సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 143వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. పాచిపోయిన చపాతీలు ఆరగించింది నా మాలికే!
  2. అవకాశమే లేకపోయినా బాబా కృపతో మళ్ళీ ప్రెగ్నెన్సీ

పాచిపోయిన చపాతీలు ఆరగించింది నా మాలికే!

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నా గురించి చెప్పాలంటే, నేను నా మాలిక్(సాయి) బిడ్డని. ఆయన లేనిదే నేను లేను. నా ప్రతిశ్వాస ఆయన ఆశీర్వాదమే. ఇక నా అనుభవానికి వస్తే...

అల్లా(సాయి) విజయదశమిని ఈ అమాయక భక్తురాలికి ప్రత్యేకమైన రోజుగా మలచిన అనుభవమిది. దసరారోజు ఉదయం నేను నా అల్లాకోసం ఏదైనా స్వీటు చేయాలని అనుకున్నాను. అదేరోజు ఒక గుడిలో జరుగుతున్న రామాయణం పారాయణకు నాకు ఆహ్వానం రావడంతో స్వీటు సాయంత్రం చేసి మాలిక్ కు సమర్పిద్దామని అనుకున్నాను. తర్వాత గుడికి వెళ్లి పారాయణలో పాల్గొన్నాను. అదే నేను మొదటిసారిగా ఆ గుడికి వెళ్లడం కావడంతో అక్కడున్న దేవతలందరి దర్శనం చేసుకుంటూ, ఏదైనా రూపంలో సాయిబాబా దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాను. అయితే ఆ మందిర ప్రాంగణంలో ఎక్కడా బాబా విగ్రహం గాని, పటం గాని కనిపించలేదు. కానీ నాకు తెలిసిన ఒక ఆంటీ కనిపించారు. ఆ సమయంలో నాకు దాహంగా ఉండటంతో ఆంటీ, "మా ఇంటికొచ్చి మంచినీళ్ళు త్రాగు" అని చెప్పి, అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళింటికి  తీసుకుని వెళ్ళారు. అక్కడ నన్ను ఆశీర్వదించడానికి అందమైన నవ్వుతో సాయిబాబా వేచివున్నారు. అలా ఆయన దర్శనమిచ్చి నా కోరిక తీర్చారు. మధ్యాహ్నమంతా అలా గడిచిపోయింది. సాయికి స్వీట్ పెట్టాలన్న నా ఆలోచన కూడా మర్చిపోయాను.

సాయంత్రం పూజ చేసి, బాబాకు హారతి ఇచ్చాక ఆయనకోసం ఏమీ చేయలేకపోయానని నన్ను నేను దోషిగా భావించుకుని, "బాబా! ఈరోజు ఇంత ప్రత్యేకమైనరోజు, అయినప్పటికీ నేను మీకు ఏమీ ప్రత్యేకంగా చేయలేకపోయాను. నేను మిమ్మల్ని అంతగా ప్రేమించట్లేదు" అని చెప్పుకుని నా గదిలోకి వెళ్ళబోయాను. అంతలో మా పక్కింటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. కాసేపటికి హఠాత్తుగా నేను, "నీకు ఏమైనా కావాలా?" అని అడిగాను. అలా ఎందుకు అడిగానో నాకే తెలీదు. నిజానికి నేనెప్పుడూ తనను అలా అడగలేదు. తను వెంటనే, "నాకు ఆకలిగా ఉంద"ని చెప్పింది. నేను, "ఏం కావాలి?" అని అడిగాను. అందుకు తను, "నాకు ప్రత్యేకంగా ఇది కావాలి అని ఏమీలేదు. మీ ఇంట్లో ఏం పెట్టినా తింటాను" అని అంది. నేను సరదాగా, "పాచిపోయిన చపాతీలున్నాయి, తింటావా?" అని అడిగాను. నిజానికి వాటినే పెట్టాలని నాకేం లేదు. అయినా అతిథికి అలాంటివి పెడతామా? నేను సరదాగా అన్నాను, అంతే! కానీ తను, "నేను పాచిపోయిన చపాతీలైనా తింటాను, సిగ్గుపడను అక్కా. దయచేసి నాకు అవే ఇవ్వండి"  అని అంది. నేను బటర్‌తో చపాతీలు వేడిచేసి, కూరతోపాటు తనకిచ్చాను. తర్వాత నేను, "మీ సిస్టర్ కి కూడా ఆకలిగా ఉన్నట్లయితే తనని కూడా పిలువు" అన్నాను. తను వెళ్లి తన సిస్టర్ ని పిలిచింది. ఇద్దరూ చపాతీలు, కూర తిని, వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. మొత్తం జరిగినదంతా గమనించండి. వాళ్ళిద్దరూ మా పక్కింటివాళ్లు. వాళ్ల అమ్మ ఎప్పుడూ చెప్తుంటారు, "ఏది ఎలా ఉన్నా మా లంచ్, డిన్నర్ సమయానికల్లా చేస్తామ"ని. అలాంటిది ఆరోజు వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి, పాచిపోయిన చపాతీలు తిన్నారు. ఆ రూపంలో చపాతీలు ఆరగించింది నా మాలికే! ఆయన మననుండి ఏదీ డిమాండ్ చేయరు, మన ప్రేమని తప్ప. నేను ఆయనకోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం మర్చిపోయాను. కానీ ఆయన మా ఇంట్లో ఉన్నదే తిన్నారు. అలా పాచిపోయిన చపాతీలతో ఆ రోజుని ప్రత్యేకంగా మలిచారు నా మాలిక్. ఆయనకు తన బిడ్డలపై ఉన్న ప్రేమను ఎప్పటికీ ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎంత లోతైనది ఆయన ప్రేమ! ఆయన నీడలో ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. నా మాలిక్ మీ అందరి కోరికలు నెరవేర్చుగాక! ఆయన పాదాల చెంతనే మనకు శాంతి లభిస్తుంది. అల్లా మనకోసం, మన చేయి పట్టుకుని నడిపించడం కోసమే ఉన్నారు.

అవకాశమే లేకపోయినా బాబా కృపతో మళ్ళీ ప్రెగ్నెన్సీ

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చాలాకాలంగా సాయిభక్తురాలిని. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన నాకు సరైన మార్గం చూపించి కాపాడుతున్నారు. ఐదేళ్లుగా మేము రెండవ బిడ్డకోసం చూస్తున్నాము. డాక్టర్లు నా ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోయాయని, అందువలన సహజ పద్ధతిలో బిడ్డ పుట్టే అవకాశం లేదని చెప్పి, ఐ.వి.ఎఫ్. పద్ధతిలో ప్రయత్నిద్దామని చెప్పారు. సరేనని ఆ ప్రయత్నం చేశాము. కానీ విజయవంతం కాలేదు. సరొగసీ పద్ధతి ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ప్రయత్నాలు చేస్తున్న సమయమంతా నేను దామూ అన్నాకు, ఇంకా ఇతర భక్తులకు సంతానాన్ని ప్రసాదించిన బాబా లీలలు తలచుకుంటూ ఉండేదాన్ని. అలవాటుగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు ఊదీ తీసుకుంటూ బాబాను ప్రార్థిస్తుండేదాన్ని.
మా పాప తనకు తమ్ముడు గాని, చెల్లెలు గాని కావాలని ఆరాటపడుతుండటంతో చివరికి దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకుని అందుకు అవసరమైన ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాము. అదలా ఉంటే 2018, ఆగస్టులో మేము ఇండియా వెళ్లి సెప్టెంబర్ మొదటివారంలో యు.ఎస్ తిరిగి వచ్చాము. ఆగష్టు చివరివారంలో రావలసిన నా నెలసరి సెప్టెంబర్ రెండోవారం వచ్చినా రాలేదు. పైగా వచ్చే సూచనలు కూడా ఏమీ కనపడలేదు. సెప్టెంబర్ 13న ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. బాబా అద్భుత లీల చూపారు. నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యింది. ముందు ఆయన మా విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షించిన తరువాత అనుగ్రహించారు. డాక్టర్లు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదన్నప్పటికీ బాబా అపారమైన కృప చూపించారు. ఆయన లీలలు వర్ణించడానికి పదాలు లేవు. "మీ అద్వితీయమైన ఆశీస్సులకు నా కృతజ్ఞతలు బాబా!"

source: 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo