సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1071వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన చెప్పలేనంత ఆనందం
2. సాయినాథుని దయతో తొలిగిన పెద్ద సమస్య
3. కరుణతో కరోనా మహమ్మారి బారినుండి కాపాడిన బాబా

బాబా ప్రసాదించిన చెప్పలేనంత ఆనందం


సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు సాయినాథునికి నమస్కరిస్తూ మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నాకు బైక్ లేకపోవడం వలన నేను చాలారోజులపాటు చాలా ఇబ్బందిపడ్డాను. పోనీ, బైక్ తీసుకుందామంటే అందుకు సరిపడా డబ్బులు నా దగ్గర లేవు. ఆ స్థితిలో నేను "పరిష్కారం చూపమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత మా అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి, "ఎలాగైనా నాకు బైక్ కావాలి" అని అన్నాను. అప్పుడు అన్నయ్య సగం డబ్బులు పెట్టి, మిగతా 50శాతం డబ్బులకి ఫైనాన్స్ మీద బైక్ తీసుకుని నాకిచ్చి, "నెలనెలా 50శాతం ఫైనాన్స్ డబ్బులు కట్టు" అని చెప్పాడు. అలా నా చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ బాబా నేను అడిగిన వారం రోజుల్లోనే నాకు బైక్ ని ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



2022, భోగి పండుగరోజు మా అన్నయ్య నన్ను తన ఆఫీసుకి తీసుకెళ్తూ మధ్యలో ఒకచోట బైక్ ఒక పక్కకి తీసి అపాడు. నేను 'ఏమిటా?' అని పక్కకి చూస్తే, అక్కడ ఒక దేవాలయం ఉంది. అందులో శివ, సాయి, దత్త, మారుతీ, సుబ్రహ్మణ్యస్వామి ఉప ఆలయాలున్నాయి. నా దృష్టి అంతా బాబా మందిరంలో ఉన్న బాబా మీదే ఉండగా నేను నేరుగా బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. ఆ ఆలయంలో బాబా పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో ఆనందానికి లోనయ్యాను. తరువాత నేను మా అన్నయ్యని "నన్ను టెంపుల్ కి తీసుకెళ్తున్నానని చెప్పలేదేంటి అన్నయ్యా?" అని అన్నాను. అప్పుడు అన్నయ్య, "నీకు బాబా అంటే చాలా ఇష్టం కదా! అందుకే తీసుకొచ్చాను" అని అన్నాడు. అప్పుడు నేను అన్నయ్యతో ఎప్పటినుండో నా మనసులో ఉన్న కోరిక గురించి చెప్పాను. అదేమిటంటే, చాలారోజుల నుంచి నాకు ఏదైనా బాబా మందిరానికి వెళ్ళినప్పుడు బాబా పాదాలకి నా నుదురు ఆనించి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలని కోరిక. అంటే ఒక్కసారైనా మందిరంలోని బాబా పాదాలను తాకాలని నాకు చాలా ఆశ. కానీ ఆ అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. అలాంటిది అనుకోకుండా ఆరోజు బాబా నా కోరికను తీర్చి నాకు చెప్పలేనంత ఆనందం ప్రసాదించారు. "బాబా! మీకు అనేకానేక కృతజ్ఞతలు".


ఈమధ్య ఒకరోజు నాకు విపరీతమైన జ్వరం, ఒళ్ళునొప్పులు, జలుబు, దగ్గు మొదలయ్యాయి. జ్వరం అస్సలు తట్టుకోలేకపోయాను. చాలా అలసటగా కూడా ఉంది. ప్రస్తుత కరోనా రోజుల్లో ఈ లక్షణాలు అంటే చాలా భయమేస్తుంది. అందువలన నేను హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్ చేయించుకుని, ట్యాబ్లెట్లు వేసుకున్నాను. అయినా జ్వరం తగ్గలేదు. దాంతో మరో హాస్పిటల్ కి వెళ్లి మరొక ఇంజక్షన్ చేయించుకున్నాను. అయినా కూడా జ్వరం తగ్గలేదు. దాంతో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లి గ్లూకోజ్ సెలైన్ పెట్టించుకున్నాను. ఆ హాస్పిటల్లో చిన్న బాబా విగ్రహం చూసాక నాకు బాబా తోడుగా ఉన్నారని నాకు చాలా దైర్యం వచ్చింది. మరుసటిరోజు ఉదయానికి కొంచం జ్వరం తగ్గింది. అప్పుడు నేను, "బాబా! ఈ జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళునొప్పులు పూర్తిగా తగ్గిపోతే నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను. అలాగే పరమాన్నం నివేదిస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. మధ్యాహ్నం పడుకున్నాక ఒళ్ళంతా చెమటలు పట్టి జ్వరం పూర్తిగా తగ్గింది. మా ఇంట్లోవాళ్ళకి కూడా జ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి కానీ, బాబా దయవల్ల త్వరగా తగ్గిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా. మేము మీ భక్తులమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలుకుతున్న మా పిలిచిన పలికే దైవం మీరు. మీ లీలలు మహాద్భుతం బాబా. నేను ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో మీ భక్తుడనయ్యాను. ఈమధ్య మీరు నాకు స్వప్న దర్శనాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. ఎల్లప్పుడూ ఇలానే మీ ప్రేమను మాపై కురిపించండి. చాలా థాంక్స్ బాబా. అనుగ్రహంతో నాకు ఒక మంచి ఉద్యోగం ప్రసాదించండి. మళ్ళీ నా అనుభవం సాటి సాయి బంధువులతో పంచుకుంటాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయినాథుని దయతో తొలిగిన పెద్ద సమస్య


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! ఎల్లవేళలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలు. నా పేరు శ్రీలత. గత 20 సంవత్సరాలుగా నేను సాయిని నా ఇష్టదైవంగా పూజిస్తున్నాను. సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. 'సాయీ' అనగానే 'ఓయీ' అని ఎన్నో బాధలు, కష్టాలను తప్పించి నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చారు. ఈ బ్లాగు గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎంతోమంది సాయిభక్తులకు నమ్మకాన్ని, దైర్యాన్ని, ఆనందాన్ని పంచుతున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనిప్పుడు ఈ మధ్యకాలంలో సాయి నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబర్ 4న మావారికి విపరీతంగా జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. తరువాత రోజుకి వాసన, రుచి కూడా తెలియలేదు. నాకు ఎంతో భయమేసి, "సాయీ! మావారికి కరోనా కాకుండా మామూలు జ్వరమే అయ్యేలా చూడు తండ్రి, మామూలు జ్వరమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ రాత్రంతా ఒకటే బాధపడుతూ సాయితండ్రిని తలుచుకుంటూ గడిపాను. తరువాత రోజు మావారు కరోనా టెస్టు చేయించుకుంటే, బాబా దయవల్ల నెగిటివ్ వచ్చింది. అయితే అదేరోజు నాకు, మా పాపకి కూడా జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "సాయితండ్రీ! మాకు కూడా మామూలు జ్వరమే అయ్యేలా చూడు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల మాకు కూడా కరోనా నెగిటివ్ వచ్చింది. దయగల నా సాయితండ్రి చల్లగా చూసి రెండురోజుల్లో మా అందరికి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించారు. అంతేకాదు సాయితండ్రి పంటి బాధనుండి కూడా నాకు విముక్తిని ప్రసాదించారు. బాబా లీలలు అనంతం. నడిచేది, నడిపించేది అంతా సాయే. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".


కరుణతో కరోనా మహమ్మారి బారినుండి కాపాడిన బాబా


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నకు మేమంతా ఎంతో ఋణపడి ఉంటాము. నా పేరు శ్వేత. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, క్రిస్మస్ సెలవుల్లో మా కుటుంబమంతా కలిసి మా బాబాయ్ గారి అబ్బాయి పెళ్ళికి వెళ్ళాము. ఆ పెళ్లికి మా చెల్లిని రమ్మంటే, తను "నేను రాలేన"ని చెప్పింది. అప్పుడు నేను మా అమ్మను, "నువ్వైనా రా అమ్మ. నాకు ఒక్కదాన్నే ఉన్న ఫీలింగ్ వస్తుంది. నువ్వు రాలేకుంటే చెల్లి వచ్చినా సరే" అని అడిగాను. ఈ కరోనా సమయంలో వాళ్ళు రావడం కొంచం రిస్క్ అనిపించినప్పటికీ ఎందుకో మళ్ళీ అమ్మను పెళ్లికి రమ్మనడంతో అమ్మ నాకోసం వచ్చింది. అయితే నా దురదృష్టం కొద్దీ పెళ్లి నుండి తిరిగి వచ్చాక అమ్మకి కరోనా వచ్చి ఆమెను హాస్పిటల్లో చేర్చాము. అయితే బాబా దయవల్ల అమ్మ ఒక వారంలో కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది. తరువాత నాకు, నా భర్తకి కూడా కరోనా వచ్చినప్పటికీ బాబా దయతో మేము తొందరగానే కోలుకున్నాము. ఇలా మా అందరికీ కరోనా వచ్చినప్పటికీ బాబా దయవల్ల పిల్లలకి మాత్రం రాలేదు. ఆ కష్ట సమయంలో నాకు చాలా భయమేసి బాబాను, "మమ్మల్ని నువ్వే రక్షించాలి సాయీ. మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు" అని వేడుకున్నాను. ఆయన ఎంతో కరుణతో ఆ మహమ్మారి నుండి మమ్మల్ని కాపాడారు. "బాబా! మీ చల్లని దయ మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు సాయి. అన్నిటికీ మీకు ధన్యవాదాలు సాయి".



3 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me for my IIMC Excutive MBA exam and help me pass the exams 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo