద్దే బాబాకు నమస్కరిస్తూనే “తాత్యాను సేవించుకో!” అని ఆదేశించారు. బాబా రెండవరోజు మూడవరోజు కూడ సహస్రబుద్దెకు అదే ఆదేశాన్ని జారీచేశారు. ఒకే స్థాయికి చెందిన ఇద్దరు స్నేహితులలో, ఒకరు మరొకరిని సేవించుకోమనడంలోని అంతరార్థం ఎవరికి బోధపడలేదు. కానీ బాబా మాటలు అగాధాలు కదా, సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వారి మాటలలోని సత్యాలు అవగాహనమవుతాయి!
సహస్రబుద్దే ఇంటికి తిరిగివెళ్ళాలని నిర్ణయించుకొని - బాబా అనుమతికోసం శ్యామాచే అడిగించారు. బాబా శ్యామాతో “నాలుగురోజులుండి వెళ్లమను!” అన్నారు. నాలుగురోజుల తర్వాత అడిగితే బాబా మళ్ళీ 'నాలుగు రోజులుండి వెళ్ళమ'నే సమాధానమిచ్చారు. ఇలా రెండుమూడు వాయిదాలైన తర్వాత ఒకరోజు బాబా “వాడిని మశీదు ముందు కుక్కలాగ పడివుండమను! ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. ముందు ముందు వాడి అవసరం మనకెంతోవుంది. వాడు పెద్దపెద్దకార్యాలు చేయవలసివుంది. నీకేమీ తెలియదు. అవసరం లేకుండా నేను వాడినిక్కడకు రప్పించలేదు” అని శ్యామాతో అన్నారు. దీనితో సహస్రబుద్దేను శిరిడీ నుండి పంపేవిషయం అందరూ మర్చిపోయారు.
నూల్కర్ అనారోగ్యము - స్నేహితుని సేవ
ఇది జరిగిన పక్షంరోజుల తర్వాత మధుమేహం వల్ల నూల్కర్ పిరుదుపై రాచకురుపొకటి లేచి బాధించింది. క్రమేణా ఈ రాచకురుపుల సంఖ్య అధికమైనందువల్ల ఆ అనారోగ్యం తీవ్రమై మంచానికతుక్కుపోయాడు. సేవాతత్పరభావంగల సహస్రబుద్దే ఇతరుల సేవకు - ఎప్పుడు సిద్ధంగానే వుండేవాడు. ఇప్పుడు జబ్బుపడినవాడు తన సన్నిహితస్నేహితుడు. పైగా బాబాయే “తాత్యాను సేవించుకో!”ని ఆదేశించారు. అందువల్ల అహోరాత్రులు నూల్కర్ సేవకు అంకితమైపోయాడు సహస్రబుద్దే. నూల్కర్ కు నయమయేంతవరకు శిరిడీ విడిచివెళ్ళకూడదని కూడ నిర్ణయించుకున్నాడు. బాబా మాటల్లోని అంతరార్థం ఇప్పుడు అందరికి అర్థమైంది.
తాత్యాసాహెబ్ ఇద్దరు కుమారులు వామనరావు, విశ్వనాధ్ కూడ శిరిడీవచ్చి తండ్రి సేవలో నిమగ్నమయ్యారు. డాక్టరైన వామనరావు బొంబాయి నుండి ఆపరేషన్ సామాగ్రి, మందులు తెప్పించి రాచకురుపులన్నింటిని శస్త్రచికిత్సచేసి కట్టుకట్టాడు. కానీ నూల్కర్ అనారోగ్యం నానాటికి తీవ్రం కాసాగిందే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలేవీ కనిపించలేదు.
సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము
ఓం సాయిరాం
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete