ఈ భాగంలో అనుభవం:
- శిరిడీయాత్ర మధురానుభూతులు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. నా పేరు సంధ్య. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను నా గత అనుభవంలో ‘మాకు శిరిడీ దర్శనభాగ్యం ప్రసాదించమ’ని బాబాను మనసారా వేడుకున్నాను. వేడుకున్నంతనే బాబా మాకు శిరిడీ దర్శనభాగ్యం కల్పించారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
పిల్లలకు సంక్రాంతి సెలవులు రావడంతో మేము శిరిడీ ప్రయాణం ప్లాన్ చేసుకున్నాం. శిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు ఆరతికి హాజరుకావాలని అనుకున్నాము. కానీ, మావారు ఆన్లైన్లో ఆరతి టికెట్స్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పైగా అదే తేదీలలో నాకు నెలసరి వచ్చే సమయం కూడా. అందువల్ల, శిరిడీయాత్ర పూర్తయ్యేవరకు నాకు నెలసరి రాకూడదనీ, ఎలాంటి ఆటంకాలు లేకుండా శిరిడీయాత్ర చక్కగా జరిగేలా అనుగ్రహించమనీ బాబాను ప్రార్థించి, బాబాపై భారం వేసి జనవరి 9వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి మా కారులో శిరిడీకి బయలుదేరాము. ప్రయాణమార్గంలో భోజన సమయం అయినందువల్ల ఒక హోటల్‌కి వెళ్ళి భోజనం చేశాము. భోజనం చేశాక నేను మావారితో, “మీరు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. లేదంటే డ్రైవర్‌ని పెట్టుకోవాల్సి వచ్చేది, అనవసరమైన దండగఖర్చులు” అని అన్నాను. ఒకవిధంగా మావారే శిరిడీయాత్రకి కార్ డ్రైవ్ చేయడం చాలా ఆనందంగా, మనస్సుకు ఉల్లాసంగా ఉంది. భోజనానంతరం మళ్ళీ కారులో బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక ట్రాఫిక్ పోలీసులు మా కారుని ఆపి, ‘సీటుబెల్ట్ పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు’ అని రకరకాల కారణాలు చెప్పి, “1,000 రూపాయలు ఇవ్వండి, లేదంటే 2,000 రూపాయలు ఫైన్ కట్టండి” అని అన్నారు. చేసేదిలేక 1,000 రూపాయలు ట్రాఫిక్ పోలీసులకి కట్టాము. “ఏంటి ఇలా జరిగింది? ‘డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బులు దండగ’ అని హోటల్లో నేను మాట్లాడిన మాటలకి బాబా నా అహంకారాన్ని చంపడానికే ఇలా జరిగిందేమో” అని అనిపించింది. కారణం, ఇచ్చేది, తీసుకునేది భగవంతుడే, మనం కేవలం నిమిత్తమాత్రులం. ‘డ్రైవర్ని పెట్టుకుంటే అనవసరమైన ఖర్చు’లంటూ అవివేకంగా మాట్లాడిన మాటలకి బాబాకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకున్నాను. ‘శిరిడీయాత్ర చేయించేదీ బాబానే; అందుకోసం సరైన సమయానికి డబ్బులను, శక్తిని ఇచ్చేది కూడా సాయిబాబానే కదా’ అని మనసులోనే అనుకుంటూ, పరిపరివిధాల బాబా ప్రేమను స్ఫురణకు తెచ్చుకుంటూ, బాబా ప్రేమలో ఆనందంగా, ఉత్సాహంగా ప్రయాణం సాగించాము. బాబా దయతో ఎంతో సునాయాసంగా రాత్రి 8 గంటలకి శిరిడీ చేరుకుని, చక్కటి రూమ్ తీసుకున్నాము.
మరుసటిరోజు జనవరి 10, సోమవారం ఉదయం స్నానానంతంరం టిఫిన్ చేసి బాబా దర్శనానికి వెళ్ళాము. మొదట ద్వారకామాయి దర్శనంతో ముందుకుసాగాము. సమాధిమందిరంలోకి ప్రవేశించి బాబాను చూడగానే అప్రయత్నంగా కన్నులు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. అందరూ ఉన్నప్పటికీ అనాథలుగా మిగిలిన మా కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న సాయితండ్రిని ఆనందాశ్రువులతో అలాగే కనులారా చూస్తూ, తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, “సాయీ, నీవే మాకు దిక్కు” అని మనసులోనే బాబాను ప్రార్థించుకుని, బాబా ఊదీ ప్రసాదంతో బయటకు వచ్చాము. మళ్లీ బాబాను దర్శించుకోవాలనిపించి మావారితో, “మళ్ళీ బాబా దర్శనం చేయించండి” అని అడిగాను. శిరిడీలో అన్నదానం కోసం కొంత డబ్బును ముడుపు రూపంలో తీసివుంచాము. ఆ డబ్బులను డొనేషన్ కౌంటరులో కట్టాము. అప్పుడు కౌంటరులో ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వుతూ మావారితో, “మీరు రెండు ఆరతులకు హాజరుకావచ్చు, అలాగే ఒకసారి బాబా దర్శనం చేసుకోవచ్చు” అని చెప్పారు. తరువాత ఊదీ ప్రసాదం ఇస్తూ, “ఇంకా ఊదీ కావాలా?” అని మరాఠీ భాషలో అడిగారు. నేను వెంటనే ఆరాటంగా, “ఆ, చాలా కావాలి” అన్నాను. ఆ వ్యక్తి నవ్వుతూ మరికొన్ని ఊదీ ప్యాకెట్లని ప్యాక్ చేసి ఇచ్చారు. ఆరతికి హాజరుకావాలనే మా మనసులోని కోరికను ఈ విధంగా అనుగ్రహించిన బాబా ప్రేమకు ఉప్పొంగిపోతూ ఆలయప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను, సమాధిమందిరాలను దర్శించుకున్నాము. కొద్దిసేపు ఆలయప్రాంగణంలో గడిపి మధ్యాహ్నఆరతికి బయలుదేరాము. మధ్యాహ్నఆరతికి బాబా ఎదురుగా ముందువరుసలో నిల్చున్నాము. ఏమి భాగ్యం! ఇంకా ఆరతికి సమయం ఉంది. తదేకంగా సాయీశ్వరుణ్ణి చూస్తూ నిలబడ్డాము. ఆరతికి ముందు బాబాకు మహానైవేద్యం సమర్పించారు. ఆరతి ప్రారంభమైంది. ఆరతిలో పాల్గొని బాబాను చూస్తూ మేము కూడా ఆరతి పాటను పాడాము. ఆరతి ముగిశాక బాబాకు పాలు త్రాగించి వక్క (తాంబూలం) సమర్పించే సన్నివేశం ఎంతగానో ఆకర్షించింది. ఆ సన్నివేశాన్ని కనులారా చూడటం ఎన్నో జన్మల పుణ్యఫలం.
ఇక, శిరిడీలో సచ్చరిత్ర రెండు అధ్యాయాలు పారాయణ చేయాలని మావారు, నేను అనుకున్నాము. మా మనసెరిగిన బాబా ఆ అవకాశాన్ని కూడా మాకు ఇచ్చారు. 2022 సంవత్సరంలో గురువారాలు తక్కువగా ఉన్న కారణంగా సోమవారం, 10వ తారీఖున మహాపారాయణ ఉంటుందని మహాపారాయణ గ్రూపులో మెసేజ్ పెట్టారు. అందులో భాగంగా మాకు కేటాయించిన అధ్యాయాలను మేము శిరిడీలో పారాయణ చేశాము. “ధన్యవాదాలు సాయితండ్రీ! మీ ప్రేమకు వేవేల కృతజ్ఞతలు. బాబా, మీ మీదే భారం వేస్తే మీరే చక్కగా అన్నీ చక్కబరుస్తారనే విశ్వాసం మమ్మల్ని వీడకుండా మా చేయి పట్టుకుని నడిపించండి సాయీశ్వరా!”
మధ్యాహ్నం భోజనానంతరం పారాయణ చేసి సాయంత్రం ధూప్ ఆరతికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరాము. సమాధిమందిరంలో బాబా ఎదురుగా ముందువరుసలో నిల్చున్నాము. ఆరతికి సమయం ఉన్నందువలన బాబాను తదేకంగా చూస్తూ, గతంలోనూ, ఇప్పుడూ కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్నందుకు బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆరోజు సోమవారం, నా ఇష్టదైవమైన ఈశ్వరుని రూపంలో సాయితండ్రిని చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఆరతికి సమయం ఉంది. నేను బాబాను చూస్తున్నాను. “నీకేం కావాలో అడుగు” అన్నట్లుగా ఉంది శ్రీసాయి దివ్యమంగళరూపం. అడగకనే అన్నీ సమకూర్చే బాబాను ఏమి అడగాలని కనులారా బాబాను చూస్తున్నాను. “నీకేం కావాలో అడుగు” అన్నట్లుగా బాబా నావైపే చూస్తున్నారు. దాంతో, నా మనసులో ఉన్నవీ, చెప్పాలనుకున్నవీ అన్నీ నా సాయితండ్రి ముందర చెబుతున్నాను. బాబా చిన్నగా నవ్వుతూ ఉన్నారు. ఇంతలో బాబాకు ధూప్ ఆరతి ప్రారంభమైంది. ఆరతిలో పాల్గొంటూ మా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఆరతి పాటలో ‘రుసో మమ ప్రియాంబికా… సాయి మా మఝవరీ కధీహీ రుసో’ అనే పాటను ఎంతో ఆనందించాను. “తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, దేవతలు ఎందరు మాపై అలిగినా, మీరు మాత్రం మాపై అలగవద్దు బాబా” అనే చక్కని అర్థమున్న పాట అది. ఆరతి పూర్తికాగానే సంస్థాన్ వాళ్ళు ఉమామహేశ్వర స్తోత్రం కూడా పాడారు. నేను బాబాను ఈశ్వరరూపంలో చూస్తూ ఉండిపోయాను. ఉమామహేశ్వర స్తోత్రం విని, “బాబా సాక్షాత్తూ ఈశ్వరులే. నా మనసులో ఉన్న నా ఇష్టదైవం ఈశ్వరుడే సాయినాథుడై ఈ విధంగా ఉమామహేశ్వర స్తోత్రం వినిపించి నన్ను ఆనందింపజేశారు” అని అనుకుంటూ బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా సన్నిధిలో ఉన్నప్పుడు మా పాప నాతో, “మమ్మీ, బాబా కనురెప్పలు మూసి తెరుచుకున్నాయి” అని చెప్పింది. అది విని, “బాబా నీకు అద్భుత దర్శనం ఇచ్చారు” అని చెప్పాను. (మావారికి సాయి సన్నిధిలో కలిగిన అనుభూతిని నాతో పంచుకున్నారు. ఆ చక్కటి అనుభూతిని, ఆరతులకు హాజరుపరచిన బాబా అద్భుత లీలలని మావారు ఇదివరకే ఈ బ్లాగులో 'సాయిభక్తుల అనుభవమాలిక 1060వ భాగంలో 'అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం' అన్న శీర్షికతో పంచుకున్నారు.) బాబా దర్శనం అనంతరం ఊదీ ప్రసాదంతో బయటకు వచ్చాము. లెండీబాగ్‌లో నందాదీపం దర్శించుకుని దీపాలు వెలిగించాము. సంస్థాన్ వాళ్ళు అది చూసి, ‘ఇక్కడ వెలిగించకూడదు’ అని చెప్పి తీసుకెళ్ళారు. బహుశా అక్కడ దీపాలు వెలిగించడం కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకం కావచ్చు. అంతలోనే సంస్థాన్ వ్యక్తి ఒకరు వచ్చి దీపానికి కావలసిన నూనెకు డబ్బులు ఇవ్వమన్నారు. బాబాను ప్రార్థించి మావారి వద్ద డబ్బులు తీసుకుని అతనికి ఇచ్చాను. అతను మమ్మల్ని అక్కడ కూర్చోమనీ, తాను వెళ్ళి ఊదీ ప్యాకెట్లు, చందనం, అభిషేకజలం తీసుకొస్తాననీ చెప్పి, వెళ్ళి ఊదీ ప్యాకెట్లు, చందనం, అభిషేకజలం తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఈ విధంగా మరోసారి ఊదీ ప్రసాదం లభించడం అదృష్టంగా భావించి బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాము. కొంతసేపు బాబా సన్నిధిలో గడిపి రూముకి చేరుకున్నాము. అక్కడ కార్ పార్కింగ్ ప్లేసులో ఊదీ ప్యాకెట్ దొరికింది. ఊదీ దొరకడం శుభసూచకమని మా బాబు అన్నాడు. నేను చాలా సంతోషించాను. ఇంతలా నాకు ఊదీ ప్రసాదం అందజేస్తున్న బాబా ప్రేమకు ఎంతో ఆనందించాను. రూముకి వచ్చాక ‘సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్’ ఓపెన్ చేశాను. ఆరోజు సాయివచనం.. "నీకేది అవసరమైనా నన్ను అడగటానికి సంశయించకు" అని బాబా సందేశం చూసి ఆశ్చర్యపోయాను. కారణం, బాబా దర్శనం కూడా ‘నీకేం కావాలో అడుగు’ అన్నట్లుగా ఉంది బాబా రూపం. మరో సాయివచనం: “నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలచింది వారు అడిగేంతవరకు” అని బ్లాగులో ఉంది. ఆ సాయిసందేశాలు చూసి, “బాబా ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంది!” అని మురిసిపోయాను. కారణం, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ప్రతినిత్యం సాయిబంధువులను మానసికంగా శిరిడీలోనే ఉంచుతుంది; బాబాతో మాట్లాడిస్తుంది; బాబా బోధనలు వినిపిస్తుంది. ‘సాయి మహరాజ్ సన్నిధి సాక్షాత్తూ శిరిడీ’ అనే భావన మనందరి హృదయాలను తాకుతుంది. బాబా సన్నిధిలో పారాయణ, బాబా దర్శనం, ఆరతులను (మధ్యాహ్న ఆరతి, ధూప్ ఆరతి) హాజరు చేయించారనే ఆనందంతో ఆ రోజంతా బాబా సన్నిధిలో తనివితీరా గడిపిన మధురస్మృతులను మననం చేసుకుంటూ, ‘బాబా ఎంతటి చక్కని దర్శనాలు ప్రసాదించారు!’ అని చాలా మురిసిపోయాము. జనవరి 11వ తేదీ ఉదయం మళ్ళీ బాబా దర్శనం చేసుకుని బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాము. బాబా దర్శనం తరువాత తిరిగి ఊరికి ప్రయాణమయ్యాము. కారులో కూర్చుని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో ఈ క్రింది సాయివచనాలు ఉన్నాయి.
మొదటి సాయివచనం: “నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పజెప్పాడు. వాళ్ళ మంచిచెడ్డలు, వాళ్ళ తరింపు నా బాధ్యత!”
రెండవ సాయివచనం: “నీవు ధైర్యం వదలకు. ఏం చింతపడకు. నీవు బాగవుతావు. దయాళువైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంటిలో కూర్చో. నిర్భయంగా, నిశ్చింతగా ఉండు. నామీద విశ్వాసముంచు!”.
ఆ సాయివచనాలలోని బాబా ప్రేమను ఆస్వాదించాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మరియు 'శిరిడీ' ఒక్కటేనని నా మనసుకు ఎంతో బోధపడింది. “ధన్యవాదాలు సాయితండ్రీ! బాబా, ప్రేమస్వరూపా! మీ పాదాలే మాకు శరణం”.
తరువాత దగ్గరలో ఉన్న శనిసింగణాపూరులో శనిభగవానుని దర్శించుకున్నాము. ఆపై తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి బయలుదేరాము. ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయం భవానీమాత దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు మా బండిని ఆపి ఆరాతీశారు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదనీ, మాస్క్ పెట్టుకోలేదనీ మమ్మల్ని ఇబ్బందిపెట్టసాగారు. అప్పుడు నేను బాబాను స్మరించుకుని, “బాబా, ఈ ట్రాఫిక్ పోలీసులు మా వద్ద దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయకుండా అనుగ్రహించండి” అని ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో ట్రాఫిక్ పోలీసులు ఒకచోట 300 రూపాయలు, ఒకచోట 200 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. లేకపోతే, అన్నీ ఉన్నా ఏదో ఒక సాకుతో 1000, 2000 దౌర్జన్యంగా డబ్బులు వసూసు చేసేవారే. “బాబా, ఈ ట్రాఫిక్ పోలీసులతో ఏ ఇబ్బందీ లేకుండా చూడు సాయీ. మీ అపారప్రేమని సాయి మహరాజ్ సన్నిది బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. మేము ఇల్లు చేరేవరకు ట్రాఫిక్ పోలీసులు మళ్ళీ మా కారును ఎక్కడా ఆపలేదు. మార్గమందు మాణిక్‌ప్రభు (హుమ్నాబాద్) గురుస్థాన్ కూడా దర్శించుకుని బాబా ప్రేమను తలచుకుంటూ ఇల్లు చేరాము. ఎంతో సునాయాసంగా ఇలా వెళ్ళి అలా వచ్చామా అన్నట్లుగా ప్రయాణం బాబా దయవలన చక్కగా సాగింది. బాబా దయవలనే ఎలాంటి ఇబ్బందీ లేకుండా శిరిడీయాత్ర చేశాము. మాకు తోడుగా ఉండి శిరిడీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించి, శిరిడీయాత్రను విజయవంతం చేశారు బాబా. “ధన్యవాదాలు సాయితండ్రీ!”
మరో అనుభవం: ఇంటికి వచ్చాక మావారికి జ్వరం వచ్చింది. మావారు బాబాను ప్రార్థించి బాబా ఊదీతీర్థాన్ని సేవిస్తూ ఉన్నారు. జ్వరం వస్తూ తగ్గుతూ ఉంది. రెండురోజుల వ్యవధిలో నాకు జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. ఇద్దరం బాబా ఊదీతీర్థాన్ని సేవించసాగాము. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు, మావారికి జ్వరం తగ్గేలా ఆశీర్వదించండి. మీ అపారప్రేమను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను సాయితండ్రీ!” అని వేడుకున్నాను. ఆరోజు రాత్రి శిరిడీసాయి లైవ్ దర్శన్ యాప్ ఓపెన్ చేస్తూ, “బాబా! మీరు పూర్తిగా ఎల్లో డ్రెస్సులో ఉంటే మాకు వచ్చింది నేను భయపడాల్సిన జ్వరం, దగ్గు, జలుబు కాదు, అది కేవలం వాతావరణంలో మార్పు వల్ల వచ్చిన జ్వరం” అని అనుకున్నాను. ఆశ్చర్యంగా, శిరిడీ లైవ్ దర్శనం ఓపెన్ కాగానే బాబా ఎల్లో డ్రెస్సులో దర్శనమిచ్చారు. మరుసటిరోజు వేకువఝామున ఈశ్వర దర్శనాలతో పాటు బాబా దర్శనం కలిగింది. స్నానానంతరం ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళాను. ధ్యానంలో నాకు ఈశ్వర దర్శనం అయింది. నేను, మావారు బాబా ఊదీని, ఊదీతీర్థాన్ని తీసుకున్నాము. బాబా దయవలన ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాము. “ధన్యవాదాలు సాయితండ్రీ!”
శిరిడీయాత్ర అనుభవాలు చదివిన సాయిబంధువులకు కూడా నా ధన్యవాదాలు. బాబా ప్రేమను పంచుకోవడానికి సాయిబాబా ఇచ్చిన గొప్ప వరం సాయిబంధువులు. “మీకు వేవేల కృతజ్ఞతలు సాయితండ్రీ! సాయీశ్వరా, మీ పాదాలే శరణం!”
సద్గురు చరణం భవభయహరణం!!!
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me and help me to pass MBA EXAM. Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram ��
ReplyDelete