సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 148వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా ఆశీస్సులతో మా అబ్బాయికి వచ్చిన ఉద్యోగం
  2. బాబాకు భక్తునిగా మార్చిన పొరపాటు

బాబా ఆశీస్సులతో మా అబ్బాయికి వచ్చిన ఉద్యోగం

విశాఖపట్నం నుండి శ్రీమతి నాగలక్ష్మి తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ముందుగా శిరిడీ సాయినాథుని పాదపద్మములకు నా శతసహస్ర వందనములు. సాయిభక్తులకు మరియు ‘సాయిభక్తుల అనుభవమాలిక’ నిర్వహిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలులు.

నా పేరు కాళీపట్నపు నాగలక్ష్మి. విశాఖపట్నం వాస్తవ్యురాలిని. నేనొక సామాన్య గృహిణిని. మావారు ప్రభుత్వ ఉద్యోగి. సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఎంతో తన్మయత్వానికి లోనై, నేను కూడా బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వస్తున్నాను.

మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ శిరిడీసాయి దయవలన మా అమ్మాయి పెళ్లి 2019, మే 26న మేము ఘనంగా జరిపించాము. మా అబ్బాయి శరత్ బి.టెక్ పూర్తిచేసి దాదాపు ఒక సంవత్సరంనుంచి ఏ ఉద్యోగమూ రాక ఖాళీగా ఉంటున్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు, కానీ ఫలితం లేదు. దానితో తను బాగా నిరాశ చెంది ఇక ఇంటర్వ్యూలకు వెళ్లనని, పైచదువులు చదువుతానని ఒక నిర్ణయానికి వచ్చాడు. మేము కూడా నిర్ణయం బాబాకే వదిలేశాము. అటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ 2019 జులై 16న. అదేరోజు ఇంకో ఇంటర్వ్యూకి కూడా ఇంకో కంపెనీ వారు పిలిచారు. ఆ రెండు ఇంటర్వ్యూలకు హాజరైన తరువాత పైచదువులు చదవడానికి ఒక నిర్ణయం తీసుకుంటానన్నాడు మా అబ్బాయి.

విశేషం ఏమిటంటే ఆ ఇంటర్వ్యూ జరిగే రోజు గురుపూర్ణిమ కావడం. ఆరోజు మా ఇంటిల్లిపాదీ మా అబ్బాయి ఉద్యోగం గురించి బాబాను ప్రార్థించాము. ఆ మరునాడు మా అబ్బాయి తను రాతపరీక్షలో ఉత్తీర్ణుడినయ్యానని, తరువాత ఇంకొక పరీక్ష 2019, జులై 18, గురువారంనాడు ఉందని చెప్పాడు. మా శ్రీవారు ప్రతిరోజూ బాబా గుడికి వెళతారు. ఆ రోజు కూడా బాబా గుడికి వెళ్లి, "మా అబ్బాయికి ఉద్యోగం ప్రసాదించమ"ని బాబాని వేడుకున్నారు. "బాబా! మీ అనుగ్రహం మా అబ్బాయిపై వున్నదనటానికి గుర్తుగా ఏదైనా నిదర్శనాన్ని (అంటే, బాబా మీద ఉండే పువ్వయినా రాలేటట్టుగా) చూపండి" అని కూడా బాబాను వేడుకున్నారు. కానీ ఎంతసేపు ఎదురుచూసినా ఆ నిదర్శనం కనబడకపోయేసరికి మావారు నిరాశతో పూజారి ఇచ్చిన తీర్థం తీసుకొని వచ్చేస్తుండగా, పూజారి వెనక్కి పిలిచి బాబా ప్రసాదంగా ఒక రొట్టెను మావారి చేతికందించారు. అప్పటివరకు క్యూలో ఎవరికీ రొట్టెను ప్రసాదంగా ఇవ్వలేదు. అలాంటిది ప్రత్యేకంగా తనకే రొట్టె ఇవ్వడంతో ఆ విధంగా బాబా నిదర్శనం చూపించారని మావారు గ్రహించి ఆనందపరవశులై మరొక్కసారి బాబాను దర్శించుకొని నమస్కరించుకున్నారు. తరువాత గుడినుండి ఇంటికి వస్తూనే నాతో ఆ విషయం చెప్పి బాబా ప్రసాదం నాకిచ్చారు. నేను కూడా చాలా సంతోషించాను. ఆ తరువాత ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయాము. సాయంత్రం 4 గంటలకు, 'తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానని, వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవమన్నారని' మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. మా ఆనందానికి అవధులు లేవు. మా అబ్బాయికి ఉద్యోగం ప్రసాదించినందుకు మేము బాబాకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇప్పుడు బాబా దయవల్ల మా అబ్బాయి హైదరాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా సమస్యలు అన్నీ కూడా బాబా తీరుస్తూనే వున్నారు. మేమే బాబా లీలలను అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ నెల 28న బాబా దర్శనానికి శిరిడీ బయలుదేరుతున్నాము. మా శిరిడీ యాత్ర విజయవంతంగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ శిరిడీ సాయినాథుని కరుణాకటాక్షములు కలగాలని మనసారా కోరుకుంటున్నాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబాకు భక్తునిగా మార్చిన పొరపాటు

సాయిభక్తుడు సెంథిల్ సచిన్ ఒక సాయి లీలను మనతో పంచుకుంటున్నారు.

2014వ సంవత్సరంలో నేను, నా స్నేహితుడు అనూప్ కాగ్నిజెంట్ అనే ప్రసిద్ధ సంస్థలో పనిచేస్తూండేవాళ్ళం. ఇద్దరమూ నెట్‌వర్క్ టీములో చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒకరోజు అనూప్ ఒక కస్టమర్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలపై నెట్‌వర్క్ మార్పు చేయాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో అనూప్ చేసిన పొరపాటు కారణంగా కస్టమర్ పై భారీ ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్య అయ్యింది. డెలివరీ మేనేజర్స్ ఆ స్థలాన్ని సందర్శించి వివరణ కోరుతూ అనూప్ మీద తీవ్రంగా అరిచారు. నిజంగా అది చాలా ఇబ్బందికరమైన, బాధాకరమైన పరిస్థితి. పొరపాటుగా జరిగినప్పటికీ దాదాపు అతడిని ఉద్యోగం నుండి తొలగించడానికి నిర్ణయించారు. అసలే ఆర్థికపరమైన సమస్యలున్న నా స్నేహితుడు నిరాశతో చాలా ఆందోళనకు లోనయ్యాడు. ఆ సమయంలో నేను అనూప్‌తో, "ఇలాంటి పరిస్థితిలో బాబా మాత్రమే మనకు రక్షణనివ్వగలరు.  ఆయనను ప్రార్థించు" అని చెప్పాను. నేను చెప్పినట్లుగానే అనూప్ హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాడు. నేను కూడా, "అనూప్ ఉద్యోగాన్ని కాపాడమ"ని బాబాను ప్రార్థించాను. అద్భుతం! కొద్దిసేపటిలో పరిస్థితి చాలా ప్రశాంతంగా మారిపోయింది. తను ఆ విషమ పరిస్థితి నుండి బయటపడ్డాడు. మా టీమ్ లీడర్ వచ్చి నా స్నేహితునితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ, "ఇది ఈ సంస్థలో చాలా అరుదైన సందర్భం. సాధారణంగా అయితే పనిలో ఏవైనా లోపాలు తలెత్తితే ఉద్యోగం నుండి తీసేస్తారు. కానీ నీ అదృష్టం బాగుంది" అన్నారు. దయగల బాబా తనని రక్షించారు. ఆ క్షణంనుండి అనూప్ బాబాకు భక్తుడిగా మారిపోయాడు. 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo