సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1095వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా బాబా అనుగ్రహం లభిస్తుంది. 
2. బాబా ప్రసాదించిన ఆనందం

మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా బాబా అనుగ్రహం లభిస్తుంది.


నేను సాయిభక్తురాలిని. నేను ఎప్పుడూ బాబాకే అన్నీ  చెప్పుకుంటాను. ఎందుకంటే, దేవుడు మాత్రమే నా బాధని విని తీరుస్తాడని నేను గట్టిగా నమ్ముతాను. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఈమధ్యకాలంలో మా ఇంట్లోవాళ్ళు నాకు ఒక పెళ్లిసంబంధం చూశారు. వాళ్ళు పెళ్ళిచూపులకి కూడా వస్తామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల నాకు ఆ సంబంధం నచ్చలేదు. కానీ అది ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో అర్ధంకాక నాలో నేనే నలిగిపోతుండేదాన్ని. చాలా భయంగానూ, బాధగానూ ఉండేది. అన్నీ తెలిసిన బాబా ఏదో ఒకటి చేస్తారని దృఢమైన నమ్మకం ఉన్నప్పటికీ టెన్షన్‍లో, "ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు?" అని కోపంతో బాబాని ఏదేదో అనేదాన్ని. మళ్లీ అంతలోనే, "నువ్వే నాకు దిక్కు" అని అనుకునేదాన్ని. ఒకరోజు నాకు బాగా ఏడుపొచ్చి, "బాబా! ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? అన్నీ నువ్వే చేసి ఇప్పుడిలా నన్ను బాధపెడుతున్నావు. నువ్వు తప్ప నా బాధ ఎవరు వింటారు? నాపై దయచూపు తండ్రీ" అని బాగా బాధపడ్డాను. బాబా దయచూపారు. నిజంగా నేను ఊహించని అద్భుతమది. పెళ్ళిచూపులకి వస్తామన్న వాళ్ళే కాల్ చేసి, "ఇప్పుడు మాకు రావడానికి కుదరదు" అని చెప్పారు. నా బాధను విన్న బాబా మాత్రమే ఇది చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు నా మీద చూపించే ప్రేమకి, చేసిన సహాయానికి నేను సదా మీకు ఋణపడి ఉంటాను. ఆ సంబంధం ఎలాగైనా క్యాన్సిల్ అయ్యేలా చేయండి బాబా. నా మనసులో ఉన్నది, నేను కోరుకునేది మీకు తెలుసు. అది జరిగేలా చేయండి బాబా. నాకు అన్నీ మీరే బాబా".


ఇటీవల నాకు ఒక కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చింది. వాళ్ళు ఫలానా తేదీన జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ విడుదల చేశారు. అయితే, నేను ఆ తేదీని మరో తేదీకి మార్చమని ఆ కంపెనీ హెచ్.ఆర్‍ ని అడగాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అడిగితే ఒప్పుకుంటారో, లేదోనని నాకు  చాలా భయమేసింది. అప్పుడు బాబాని తలచుకుని, "బాబా! హెచ్.ఆర్ ఏమీ అనకుండా నా అభ్యర్థనకు ఒప్పుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుని హెచ్.ఆర్‍ కి కాల్ చేశాను. తను నేను చెప్పింది విని సింపుల్‍గా సరేనని చెప్పి, జాయినింగ్ తేదీ మార్చి కొత్త ఆఫర్ లెటర్ పంపించారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు చేసిన సహాయం వల్లే ఇది సాధ్యమైంది".


కొత్త కంపెనీలో ఉద్యోగం వచ్చిన తరువాత అదివరకు పాత కంపెనీలో నాతో కలిసి చాలాకాలం పనిచేసిన నా ఫ్రెండ్‍కి కూడా కొత్త కంపెనీలో ఉద్యోగం రావాలని తలచి తన రెజ్యూమ్ కొత్త కంపెనీవాళ్ళకి రిఫర్ చేశాను. వెంటనే కంపెనీ హెచ్.ఆర్. నా ఫ్రెండ్‍కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నారు. అయితే నా ఫ్రెండ్‍కి జీతం కొంచెం ఎక్కువగా ఉన్నందువల్లనో లేక మరే ఇతర కారణంగానో తెలీదుగానీ చాలారోజుల వరకు కంపెనీవాళ్ల నుంచి ఏ స్పందనా రాలేదు. నా ఫ్రెండ్‍కి కాల్ చేస్తే తను, "నేను కాల్ చేస్తే, హెచ్.ఆర్‍ పర్సన్‌కి కోవిడ్ వచ్చి సెలవులో ఉంటూ ఏమీ గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు" అని చెప్పింది. అది విని నాకు చాలా బాధగా అనిపించింది. కానీ బాబా మీద దృఢమైన నమ్మకముంచి నా ఫ్రెండ్‍తో, "బాబా ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆయనపై నమ్మకముంచు, చాలు" అని చెప్పి హెచ్.ఆర్‍ కాల్ చేస్తుందని వేచి చూశాను. తరువాత ఒకరోజు మావైపు నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిదనిపించి హెచ్.ఆర్‍.కి కాల్ చేసి విషయం గుర్తుచేశాను. తను వెంటనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. ఎటువంటి ఆశా లేకున్నా బాబా సహాయం చేస్తారన్న నా నమ్మకం వల్లే ఇది సాధ్యమైందనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఇంటర్వ్యూ బాగా జరిగి తనకి ఉద్యోగం రావాలి" అని బాబాను చాలా వేడుకున్నాను. తరువాత నా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో కూడా నేను బాబాను తలచుకున్నాను. ఒక గంటసేపు ఇంటర్వ్యూ జరిగింది. వెంటనే నా ఫ్రెండ్ కాల్ చేసి, "ఇంటర్వ్యూలో నాకు అనుభవంలేని వాటిపై కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను చెప్పలేకపోయాను. నేను ఉద్యోగానికి ఎంపిక అవుతానో, లేదో" అని అంది. దానికి తోడు ఇంటర్వ్యూ స్టేటస్ గురించి అడుగుదామని కంపెనీవాళ్ళకి కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఎటువంటి సమాధానమూ ఉండేది కాదు. నాకు చాలా బాధగా అనిపించి బాబా ఏం చెప్తారో చూద్దామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ కింది మెసేజెస్ వచ్చాయి.

'రేపు నీకు పరిష్కారం లభిస్తుంది. భయానికి కారణం లేదు. సన్మానం పొందేరోజు దగ్గరలో ఉంది. మీకు విజయం, కీర్తి, గౌరవం లభిస్తాయి'.

'దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనను విశ్వసిస్తే! అల్లా (దేవుడు) అత్యున్నత శక్తివంతుడు.. చనిపోయిన మనిషిని సైతం ఆయన బతికించగలడు. బిడ్డా! ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనపై నమ్మకముంచు'.

'ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది.... నీకు శుభవార్త అందుతుంది... సంతోషకరమైన రోజులు చూడటానికి సిద్ధంగా ఉండు... నేను నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను..'


అప్పుడు నేను, 'బాబా దయవల్ల మొదటి రౌండ్ ఫలితం మంచిగా వస్తే గురువారం గుడికి వెళ్ళి ఉపవాసం ఉందామ'ని అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. అయినా నా మనసుకి 'ఏదీ బాగోనప్పుడు కూడా దేవుడి మీద నమ్మకముంటే, అదే నిజమైన నమ్మకం' అనిపించి, "బాబా! ఏది ఎలా జరిగినా మీరు మంచి చేస్తారు. నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యేలా మీరు చేస్తారు" అని చెప్పుకుని నమ్మకంతో బాబా గుడికి వెళ్ళాను. అక్కడ బాబాతో, "బాబా! మీరు మెసేజ్ ద్వారా నాకు మాటిచ్చారు. అది ఖచ్చితంగా మీరు చేస్తారు. మీరు మాట తప్పరు" అని అనుకున్నాను. తరువాత గుడినుంచి ఇంటికి వచ్చి సచ్చరిత్ర పారాయణ చేశాను. ఆ సమయంలో చాలా బాధనిపించి, "ఎందుకు బాబా ఇంతలా పరీక్షిస్తున్నావు? నా భక్తి నిజం కాదా? నాకు భక్తి లేదా? నా భక్తి మీకు కనిపించట్లేదా? మీరు నా మాటలు వింటున్నారా బాబా? శిరిడీ వద్దామనుకుంటే, నేను అనుకున్నది ఎందుకు జరిగేలా చేయట్లేదు? నేనంటే నీకు ఇష్టం లేదా?" అని బాబా ఫోటో ముందు కాసేపు కోపంగా ఏదేదో అన్నాను. తరువాత నేను 'పారాయణ పూర్తయ్యేలోపు కంపెనీ నుంచి నాకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది' అని అనుకున్నాను. కానీ ఏ మెసేజ్ రాలేదు. దాంతో నేనే ఒకసారి అడుగుదామని హెచ్.ఆర్‍.కి మెసేజ్ చేశాను. తరువాత దానిగురించి మర్చిపోయాను. కాసేపటి తర్వాత ఫోన్ చూస్తే, హెచ్.ఆర్. రిప్లై ఉంది. విషయమేమిటంటే, 'నా ఫ్రెండ్ మొదటి రౌండ్ విజయవంతంగా పూర్తిచేసింది. మరుసటిరోజు తనకి రెండో రౌండ్ ఇంటర్వ్యూ ఉంది'. ఆ మెసేజ్ చూశాక నా బాబా నాకోసం ఇదంతా చేశారనిపించి నాకు కలిగిన సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఓపికతో వేచివుంటే అన్నీ బాబా చూసుకుంటారని ఇంకోసారి నిరూపించారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా. ఇంతకుమించి నేనేం చెప్పగలను? రెండో రౌండ్ ఇంటర్వ్యూ మంచిగా అయ్యేలా చూడు తండ్రీ. దయతో నా ఫ్రెండ్‍కి ఎలాగైనా ఆఫర్ వచ్చేలా చేయండి తండ్రీ. మీరు చేస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకముంది. తనకి ఉద్యోగమొస్తే మళ్లీ నేను ఈ బ్లాగులో పంచుకుంటాను. శిరిడీ వచ్చేందుకు నాకు మార్గం సుగమం చేశావు. త్వరలోనే వస్తాను బాబా".


నా అనుభవంతో ప్రతి ఒక్కరికీ చెప్పేది ఒక్కటే, 'ఎటువంటి ఆశా కనిపించని స్థితిలో కూడా బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన ఖచ్చితంగా దారి చూపిస్తారు. అన్నీ బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా దేవుడ్ని నమ్ముతారు. కానీ ఏదీ బాగోనప్పుడు, ఏ ఆశా లేనప్పుడు కూడా బాబా మీద నమ్మకముంటే అదే నిజమైన నమ్మకం. అటువంటి నమ్మకముంటే మీరు ఆశ్చర్యపోయేలా బాబా తామున్నామని నిరూపిస్తారు. "బాబా! మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. నా జీవితంలో ప్రతిక్షణం, ప్రతి విషయంలో నువ్వు ఉన్నావని నిరూపిస్తున్నావు బాబా. టెన్షన్ పెడతావు, మీ మీద నమ్మకంతో మేము వేచి ఉంటామా, లేదా అని చూస్తావు, మాకు ఓపికను నేర్పిస్తావు, మీ లీలలు మాకు అర్థం కావు తండ్రీ. కానీ నేను ఎప్పుడూ మిమ్మల్నే నమ్ముకున్నానయ్యా".


బాబా ప్రసాదించిన ఆనందం


సాయిబంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈ బ్లాగును ఈమధ్యకాలంలోనే చూశాను. అప్పటినుండి నేను క్రమంతప్పకుండా ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. మీ అందరి అనుభవాలు చదవడం వల్ల మూడు సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలకుంటున్నాను. అప్పట్లో మేము ఒక సొంత ఇల్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు ఒకరోజు రాత్రి గం.8.30నిమిషాలకు మేము బాబా గుడికి వెళ్ళాము. గుడిలో ఉండగా నాకు సచ్చరిత్రలోని భక్తుడు చోల్కరు కథనం గుర్తుకువచ్చి, "బాబా! మీరు మాకు ఒక సొంత ఇల్లు ఇచ్చేవరకు నాకు చాలా ఇష్టమైన పులిహోర తినను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతలో పూజారి పులిహోర ప్రసాదంగా ఇచ్చారు. అప్పుడు నేను, "బాబా! పూజారిగారు ఇంకాస్త పులిహోర పెడితే బాగుండు. ఎందుకంటే, మీరు అనుగ్రహించేవరకు నేను మళ్ళీ పులిహోర తినను కదా!" అని అనుకుని బయటకు వచ్చాను. కాస్త ముందుకు వెళ్ళగానే వెనుకనుండి పూజారిగారు నన్ను పిలిచి, "కొంచెం పులిహోర ఇస్తాను, తీసుకుని వెళ్ళండి" అని అన్నారు. నాకు ఎంత ఆనందమేసిందో నేను చెప్పలేను. ఆ బాబా అనుగ్రహాన్ని గుర్తుచేసుకున్న ప్రతిసారీ నాకు అంతే ఆనందంగా ఉంటుంది. అయితే బాబా మాకు ఇంకా సొంత ఇంటిని అనుగ్రహించలేదు. బాబా మమ్మల్ని అనుగ్రహించగానే మీతో తప్పకుండా పంచుకుంటాను.


ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటాను. ఈమధ్య నేను బ్లాగులో బాబా తనచేత సప్తశనివారవ్రతం ఎలా పూర్తి చేయించారనే ఒక భక్తురాలి అనుభవం చూశాను. అది చదివినంతనే నాకు కూడా ఆ వ్రతం చేయాలనిపించి సప్తశనివారవ్రతం చేశాను. ఆ పూజలో ఉపయోగించిన వెండి ఇల్లు అలాగే మా ఇంట్లో కొన్నిరోజులు ఉండిపోయింది. దానిని 'మా ఇంటి దగ్గరున్న వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవ్వాల'ని నేను, 'లేదు, తిరుపతిలో ఇవ్వాల'ని మావారు. అలా అనుకుంటూనే 3, 4 నెలలు గడిచాయి. అప్పుడు నేను, "బాబా! వీలైనంత త్వరగా ఆ వెండి ఇల్లు స్వామివారి గుడికి చేర్చితే, నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల 15 రోజులలో మావారికి తిరుపతి దర్శనానికి టికెట్ దొరికింది. దాంతో మావారు తిరుపతి వెళ్ళి వచ్చారు. నేను బాబా ప్రసాదించిన అనుగ్రహానికి ఆనందంలో మునిగిపోయాను. అందుకే వెంటనే ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇలా ఎన్నో విషయాల్లో బాబా నాకు సహాయం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ నచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1094వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని ప్రసాదించే సాయి
2. బాబా దయతో చక్కబడిన ఆరోగ్యం
3. సమస్య ఎలాంటిదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది

ఆరోగ్యాన్ని ప్రసాదించే సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. కోవిడ్ కాలంలో ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలైంది. మేము ఎంతో ఆందోళన చెందాము. కానీ సాయి మాకు తోడుగా ఉన్నారు. ఆయన ఒక డాక్టరు ద్వారా మాకు సహాయం అందించారు. ఆ డాక్టరు అమ్మకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. ఏ సమస్యా లేకుండా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడండి సాయీ".


కరోనా మూడో వేవ్‍లో మావారికి జ్వరం వచ్చింది. కానీ బాబా దయవలన రెండు రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇంకా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి బాబా దయవలన తగ్గిపోతాయని నా నమ్మకం.


దసరా సమయంలో నాకు జ్వరం వచ్చింది. ఆ సమయంలో మా ఇంటి చుట్టూ డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. అందువల్ల నాకు కూడా డెంగ్యూ జ్వరమే అయుంటుంది అనిపించింది. అయినా నేను ఏ టెస్టు చేయించుకోకుండా బాబా మీద నమ్మకముంచి పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకుంటూ, బొప్పాయి జ్యూస్ త్రాగాను. బాబా దయవలన జ్వరం రెండు రోజులలో తగ్గింది. కానీ కీళ్ళనొప్పులు 3 నెలల వరకు ఉన్నాయి. అయినా నేను డాక్టరు దగ్గరకి వెళ్లకుండా, "బాబా! నొప్పులు తగ్గితే, 5 వారాలు పూజ చేస్తాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, బాబా దయవలన నొప్పులు తగ్గిపోయాయి.


ఇటీవల ఒకసారి నాకు కంటికి సంబంధించి ఒక చిన్న సమస్య వచ్చింది. డాక్టరు దగ్గరకి వెళితే, "ఏమీ పర్వాలేదు" అని చెప్పి ఐ-డ్రాప్స్ ఇచ్చారు. బాబా దయవలన నాకు చాలామటుకు నయమైంది. త్వరలో పూర్తిగా తగ్గిపోతుందని నా విశ్వాసం. ఇలా సాయి నాకు, మా కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబా దయతో చక్కబడిన ఆరోగ్యం


సాయినాథునికి, ఈ బ్లాగ్ నిర్వహకులకు నా నమస్కారాలు. నా పేరు ఇందిర. నాకు సమస్తం శ్రీసాయినాథుడే. నా భర్త విషయమై నేను పడిన ఇబ్బందుల గురించి, బాబా దయవల్ల వాటినుండి బయటపడటం గురించి నేను ఇదివరకు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ముందుగా, నా అనుభవాలను పంచుకోవటంలో నేను చాలా ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నాను. మా పాప విజయవాడలో చదువుతుంది. అసలే అంతంత మాత్రంగా ఉండే మావారి ఆరోగ్యరీత్యా మా పాపను చూడడానికి వెళ్ళిరావటం మాకు ఒక పెద్ద పని అయింది. ఒకరోజు నేను, మావారు బండి మీద విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద వాన పడింది. రెండు రోజుల తరువాత మావారికి 103 డిగ్రీల జ్వరమొచ్చి చాలా ఇబ్బందిపడ్డారు. నాకు కూడా జ్వరం వచ్చింది. డాక్టరు వైరల్ ఫీవర్ అని చెప్పి మందులిచ్చారు. కానీ మందులు వాడుతున్నప్పటికీ మావారికి జ్వరం తగ్గకపోగా షుగర్ డౌన్ అయిపోయి చాలా ఇబ్బందిపడ్డారు. మరోవైపు జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్న నాకు 'ఆయనకి ఏమవుతుందోన'ని చాలా భయమేసి బాబా మీద భారం వేసి ఊదీ మావారి నుదుటన పెట్టి, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి ఇచ్చి, బాబా నామం చేస్తూ ఉండేదాన్ని. పదిరోజులకి ఆయన కోలుకున్నారు కానీ, చాలా నీరసంగా ఉండేవారు. ఇలా ఉండగా నెలరోజుల వ్యవధిలోనే మావారికి మళ్లీ జ్వరం వచ్చింది. అప్పుడు కూడా నేను బాబానే నమ్ముకుని, "బాబా! మీ దయతో ఈ పరిస్థితులన్నీ చక్కబడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో మెల్లగా మావారికి జ్వరం తగ్గి పరిస్థితులు చక్కబడ్డాయి. కానీ నేనే నా అనుభవాన్ని పంచుకోవడంలో చాలా ఆలస్యం చేశాను. అందుకు మరోసారి బాబాని క్షమాపణలు వేడుకుంటున్నాను.


మన కర్మల ఫలితాలను మనం తప్పక అనుభవించాలి. అవి ఒక్కరోజులో తీరిపోయేవి కావు. అందుకే నేను, 'కష్టాలని, బాధలని తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగే శక్తిని నాకు, నా బిడ్డలకు ప్రసాదించమ'ని బాబాని ప్రతినిత్యం వేడుకుంటాను. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మా అత్తగారి పరిస్థితి బాగోలేదు. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆవిడ త్వరగా కోలుకోవాలి తండ్రీ. నా భర్త విషయంలో నేను చెప్పలేని మానసిక ఆందోళనకి గురవుతున్నాను. ఆయన విషయంగా నేను మీకు మొరపెట్టుకోని రోజు లేదు. స్వతహా ఆయన మంచివారే. కాకపోతే అతి ప్రేమ, అతి కోపం. ఆయన స్థిర చిత్తాన్ని, మానసిక సమతుల్యాన్ని కలిగి ఉంటూ అటు ఆరోగ్యపరంగా, ఇటు కుటుంబపరంగా ఉన్నతమైన వ్యక్తిగా ఉండేలా అనుగ్రహించండి. చల్లని తండ్రి బాబా, మీ కరుణ ఎల్లవేళలా అందరిపై ఉండాలి తండ్రీ. ధన్యవాదాలు".


సమస్య ఎలాంటిదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది


అందరికీ నమస్కారం. ముందుగా సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహకులకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కొన్ని అనుభవాలను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మీ ముందుకు వచ్చాను. నాకు పెళ్ళై 3 సంత్సరాలైంది. మాకు ఒక పాప. మేము తనకి 'రిత్విక సాయి' అని పేరు పెట్టుకున్నాము. ఈమధ్య ఒకరోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మేము మంచి నిద్రలో ఉండగా మా పాప మంచం మీద నుండి కింద పడిపోయింది. పెద్దగా శబ్దం వినబడటంతో మాకు మెలకువ వచ్చి చూస్తే పాప ఏడుస్తోంది. నేను తన తలకి దెబ్బ తగిలి ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్నట్లే తలకు దెబ్బ తగిలి వాపు వచ్చింది. అది చూసి నేను చాలా కంగారుపడ్డాను. ఏం చేయాలో తెలియక మనసులోనే, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామం జపిస్తూ, "పాపకు ఏమీ కాకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. కాసేపటికి పాప ఏడవడం ఆపి నిద్రపోవడంతో మేము కూడా నిద్రపోయాము. పొద్దునే లేచి చూస్తే, ఆశ్చర్యం! దెబ్బ తగిలిన చోట రాత్రి ఉన్న వాపు ఏ మాత్రమూ లేదు, మునుపటిలా మామూలుగా ఉంది. అది చూసి మేము చాలా సంతోషించాము. "ధన్యవాదాలు బాబా. ఇలాగే అందరి కష్టాలను కడతేర్చు తండ్రీ. ఉద్యోగం గురించి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాను బాబా. దయచేసి కరుణించు తండ్రీ సాయినాథా".


సర్వేజనాః సుఖినోభవంతు!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!





సాయిభక్తుల అనుభవమాలిక 1093వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మాపై చూపిన కరుణ
2. ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు
3. పిలిస్తే పలుకుతారు బాబా

బాబా మాపై చూపిన కరుణ

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలలను భక్తులకు అందజేస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనిప్పుడు బాబా మాపైన చూపిన కరుణను మీతో చెప్పబోతున్నాను. నేను నా కిందటి అనుభవంలో గర్భవతిగా ఉన్న నా భార్యకి స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు సిస్ట్ ఉందని చెప్పాను. ఆ కరుణామూర్తి దయవల్ల 2022, ఫిబ్రవరి రెండోవారంలో డాక్టరు మళ్ళీ స్కాన్ చేసి, "ఇప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉంది, సిస్ట్ చాలావరకు నయమైంది. ఇంజెక్షన్‍తో పూర్తిగా తగ్గిపోతుంది" అని చెప్పారు.

మొదటిసారి నా భార్య గర్భం దాల్చినప్పుడు మూడవ నెలలో గర్భం పోయింది. అందుకే ఈసారి మూడవ నెల రాగానే అంటే ఫిబ్రవరి మూడోవారంలో బాబా మీద నమ్మకం ఉంచి NT స్కాన్ చేయించడానికి హాస్పిటల్‍కి వెళ్ళాం. స్కానింగ్ చేసేటప్పుడు బిడ్డ పొజిషన్ గురించి ఏమీ తెలియట్లేదని డాక్టరు చెప్పారు. రెండు, మూడుసార్లు స్కాన్ చేసినా బిడ్డ పొజిషన్ తెలియకపోవడంతో డాక్టరు, "రాత్రి 8 గంటలకి మళ్ళీ రమ్మ"ని అన్నారు. వెంటనే మేము బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఈసారి స్కానింగ్ బాగా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాం. రాత్రి మళ్ళీ బాబాకి దణ్ణం పెట్టుకుని స్కానింగ్‍కి వెళ్ళాం. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ కరుణామూర్తి అనుగ్రహం వల్ల స్కానింగ్ ప్రక్రియ మొదటి ప్రయత్నంలోనే బిడ్డ కదులుతూ కనిపించింది. డాక్టరు, "తల, కాళ్ళు ఏర్పడ్డాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంది" అని చెప్పడంతో హమ్మయ్య అనుకున్నాం. "మిమ్మల్ని శరణు వేడిన వారిని ఎల్లప్పుడూ కరుణిస్తూ ఉంటావు సాయినాథా. ఇలానే మా బిడ్డని కాపాడుతూ చక్కగా ప్రసవమై బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చూడు తండ్రి". ఇకపోతే అదే సమయంలో చేసిన బ్లడ్ టెస్టు రిపోర్టు వారం తరువాత వచ్చింది. అందులో ఆల్ఫా మరియు బీటా వాల్యూస్ మారుతున్నట్లు ఉంది. డాక్టరు, "ఈసారి వచ్చినప్పుడు మరోసారి చెక్ చేద్దాం" అని అన్నారు. ఆ బాబా దయవల్ల ఈసారి చెకప్‍కి వెళ్ళినపుడు బ్లడ్ టెస్టు రిపోర్టు నార్మల్ రావాలని కోరుకుంటున్నాను. "ఆ రిపోర్టు నార్మల్ వస్తే బ్లాగులో పంచుకుంటాను సాయినాథా. మీ కరుణాకటాక్షాలు ఎప్పుడూ మీ భక్తులపై చూపుతూ ఉండండి తండ్రి".

మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తే 2022, ఫిబ్రవరి మొదటి వారంలో ఆమెను డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాము. డాక్టరు, "కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది. మందులు వాడి చూడాలి" అన్నారు. దాంతో నేను రెండో వారంలో నా భార్యని చూపించే డాక్టరు దగ్గరకి నా భార్యతోపాటు అమ్మను కూడా తీసుకుని వెళ్ళాను. అప్పుడు, "ఏ సమస్యా లేకుంటే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకుని మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరిస్తూ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. ఆ బాబా ఆశీర్వాదం వల్ల అమ్మని చూసిన డాక్టరు, "పెద్దగా సమస్య ఏమీ లేదు. కొన్నిరోజుల్లో నయం అయిపోతుంది" అని అన్నారు.

ఈమధ్య నేను దాచిపెట్టుకున్న నా డబ్బుల నుండి 30,000 రూపాయలతో ఒక వన్ ప్లస్ మొబైల్ కొన్నాను. కొన్నిరోజులు బాగానే పనిచేసిన తరువాత హఠాత్తుగా ఒకరోజు మొబైల్ డిస్ప్లే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా డిస్ప్లే ఆన్ అవ్వలేదు. అప్పుడు సాయినాథుని తలుచుకుని ప్రయత్నిస్తే, వెంటనే ఆన్ అయ్యింది. అప్పుడు నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాను. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ, నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పెద్ద విషయం. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!

ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు

సాయి బంధువులందరికీ నమస్కారం. నాపేరు మహేష్. శ్రీసాయినాథునికి, మా ఇంటి దైవం కొమురవెల్లి శ్రీ మల్లన్నస్వామికి నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య మా పక్కింటివారితో కొంచెం స్థలం విషయంగా ఒక సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఎలాంటి గొడవ, ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారమైతే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయతో ఆ సమస్యను ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించారు. "ధన్యవాదాలు సాయినాథా". ఈమధ్య ఒకరోజు మా అక్క మెట్లు దిగుతుండగా కాలుజారి పాదం చాలా నొప్పి పెట్టింది. నేను ఆయింట్మెంట్ రాసి, ఆపై బాబా ఊదీ కూడా రాసాను. తరువాత, "బాబా! అక్కకి నొప్పి తగ్గి ఎలాంటి సమస్య లేకుండా చూడండి. అలా అయితే ఈ అనుభవం మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి నొప్పి కొంతవరకు తగ్గింది. ఇలా ఎల్లప్పుడూ బాబా మాతోనే ఉన్నారు. "మీకు శతకోటి వందనాలు బాబా. అక్కకి పాదం నొప్పి పూర్తిగా తగ్గించండి. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది బాబా. మమ్మల్ని ఆదుకోండి. మంచిరోజులు వచ్చేటట్లు చెయ్యండి బాబా. నాకు ఒక బ్రతుకుదెరువు చూపించండి బాబా. చాలారోజులు నుండి శ్రద్ధ, సబూరిలతో ఎదురుచూస్తున్నాను బాబా. కృపతో అతిత్వరలో అనుగ్రహించి నా అనుభవాలను పంచుకునే అవకాశమిస్తారని ఆశిస్తున్నాను తండ్రి".

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

పిలిస్తే పలుకుతారు బాబా

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు గంగా భవాని. మాది వైజాగ్. నేను చిన్నప్పటినుండి సాయి భక్తురాలిని. నాకు అన్ని ఆయనే. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవం పంచుకుంటాను. 2022, ఫిబ్రవరి 12 రాత్రి ఎందుకోగాని మా మనవరాలు(అక్క కూతురు) విపరీతంగా ఏడుస్తూ అస్సలు నిద్రపోలేదు. టానిక్ పట్టినా ఏడుపు ఆపలేదు. తను అంతలా ఏడుస్తుంటే నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు బాబా ఊదీ పెట్టి, "పాప ఏడుపు ఆపేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల పాప కాసేపటికి ఏడుపు ఆపింది. నేను కాస్త నెయ్యి వెచ్చబెట్టి పాపకి తినిపించాను. పాప హాయిగా పడుకుంది. అంతా బాబా దయ. ఆయన పిలిస్తే పలుకుతారు. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. "ధన్యవాదాలు బాబా. మీ కరుణాకటాక్షవీక్షణాలతో అందరినీ చల్లగా చూడు తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1092వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు
2. అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం
3. బాబా దయతో కుదుటపడిన ఆరోగ్యం

నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు

సద్గురు శ్రీసాయినాథునికి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి భక్తులకు నా అభినందన పూర్వక కృతజ్ఞతలు. నా పేరు సత్యనారాయణ. మాది రావులపాలెం. 2021, మే నెలలో మా నాన్నగారు ఒక్కసారిగా విపరీతమైన, విరోచనాలతో అనారోగ్యంపాలై బాగా నీరసించిపోయారు. దగ్గర్లోని ఆసుపత్రిలో ఆయనను చేర్చగా టెస్టులు చేస్తే నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది. తరువాత నాన్న ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అప్పుడు నేను, "బాబా! మానాన్నగారికి స్వస్థత చేకూర్చి, మాకెవరికీ కరోనా రాకుండా ఉండేలా చూడండి తండ్రి. అలా జరిగితే ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన తర్వాత గంటకి నాన్న జ్వరం తగ్గడం మొదలై రెండు రోజుల్లో నార్మల్ అయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. సాయినాథుని కృపవలన మా ఇంట్లో ఇంకెవ్వరికీ కరోనా సోకలేదు. ఆలస్యమైనా అనుకున్న ప్రకారం నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. "బాబా! ఆలస్యానికి క్షమించు తండ్రి".

తర్వాత ఒకసారి మా మేనల్లుడికి జ్వరం, జలుబు వచ్చాయి. అప్పుడు కూడా నేను మునపటిలాగే బాబాకి చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. మర్నాటికి కరోనా కాదని తెలియడమే కాకుండా జ్వరం, జలుబు తగ్గిపోయి వాడికి ఆరోగ్యం చేకూరింది. ఆ బాబా దయవలనే ఇది సాధ్యమైందని నా నమ్మకం. "కృతజ్ఞతలు సాయినాథా!".

కొన్నిరోజుల తరువాత ఒకరోజు రాత్రి హఠాత్తుగా గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే నేను కొద్దిగా బాబా ఊదీ సేవించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ నిద్రపోయాను. ఉదయానికి అంతా నార్మల్ అయింది. మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని కోరుకుంటే ఎటువంటి విషయంలోనైనా బాబా అనుగ్రహం పొందగలం. ఆయనే నా నమ్మకం. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి కొదవలేదు. "ధన్యవాదాలు బాబా. ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడండి బాబా".

అద్భుత రీతిన బాబా ప్రసాదించిన ఉద్యోగం

నేను ఒక సాయి భక్తురాలిని. మన జీవితాలలో బాబా చేసే అద్భుతాలకు అంతులేదు. మనం ఎప్పుడూ ఆయనకి ఋణపడి ఉండాలి. మా పిల్లలిద్దరికీ ఉద్యోగం బాబానే ప్రసాదించారు. ముందుగా దయతో మా పెద్దబాబుకి మంచి ఉద్యోగం ప్రసాదించి మా బెంగను తీర్చారు. తరువాత మా చిన్నబాబు ఉద్యోగ విషయంలో బాబా చేసిన అద్భుతాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఆరునెలల క్రితం మా చిన్నబాబు బి.టెక్ పూర్తి చేశాడు. తనకి క్యాంపస్ సెలక్షన్‌‍లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన తరువాత ఒకరోజు బాబు నాతో, "అమ్మా! నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. నేను ఆ కంపెనీకి దరఖాస్తు చేయలేదుగానీ, వాళ్ళే ఇంటర్వ్యూకి పిలిచారు. నేను ఉద్యోగంలో చేరింది ఇప్పుడే కదా! ఇంతలోనే నాకు ఇంకో ఉద్యోగం ఎందుకు? ఒక సంవత్సరం అయ్యాక వేరే ఉద్యోగం గురించి చూస్తాను. కానీ వాళ్ళు పిలిచినందుకుగానూ ఊరికే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను" అని అన్నాడు. నేను తనతో, "సరే, ముందు ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వు. మిగిలిన విషయాలు ఇంటర్వ్యూ అయ్యాక చూడొచ్చు" అని చెప్పి నా అలవాటు ప్రకారం మన బాబా దగ్గరకి వెళ్లి, "తండ్రీ! మీ దయ. మీకు ఎలా అనిపిస్తే, అది చేయండి" అని ప్రార్థించి, ఊదీ బాబుకి పెట్టి బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. ఆరోజు బాబా రోజు, గురువారం. ఆరోజు మధ్యాహ్నం చాలాసేపు ఇంటర్వ్యూ జరగడం, వాళ్ళు వెంటనే ఎంత జీతం కావాలని అడగడం, ఆఫరు లెటర్ ఇవ్వడం, వెంటనే ఉద్యోగంలో చేరాలని చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అసలు ఒకేరోజులో అంతా జరిగిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. కొత్త ఉద్యోగం మేనేజర్ పోస్ట్. పైగా మేము ఉన్న ఊరిలోనే. కెరీర్ ప్రారంభంలోనే మేనేజర్ పోస్ట్ రావడమన్నది బాబా అపార అనుగ్రహానికి నిదర్శనం. "సాయినాథా! ప్రతిజన్మలోనూ మీరు మాకు తోడుగా ఉండి సదా మా యోగక్షేమాలు చూసుకుంటూ కాపాడు తండ్రి. మా పిల్లలిద్దరినీ మీ చేతుల్లో పెట్టాను. ఇక వాళ్ళ భారం మీదే. వాళ్లిద్దరూ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు. మీ దయతో పెద్దబాబుకి త్వరగా వీసా వచ్చి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమెరికా ప్రయాణమయ్యేలా ఆశీర్వదించు తండ్రి. అలాగే మా వ్యాపారం అభివృద్ధి చెందేలా, మావారికి ఉపాధి దొరికేలా అనుగ్రహించి తద్వారా ఋణ విముక్తి గావించి, మా ఆతురతలను తీసివేసి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చి మనఃశాంతిని ప్రసాదించు తండ్రి. అలాగే మాకు, మా మేనకోడలికి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. తను మీ బిడ్డ తండ్రి. దయతో తనని బ్రతించించావు. కష్టపెట్టకు తండ్రి. తన భారాన్ని మీరు తీసుకుని తనపై దయచూపు తండ్రి".

బాబా దయతో కుదుటపడిన ఆరోగ్యం

సాయి భక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు నేను ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఉన్నట్టుండి మా తమ్ముడికి జ్వరం, తలనొప్పి మొదలయ్యాయి. డాక్టరు దగ్గరికి వెళితే, టెస్టు చేసి కొన్ని టాబ్లెట్లతోపాటు ఇంజక్షన్ కూడా వ్రాశారు. హాస్పిటల్లోనే యాంటిబయోటిక్ ఇంజక్షన్ వేశాక ఇంటికి వచ్చాము. అయితే ఇంటికొచ్చాక తమ్ముడికి విరోచనాలు, వాంతులు కూడా మొదలయ్యాయి. టాబ్లెట్ వేసినా తగ్గలేదు. మరుసటిరోజు ఉదయం అర్.యమ్.పి డాక్టరుని పిలిపించి విరోచనాలు, వాంతులు తగ్గడానికి ఇంజక్షన్ చేయించి, సెలైన్ పెట్టించాం. దాంతో మా తమ్ముడు ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు, ఒళ్లంతా చల్లబడిపోయింది. మేము చాలా భయపడిపోయి వెంటనే తమ్ముడిని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. నేను, "బాబా! మా తమ్ముడు త్వరగా కోలుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడికి యాంటిబయోటిక్ ఇంజెక్షన్ పడలేదని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారు. దాంతో తన ఆరోగ్యం కుదుటపడింది. అయితే నేను నా మ్రొక్కును మర్చిపోయాను. తరువాత అదివరకు నాకు ఒకసారి వచ్చి తగ్గిన ఒక అనారోగ్య సమస్య మళ్లీ మొదలైంది. అప్పుడు బాబాకి క్షమాపణలు చెప్పుకుని వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం బ్లాగు వారికి పంపించాను. "ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. ఎల్లప్పుడూ మీ కృప మా అందరిపై ఉండేలా అనుగ్రహించు తండ్రి. మీ ప్రేమను ఇంకా ఇంకా తోటి భక్తులతో పంచుకునేందుకు నాకు చాలా చాలా అనుభవాలను ప్రసాదించు తండ్రి".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1091వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నందుకు మంచి చేసిన బాబా
2. అనుగ్రహప్రదాత సాయి
3. శ్రీసాయి కృప

నమ్ముకున్నందుకు మంచి చేసిన బాబా


ముందుగా బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు పావని. సాయి నా వెంటే ఉంటూ ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. నేను సాయికి ఎంతో ఋణపడి ఉన్నాను. ఆయన మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా మామయ్యగారికి 70 సంవత్సరాలు. ఆయన చాలా మంచివారు. ఒకరోజు ఆయనకి తలలో విపరీతమైన నొప్పి వచ్చి బాగా వాంతులు అయ్యాయి. దాంతో మేము ఆయనను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ అన్నిరకాల టెస్టులు చేసి, "తలలో నరం ఉబ్బింది. ఆపరేషన్ చేయాలి. కానీ ఆపరేషన్ చేసినా చెప్పలేము. అలాగని ఆపరేషన్ చేయకపోతే ఉబ్బిన నరం చిట్లిపోయి కోమాలోకి వెళ్లి ఏదైనా జరగొచ్చు" అన్నారు. అంటే, ఆపరేషన్ చేసినా, చేయకున్నా సమస్యే. మా అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను, "బాబా! మామయ్యగారికి ఆపరేషన్ లేకుండా తగ్గిపోవాలి. నీవే మాకు దిక్కు సాయీ. కరుణించు తండ్రీ. నేను ఇంతవరకు శిరిడీ వెళ్ళలేదు బాబా. వెళ్ళాలని చాలా కోరిక. మీ దయ ఉంటేనే ఎవరైనా శిరిడీ వెళ్ళగలరని విన్నాను. నాకు అంత అదృష్టం లేదేమో, నా మీద మీకింకా దయ రాలేదేమో తండ్రీ. మామయ్యగారికి ఆపరేషన్ లేకుండా నయమైతే నేను శిరిడీ వస్తాను. అలా జరగకుంటే నేను నా జీవితంలో శిరిడీ రాను సాయీ. కరుణించి కాపాడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. మనసులో మాత్రం 'ఒకవేళ మావయ్యకి ఆపరేషన్ అన్నారంటే, నేను శిరిడీ వెళ్ళలేను కదా!' అని బాధపడ్డాను. సరే, మొదట మామయ్యని ఖమ్మంలో చూపించిన మేము, డాక్టర్లు చెప్పినందువల్ల ఆయన్ని హైదరాబాద్ తీసుకుని వెళ్లి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టరుకి చూపించాం. ఆయన కూడా ఖమ్మం డాక్టరు చెప్పినట్లే చెప్పారు. దాంతో నేను, "ఇప్పుడెలా బాబా? నేను ఎందుకలా మొక్కుకున్నాను? మామయ్యకు తగ్గదా? నేను శిరిడీ వెళ్లలేనా?" అని అనుకున్నాను. తరువాత మేము మామయ్యను నిమ్స్‌కి తీసుకుని వెళ్ళాము. వాళ్ళు అన్ని టెస్టులు రాశారు. ఒకరోజంతా టెస్టులు జరిగాయి. తరువాతరోజు రిపోర్టులు వచ్చాయి. మరుసటిరోజు డాక్టరు చూస్తారనగా నేను, "బాబా! మాకున్న చివరి అవకాశం మీరే. మాకు దిక్కు మీరే. మీ మీదే భారం వేశాము సాయీ" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టరు వచ్చి రిపోర్టులు చూశారు. ఇంటిదగ్గర ఉన్న నేను బాబాను తలచుకుంటూ ఉన్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అంతలో మావారు ఫోన్ చేశారు. టెన్షన్ పడుతూ ఫోన్ తీశాను. "డాక్టరు రిపోర్టులు చూశారు. నాన్న తలలో ఏమీ లేదు. ఆయన చాలా బాగున్నారు. ఆయనకు ఆపరేషన్ అవసరం లేదు, మందులు కూడా అవసరం లేదు" అని చెప్పారు మావారు. అది విని నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. బాబానే ఆ డాక్టరు రూపంలో వచ్చారనిపించింది. "బాబా! మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకు మంచి చేశారు. మీ పాదపద్మాలకు కోటి వందనాలు. వీలుచూసుకుని శిరిడీ వస్తాను సాయీ". అన్నట్టు చెప్పడం మరచిపోయాను, 'మావయ్యకి తగ్గితే, మా అనుభవం గురించి బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. కాస్త ఆలస్యమైంది. తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి.


అనుగ్రహప్రదాత సాయి


తోటి సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రజనీకాంత్. మేము మా కొబ్బరితోటను ఒకరికి లీజుకు ఇస్తే, వాళ్ళు తోటంతా పాడుచేశారు. పాడైపోయిన తోటను చూస్తే, మాకు చాలా బాధేసింది. ఆ తోటలోని మోటారు కూడా చెడిపోతే నేను ఎలక్ట్రీషియన్‌ని తీసుకొచ్చి బాగుచేయించాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల నేను, "బాబా! తక్కువ ఖర్చుతో మోటారు రిపేర్ అయిపోయేలా చూడు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా తక్కువ ఖర్చుతో మోటారు రిపేర్ అయ్యేలా చూశారు. ఇది చిన్న విషయమే కానీ, ఆ సమయంలో నాకు అది పెద్ద సమస్యగా తోచింది. తర్వాత ఆ కొబ్బరితోటను వేరే వాళ్ళకి ఇవ్వాలని చూశాము. కానీ లీజుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. దాంతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. అప్పుడు మాకు తెలిసిన ఒకరితో ఆ తోటను లీజుకు తీసుకోమని చెప్పి, "బాబా! వాళ్ళు తీసుకుంటే, తోటను బాగా చూసుకుంటారు. మీ దయతో వాళ్ళు గనక లీజుకు తీసుకుంటే, నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన వాళ్ళు తోటను తీసుకున్నారు. అయితే నేను నా అనుభవాన్ని పంచుకోలేదు. తరువాత 2022, ఫిబ్రవరి 9న పెద్ద సమస్య వచ్చి పడింది. అప్పుడు నేను ఎందువల్ల ఇలా జరిగిందని అనుకుంటే, నేను నా అనుభవాన్ని పంచుకోలేదని గుర్తుకొచ్చింది. దాంతో 'అందుకే ఇలా అయిందేమో!' అనుకుని "బాబా! నా నిర్లక్ష్యం వలనే ఆ సమస్య వచ్చినట్లయితే నన్ను క్షమించండి. ఏ ఇబ్బంది, గొడవలు లేకుండా వాళ్ళు మాకివ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేలా దయచూపండి. అలాగే, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరుణించు తండ్రీ. తెలిసీ తెలియక నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


శ్రీసాయి కృప


సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఈరోజు మరో అనుభవం చెబుతున్నాను. నేను నా గత అనుభవంలో బాబా దయవల్ల మా మేనకోడలికి పెళ్లి కుదిరిందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం జరిగితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటానని చెప్పాను. బాబా కృపతో వివాహం చాలా అద్భుతంగా జరిగింది. అందుకు బాబాకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే, మా మేనకోడలు తనకు ఉద్యోగం వస్తే, మొదటి నెల జీతం బాబాకి సమర్పించుకుంటానని మ్రొక్కుకుంది. బాబా దయవలన ఇంటర్వ్యూ పూర్తయిన రెండు రోజులకే తనకి 30,000 రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. శ్రద్ధ, సహనం ఉంటే బాబా అసాధ్యాలను సాధ్యం చేస్తారని  నిరూపించారు. నమ్మకంతో బాబా నామాన్ని జపిస్తే, అన్నీ అద్భుతాలే. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చిన మీకు శతకోటి నమస్కారాలు. అయితే ఆలస్యంగా పంచుకున్నందుకు మన్నించండి బాబా. కానీ నన్ను ఎన్నడూ మీ భక్తికి దూరం చెయ్యొద్దు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1090వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి సంరక్షణ
2. ప్రమాదం జరిగినా పెద్దగా సమస్య లేకుండా కాపాడిన బాబా
3. కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా
4. బాబా ఊదీతో తగ్గిన యూరిన్ ఇన్ఫెక్షన్

సాయి సంరక్షణ


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు మూడు నెలల పాప ఉంది. పాప పుట్టిన తర్వాత నేను హైదరాబాదులో ఉన్న మా అత్తవారింటికి వెళ్ళాను. అక్కడ మా పాపను డాక్టరుకి చూపిస్తే మళ్లీ మూడు నెలల తర్వాత రమ్మన్నారు. అందువల్ల నేను ఈ మూడు నెలలు అక్కడే ఉన్నాను. మూడు నెలలు గడిచాక పాపని డాక్టరుకి చూపించి, ఆ తర్వాత ఆంధ్రలో ఉన్న పుట్టింటికి రావడానికి బయలుదేరాను. నన్ను, పాపను పుట్టింట్లో దింపడానికి మావారు కూడా మాతో బయలుదేరారు. అంటే మమ్మల్ని మా పుట్టింట్లో దించేసాక ఆయన ఒక్కరే హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. నేను పక్కన ఉంటే సరేగాని, ఆయనొక్కరే కారు డ్రైవ్ చేస్తూ అంత దూర ప్రయాణమంటే నాకు చాలా భయం. అందువల్ల నేను, "బాబా! మావారు నన్ను, పాపని పుట్టింట్లో వదిలిపెట్టి తిరిగి మా ఇంటికి క్షేమంగా వెళితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మేము క్షేమంగా మా పుట్టింటికి చేరుకున్నాం. ఇకపోతే, మావారి తిరుగు ప్రయాణం విషయానికి వస్తే, ఇంట్లో పరిస్థితులు మరియు ట్రాఫిక్ జామ్ వల్ల బాగా చీకటి పడ్డాక ఆయన కారు నడపాల్సి వచ్చింది. నిజానికి మావారికి రాత్రివేళ కారు నడిపే అలవాటు లేదు. అందువల్ల నాకు కొంచం టెన్షన్‌గా అనిపించి బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మావారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా. నా కుటుంబాన్ని సదా సంరక్షించండి బాబా". 


2022, ఫిబ్రవరి 8 సాయంత్రం హఠాత్తుగా మాపాప చాలా ఏడ్చింది. ఎంత సముదాయించినా తను ఏడుపు ఆపలేదు. అసలే తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల తనకి ఏ కష్టం వచ్చిందో, ఎందుకు ఏడుస్తుందో అర్ధంకాక నాకు చాలా బాధేసి కన్నీళ్లు పెట్టుకున్నాను. వెంటనే బాబా గుర్తొచ్చి, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే నామాన్ని 108 సార్లు చెప్పుకుని, "బాబా! పాపకి ఏం బాధ ఉందో అది తగ్గిపోయి, తను నవ్వితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 30నిమిషాల్లో పాప ఏడుపు అపేసి అడుకోసాగింది. "థాంక్యూ బాబా. మా పాపకి హార్ట్ ఆపరేషన్ చేయాలంటున్నారు. మీరు పాప దగ్గరుండి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూసి పాపని 'దీర్ఘాయుష్మాన్ భవ' అని దీవించండి సాయినాథా. కొన్ని కారణాల వల్ల కొన్నిరోజులుగా నేను మిమ్మల్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించండి బాబా".


ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


ప్రమాదం జరిగినా పెద్దగా సమస్య లేకుండా కాపాడిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. మన దైవం బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ముందుగా నేను సాయినాథుని పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నాకు 8 సంవత్సరాల వయస్సున్న కుమార్తె ఉంది. ఒక గురువారంనాడు తను ఆడుకోవడానికని బయటకి వెళ్ళినప్పుడు రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక బైక్‌ తనని ఢీకొట్టింది. దాంతో తను కిందపడి తల రోడ్డుకి గుద్దుకుని వాపు వచ్చింది. శరీరానికి కూడా కొన్ని చిన్న గాయాలు అయ్యాయి. మేము తన తలకి వాపు రావడం వల్ల ఆందోళన చెంది వెంటనే పాపను తీసుకుని డాక్టరు వద్దకు వెళ్లాము. డాక్టరు CT స్కాన్‌ చేయించి "స్పెషలిస్ట్‌ని సంప్రదించమ"ని సూచించారు. స్పెషలిస్ట్‌ దగ్గరికి వెళ్తున్నపుడు నేను, "బాబా! పాపకి ఏ సమస్య రాకూడదు. ఇది సాధారణ గాయమే అయి ఉండాలి బాబా" అని బాబాను ప్రార్థించాను. స్పెషలిస్ట్‌ డాక్టరు పాపకి ఎం.ఆర్.ఐ స్కాన్ చేసి, "ఇది మామూలు గాయమే, ఆందోళన చెందనవసరం లేదు" అని చెప్పారు. తల రోడ్డుకు గుద్దుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదమూ లేకుండా బాబా నా బిడ్డను కాపాడారు. ఇది బాబా చేసిన అద్భుతం. "థాంక్యూ సో మచ్ బాబా". 


సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


కష్టకాలంలో ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా


"బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు. మొట్టమొదటి సారిగా నా అనుభవాలు పంచుకుంటున్నాను. తప్పులు ఉంటే క్షమించండి బాబా". నాపేరు అశోకరాణి. 1996వ సంవత్సరంలో ఒక ముస్లిం కుటుంబం ద్వారా నాకు శ్రీసాయిబాబాతో పరిచయం జరిగింది. ప్రస్తుతం నా కుటుంబం సమస్యల వలయంలో ఉండగా నా కుమారునికి గుంటూరులో ఉద్యోగం ఉందని పిలుపు వచ్చింది. అయితే ఆ ఉద్యోగం తనకి రాలేదు. దాంతో నా మానసిక వేదన ఎక్కువైపోయింది. అంతలో ఈ బ్లాగు నా కంటపడింది. ఇందులో అనుభవాలు చదివిన వెంటనే నేను దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లాను. ఆ రోజు గురువారం(2022, జనవరి 20). "బాబా! నేను నడి సముద్రంలో ఉన్నాను. మీరే దిక్కు" అని బాబాతో చెప్పుకుని ఒక కొబ్బరికాయ కొట్టి, దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చాను. అదేరోజు సాయంత్రం నాకు తెలిసిన ఒకామె నాకొక ఉద్యోగ ప్రకటనను పంపింది. మరుసటిరోజు నా కుమారుడు ఇంటర్వ్యూకు వెళ్లి, సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు నా కుమారుడు ఆ సంస్థలో చేరి ఉద్యోగం చేస్తున్నాడు. "సాయి నాన్నా! మీరు ఉన్నారు. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, ఆప్తుడు, ఆత్మీయుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నీ మీరే నాకు. సత్ప్రవర్తనతో కుటుంబంపట్ల బాధ్యతగా నడుచుకునేటట్లు నా కుమారుడిని మలిచే భారాన్ని మీ మీద పెడుతున్నాను తండ్రి. తన విషయంలో మీరే నాకు దిక్కు నాన్నా. నేను చాలా అలసిపోయాను. మరలా మరలా నా అనుభవాలను పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి బాబా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా ఊదీతో తగ్గిన యూరిన్ ఇన్ఫెక్షన్


నేను సాయి భక్తురాలిని. కొన్నిరోజుల క్రితం యూరిన్ కి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంటగా అనిపిస్తుండేది. అదివరకు కూడా ఒకసారి అలానే అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుంటూ మందులు వాడితేనే తగ్గింది. మళ్లీ అదే సమస్య రావడంతో నాకు చాలా భయమేసి, "ఇదేంటి బాబా, మళ్లీ అదే పరిస్థితి వచ్చినట్లు ఉంది. దయచేసి మంట తగ్గేలా అనుగ్రహించండి. మీ కృపవలన తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని ఊదీ నీళ్ళలో కలుపుకుని తాగాను. అలాగే కొబ్బరినీళ్లలో కూడా బాబా ఊదీ వేసుకుని తాగాను. బాబా దయవలన నొప్పి, మంట తగ్గి సాయంత్రానికల్లా నార్మల్ అయ్యాను. "థాంక్యూ బాబా. నాకున్న మిగతా సమస్యలు కూడా త్వరగా సమసిపోయేలా చూడండి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1089వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి ఆశీస్సులు
2. మనసులో అనుకున్నంతనే అనుగ్రహించిన సాయి
3. ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా

సాయి ఆశీస్సులు

నా పేరు సంధ్య. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఉదయాన నిద్రలేవగానే ఈ బ్లాగును చూస్తే మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే 'సాయితల్లి' ఎప్పుడూ మనతోనే ఉన్నారనిపిస్తుంది. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బాబా బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మావాళ్ల ఇల్లు కట్టించి చాలా సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆ ఇల్లు చాలా పాడైపోయింది. ఎప్పటినుంచో బాగుచేయాలనుకుంటుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉండేది. అప్పుడు నేను సాయితల్లికి దణ్ణం పెట్టుకుని, "ఇల్లంతా పెయింటింగ్ వేయించాలి బాబా. ఎప్పటినుంచో ఉన్న నా ఈ కోరిక నెరవేరేలా చూడు బాబా" అని వేడుకున్నాను. నా సాయితల్లి నా ప్రార్థన విన్నారు. పెయింటింగ్స్‌తో పాటు కప్‌బోర్డ్స్ కూడా పెట్టించుకునేలా అనుగ్రహించారు.

ఒకసారి అనుకోకుండా మా తమ్ముడు తన స్నేహితులను కలిశాడు. వాళ్ళ ద్వారా మా తమ్ముడికి కరోనా వచ్చింది. నాకెంతో బాధ అనిపించి, "బాబా! తమ్ముడికి ఎటువంటి బాధ లేకుండా త్వరగా తగ్గేలా చూడు తండ్రీ. వాడికి ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టులో నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని సాయితల్లికి మొక్కుకున్నాను. తమ్ముడు 15 రోజులు గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ బాబా దయవల్ల కొద్దిపాటి లక్షణాలతో కరోనా నుండి భయపడ్డాడు.

ఒకరోజు రాత్రి అనుకోకుండా మా చిన్నబాబుకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వాటికి తోడు జ్వరం కూడా ఉండేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకు త్వరగా తగ్గేలా చేయండి తండ్రీ" అని వేడుకున్నాను. తరువాత బాబుని తీసుకుని హస్పిటల్‌కి వెళ్ళి మందులు వాడుతున్నప్పటికీ రెండురోజులైనా విరోచనాలు అవుతూనే ఉన్నాయి. అప్పుడు నేను బాబుకి కొద్దిగా బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించి, "బాబా! బాబుకి వెంటనే తగ్గితే మీ గుడికి వచ్చి స్వీట్లు పంచుతాను. అలాగే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. సాయి దయవల్ల రెండు రోజుల్లో బాబు పూర్తిగా కోలుకున్నాడు. "సాయీ! మీకు శతకోటి వందనాలు తండ్రీ".

ఒకరోజు ఎంత వెతికినా నా నల్లపూసలు కనపడలేదు. 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని చెప్పుకుంటూ నేను, మావారు చాలాసేపు వెతికినప్పటికీ ఆ నల్లపూసలు కనిపించలేదు. అయితే బాబా దయవల్ల ఆరోజు సాయంత్రానికి నా పర్సులోనే నల్లపూసలు కనిపించాయి. సంతోషంగా సాయితల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలాగే ఒకసారి మా అమ్మావాళ్ళ ఇంట్లో అమ్మ నా నల్లపూసలు ఎక్కడో పెట్టి మరిచిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ గుడికి వచ్చి 116 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆశ్చర్యంగా 10 నిమిషాల్లో నా నల్లపూసలు దొరికాయి. "సాయితల్లీ, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే మాకు ఉండాలి తండ్రీ. అందరినీ చల్లగా చూడు స్వామీ. ఈ కరోనా నుండి అందరినీ కాపాడు తండ్రీ".

మనసులో అనుకున్నంతనే అనుగ్రహించిన సాయి

నా పేరు అభి. ముందుగా సాయిబంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మేము ఇల్లు కట్టాలనుకుని ఆ స్థలంలో ఉన్న రాళ్లను ట్రాక్టరులో తరలించాలని అనుకున్నాం. అయితే ఏ ట్రాక్టర్ వచ్చినా అక్కడున్న బురదలో ఇరుక్కుని ముందుకు కదిలేది కాదు. అప్పటికీ ఒక డ్రైవరు లోడ్ దింపి కదిలించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు నాలుగు గంటలు ప్రయత్నం చేసినా ట్రాక్టర్ బయటకి రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ట్రాక్టర్ బయటకు వచ్చేలా చేయండి" అని మనసులో అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల పదినిమిషాల్లో ట్రాక్టర్ బురదలో నుంచి బయటకు వచ్చింది.

ఒకరోజు రాత్రి హఠాత్తుగా నాకు మైగ్రేన్ తలనొప్పి వచ్చి ఏ ప్రయత్నం చేసినా తగ్గలేదు. అది రాత్రివేళ కావడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు, "బాబా! తలనొప్పి తగ్గించండి" అని మనసులో అనుకున్నాను. అలా అనుకున్న కాసేపటికే అద్భుతం జరిగినట్లు తలనొప్పి తగ్గిపోయింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ దయ ఎప్పటికీ నామీద, నా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సాయీ"

శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా

నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. రోజూ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే బాబాకు దగ్గరవుతున్న అనుభూతి కలుగుతుంది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము సంక్రాంతికి ముందు మా ఊరు వెళ్లాలనుకుని, కరోనా కారణంగా ముందుగానే రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకున్నాము. అయితే మా ప్రయాణానికి ముందు హఠాత్తుగా మా అత్తమ్మకి ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "అత్తమ్మ ఆరోగ్యం బాగుపడితే, నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను వేడుకుని రెండు రోజులు ఊదీ నీళ్లలో కలిపి అత్తమ్మకి ఇచ్చాను. బాబా దయవలన మేము ఊరు వెళ్లేరోజుకి అత్తమ్మ ఆరోగ్యం కుదుటపడింది. "చాలా ధన్యవాదాలు సాయీ. ఇలాగే మా కుటుంబాన్ని సదా కాపాడు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1088వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలోనూ సహాయం అందిస్తున్న బాబా
2. ప్రిన్సిపాల్ మనసు మార్చి సహాయం చేసిన బాబా
3. ఉదయానికి నొప్పి తగ్గించిన బాబా
4. మనసు కుదుటపరిచి సమస్య లేకుండా చేసిన బాబా

ప్రతి విషయంలోనూ సహాయం అందిస్తున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు యోగిరాజు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సచ్చిదానంద సద్గురు సాయినాథుని దివ్య పాదారవిందములకు శిరసా నా నమస్సులు. సాయిబందువులందరికీ నమస్కారం. నాపేరు శ్రీదేవి. నేను సాయి భక్తురాలిని. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకి మనస్ఫూర్తిగా చెప్పుకుని, ఈ బ్లాగులో పంచుకుంటామని అనుకున్నంతనే ఎందరో భక్తుల కోర్కెలు తీరుస్తున్న సాయితండ్రి ప్రేమను ఏమని చెప్పగలం?. ఆ తండ్రి ప్రేమకు ప్రతిరూపమైన ఆయన ప్రసాదించే ప్రతి అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆ అవకాశమిచ్చిన బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మా బాబు పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకున్న చాలా రోజుల తరువాత 2022, జనవరి 26న మాకు పాస్‍పోర్టు పంపబడిందని ఒక మెసేజ్ వచ్చింది. అయితే పోస్టుమెన్ దానిని మాకు తెచ్చివ్వలేదు. నేను అతనిని అడిగితే, "మీకు ఎలాంటి లెటర్ రాలేద"ని చెప్పాడు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో పాస్‍పోర్టు వస్తే, నా అనుభవాన్ని సాయి బందువులందరితో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా కృపతో రెండురోజుల్లో పాస్‍పోర్టు వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంచుకోవడానికి ఆలస్యం చేశాను. నన్ను క్షమించండి బాబా".

ఒకసారి మా పాప చైన్‍కోసం నేను ఇల్లంతా వెతికినా కనిపించలేదు. దాంతో పాప ఎక్కడైనా అజాగ్రత్తగా పడేసిందేమోనని నాకు అనిపించింది. అయినా నేను బాబాను తలుచుకుని, "బాబా! ఆ చైన్ ఆచూకీ తెలిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత మా అత్తగారితో, "గొలుసు కనపడటం లేద"ని చెపితే ఆవిడ, "దాన్ని బ్యాంకులో పెట్టాము" అని చెప్పింది. అలా బాబా నా టెన్షన్ తగ్గించారు. "ధన్యవాదాలు బాబా".

2022, ఫిబ్రవరి 8న మా అన్నయ్య అకౌంట్ బుక్ ఇల్లంతా వెతికినా కనిపించలేదని ఇంట్లో అంతా బాధపడుతుంటే నేను వాళ్లతో, "బాబాకి చెప్పుకుని, అకౌంట్ బుక్ దొరికితే బ్లాగులో పంచుకుంటామ"ని చెప్పుకోమన్నాను. నేను చెప్పినట్లే వాళ్ళు బాబాని ప్రార్ధించి మళ్ళీ వెతికితే అకౌంట్ బుక్ కనిపించింది. ఇలా బాబా మాకు అండగా ఉంటూ ప్రతివిషయంలోనూ సహాయం చేస్తున్నారు. మనకు బాబా ఉండగా ఏ విషయంలోనూ భయపడాల్సిన పని లేదు. భారం బాబాకి అప్పజెప్పి మనం ఆయన నామస్మరణ చేసుకుంటే చాలు. అంతా బాబా చూసుకుంటారు. బాబా మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటమొక్కటే మనం చేయాల్సింది. "బాబా! మీ అనుగ్రహం మా అందరిపై ఎల్లవేళలా ఉండాలి తండ్రి".

ప్రిన్సిపాల్ మనసు మార్చి సహాయం చేసిన బాబా

సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మీతో బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియెట్ పూర్తిచేసి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాను. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలో ఉన్న నా సర్టిఫికెట్లకోసం కాలేజీకి వెళ్ళాను. అయితే నేను చదివినప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ వచ్చి ఉన్నారు. ఆ ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు కావాలంటే 18 వేల రూపాయలు కట్టాలని, ఒక్క రూపాయి తగ్గినా ఎవరికీ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని అన్నారు. దాంతో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! పది వేల రూపాయలు కట్టాల్సిన దానికి అన్యాయంగా 18 వేల రూపాయలు కట్టమంటున్నారు. 10 వేల రూపాయలకే నా సర్టిఫికెట్లు నా చేతికి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తరువాత మా నాన్న తన స్నేహితుడితో కలసి కాలేజీకి వెళ్లారు. అప్పుడు కూడా ఆ ప్రిన్సిపాల్ 18,000 రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని అన్నారు. నేను మళ్ళీ నమ్మకంతో బాబాను ప్రార్థించాను. 15 నిమిషాల తర్వాత ప్రిన్సిపాల్ తన మనసు మార్చుకుని 10,000 రూపాయలు కడితే సర్టిఫికెట్లు ఇస్తానని ఫోన్ చేశారు. ఇలా ప్రతీసారి నన్ను కాపాడుతున్న బాబాకు నేను భక్తురాలినవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఉదయానికి నొప్పి తగ్గించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులకు నమస్కారం. నా పేరు రవీంద్ర. నేను ప్రతిరోజూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నాకు ఎటువంటి సమస్య వచ్చినా బాబాకే చెప్పుకుంటాను. ఆయన నా సమస్యకు పరిష్కారం చూపుతారు. ఈమధ్య ఒకరోజు నేను వంగినప్పుడు వెనుక కండరం పట్టేసింది. నేను, "బాబా! నొప్పి తగ్గిపోతే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికల్లా నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. నాకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తొలగించండి బాబా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి".

సర్వేజన సుఖినో భవంతు!!!

మనసు కుదుటపరిచి సమస్య లేకుండా చేసిన బాబా

సాయి బంధువులకు నమస్కారం. బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నాయందు ఎప్పుడూ ఉంటూ పిలిచిన వెంటనే పలికే సాయి తండ్రికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఒకరోజు నేను నాకు కాబోయే భర్తతో మాట్లాడుతూ మాటల మధ్యలో, "నీ విషయంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను" అని అనేశాను. ఆ మాటలకి తను 'నువ్వు నాకొద్దు' అనేంతలా బాధపడ్డారు. నాకు ఏం చేయాలో తెలియక, "బాబా! నేను తప్పు చేశాను. తన విషయంలో మాట జారాను" అని బాధతో బాబాకి చెప్పుకుని, "నన్ను మీరే కాపాడాలి బాబా. తన మనసు కుదుటపడి మునుపటిలా నార్మల్ గా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. సాయికి నాపై దయ కలిగి నాకు కాబోయే భర్త మనసును కుదుటపరిచారు. ఇప్పుడు తను నాతో బాగా ఉంటున్నారు. "నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టన"ని బాబా చెప్పారు. అది అక్షరసత్యం. "థాంక్యూ బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1087వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపించిన దయ
2. బాబా ఆశీస్సులతో సాఫీగా పూర్తయిన రిజిస్ట్రేషన్
3. బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేస్తున్న ఫ్యాట్ బెల్ట్

బాబా చూపించిన దయ

ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిది' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు అనూరాధ. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. నేను నా గత అనుభవంలో సాయి కృపతో మేము వైజాగ్ దగ్గర ఒక స్థలం చూసి, నెల రోజుల్లోనే 20 లక్షలు సమకూరడంతో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. 2021, ఆగస్టులో మా బంధువులందరి సమక్షంలో మా తమ్ముడి వాళ్ళ గృహప్రవేశం చాలా బాగా జరిగింది. వారం రోజుల తర్వాత మా మరదలి తండ్రిగారికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చాలా సీరియస్ అయ్యి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోంచి బయటికి వచ్చిన తరువాత ఆయన పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడటం చేసేవారు. నాకు చాలా బాధ అనిపించి బాబాతో, "బాబా! ఈ మధ్యే అన్ని కుటుంబాల వాళ్ళం సంతోషంగా గృహప్రవేశ వేడుకలో ఆనందంగా కలుసుకున్నాం. ఇంతలోనే ఆయనకి ఇలా అయ్యింది. ఆయనకి ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే, ఈ అనుభవం మన బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల 15 రోజులు తర్వాత ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు బాగానే ఉన్నారు.

నేను ఈమధ్య ఒకరోజు ఇంట్లో షుగర్ టెస్టు చేసుకుంటే 380 వచ్చింది. ఎప్పుడూ 98, 104 అలా వచ్చేది కాస్త అంత ఎక్కువ వచ్చేసరికి నాకు భయమేసింది. వెంటనే, "బాబా! ఇంత త్వరగా నాకు షుగర్ వ్యాధి రాకుండా కాపాడండి. షుగర్ ఎప్పటిలానే మామూలుగా ఉంటే మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. రెండు రోజుల తర్వాత మళ్లీ చెక్ చేసుకుంటే మునుపటిలా నార్మల్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా! మీరు చూపించే దయకు ఎంతో ఋణపడిపోతున్నాం తండ్రి. ఈ అనుభవాలను పంచుకోవడంలో ఎంతో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి సాయిదేవా. నేను ఇప్పుడు కొన్ని ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ చాలా ఇబ్బందిపడుతున్నాను బాబా తండ్రి. దయచేసి మీ కృపను ప్రసరింపజేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ కృపకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను త్వరగా అనుగ్రహించండి బాబా".

ఓం శ్రీసచ్చిదానంద సాయినాథాయ నమః!!!

బాబా ఆశీస్సులతో సాఫీగా పూర్తయిన రిజిస్ట్రేషన్


అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. సాయి నాకు ప్రసాదించిన ఇంకొక అనుభవంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మేము కొద్ది రోజుల క్రితం చాలా విలువైన స్థలమొకటి కొన్నాము. ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసే సమయానికి దాన్ని అమ్మిన వ్యక్తి నుండి మాకు చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. అతను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడంటే, రిజిస్ట్రేషన్ ముందురోజు సగం డబ్బులు తీసుకుని కూడా మరుసటిరోజు రిజిస్ట్రేషన్ సమయానికి కొత్త నింబంధనలు పెట్టి చాలా విసిగించాడు. చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం అయినందువల్ల ఇంట్లో అందరమూ చాలా టెన్షన్ పడ్డాము. అందరూ బాగా భయపడ్డారు. నేను మాత్రం బాబా మీద భారం వేసి, 'శ్రీసాయి సులభ దుర్లభాయ నమః' అనే మంత్రాన్ని చెప్పుకోసాగాను. అలాగే "సాయంత్రంలోపు ఈ సమస్య పరిష్కారమైపోతే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిజిస్ట్రేషన్ ఎంతో సాఫీగా జరిగి మా సమస్య తీరిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్ముకున్న భక్తులను మీరు ఎప్పుడూ నిరాశపరచరు తండ్రి. ఈ మధ్యకాలంలో నా మనసు ప్రశాంతంగా ఉండట్లేదు. దయచేసి నాకు మానసిక ప్రశాంతతని ప్రసాదించండి బాబా. నేను ఒక ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నాను. మీ దయతో అది కూడా పూర్తిగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నా మ్రొక్కుల విషయంలో ఏమైనా లోటుపాట్లు చేస్తే మన్నించండి బాబా. మీ ఆశీస్సులు మా అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


బాబా ఊదీ అనుగ్రహంతో పనిచేస్తున్న ఫ్యాట్ బెల్ట్

భక్తులందరికీ మరియు బ్లాగు నడుపుతున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ఒకసారి నేను ఆన్లైన్‍లో ఒక ఫ్యాట్ బర్నింగ్ బెల్ట్ ఆర్డరు చేసీ తెప్పించుకున్నాను. దాన్ని ఒక వారం వాడిన తరువాత ఏ సమస్య వచ్చిందో తెలీదుగానీ పని చేయడం మానేసింది. ఆన్లైన్‍లో తెచ్చుకునే వస్తువులు ఇలాగే ఉంటాయని దాని మీద ఆశలు వదిలేసి పక్కన పడేసాను. నేను రోజూ చదివే ఈ బ్లాగులో చాలామంది భక్తులు తమ వస్తువులు ఏవైనా పని చేయకపోతే, వాటికి బాబా ఊదీ పెట్టి బాబాని తలుచుకోగానే అవి పనిచేశాయని పంచుకోవడం చదివి ఆ బెల్ట్ తీసి దానికి బాబా ఊదీ పెట్టి, "బాబా! ఇది పని చేస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకుంటూ బెల్ట్ ఆన్ చేశాను. బాబా దయవల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బెల్టు పని చేస్తుంది. "థాంక్యూ సో మచ్ బాబా. ఈ అనుభవం పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైంది. క్షమించండి బాబా".

ఓం సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo