సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 145వ భాగం...


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. వృత్తి జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు
  2. నా పూర్తి ప్రార్థనకు బాబా సమాధానం లభించిన అనుభవం

నిన్నటి భక్తురాలి మరికొన్ని అనుభవాలు:-

వృత్తి జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు

నేను నా వృత్తి జీవితంలో కొన్ని అనుభవాలు చవిచూశాను. నేను కొన్నేళ్ల క్రితం ఒక ప్రాజెక్టులో పనిచేస్తుండేదాన్ని. ఒకానొక సమయంలో ఆ పనిలో బాగా విసిగిపోయి, "ఆ ప్రాజెక్టు నుండి నన్ను తొలగించి వేరే అంతర్గత ప్రాజెక్టులో వేయమ"ని నా పైఆఫీసర్లని అభ్యర్థించాను. వాళ్ళు నా అభ్యర్థనను మన్నించి నన్ను వేరే ప్రాజెక్టులో వేశారు. రెండునెలలు బాగానే గడిచింది. తరువాత వేరే ప్రాజెక్టు ఏదీ లైనులో లేకపోవడంతో ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పారు. నేను, "బాబా! నాకు ఏదైనా ప్రాజెక్టులో అవకాశం వచ్చేలా సహాయం చేయండి. ఆ ప్రాజెక్టు ద్వారా నా నుండి ఉత్తమమైన పనితీరు, సామర్థ్యం బయటకు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నా పాత ప్రాజెక్టులో పని ఉందని ఫోన్ వచ్చింది. ముందు ఏ ప్రాజెక్టయితే వద్దని బయటకు వచ్చానో మళ్ళీ అందులోకి అవకాశం అనేసరికి నేను నిరాశచెందాను. కానీ నాకు వేరే దారి కూడా లేక మళ్ళీ ఆ ప్రాజెక్టులో చేరాను. అయితే ఈసారి నేను చేయాల్సిన పనులు చాలా భిన్నమైనవి. పైగా ఆ పొజిషన్ నా కోసమే సృష్టించబడినట్లుగా ఉంది. నేను కోరుకున్నట్లుగా ఆ పని నిజంగా నాలోని ఉత్తమమైన పనితీరును బయటకు తీసుకొచ్చింది. ఎంతగా అంటే, ఆరునెలల్లో ఆశ్చర్యకరంగా నాకు ప్రమోషన్ లభించింది! స్వయంగా సాయిబాబానే నాకోసం ఆ పొజిషన్ ఏర్పాటు చేసి, నన్ను అందులో పెట్టారు.

మరో విషయం, ఆ ప్రాజెక్టులో చేరినప్పుడు భద్రతాపరమైన అనుమతి పొందాల్సి ఉండగా కొన్ని కారణాలరీత్యా నేను అందులో పాస్ కాలేనని అనిపించింది. అందువలన, "బాబా! ఈ విషయంలో నాకేదైనా మిరాకిల్ చూపించండి" అని ప్రార్థించాను. ఆ విషయమై మళ్ళీ మళ్ళీ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే, ఆ కారణంగా నేను ఆ ప్రాజెక్టుని వదులుకోదలుచుకోలేదు. ఒకరోజు ఆ విషయంగా ఆఫీసు వాళ్ళు నన్ను పిలిచారు. నేను భయపడుతూ వెళ్ళాను, కానీ బాబా అద్భుతం చేశారు. నేను వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకేమీ చెప్పకముందే వాళ్ళు, "మీరు ఇప్పుడేమీ భద్రతాపరమైన పేపర్ వర్క్ చేయనవసరంలేదు. మీ పాత ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్ వర్క్ సరిపోతుంది" అని చెప్పారు. నాతోపాటు అక్కడ ఆఫీసులో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

నా పూర్తి ప్రార్థనకు బాబా సమాధానం లభించిన అనుభవం

నా ఆరోగ్య విషయంలో కూడా బాబా నన్ను ఆశీర్వదిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. 2018, ఆగస్టులో నా కన్ను చాలా ఎర్రబారి నొప్పిగా ఉండేది. స్టెరాయిడ్లు వాడితే దీర్ఘకాలంలో కంటికి నష్టం వాటిల్లుతుందని విన్నందున నేను డాక్టరు వద్దకు వెళ్లాలని అనుకోలేదు. ఆ సమస్యతో ఇబ్బందిపడుతూనే బాబా మందిరానికి వెళ్లి, "బాబా! ఏ మందులూ అవసరం లేకుండా కేవలం మీ కృపతో నా ఈ కంటి సమస్య తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించాను. తరువాత ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ బాబా ఊదీని నా కనురెప్పలపై రాసుకుని, మరికొంత ఊదీ నీటిలో కలిపి త్రాగుతుండేదాన్ని. అయినప్పటికీ కంటి ఎర్రదనం తగ్గుతున్న సూచనలు కనపడలేదు. చివరగా నేను డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకుని కారు నడుపుతూ ఆసుపత్రికి బయలుదేరాను. కారు నడుపుతూ కారు అద్దంలో చూసుకున్నాను. కంటి ఎర్రదనం తగ్గడం మొదలైంది! ఆసుపత్రి వద్దకు చేరుకునే సమయానికి దాదాపు తగ్గిపోయింది. ఇంకా పెద్ద అద్భుతం - అప్పటికే డాక్టరు ఒక రోగిని పరీక్షిస్తున్న కారణంగా నన్ను చూడటానికి సమయం లేదని అక్కడి వాళ్ళు చెప్పారు. నా పూర్తి ప్రార్థనకు సమాధానం లభించిందని నాకు అర్థమైంది. అయినప్పటికీ నేను పూర్తిగా సమస్యపోయేందుకు కొద్ది నిమిషాలు కేటాయించి, నా సమస్యను పరిశీలించి మందులివ్వమని డాక్టరును అభ్యర్థించాను. దాంతో డాక్టరు కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ ఆ రాత్రి నేను ఇంటికి వచ్చే సమయానికి కంటి ఎర్రదనం పూర్తిగా తగ్గిపోయింది. వైద్యంతో పనిలేకుండా నా కంటి ఎర్రదనాన్ని నయం చేశారు బాబా. గత పదేళ్ళలో నాలో చాలా పరివర్తన తీసుకొచ్చిన శ్రీ సాయిబాబాకు నేనెంతో ఋణపడివున్నాను. నేను బాబా మందిరాన్ని సందర్శించిన ప్రతిసారీ కృతజ్ఞతతో వినయంగా బాబా ముందు తలవంచి ఆర్ద్రతతో నా మనస్సు, శరీరం, ఆత్మను ఆయనకు అర్పించుకుని నిరంతరం ఆయన నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన రక్షణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

source: 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo