సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 127వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. స్వలాభం కోసం కాక దీనార్తుల కోసం ప్రార్థిస్తే బాబా తప్పక కరుణిస్తారు
  2. బాబా ఉనికిని తెలియజేసిన కొన్ని లీలలు

స్వలాభం కోసం కాక దీనార్తుల కోసం ప్రార్థిస్తే బాబా తప్పక కరుణిస్తారు

సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు సుధాకర్. నేను గుంటూరులో నివసిస్తున్నాను. నేను వృత్తిరీత్యా లాయరుని. ఇంతకుముందు ఈ బ్లాగులో నా అనుభవాలు కొన్నింటిని పంచుకున్నాను. సాయి దయ అపారమైనది. నేను చాలాకాలం క్రితం అద్దంకి కోర్టులో ఒక కేసు దాఖలు చేశాను. కానీ, కోర్టులో దానిని స్వీకరించక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. 2019, జులై 30వ తారీఖున కోర్టులో ఆ కేసు స్వీకరించకపోతే నాకు సమయం వృధా, కేసు వేసిన వారికి చాలా నష్టం జరుగుతుంది. నేను ఆరోజు ఉదయం అద్దంకి వెళ్ళి కోర్టులో చాలా బ్రతిమాలాను. "జడ్జిగారికి చెబుతాం, వారి దయ, వారు కేసు పిలిచినప్పుడు చెప్పుకోండి" అని చెప్పారు. ఆరోజు కేసు విని నిర్ణయం చెప్పకపోతే పార్టీలకు అన్యాయం జరుగుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక బాబా పైనే భారం వేసి, నేను ఒక గదిలో కూర్చుని బాబా జీవితచరిత్ర పారాయణ చేసుకుంటూ, "ఇది నా కోసం కాదు, కేసు  వేసిన వారికోసం. వారికి న్యాయం చేయండి" అని బాబాను వేడుకుంటూ ఉన్నాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు కోర్టువారు నా కేసు పిలిచారు. నా వాదన విని జడ్జిగారు నా పార్టీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది బాబా అపూర్వ కరుణవల్ల జరిగింది. బాబా చరణారవిందాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.

ఈ అనుభవం ద్వారా 'స్వలాభం కోసం కాక దీనార్తుల కోసం ప్రార్థిస్తే బాబా మన ప్రక్కనే ఉండి కరుణిస్తాడ'ని ఋజువవుతోంది.

సాయిబాబా పిలిచిన పలికే దైవం.

బాబా ఉనికిని తెలియజేసిన కొన్ని లీలలు

బెంగళూరునుండి సాయిబంధువు దివ్య అనిల్ తనకి తెలిసినవారి అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

నేను రోజూ బెంగళూరులో ఉన్న బుడిగెరె సాయిబాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. ఆ మందిరం శిరిడీని తలపిస్తుంది. శిరిడీలో ఉన్నట్లుగానే సమాధిమందిరం, ద్వారకామాయి, చావడి, గురుస్థాన్ మరియు లెండీబాగ్ ఉన్నాయి. ఆ మందిరంలో మేనేజరుగా పనిచేస్తున్న మురళిగారి అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి లీల:

సమాధిమందిరం, ద్వారకామాయి నిర్మాణం పూర్తైన తరువాత ఒకరోజు మురళిగారు చెక్కబల్లలు ధునిలో వేస్తుండగా ఎవరో వెనుకనుండి వచ్చి అతని వీపుపై తట్టి త్వరత్వరగా వెళ్ళిపోయినట్లు అనిపించింది. వెంటనే అతను వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. వీపుపై చాలా నెమ్మదిగా తట్టినప్పటికీ ఆ స్పర్శానుభూతి ఒక వారం వరకు అలాగే ఉంది. అప్పుడు, 'వెనుకనుండి తనను తట్టినది వేరెవరో కాదు, బాబానే!' అని గ్రహించారతను.

రెండవ లీల:


ఒకరోజు రాత్రి మురళిగారు, అతని భార్య తమ ఇంటి వరండాలో నిద్రపోతున్నారు. మధ్యరాత్రిలో గాలివాన కారణంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. గాలి తీవ్రత వలన కిటికీల చప్పుడుకి అతనికి మెలుకువ వచ్చి చూస్తే, వాళ్ళ ఇంటిముందున్న కొబ్బరిచెట్టుపై ఒక దీపపు కాంతిలో సాయిబాబా ముఖం స్పష్టంగా కనిపించింది. అతను ఆశ్చర్యంతో తన భార్యను నిద్రలేపారు. ఆమె నిద్రలేస్తూనే, "ఎందుకు నన్ను నిద్రలేపారు? బాబా కలలో దర్శనమిస్తుంటే, మీరెందుకు భంగపరిచారు?" అని అన్నది. ఆమె మాటలు విని అతను మళ్ళీ ఆశ్చర్యపోతూ, "బాబా ఇక్కడ కూడా ఉన్నారు. మన కొబ్బరిచెట్టు మీద చూడు!" అన్నారు. ఇద్దరూ బాబాను చూసి ఆనందంలో మునిగిపోయారు. ఆవిధంగా తమను బాబా ఆశీర్వదించినట్లుగా చాలా సంతోషించారు. బాబా సర్వాంతర్యామి.

మూడవ లీల:

ఆ మందిరానికి చాలామంది భక్తులు వస్తుంటారు. చాలామంది స్వచ్ఛంద సేవకులు కూడా ఉన్నారు. ఒకరోజు వాళ్లలో ఒక పెద్దాయన రాలేదు. మిగిలినవాళ్లంతా భోజనాల హాలులో కూర్చుని, 'ఆ పెద్దాయన ఎందుకు రాలేద'ని మాట్లాడుకుంటున్నారు. అంతలో సమాధిమందిరం ముందు నుండి ఆ పెద్దాయన గొంతుతో ఒక స్వచ్ఛంద సేవకుని పేరుపెట్టి పిలవడం వినిపించింది. గోడ అడ్డంగా ఉండటం వలన పెద్దాయన వాళ్లకు కనిపించలేదు. కానీ ఆ సేవకుడు, "ఇటు రండి కాకా! మేమంతా భోజనాల హాలులో ఉన్నాము" అని చెప్పాడు. అందరూ పెద్దాయన రాకకోసం ఎదురుచూశారు గానీ పెద్దాయన రాలేదు. మరుసటివారం పెద్దాయన రాగానే వాళ్లంతా, "గతవారం మీ పిలుపు విన్నాం, కానీ మీరెక్కడా కనిపించలేదు. అంతలోనే ఎక్కడికి వెళ్లిపోయారు?" అని అడిగారు. అందుకు పెద్దాయన ఆశ్చర్యంతో, "నేనసలు ఆరోజు మందిరానికి రాలేదు. నేను మా ఊరికి వెళ్ళాను" అని చెప్పారు. ఆయన సమాధానం వింటూనే అందరూ మూగబోయారు. అప్పుడందరూ 'ఆయన గొంతుతో మాట్లాడింది బాబానే, వేరే వారు కాదు' అని గ్రహించారు. బాబా తమ ఉనికిని తెలియజేసే మార్గాలు ప్రత్యేకమైనవి. ఇవన్నీ మురళిగారి అనుభవాలు. 

ఒకసారి ధునిలో బాబా నాకు, నా స్నేహితులకు దర్శనం ఇచ్చారు. ఆ అనుభవాన్ని త్వరలో మీతో పంచుకుంటాను.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2390.html

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo