సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

హరిభావు మోరేశ్వర్ ఫన్సే



హరిభావు మోరేశ్వర్ ఫన్సే అలియాస్ జనార్ధన్ ఎమ్. ఫన్సే సాయిబాబా భక్తుడు. 1913లో తన మిత్రుడు నాచ్నే శిరిడీ ప్రయాణమవుతుంటే అతనిని కలిసి, ఆఫీసు డబ్బు దుర్వినియోగపరచిన నేరంపై తనను దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, ప్రస్తుతం జామీనుపై తనని విడుదల చేశారని చెప్పాడు. అంతేకాదు, తాను కోర్టులో అప్పీలు చేసుకున్నానని, అది ఒకటి రెండు రోజుల్లో విచారణకొస్తుందని చెప్పి, తాను నిర్దోషినని, ఇబ్బందుల్లో ఉన్న తనకు సహాయం చేయమని తన తరపున బాబాను ప్రార్థించమని చెప్పాడు. మరుసటిరోజు తెల్లవారుఝామున నాచ్నే శిరిడీ చేరుకునేసరికి చావడిలో బాబాకు కాకడ ఆరతి జరుగుతోంది. ఆ సమయంలో బాబా చాలా కోపంగా ఉన్నారు. అయినప్పటికీ నాచ్నేను చూస్తూనే బాబా, “ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అతనితో చెప్పు. అతను అప్పీలు మీద నిర్దోషిగా ప్రకటించబడతాడు” అని చెప్పారు. అదే జరిగింది. నాచ్నే శిరిడీ నుండి తిరిగి వెళ్లి ఫన్సేతో ఆ విషయం చెప్పేసరికే అతను అప్పీలు మీద నిర్దోషిగా విడుదలై ఉన్నాడు. అంటే, బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరిందన్న మాట.

ఒకప్పుడు ఫన్సే అంతంతమాత్రమే వచ్చే ఆదాయంతో కుటుంబభారాన్ని మోయలేక, కన్నతల్లి బాగోగులు చూసుకోలేక ఎంతో మనస్తాపం చెందాడు. చివరికి తన కష్టాలు ఎప్పటికీ తీరవని భావించి అన్నీ విడిచిపెట్టి ఇల్లు వదిలి రామేశ్వరం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. దారిలో శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుందామని కూడా అనుకున్నాడు. అతను తన నిర్ణయాన్ని తల్లితో చెప్పి, ఆమె వారిస్తున్నా వినకుండా రామేశ్వరం ప్రయాణమయ్యాడు. అనుకున్నట్లే అతను దారిలో శిరిడీ వెళ్ళాడు. ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబాను దర్శిస్తూనే ఎంతో ఆనందాన్ని పొందాడు. బాబా అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, “ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం పస్తుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది. నీ తల్లి నీకోసం పరితపిస్తూ ఉపవాసముండి శుష్కించిపోయింది. ఆలసించక వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు” అని ఆదేశించారు. అతను బాబా వద్ద సెలవు తీసుకొని బయలుదేరుతుంటే, ఆయన అతనికి ఊదీ ఇచ్చి ఆశీర్వదించారు. అతడు ఇంటికి చేరేసరికి అతని తల్లి నిజంగానే నిరాహారియై, “బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి” అని రోజూ బాబాను ప్రార్థిస్తున్నదని తెలిసింది. అతడు తల్లికి బాబా చెప్పినదంతా వివరంగా చెప్పాడు. అంతటితో ఆమెకు బాబా దైవశక్తి మీద పూర్తి విశ్వాసం కుదిరింది.

ఒకసారి ఫన్సే ఆ గ్రామంలో కలరా వ్యాధితో బాధపడుతున్న ఒకతనికి బాబా ఊదీని ఇచ్చాడు. బాబా కృపవల్ల అతని వ్యాధి నయమయింది. నాటినుండి ఫన్సే గొప్ప వైద్యుడని తలచి ఆ వ్యాధికి గురైన వారంతా వైద్యం కోసం అతని దగ్గరకు రావడం ప్రారంభించారు. అతను వాళ్ళకి ఊదీ ఇస్తూ ఉండేవాడు. అందరూ ఆ వ్యాధి నుండి విముక్తులయ్యారు. తొందరలోనే అతని దగ్గరున్న ఊదీ అంతా అయిపోయింది. ఇప్పుడేమి చేయాలా అని అతడు కంగారుపడుతుంటే నాటితో ఆ ఊళ్ళోనే కలరా వ్యాధి లేకుండా పోయింది. కొన్నాళ్ళకు ఫన్సే ప్రక్క గ్రామానికి చెందిన ఒక మార్వాడీ మిత్రుడిని చూడటానికి వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బుచేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గడం లేదు. ఆ మిత్రుడు ఫన్సేతో, “నా తమ్ముడు రోగంతో మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని రకాల చికిత్సలు చేసినా ఫలితం కనపడలేదు. నువ్వు సాయిభక్తుడివి. నువ్వు నా తమ్ముణ్ణి చూడాలి. సాయిబాబా మహాత్ములైతే నీ ద్వారా నా తమ్ముడి జబ్బు నయం చేస్తారు” అని అన్నాడు. ఫన్సే రోగిని చూసి, పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వలన భయపడి తప్పించుకోజూశాడుగానీ అప్పటికే చీకటిపడినందువల్ల వెంటనే బయలుదేరలేకపోయాడు. అతని అలవాటు ప్రకారం నాటిరాత్రి బాబా పూజకి స్వయంగా రోగియే అన్ని ఏర్పాట్లు చేశాడు. అది చూసి కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు. పూజ, భజన జరుగుతున్నంతసేపూ రోగి బాబా ఫోటోనే ప్రేమతో తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అది చూసిన మార్వాడీ ఎంతో సంతోషించి ఫన్సేతో, “జబ్బుతో బాధపడుతున్న నా తమ్ముని భారమంతా నీదే. వాడి జబ్బు నువ్వే నయం చేయాలి. వాడు బ్రతికినా, మరణించినా నీ దగ్గర తప్ప మరెవ్వరి దగ్గరా మందు పుచ్చుకోడు” అని అన్నాడు. ఆ మాట వింటూనే ఫన్సే ఉలిక్కిపడ్డాడు. ధైర్యం చాలక ఎలాగైనా తప్పించుకోవాలని ఎంతో ఎక్కువ ఫీజు (రెండు వందల రూపాయలు) అడిగాడు. ఆ రోజుల్లో అంత పెద్ద మొత్తాన్ని పెద్ద పెద్ద సివిల్ సర్జన్లు కూడా తీసుకొనేవారు కాదు. అంత పెద్ద మొత్తాన్ని మార్వాడీ ఎలాగూ ఇవ్వలేడని అతని ఉద్దేశ్యం. కానీ ఆ మార్వాడీ ఫన్సే చెప్పిన ఫీజు ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. దాంతో ఫన్సే ఏమి చేయాలో తోచని అయోమయంలో పడ్డాడు. అయితే, కరుణాసముద్రుడైన బాబా నాటిరాత్రి అతనికి స్వప్నదర్శనమిచ్చి, రోగికొచ్చిన జబ్బును, దాని తత్వాన్ని, దాని నివారణకు ఇవ్వవలసిన మందునూ తెలియజేశారు. అతను బాబా చెప్పినట్లే చేయడంతో రోగి పూర్తిగా కోలుకొన్నాడు. మార్వాడీ ఎంతో సంతోషించి అన్నమాట ప్రకారం ఫన్సేకి రెండువందల రూపాయలు ఇవ్వబోయాడు. కానీ ఫీజు తీసుకోవడానికి ఫన్సే అంగీకరించక. “ఇదంతా నా గురువు దయవల్లనే జరిగింది. ఇందులో నేను చేసినదేమీ లేదు. నాకెటువంటి ఫీజూ వద్దు” అని అన్నాడు. మార్వాడీ ఎంతో నిరాశ చెంది, తానివ్వదలచిన డబ్బుతో ఒక శాలువా కొని ఫన్సే ఇంటిలో లేని సమయం చూసి అతని ఇంటిలో ఇచ్చి వెళ్ళిపోయాడు.

ఆ విషయం తెలిసి ఫన్సే ఎలాగైనా ఆ శాలువాను బాబాకే ఇచ్చేద్దామనుకొన్నాడు. కానీ అతను పంపేలోపే బాబా మహాసమాధి చెందారు. ఆ శాలువాను ఏమి చేయాలో తోచక, కర్తవ్యాన్ని ఉపదేశించమని అతను కన్నీళ్లతో బాబాను ప్రార్థించాడు. ఆ రాత్రి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, “ఈ ప్రాంతమంతా కరువు వల్ల పేదజనం అల్లాడుతున్నారు. ఆ శాలువా అమ్మి, వచ్చిన డబ్బుతో బియ్యం కొని, పేదజనానికి తక్కువ ధరకు అమ్ము. ఆ డబ్బంతా అయిపోయాక బియ్యం వ్యాపారం చేసుకో, దానితో నీ జీవితం సుఖంగా సాగుతుంది” అని చెప్పారు. అతడు బాబా చెప్పినట్లే చేసి ఎంతో అభివృద్ధిలోకి వచ్చాడు. తన తల్లిని చక్కగా చూసుకున్నాడు.

సమాప్తం .....

సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ.

4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🌺🌼🌺🙏🙏🙏🙏🙏🌺🌻🌺

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo