సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 136వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • మహాపారాయణకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ తామే చూసుకుంటామని ఋజువు చూపిన బాబా

సాయిభక్తురాలు రేఖా గోయల్ మహాపారాయణ నిర్వహణలో తనకి ఎదురైన బాబా లీలల్ని మనతో ఇలా పంచుకుంటున్నారు..

సాయిభక్తులందరికీ సాయిరామ్! నా పేరు రేఖా గోయల్. నేను 'మహాపారాయణ గ్రూపు 1'లోని సభ్యురాలిని. బాబా ప్రతిక్షణం తమ ఉనికిని తెలియజేస్తూ, తమదైన ప్రత్యేకశైలిలో లీలలు చూపిస్తూ మనల్ని ఆశీర్వదిస్తుంటారు. అలాంటి అపూర్వమైన రెండు అనుభవాలు మా ఇద్దరక్కలకు జరిగాయి. వాటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మేము మహాపారాయణ మొదలుపెట్టినప్పటినుంచి ఒక ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉండేది. అదే విషయం గురించి తరచూ నేను నా మేనకోడలు పూజతో, "నువ్వు ఎంతో శ్రమపడి అంతర్జాతీయస్థాయిలో మహాపారాయణ నిర్వహిస్తున్నావు కదా! మరి గ్రూపులో ఉండే సభ్యులు కూడా అంతే నిబద్ధతతో పారాయణ చేసి, నిజాయితీగా రిపోర్ట్ చేస్తారనే నమ్మకం నీకుందా?" అని అడుగుతుండేదాన్ని. అందుకు తనెప్పుడూ చిరునవ్వుతో, “అదంతా బాబా తలనొప్పి, నువ్వు దిగులుపడకు ఆంటీ. అది ఆయనకే వదిలేయండి. ఖచ్చితంగా ఆయన చూసుకుంటారు. మనం చేయగలిగినదంతా మెరుగైన రీతిలో చేద్దాం. ఒకవేళ ఎవరైనా అసత్యమాడినా బాబాయే చూసుకుంటారు" అని ఒకటే సమాధానం చెప్పేది.  నేను ఆశ్చర్యపోయేలా అదే నిజమైంది.

బాబా మనందరి దైవం. ఆయన ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారు. అది మనం ఉహించను కూడా ఉహించలేము. మహాపారాయణలో అధ్యాయాలను కేటాయించడం మొదలుకొని మనచేత పారాయణ చేయించడం, రిపోర్ట్ చేయించడం, అటు పిమ్మట మహాపారాయణ విజయవంతంగా పూర్తయ్యేలా కూడా ఆయనే చూసుకుంటారని క్రింది అనుభవాల ద్వారా తెలియజేశారు. ఇక అసలు విషయంలోకి వెళదాం.

మొదటి అనుభవం:

మా అక్క సరోజా మహాజన్ 'మహాపరాయణ గ్రూపు 14'లో సభ్యురాలు. తను హుబ్లీలో నివాసం ఉంటుంది. తను 2017, అక్టోబరులో మా సోదరుడి ఆరోగ్యం విషమంగా ఉన్న కారణంగా తనని చూసిపోదామని హుబ్లీ నుండి పూణే వచ్చింది. తను బుధవారం వచ్చి, తిరిగి అదేరోజు తనింటికి చేరుకుంది. మరునాడు గురువారం, అంటే మహాపారాయణ చేయాల్సిన రోజు. కాబట్టి ఆరోజు తనకి నిర్దేశించిన అధ్యాయాలు తను ఖచ్చితంగా చదివి తీరాలి. నిజానికి ఆమెకి కేటాయింపబడిన అధ్యాయాలను ఆమె కోడలు చదువుతుంటే తను విని గ్రూపులో రిపోర్ట్ చేస్తుంది. అయితే ఆరోజు తనకి బాగా అలసటగా ఉండడంవల్ల కోడలితో, "ఈరోజు నేను వినలేను. నువ్వు వాటిని చదివేసి, నా తరఫున గ్రూపులో రిపోర్టు చేసేయి" అని చెప్పింది. అయితే బాబా ఏమి చేసారో చూడండి!

ఆ రాత్రి సరోజ గాఢనిద్రలో ఉండగా సాయిబాబా తన కలలోకి వచ్చారు. కలలో తన గది అంతా భక్తులతో నిండి ఉంది. అక్కడ బాబా కూడా ఉన్నారు. బాబా తనని చూసి, ”ఈరోజు నువ్వు వినాల్సిన నీ అధ్యాయాలను వినలేదు కదా! అందుకే నేనిప్పుడు నీకు ఆ అధ్యాయాలను వినిపిస్తాను, నువ్వు శ్రద్ధగా విను" అంటూ తమ ఒక చేతి పిడికిలితో మరో అరచేయిపై గుద్దుకుని, "9వ అధ్యాయం చదివేలా చేస్తాను” అన్నారు. అంతటితో కల ముగిసింది. మరునాడు ఉదయం తనకి మెలకువరాగానే తనకి వచ్చిన కలను గుర్తుచేసుకుని సిగ్గుతో బాబాకి క్షమాపణలు చెప్పుకుంది. ఇక ఆలస్యం చేయక వెంటనే తన కోడలిచేత ముందురోజు అధ్యాయాన్ని చదివించుకుంది. ఆశ్చర్యం! తనకి కేటాయించింది 9వ అధ్యాయమే! పారాయణ ముగిశాక తనకి జరిగిన అనుభవాన్ని నాతో పంచుకుంది. అది విన్న నాకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. ఈ అనుభవంతో 'అంతర్జాతీయస్థాయిలో మహాపారాయణ నిర్వహిస్తున్నది బాబానే గానీ పూజ కాదు' అని నాకు అర్థమయింది. ఇక మరొక అనుమానం 'తప్పుడు రిపోర్టు ఇవ్వడం' గురించి. ఆ అనుమానాన్ని బాబా ఎలా నివృత్తి చేశారో చదవండి.

రెండవ అనుభవం:

ఇది మరో అక్క సంతోష్ గార్గ్ కు సంబంధించినది. తను కూడా 'మహాపారాయణ గ్రూపు 14' లోని సభ్యురాలు. మేము మా మొదటి మహాపారాయణ బ్యాచ్‌ని 2017, సెప్టెంబర్ 30 విజయదశమి పర్వదినంనాడు ప్రారంభించాము. మొదట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అధ్యాయం మాత్రమే కేటాయించేవాళ్ళం. ఆ సంవత్సరం దీపావళి గురువారంనాడు వచ్చింది. ఆరోజు కూడా మహాపారాయణలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క అధ్యాయం కేటాయించారు. దీపావళి అంటే అందరికీ తెలిసిందే! ఆరోజు అందరికీ పని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్షణం తీరిక లేకుండా ఉంటారు. అందువలన ఆలస్యంగానే అందరూ వారివారి అధ్యాయాలను చదివామని రిపోర్టు చేస్తూ వచ్చారు. అయితే మా అక్క సాయంత్రమవుతున్నా తను చదివినట్టు నిర్ధారించలేదు. అప్పటిదాకా వేచి చూసి తనకి నేను ఫోన్ చేశాను. తన కోడలు ఫోన్ ఎత్తి, “అత్తయ్య తన అధ్యాయాన్ని ఎప్పుడో చదివేశారు. నేనిప్పుడే మీకు తన రిపోర్టు పంపుతాను” అంది. అయితే అసలు జరిగిందేమిటంటే, అక్క తన అధ్యాయాన్ని చదవలేదు. ఆ విషయం నాతో చెప్పడానికి భయపడి ఆమె తన కోడలిచేత అబద్ధం చెప్పించింది. సర్వాంతర్యామి అయిన బాబాకి ఆ విషయం తెలుసు. మరి బాబా ఏమి చేసారో చూడండి!

ఆరోజు రాత్రి మా అక్క నిద్రలో ఉండగా కలలో బాబా కనిపించి, “లే! లేచి నీ అధ్యాయం చదువు” అని చెప్పారు. వెంటనే తను బిత్తరపోతూ నిద్రలేచింది. అప్పుడు సమయం రాత్రి 11.30 అయింది. అంటే రోజు ముగియడానికి ఇంకా అరగంట సమయం ఉంది. వెంటనే తను తనకి కేటాయించిన అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టి అరగంటలో పూర్తిచేసింది. మరుసటిరోజు నాతో అంతా వివరంగా చెప్పి, తన తప్పుని ఒప్పుకుంది. అది విన్న నేను ఆశ్చర్యపోయాను. వెంటనే తేరుకుని తనకంటే చిన్నదానినైనప్పటికీ మహాపారాయణ గ్రూపు టీచరుగా తనతో, "ఇందుకే నిన్ను గ్రూపులోకి తీసుకునేందుకు మొదట నేను సందేహించాను. అంతర్జాతీయస్థాయిలో మహాపారాయణ విజయవంతం కావాలని ఎందరో సాయిభక్తులు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యకు" అని మందలించాను. కానీ బాబా తన అద్భుతమైన లీలను నేను అర్థం చేసుకోవాలని తక్కువ సమయంలోనే నన్ను శాంతింపజేశారు.

బాబా తన అద్భుతమైన ఈ లీల ద్వారా నా రెండవ సందేహానికి జవాబు ఇచ్చారు. మహాపారాయణ గ్రూపులోని ప్రతి ఒక్కరూ రాత్రి 7.30 లోపు వారికి కేటాయించిన అధ్యాయాన్ని చదవడం పూర్తిచేసి రిపోర్టు చేయాలి. ప్రత్యేకించి 7.30 ఎందుకంటే, వాలంటీర్లుగా ఉన్నవాళ్ళు అంతర్జాతీయస్థాయిలో వేలసంఖ్యలో ఉన్న భక్తుల వద్దనుండి రిపోర్టులు సేకరించి ఆరోజు పారాయణ ముగిసినట్లుగా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చదవడం మర్చిపోయినా, కేటాయించిన అధ్యాయాన్ని కాకుండా వేరే అధ్యాయాన్ని పొరపాటుగా ఎవరైనా చదివినా, అవన్నీ స్పష్టంగా తెలుసుకుని, ఏది ఏమైనా గురువారం ముగిసేలోగా పారాయణను పూర్తి చెయ్యాలి. ఒక్క అధ్యాయం చదవకపోయినా ఆరోజు పారాయణ అసంపూర్తి అయినట్టే. అప్పుడు మరుసటిరోజే ఆ నిర్ణీత గ్రూపులోని సభ్యులందరూ మరలా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాంటిది ఆ దీపావళిరోజు పారాయణకి అంతరాయం కలగకుండా బాబా ఎంతో చాకచక్యంగా మా అక్కకు కలలో కనిపించి 12 గంటల లోపలే ఆ అధ్యాయాన్ని చదివేలా చేసారు.

అయితే ఇంతటి అద్భుతమైన అనుభవాల గురించి ఈ మహాపారాయణకి మూలకారకురాలైన పూజా గార్గ్ కి చెపితే తను ఏమైనా తప్పుగా అనుకుంటుందేమోనని తనతో చెప్పడానికి మొదట్లో సంకోచించాను. ఎందుకంటే ఎంతో శ్రమకోర్చి అంతర్జాతీయస్థాయిలో మహాపారాయణ నిర్వహిస్తున్న తనని ఆ విషయాలు నిరుత్సాహపరుస్తాయేమోనని అనుకున్నాను. కానీ, 'ఎంతో ఆనందాన్నిచ్చే అద్భుతమైన, ప్రత్యేకమైన బాబా లీలలను చెప్పకపోతే ఎలా?' అనిపించి, బాబా ప్రోద్బలంతో ఒకనాడు వాటి గురించి పూజతో చెప్పాను. పూజ చాలా ఆశ్చర్యానందాలకు లోనై, "ఈ అద్భుతమైన బాబా లీలల యొక్క  మాధుర్యం అందరికీ తెలియాలి. అందులోని అంతరార్థం భక్తులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు అనుభవాలను నువ్వు వ్రాయి" అని నన్ను ప్రోత్సహించింది. అయితే ఇంత ఆలస్యంగా మీతో పంచుకుంటున్నందుకు అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను.

పై రెండు చక్కటి అనుభవాల ద్వారా బాబా నా ప్రశ్నలకు సమాధానమిస్తూ తానే స్వయంగా మహాపారాయణకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో నేర్పుగా, జాగ్రత్తగా చూసుకుంటున్నానని తెలియజేశారు. మహాపారాయణలోని సభ్యులను బాబానే స్వయంగా ఎన్నుకున్నారు. కాబట్టి మహాపారాయణలో ఉండేవారికి ఇది ఒక వరం వంటిది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీరు అందించిన ఈ మహాపారాయణ మానవజాతికి నిజమైన ఆశీర్వాదం".

source: http://experiences.mahaparayan.com/2018/10/proof-showing-baba-himself-conducting.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo