సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పల్లకి - రెండవ భాగం


మరునాటి ఉదయం యథాప్రకారం సాయి మసీదు చేరారు. కానీ పల్లకీని వెంట తెచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. రెండు మూడు రోజులు చావడిలోనే వుండిపోయింది పల్లకి. ఆ సమయంలో పల్లకీకి అమర్చిన వెండి కలశాన్ని, మిగిలిన అలంకార వస్తువుల్ని ఎవరో దొంగిలించారు. విషయం విన్న బాబా, “అసలా పల్లకీనే పట్టుకెళితే ఇంకా బాగుండేది” అని పకపకా నవ్వారు. భక్తులు మాత్రం బాధపడ్డారు. పల్లకిని భద్రపరిచేందుకు ఒక రేకుల షెడ్డును నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పురందరే. మశీదుకు, నారాయణతేలి ఇంటికి మధ్యలో రేకులషెడ్డు నిర్మించాలి. అందుకుగాను వసారా వేయడానికి నారాయణతేలి ఇంటిగోడలకు, మసీదు గోడలకు రంధ్రాలు కొట్టాలి. నారాయణతేలి సాయిభక్తుడు కనుక, కాదనే సమస్యే లేదు. ఇకపోతే ఇబ్బందంతా బాబాతోనే!

బాబా లెండీకి వెళ్ళి తిరిగి రావడానికి రెండు, మూడు గంటలు పడుతుంది కనుక ఆ సమయంలో పని పూర్తిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాబా లెండీకి వెళ్ళగానే పని ప్రారంభించారు. నారాయణతేలి ఇంటిగోడలకు రంధ్రాలు కొట్టి, మశీదు గోడలకు కొట్టబోతున్నంతలో బాబా లెండీ నుండి రానేవచ్చారు. అప్పుడు సమయం సుమారు పదిగంటలయింది. బాబా రావడం చూసి ఆ కార్యక్రమంలో సహాయపడుతున్న భక్తులు, కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారందరూ పరుగందుకున్నారు. తులసిరాం సోదరుడైన ఫకీర, పురందరేలు మాత్రం అక్కడ మిగిలారు. ఫకీర ఒకప్రక్క పందిరి కర్రలను పట్టుకొని నారాయణతేలి ఇంటిమీద ఉన్నాడు, పురందరే మసీదు గోడలకు రంధ్రం కొడుతూ వున్నాడు. అందువల్ల బాబాకు సులభంగా దొరికిపోయారు. బాబా పురందరే మెడపట్టుకొని కోపంగా, ఏరా, ఏం చేస్తున్నారు?” అని హుంకరించారు. “బాబా, మీ పల్లకీకి గదిని నిర్మిస్తున్నాను” అని పురందరే సమాధానమిచ్చాడు.

అది విని బాబా కోపంతో “ఇదివరకు వచ్చి నా మశీదును తవ్వి మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయారు. నింబారును కూడా తీశారు. ఇప్పుడు గోడకు కన్నాలు వెయ్యడానికి తయారయ్యారా?” అని కేకలేస్తూ పురందరేని తలుపు దగ్గరకు నెట్టుకుంటూ వెళ్ళి, “ఇక్కడనుంచి వెళ్ళు, లేకపోతే తన్నులు తింటావు, గుర్తుంచుకో” అని ఒక ఇటుకరాయి చేతిలోకి తీసుకున్నారు. “బాబా! నన్ను కొట్టండి, లేదూ మీ ఇష్టమొచ్చినట్లు చేయండి. పల్లకీకి గది నిర్మించనిదే మాత్రం, నేను ఇక్కడనుండి కదిలేది లేదు” అని పురందరే మొండిగా సమాధానమిచ్చాడు. బాబా కోపంతో తిడుతూ పురందరేను ఒక్క తోపు త్రోసి, కాళ్ళు కడుక్కొని మశీదులోకి వెళ్ళిపోయారు. కానీ తిట్లవర్షం మాత్రం ఆపలేదు. పురందరే ఏమాత్రం చలించనేలేదు. “ఏడువందల సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు. నువ్వెంత దూరానవున్నా సరే, నిన్ను కాపాడే బాధ్యత నాదే” అని వరమిచ్చిన అభయప్రదాత, ప్రేమమూర్తి తననేమీ చేయరనే విశ్వాసం పురందరేది. అందుకే బాబా కోపాన్నేమీ అతను పట్టించుకోలేదు.

కొద్దిసేపయిన తరువాత బాబా, “వాడిని ఇక్కడకు తీసుకురండి” అని కబురు పంపారు. పురందరే మశీదులోకి వెళ్ళి మౌనంగా చేపట్టుకు వెలుపల నిల్చున్నాడు. బాబా కొంచెం కోపం, కొంచెం విసుగు సమ్మిళితమైన స్వరంతో, “చెప్పిన మాట వినవా? మసీదు గోడలు పగలకొట్టాలనుకుంటున్నావా?” అన్నారు. “లేదు బాబా, అవి భద్రంగానే వుంటాయి” అని వినమ్రంగా సమాధానమిచ్చాడు పురందరే. బాబా ఏమనుకున్నారో ఏమో శాంతంగా, “సరే వెళ్ళు! నీ ఇష్టం, కానీ అనుకున్న పని మాత్రం శ్రద్ధగా చేయి!” అని అన్నారు. 

మధ్యాహ్నమయింది. బాబాకు ఆరతిచ్చి భక్తులంతా భోజనాలకని వెళ్ళిపోయారు. భోజనాలు కానిచ్చుకున్న భక్తులు కొద్దిసేపటికి తిరిగి మసీదుకు చేరుకోసాగారు. పురందరే మాత్రం భోజనం మాటే మరిచి పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. బాబా అతనితో “నువ్వూ వెళ్ళి భోంచేసిరా!” అని అన్నారు. కొద్దిసేపుండి మళ్ళీ ఆయనే చెప్పారు, "ఆకలేయట్లేదూ, వెళ్ళి అన్నం తినిరా” అని. పురందరే కదల్లేదు. అతనికి తిండిధ్యాసే లేనట్లున్నా బాబా మాత్రం అసహనంగా అటూ ఇటూ తిరగసాగారు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్‌తో ఫిర్యాదులా చెప్పారు: “చూశావా ఈ మూర్ఖుడ్ని. అన్నం తినొచ్చి పని చేసుకోవచ్చు కదా! నేనెంత చెపుతున్నా వినడేం? వాడి ఆకలి కూడా వాడికి తెలియకపోతే ఎలా?” మళ్ళీ అయిదునిమిషాలాగి ఆయనే అన్నారు: “ఇంత మొండివానితో నేనెలా వేగేది? కడుపులో ప్రేగులు అరుస్తున్నాయి”.

“బాబా, అతనికి శలవు పూర్తికావస్తోంది. కాబట్టి తొందరగా పని పూర్తిచెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లున్నాడు. అతనిని భోజనానికి పంపించమంటారా!” అని కాకాసాహెబ్ దీక్షిత్ అడిగాడు. అందుకు బాబా పెదవి విరుస్తూ, “నా మాటే వాడు వినటంలేదు, నీ మాటేం వింటాడు? భాగోజీ, నువ్వెళ్ళి వాడిని పిల్చుకునిరా” అని భాగోజీషిండేని పంపారు. పనిచేసుకుంటూనే బాబా మాటలన్నీ వింటూన్న పురందరే యిక ఆగలేనట్లు పరుగున వచ్చి ఆయన పాదాలపై వాలిపోయి భోరున ఏడ్చేశాడు. “ఎందుకురా భావూ? ఏమయిందిప్పుడు?” లాలనగా అతని తలపై చేయివేసి అడిగారు బాబా. “బాబా, మా పంతమే నెగ్గించుకుని మీకిష్టంలేని పని చేస్తున్న మాపై మీకెందుకింత ప్రేమ? పొద్దున్న నన్ను తిట్టారు, కొట్టబోయారు, చంపేస్తాననీ బెదిరించారు. అయినా ఇప్పుడు నేను అన్నం తినలేదని యింత బాధపడుతున్నారే? ఒక్కపూటకి ఏమవుతుందిలే అనుకోకుండా నా కన్నతల్లిని మించి యింత ప్రేమని నాపై మీరు తప్ప యింకెవరు చూపగలరు? బాబా! నా తల్లీ తండ్రి, గురువూ, దైవమూ, సర్వస్వమూ మీరే. నాకింకేమీ వద్దు. అనుక్షణం మీ పాదాలకు సేవ చేసుకునే అదృష్టమివ్వండి చాలు!” అన్నాడు పురందరే కన్నీళ్ళ మధ్య. "సర్లే, వెళ్ళి భోంచేసిరా ముందు” అని తల్లిలా ప్రేమగా కసిరారు బాబా. కళ్ళు తుడుచుకుని లేచాడు పురందరే. మసీదు దాటబోయి మళ్ళీ అనుమానం వచ్చి బాబా దగ్గరకొచ్చి అడిగాడు, "బాబా, నేనటు వెళ్ళగానే నా పని అంతా తలక్రిందులు చేసి అన్నీ బైట పడేయరు కదా?” అని. పసిపిల్లవాడ్ని చూసినట్లు పురందరేను చూసి చల్లగా నవ్వారు బాబా. “పిచ్చివాడా, నేనలా ఎందుకు చేస్తాను? ఏమీ చేయను. వెళ్ళి భోంచేసిరా” అని మాట యిచ్చారు. తర్వాత దీక్షిత్ వైపు తిరిగి, “ఏం చేస్తాం, బిడ్డ కాలిపై మలవిసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలిని నరుకుతామా? సహించవలసిందే కదా!” అన్నారు.

పురందరే నిశ్చింతగా వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ పని ప్రారంభించాడు. సాయంత్రానికి షెడ్డు నిర్మాణం అయిపోయింది. రెండు తలుపులు పెడదామనుకుంటే, అప్పటికి ఒక్క తలుపు మాత్రం బిగించటం అయింది. మరునాడు పురందరే ఊరికి తిరిగి వెళ్ళిపోవలసి ఉంది. ఆ ఒక్క తలుపు పని తాత్యాకి అప్పగిద్దాములే అనుకొని బాబా దగ్గరకు వచ్చి చెప్పాడు. “బాబా, దాదాపు పనంతా అయినట్లే, ఇంకొక్క తలుపు బిగించాలంతే. కానీ రేపటితో సెలవయిపోతుంది నాకు. మీరు అభ్యంతరం చెప్పకుండా వుంటే ఆ కాస్త పని తాత్యా చేస్తాడు” అని. “అది తర్వాత చూసుకుందాంలే. ముందెళ్ళి విశ్రాంతి తీసుకో! పొద్దున్నుంచి కష్టపడుతూనే వున్నావు” అన్నారు బాబా ఊదీ ఇస్తూ. పురందరే బాబాకు నమస్కరించి ఊదీ తీసుకుని వెళ్ళిపోయాడు. పురందరే వెళ్ళగానే బాబా కాకాసాహెబ్‌తో, "కాకా! ఎవరి మంచితనం ఎట్లావుంటే, వారి అభివృద్ధి కూడా అట్లాగే వుంటుంది” అని అన్నారు.

మరునాటి ఉదయం కాకడ ఆరతి అయ్యాక ఊరికి వెళ్ళేందుకని బాబాను సెలవు అడిగాడు పురందరే. “భావూ, చేద్దామని పూనుకున్న పని పూర్తిగా చేసే తీరాలి. సగంలో వదిలేసి ఇంకొకళ్ళకి అప్పగించకూడదు. ఈ పనీ మనదే, ఆ పనీ మనదే! నీ పని పూర్తిచేసి, ఊరికి రేపు వెళ్ళు” అని ఆప్యాయంగా చెప్పారు బాబా.

ఈ పని తలపెట్టినపుడు బాబా ఎంత వారించారు, కోప్పడ్డారు! కానీ ఇపుడదంతా మన్నించి ప్రేమనే కురిపిస్తున్నారు. “తండ్రీ, నేనెన్ని జన్మలెత్తినా నీ బిడ్డగానే ఉండాలి. కన్నుల్లో తిరగబోతున్న నీటినాపుకుని ఆ కృపాసాగరునికి మనసులోనే సాష్టాంగపడుతూ “సరే బాబా!” అంటూ ముందటిరోజు వదలిపెట్టిన పని పూర్తిచేయటానికి పూనుకున్నాడు పురందరే. అనుకున్న పనంతా అయ్యాక షెడ్డులోపల, తలుపుల వెనుక భద్రంగావున్న పల్లకీని ఓసారి నిశ్చింతగా చూసుకుని, అప్పుడు బాబా దగ్గర ప్రణమిల్లి సెలవడిగాడు పురందరే. “వెళ్ళిరా. కానీ తరచూ శిరిడీ వస్తూండు” అని ఆశీర్వదించారు బాబా. “అలాగే బాబా!” ఊదీ కళ్ళకద్దుకుంటూ అన్నాడు పురందరే. 

“వెళ్ళిరా పురందరే. శాశ్వతంగా సాయి పాదాలవద్ద నాకూ యింత చోటు కల్పించావు. నీ మేలు ఎన్నటికీ మరువను. సదా నీకు శుభమగుగాక!” అంటూ పల్లకీ కూడా నిండు మనసుతో పురందరేను దీవించింది.

సోర్స్: సాయిపథం ప్రథమ సంపుటము

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

6 comments:

  1. అద్భుతంగా ఉంది సాయీ.. Thank you so much for sharing

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  4. 🌼🌺🌺🙏🙏🙏 Om Sri Sairam 🌺🌺🌼

    ReplyDelete
  5. Om Sri Sai Nathaya Namah🌹🙇🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo