సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 149వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం
  2. సాయి తీసుకొచ్చిన పరివర్తన

నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. ఆయన దయవల్ల నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. ముందుగా బ్లాగు, వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. మీ గ్రూపులో ఉండే అవకాశం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక గ్రూపు మాత్రమే కాదు, మా ఉనికికి ఒక మార్గం చూపుతుంది. భక్తులు పంచుకుంటున్న అనుభవాల ద్వారా ఎన్నో విషయాలకు బాబా పరిష్కారం చూపిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పనికి మా అందరి తరపున మీకు చాలా కృతజ్ఞతలు. ఇక నా అనుభవానికి వస్తే ...


శిరిడీలో నాకొక ఆశ్చర్యకరమైన అనుభవం జరిగింది. దాన్నిప్పుడు నేను మీతో పంచుకుంటాను. ఇటీవల మేము ముందుగా ప్రణాళిక చేసుకున్న తేదీన మా ఊరినుండి శిరిడీకి ప్రయాణమయ్యాము. అయితే మా ప్రయాణానికి నెలరోజుల ముందునుండి నేను నా నెలసరి విషయంగా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఆ సమస్య ఎక్కడ మా ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందో అనే ఆలోచనతో నేను చాలా భయపడ్డాను. విషయం ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఆందోళనపడుతూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో బ్లాగులో వచ్చిన "నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి" అనే అనుభవం చదివిన తరువాత నా మనసు సమాధానపడింది. దానితో ధైర్యంగా శిరిడీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దురదృష్టవశాత్తు శిరిడీ చేరుకున్న తర్వాత నాకు నెలసరి వచ్చింది. బాబా నుండి నాకు స్పష్టమైన సమాధానం వచ్చినప్పటికీ సమాధిమందిరంలోకి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది. అయినా 'తమకు అటువంటి పట్టింపులు లేవ'ని బాబా తన భక్తులకు ఎన్నో అనుభవాలిస్తుంటే నేనింకా భయపడటం సరికాదని నా హృదయాన్ని దృఢపరుచుకుని లోపలికి వెళ్ళాను. అద్భుతం! ఆరతి జరుగుతున్నంతసేపూ, అంటే దాదాపు 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం తమకు దగ్గరగా నిలబడే అవకాశాన్నిచ్చారు బాబా. ఆరతి పాడేవాళ్ళు కూడా నా వెనుక నిలబడ్డారు. బాబా నన్ను అంత గొప్పగా చూసుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదంతా వ్రాస్తూ ఆ క్షణాన నేను పొందిన మధురానుభూతిని మళ్ళీ అనుభూతి చెందుతున్నాను. నా శరీరమంతా రోమాంచితం అవుతుంది. "చక్కటి అనుభవాన్నిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మనం బాబాతో వ్యవహరించినట్లే ఆయన మనతో వ్యవహరిస్తారు. ఆయన మననుండి ఆశించేది భక్తి, ప్రేమలను మాత్రమే. మరేవీ ఆయనకు, మనకు మధ్య అడ్డుకావు. ఆయన వేర్వేరు మార్గాల ద్వారా మన సమస్యలకు సమాధానాలు ఇస్తారు. ఆయనిచ్చే సమాధానాలు తగిన వ్యక్తికి తగిన విధంగా చేరుతాయి.

"నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి" అనుభవం చదవాలనుకునే వారికోసం క్రింద లింకు ఇస్తున్నాను.


సాయి తీసుకొచ్చిన పరివర్తన

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాకు 22 ఏళ్లు. నేను ప్రస్తుతం గుర్గాఁవ్ లోని ఒక టెలికాం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. అంతకుముందు నేనొక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేదాన్ని. నా స్నేహితులంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో మంచిస్థాయిలో ఉండటంతో నేను అసూయ చెందుతూ వాళ్లతో కలవలేకపోయేదాన్ని. ఆ కారణాల వల్ల నేను చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ నెలలు గడుస్తున్నా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. ఈలోగా నాకు అర్హత లేనప్పటికీ బాబా అనుగ్రహం వలన నా జీతం 40% పెరిగింది. అయినప్పటికీ నా మనసుకు ప్రశాంతత లేదు. ఒకరోజు, "దేవా! నా స్నేహితులపట్ల అసూయ చెందడం నాకిష్టంలేదు. న్యూనతా భావంతో వాళ్లతో నేను కలవలేకపోతున్నాను. దయచేసి నాకు మంచి సంస్థలో ఉద్యోగాన్ని ఇవ్వండి" అని నిజాయితీగా బాబాను ప్రార్థించాను. అదేరోజు నాకొక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అయితే అది నేను చేస్తున్న ఉద్యోగానికి పూర్తి భిన్నమైనది. కానీ అమ్మాయిలకి చాలా అనుకూలమైనది కావడంతో నేను చాలా సంతోషించాను. గూగుల్ లో వెతికి కష్టపడి ఇంటర్వ్యూ కోసం ఒక రోజంతా చదివాను. రోజుల తరబడి అదే సబ్జెక్టు మీదే జ్ఞానం సంపాదించిన వారికి, ఒక్కరోజులో ప్రిపేరైన నాకు చాలా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ బాబా కృపవలన నేను ఎంపిక కాబడతానని నాకు పూర్తి నమ్మకముంది. ఒక గురువారంనాడు నా ఇంటర్వ్యూ జరిగింది. ఒకటి తరువాత ఒకటి, మొత్తం నాలుగు రౌండ్లు పూర్తి చేశాను. రెండురోజుల తరువాత బాబా మహాసమాధి రోజున కంపెనీ వాళ్ళు  ఫోన్ చేసి నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అవధులు లేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, నా కుటుంబసభ్యులతో ఆ సంతోషకరమైన వార్తను పంచుకున్నాను.

ఆ తరువాత వారం గడిచినా వాళ్ళనుండి ఏ కాల్ లేకపోవడంతో మరుసటి గురువారం నేను కంపెనీకి ఫోన్ చేశాను. వాళ్ళు నా జీతానికి సంబంధించిన సమస్య వలన నన్ను హోల్డ్ లో పెట్టి, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పారు. ఆ మాటతో నా గుండె బద్దలైపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ, "సాయిదేవా! దయచేసి నాకా ఉద్యోగాన్ని ఇప్పించండి" అని అభ్యర్థించాను. మరుసటిరోజు నాకొక కల వచ్చింది. కల స్పష్టంగా గుర్తులేదుగాని, కలలో నేనొక పూలమాలను బాబాకి సమర్పిస్తున్నాను. ఆ సాయంత్రం నేను గుడికి వెళ్లి, షాపులో పూలమాల తీసుకుంటుండగా కంపెనీ హెచ్.ఆర్. నుండి ఫోన్ వచ్చింది. అతను, "మేము మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీకు సమ్మతమైతే, ఇప్పటికే మేము తీసుకున్న వ్యక్తి వేరే బ్రాంచ్ కి వెళ్తార"ని చెప్పారు. నేను వెంటనే నా అంగీకారం తెలిపాను. ఆ ఆనందంలో బాబాకి పూలమాల సమర్పించుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ తరువాత కూడా కంపెనీ నుండి స్పందన లేదు. వారం గడిచాక నేను ఫోన్ చేస్తే, "కొన్ని కారణాల వలన మిమ్మల్ని హోల్డ్ లో పెట్టాం" అన్నారు. మళ్ళీ నేను కృంగిపోయాను. ఎంతో బాధతో, "బాబా! నా విషయంలో ఎందుకిలా చేస్తున్నారు? ఇలా చేయడం మీకు తగునా?" అని సాయితో పోరాడాను. "దయచేసి నన్ను అనుగ్రహించండి" అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాను. మరుసటిరోజే కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, "మీ ఉద్యోగం నిశ్చయమైంది. మీ శాలరీ స్లిప్స్, ఇతర డాక్యుమెంట్లు పంపించండి" అన్నారు. మళ్ళీ సంతోషంతో బాబాకి క్షమాపణలు చెప్పి, "ఆశాభంగమైన కారణంగా బాధలో మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఇకపై మీకు తగిన బిడ్డగా ఉంటాను" అని బాబాకు వాగ్దానం చేశాను.

అయితే తరువాత కూడా వాళ్ళనుండి ఎటువంటి స్పందనా లేదు. మళ్ళీ నేనే ఫోన్ చేసి అడిగితే, వాళ్ళు, "ఇంక మీరు వేచి ఉండనవసరం లేదు. మాకు కావాల్సిన, ఆ ఉద్యోగానికి తగిన వ్యక్తి దొరికారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ప్రయత్నించండి" అని స్పష్టంగా చెప్పేశారు. అంతా ఒక ఆటలా సాగింది. కానీ ఈసారి నేను ఏడవలేదు, అదే ఉద్యోగం కావాలని పట్టుబట్టలేదు, బాబాతో పోట్లాడలేదు. ప్రశాంతంగా పూర్తి విశ్వాసంతో, "దేవా! ఎన్నో ఏళ్లుగా మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ ఉద్యోగం ఇవ్వడం లేదంటే అందులో ఏవో సమస్యలు ఉండే ఉంటాయి. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి. ఐ లవ్ యు సాయి" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు గురువారం, నేను ఆశ్చర్యపోయేలా హెచ్.ఆర్. ఫోన్ చేసి, "మేము చేసిన గందరగోళానికి క్షమాపణలు చెప్తున్నాను. మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వండి" అని చెప్పారు. అంతేకాదు, నేను అడిగిన శాలరీ హైక్(జీతం పెంపు) కూడా ఇచ్చారు. ఇదంతా సాయి లీల. ఏ పరిస్థితులు ఎదురైనా చెదిరిపోకుండా, ఎప్పుడూ నమ్మకాన్ని కలిగివుండే ఆయనకు తగిన బిడ్డగా నన్ను మలిచారు. "ఐ లవ్ యు సాయీ!"

అంతేకాదు, నా పాత కంపెనీనుండి నాకు రిలీవింగ్ లెటర్ వచ్చేలా కూడా బాబా సహకరించారు. 7 నెలల క్రితమే 40% శాలరీ హైక్ ఇచ్చినందువలన రిలీవింగ్ లెటర్ ఇవ్వడంలో వాళ్ళు నాకు సమస్యలు సృష్టించారు. కానీ సాయి ఉండగా దేనికైనా అసాధ్యమనేది ఉంటుందా? అందరికీ సాయిరామ్! 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo