సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 671వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాను వేడుకున్నంతనే తీరిన సమస్య
  2. సాయినాథుడే మన ఏకైక రక్షకుడు

బాబాను వేడుకున్నంతనే తీరిన సమస్య


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. సాయిబంధువులకు నా నమస్కారములు. బాబా లేకపోతే నా జీవితం లేదు. బాబా దయవలన నేను మహాపారాయణ గ్రూపులో క్లాసు టీచరుగా ఉన్నాను. బాబా నా నెలసరి సమస్యను పరిష్కరించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 


నాకు నెలసరి ఎప్పుడూ సక్రమంగానే వచ్చేది. కానీ ఈమధ్య ఎందుకో నాకు నెలసరి సరిగా రావడం లేదు. ఈ విషయంగా నేను చాలా బాధపడుతూ, "నా నెలసరి సమస్యను తీర్చమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల సరైన సమయానికి నాకు నెలసరి వచ్చింది. ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ లీలతో బాబాపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. బాబా ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో అనుభవాలను మీతో పంచుకుంటానని ఆశిస్తున్నాను. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


సాయినాథుడే మన ఏకైక రక్షకుడు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను మన ప్రియమైన శిరిడీ సాయిబాబా భక్తుడిని. ముందుగా ఈ విశ్వమునందు మన ఏకైక రక్షకుడైన సాయిబాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ప్రతి శ్వాసలో నా సాయి నాతో ఉన్నారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ ఆయనే. ఆయన గొప్పతనాన్ని, అనంతమైన ఆయన ప్రేమను, సంరక్షణను వ్రాయాలని ప్రయత్నిస్తే మాటలు సరిపోవు. బాబా మా కుటుంబంపై చూపించిన కృపను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

లాక్‌డౌన్ సమయంలో మా నాన్నగారు మలబద్ధకంతో వారానికి పైగా బాధపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా బయటకి వెళ్లలేక చిట్కా వైద్యాలన్నీ ఉపయోగించాం. కానీ ఏదీ సత్ఫలితాన్ని చూపలేదు. ఆ సమస్య కారణంగా నాన్న సరిగా తినేవారు కాదు. ఆయనకి నిద్ర కూడా కరువైంది. రోజులు గడుస్తున్నకొద్దీ సమస్య తీవ్రమైంది. దాంతో మేము ఫోనులోనే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు సూచించిన మందులు ఉపయోగించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నా కరోనా కారణంగా నాన్నను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళడానికి మేము చాలా భయపడ్డాము. అప్పుడు నేను వైద్యులకే వైద్యుడు, కంటిచూపుతో ఎంతటి వ్యాధినైనా నయం చేయగల సాయి ముందు కూర్చుని ఏడుస్తూ, "ఈ సమస్య కోసం మమ్మల్ని హాస్పిటల్‌కి వెళ్లనివ్వకండి. ఈ కష్టం నుండి బయటపడటానికి ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆ ప్రార్థన ముగించిన వెంటనే నేను ఇంగ్లీష్ బ్లాగు ఓపెన్ చేశాను. అక్కడ దాదాపు మేము అనుభవిస్తున్నటువంటి సమస్యే నా కంటపడింది. లాక్‌డౌన్ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళకుండా బాబా తన భక్తుని కాపాడిన ఒక అనుభవాన్ని చదివాక బాబా నా ప్రార్థనకు సమాధానమిచ్చారని నేను అర్థం చేసుకున్నాను. ఆ అనుభవం ద్వారా ఖచ్చితంగా నాన్నకు నయమవుతుందన్న నమ్మకం వచ్చింది. నాన్న కూడా బాబాను ప్రార్థించారు. నేను నాన్నకు ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి త్రాగమని ఇచ్చాను. మీరు నమ్ముతారో లేదోగానీ, వారం రోజులుగా ఉన్న సమస్య నుండి కేవలం ఒక్క గంటలోనే నాన్న ఉపశమనం పొందారు. నాన్న ఆ మాట చెప్పగానే నా నోట మాట రాలేదు. వెంటనే పరుగుపరుగున బాబా వద్దకు వెళ్లి, ఆయన చూపిన అద్భుతలీలకు, ఆశీర్వాదానికి నమస్కారాలు చెప్పుకున్నాను. నిజంగా మన బాబా దయామయులు.

హృదయపూర్వకంగా బాబాను విశ్వసించండి. కష్టసమయాల్లో ఆయన మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. సాయే మన ఏకైక రక్షకుడు. "ప్రియమైన బాబా! మీకు నా కృతజ్ఞతలు. ఎప్పటికీ నేను మీకు ఋణపడివుంటాను. దయచేసి నా తప్పులన్నింటినీ క్షమించి, మీ పాదకమలాల వద్ద సదా నాకు స్థానం కల్పించండి".

అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 670వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ త్వరగా తగ్గిన నొప్పి
  2. బాబా మాట సత్యం - ఆయన ఉనికి నిత్యం

బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ త్వరగా తగ్గిన నొప్పి


హైదరాబాద్ నుండి సాయిభక్తుడు రవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు రవి. నేను హైదరాబాద్ వాసిని. నేను ఎల్లప్పుడూ బాబా నామజపం చేస్తాను. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకరోజు అకస్మాత్తుగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఛాతీలో నొప్పి మొదలైంది. అది గుండెనొప్పో లేక గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చిన నొప్పో నాకు అర్థం కాలేదు. నేను బాబాను తలచుకుని మంచినీళ్ళల్లో బాబా ఊదీని కలుపుకుని త్రాగాను. తరువాత బాబా నామజపం చేశాను. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గడానికి జెలుసిల్ కూడా వేసుకున్నాను. “బాబా! మీ దయవల్ల ఈ నొప్పి తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన”ని బాబాను ప్రార్థించాను. బాబా చల్లని దయవల్ల కాసేపటికే నొప్పి తగ్గింది. అంతకుముందు ఇలాగే నొప్పి వచ్చినప్పుడు జెలుసిల్ వేసుకున్నా తగ్గేది కాదు. ఇప్పుడు బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ నొప్పి త్వరగా తగ్గిపోయింది. నాకున్న మిగిలిన ఆరోగ్య సమస్యలు కూడా వీలైనంత త్వరగా తగ్గేలా అనుగ్రహించమని బాబాను మనసారా వేడుకుంటున్నాను. నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. బాబా దయవలన అవి తీరితే ఆ అనుభవాలు పంచుకోవడానికి మరోసారి మీ ముందుకు వస్తాను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. 


ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః

బాబా మాట సత్యం - ఆయన ఉనికి నిత్యం


జర్మనీ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

తోటి భక్తులకు జై సాయినాథ్!

మొదటి అనుభవం:

నేను గత 10 సంవత్సరాలుగా జర్మనీలో నివాసముంటున్నాను. నేను మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు సుమారు 5 సంవత్సరాల పాటు కెరీర్(వృత్తిజీవితం)లో విరామం తీసుకోవలసి వచ్చింది. తరువాత నేను నా కెరీర్ మొదలుపెడదామనుకున్నాను. అయితే డబల్ గ్రాడ్యుయేట్‌గా నాకు మంచి అర్హతలు ఉన్నప్పటికీ 5 సంవత్సరాలలో వచ్చిన సాంకేతిక మరియు వ్యక్తిగత నైపుణ్యాలలో మార్పుల కారణంగా ఉద్యోగం సంపాదించడం నాకొక పెద్ద సవాలుగా కనిపించింది. అందువల్ల నేను నిరాశ చెందినప్పటికీ నా బయోడేటాను ఇంటర్నెట్లో పెట్టాను. కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు నేను సాయి సచ్చరిత్ర చదవడం ప్రారంభించాను. అప్పుడు మొదటి అద్భుతం జరిగింది. మరుసటి గురువారం నేను చివరి అధ్యాయాన్ని పూర్తిచేసిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది. అయితే అది తాత్కాలిక (పార్ట్ టైమ్) కాంట్రాక్ట్ ఉద్యోగం. అయినప్పటికీ, నాకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి బాబా ఇచ్చిన అవకాశంగా భావించి నేను చాలా సంతోషించాను. తరువాత నెలలు గడిచినప్పటికీ తాత్కాలిక ఉద్యోగిగానే కొనసాగుతున్నందున, "శాశ్వత ఉద్యోగ అవకాశాన్ని ప్రసాదించమ"ని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకసారి నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో "ఎప్పుడు నాకు శాశ్వత ఉద్యోగం లభిస్తుంది?" అని బాబాను అడిగినపుడు, "నీ తల్లి నీతో ఉన్నప్పుడు నువ్వు అనుకున్న దాంట్లో నీకు విజయం సిద్ధిస్తుంది" అని వచ్చింది. ఆ సమాధానం నాకు ఏమీ అర్థం కాలేదు.

తరువాత నేను నా ఉద్యోగ విధులలో సాధారణంగా కొనసాగుతున్నాను. ఈలోగా నాన్న క్యాన్సర్‌ వ్యాధికి గురై ఎప్పటికప్పుడు అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుండేవారు. ఆయన మృత్యువుతో చాలా పోరాడిన తరువాత దురదృష్టవశాత్తు కన్నుమూశారు. ఆ తరువాత మా అమ్మ కొన్ని నెలలపాటు మాతో కలిసి ఉండటానికి జర్మనీకి వచ్చింది. ఆమె మా ఇంటికి వచ్చిన మొదటిరోజున నా హెచ్.ఆర్. నుండి 'నాకు శాశ్వత స్థాయి ఉద్యోగం ఇవ్వబోతున్నామ'ని ఇ-మెయిల్ వచ్చింది! నా ఆనందానికి అవధులు లేవు, అప్పుడు నేను బాబా ఇచ్చిన సమాధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ఆ విధంగా బాబా తన భక్తులకోసం ప్రణాళికలు కలిగి ఉంటారనీ, భక్తులందరినీ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారనీ నాకు భరోసా ఇచ్చారు.

ఇటీవలి అనుభవం:

ప్రస్తుతం కోవిడ్ కారణంగా, పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేసుకోవడం పెద్ద సవాలైంది. ఇంట్లో ఎన్నో బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ప్రార్థన చేయడానికి లేదా బాబాతో కనెక్ట్ అవ్వడానికి సమయం దొరికేది కాదు. ఆ పరిస్థితి నా మనసుకు ఏ మాత్రం నచ్చేది కాదు. దానికి తోడు బాబా ఉనికిని తెలియజేసే సంకేతాలు కూడా చాలాకాలం పాటు నాకు లభించలేదు. దాంతో బాబాతో అనుబంధాన్ని కోల్పోతున్నానేమోనని భయపడ్డాను. అటువంటి సమయంలో బాబా తన ఉనికిని ఆధునిక పద్ధతిలో చూపించారు. ఒకరోజు నేను నా మేనేజరుతో ఒక సమావేశంలో ఉన్నాను. ఆ సమయంలో నా కూతురు వచ్చి నా ఫోన్‌ అడిగితే ఇచ్చాను. సాధారణంగా తను సెల్ఫ్ వీడియోలు తీసుకోవడానికి మాత్రమే ఫోన్ ఉపయోగిస్తుంది. కానీ ఆరోజు తను వాట్సాప్ తెరిచి నా సోదరుడితో చాట్ చేయడం ప్రారంభించింది. నా సమావేశం ముగిసిన తరువాత నేను తన వద్ద నుండి ఫోన్ తీసుకుని తను ఏమి వ్రాసిందా అని చూస్తూ నా సోదరునితో చేసిన చాటింగు‌లో సాయిబాబా స్టికర్ చూసి ఆశ్చర్యపోయాను. నా కూతురు ఆ స్టిక్కర్‌ను నా సోదరునికి పంపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ స్టికర్ ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలియదు! నేనెప్పుడూ నా ఫోనులో దాన్ని చూడలేదు. అది చూసి నేను, "నువ్వు చింతించకు, నేను నీతోనే ఉన్నాను" అని బాబా నాకు సంకేతం ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. "బాబా మీ ఆధునిక సూచనకు నా ధన్యవాదాలు".

ఓం సాయినాథ్!



సాయిభక్తుల అనుభవమాలిక 669వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. కరోనా పరీక్షకి వెళ్లకుండా బాబా కాపాడారు
  2. కరోనావైరస్ బారినుండి రక్షించిన బాబా

కరోనా పరీక్షకి వెళ్లకుండా బాబా కాపాడారు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఈ కరోనా సమయంలో మేము బయటకి వెళ్ళట్లేదు, బయట ఆహారాన్ని కూడా తినట్లేదు. కానీ 2021, జనవరి 3వ తేదీన మా అమ్మాయి నా సోదరి కొడుకు పుట్టినరోజు పార్టీకి వెళ్ళింది. పార్టీ బాగా జరిగింది. పార్టీలో మా అమ్మాయి దాదాపు అన్నీ ఇంట్లో తయారుచేసిన ఆహారపదార్థాలనే తిన్నది. ఒక్క పన్నీరు కూర మాత్రమే హోటల్ నుంచి తెచ్చింది తిన్నది. మరుసటిరోజు గొంతు గరగర, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలతో తను తన ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. మేము వెంటనే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు మా అమ్మాయిని పరీక్షించి మందులు వ్రాసిస్తూ, "ఈ మందులు వాడండి. మూడు రోజుల తర్వాత కూడా లక్షణాలు ఇలాగే ఉంటే కరోనా పరీక్ష చేయించాలి" అని అన్నారు. అది వింటూనే నాకు చాలా ఆందోళనగా అనిపించి, "బాబా! కరోనా పరీక్ష అవసరం లేకుండా మందులతో నా కూతురి ఆరోగ్యం కుదుటపడితే నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మాటిచ్చాను. తరువాత మా అమ్మాయికి మందులతోపాటు ఊదీనీళ్లు ఇచ్చాను. బాబా అనుగ్రహంతో మా అమ్మాయికి ఉన్న తలనొప్పి, వికారం మొదలైన లక్షణాలన్నీ మెల్లగా ఉపశమించాయి. ఇప్పుడు తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. కరోనా పరీక్షకి వెళ్లకుండా బాబా మమ్మల్ని  కాపాడారు. ఇది చిన్న అనుభవం అయినప్పటికీ నిజంగా బాబా మమ్మల్ని క్లిష్టపరిస్థితి నుండి రక్షించారు. "థాంక్యూ బాబా". ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకొనే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు భయ్యా! బాబా అద్భుతం కోసం నిరీక్షిస్తున్న నేను మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


ఓం సాయిరామ్!


కరోనావైరస్ బారినుండి రక్షించిన బాబా

యు.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయి భక్తురాలిని. ఇటీవల మా నాన్నగారు కరోనా వైరస్ బారినపడి అనారోగ్యం పాలయ్యారు. కేవలం సాయిబాబా దయతో అతను తిరిగి కోలుకుని మా మధ్యకి వచ్చారు. ఈ అనుభవం ద్వారా భక్తులకు బాబాయందు విశ్వాసం దృఢపడుతుందన్న నమ్మకంతో నేను నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబాపై విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన ఎలాంటి తీవ్ర పరిస్థితులనైనా మార్చగలరు.  

ఏప్రిల్ నెలలో ఒకరోజు మా నాన్న కడుపునొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లారు. అప్పుడు ఆయనకి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో డాక్టర్లు, "నాన్న శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నందున రాత్రంతా అతనికి ఆక్సిజన్ పెట్టి ఉంచుతామ"ని మాకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులెవ్వరికీ హాస్పిటల్లో ఉండటానికి అనుమతించలేదు. కేవలం విజిటింగ్ అవర్ లో నాన్నను చూడటానికిగాని, మాట్లాడటానికి గాని అవకాశం మాకు ఇచ్చారు. నాన్న చాలా ఆందోళన చెందారు. దాంతో అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది.

మరుసటిరోజు హాస్పిటల్ నుండి అకస్మాత్తుగా మాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు, "నాన్నకి డబుల్ న్యుమోనియా ఉందని, శ్వాసించడం చాలా ఇబ్బందిగా ఉందని, పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతన్ని పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంచవలసి వచ్చింద"ని చెప్పారు. మేమంతా చాలా భయపడిపోయాము. ఇక మేము రాత్రి, పగలు తేడా లేకుండా, "బాబా! నాన్నకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు శుభవార్త వినిపించండి" అని బాబాను ప్రార్థిస్తూ గడిపాము. అయితే నాలుగవరోజు నుండి నాన్న పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మాకు కాల్స్ రాసాగాయి. అయినా మేము బాబాపై విశ్వాసాన్ని కోల్పోకుండా నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. నెమ్మదిగా అతని పరిస్థితి మెరుగుపడసాగింది. వెంటిలేటర్ మీద మూడు వారాలు గడిచాక డాక్టర్స్, "ఒక చిన్న శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వెంటిలేటర్ తీస్తే అతను ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఈ వారాంతంలో ఏదైనా అద్భుతం జరగకపోతే, సోమవారం శస్త్రచికిత్స చేస్తామ"ని చెప్పారు. 

బాబా అద్భుతం చేసారు. ఆదివారంనాడు నాన్న వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని మాకు వార్త వచ్చింది. సోమవారం వెంటిలేటర్‌ను పూర్తిగా తొలగించారు. కానీ నాన్న చాలా బలహీన పడిపోయారు, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మేము నిరంతరం చేసిన ప్రార్థనలకు బాబా, ఇంకా ఇతర దేవతలందరూ కరుణ చూపారు. రోజురోజుకి నాన్న పరిస్థితి మెరుగుపడింది. వెంటిలేటర్ తీసేసిన నాలుగురోజుల తరువాత నాన్నని పునరావాస విభాగానికి తరలించారు. సరిగ్గా ఐదువారాల తరువాత నాన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. నాన్న ఇప్పుడు బాగున్నారు. కొద్దివారాల్లో వ్యాయామంతో అతని కండరాలు పటుత్వం సంతరించుకుంటాయి. నిజానికి మేము మా నాన్నను కోల్పోతామని అనుకున్నాము. అతను మృత్యువు అంచువరకు వెళ్లారు. కాని విశ్వాసంతో, సానుకూల దృక్పథంతో  మేము నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండబట్టి, ఆయన అనుగ్రహం వలన నాన్న ఇప్పుడు మాతో ఉన్నారు.

జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా బాబాపై విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు, మనల్ని బలోపేతం చేస్తారు. ఈ సంఘటన బాబాపై నా విశ్వాసాన్ని దృఢం చేసింది. "నన్ను క్షమించండి బాబా, కొన్నిసార్లు మిమ్మల్ని అనుమానిస్తుంటాను. మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారన్న విశ్వాసం మాకు చాలా అవసరం. ఏది ఏమైనా అన్నిటికి మీకు ధన్యవాదాలు. దయచేసి నా తప్పులను క్షమించండి".

ఓం జై సాయిరామ్.



సాయిభక్తుల అనుభవమాలిక 668వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. 'సాయీ' అని తలచినంతనే తాను పలుకుతానని బాబా తెలియజేసారు
  2. క్షేమంగా ప్రయాణం చేయించిన బాబా
  3. అంతా బాబా చూసుకుంటారు, నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు

'సాయీ’ అని తలచినంతనే తాను పలుకుతానని బాబా తెలియజేసారు


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శిరిడీ సాయిరాం! ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను సాయిని ప్రార్థించి, ‘ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి’ అనే సాయినామాన్ని స్మరించి, సాయి చాలీసాను చదువుకుంటాను. అప్పుడు బాబా నా సమస్యలను పరిష్కరిస్తుంటారు. మా అబ్బాయిల ఉద్యోగాల విషయంలో బాబా ఎంతో సహకరించి వాళ్ళకు ఉద్యోగాలను ప్రసాదించారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబానే. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులందరికీ తెలియజేయదలచుకున్నాను. 


మా అబ్బాయి వివాహ విషయంలో నేను ఆంజనేయస్వామి చుట్టూ 5 శనివారాలు ప్రదక్షిణలు చేయాలని అనుకున్నాను. 2020, కార్తీకమాసంలో నేను ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేస్తూ, కార్తీకమాసం కదా అని ఆ గుడిలో కార్తీకదీపాలు కూడా వెలిగించాను. ఆ గుడిలో నవగ్రహాలు, వినాయకుడు, శివుడు, బాబా, నాగదేవతల ప్రతిమలు కూడా చిన్నవి ఉన్నాయి. నేను అక్కడ కూడా దీపాలు వెలిగించి వచ్చాను. కానీ ఒక శనివారంరోజు మాత్రం అక్కడ బాబా విగ్రహం కనపడలేదు. బాబా విగ్రహాన్ని అక్కడినుంచి తీసి వేరే చోట పెట్టారేమోనని అక్కడంతా వెతికాను. కానీ, ఎక్కడా కనిపించలేదు. దాంతో నేను మనస్సులోనే బాబా అక్కడే ఉన్నారని భావించుకుని బాబాను స్మరించుకుంటూ దీపాలు వెలిగించాను. ఇంతలో ఒకామె మూడేళ్ళ వయసున్న తన బాబుతో వచ్చింది. ఆమె ఆ బాబుని ‘సాయీ, సాయీ’ అని పిలుస్తోంది. నాకు అప్పుడు అనిపించింది, “నేను బాబా కోసం వెతుకుతుంటే, బాబానే ఆమె నోటినుంచి ‘సాయీ’ అని పిలిపించి, నేను ఆ బాబును చూసేటట్లు చేసి, మనం ‘సాయీ’ అని తలచినంతనే తాను పలుకుతానని బాబా నాకు తెలియజేస్తున్నారు” అని. ఆ తరువాత ‘సాయి’ అనే పేరుగల ఒక పెద్దబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నాకు బాబా సన్నిధిలో దీపాలు వెలిగించిన తృప్తి కలిగింది. మా ఇంట్లో మా పిల్లల అందరి పేర్ల ముందు ‘సాయి’ ఉంటుంది. “మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు బాబా! నా మనస్సులోని కోరికలు మీకు తెలుసు బాబా, దయచేసి వాటిని నెరవేర్చండి”.


క్షేమంగా ప్రయాణం చేయించిన బాబా


బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు బాబా ఇటీవల తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవాళ్లందరికీ కూడా నా నమస్కారాలు. కరోనా కారణంగా దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము ఇల్లు విడిచి బయటకెక్కడికీ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండటం వలన పిల్లలు తమకు చాలా బోర్ కొడుతోందని అంటుండేవారు. కానీ, ‘ఇదంతా తప్పదు’ అంటూ వాళ్ళకి నేను, మావారు నచ్చజెప్తూండేవాళ్ళం. ప్రతి సంవత్సరం మా పిల్లలకి డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవులు ఇస్తారు. ఆ సెలవుల్లోనైనా ఎక్కడికైనా వెళదామని చాలాసార్లు మా పిల్లలు అడిగారు. దాంతో, నోయిడాలో ఉన్న మా ఆడపడుచు దగ్గరికి సెలవుల్లో వెళదామని నిర్ణయించుకున్నాము. కానీ ఏదో తెలియని భయం. టిక్కెట్లు బుక్ చేసినప్పటినుంచి నేను, "నువ్వే మమ్మల్ని క్షేమంగా నోయిడా తీసుకెళ్లి, తీసుకురావాలి బాబా" అని బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల నోయిడా వెళ్లి, పదిరోజులు అక్కడ ఆనందంగా గడిపి తిరిగి వచ్చాము. పిల్లలు అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఎంజాయ్ చేశారు, ఎంతో ఆనందంగా గడిపారు. తరువాత ఈమధ్య మా అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. ఆరోజు మేము బాబా గుడికి వెళ్ళాము. నేను బాబా దర్శనం చేసుకొని, "థాంక్యూ సాయీ! మీ దర్శనభాగ్యాన్ని కలిగించారు. నా మొర విని క్షేమంగా మమ్మల్ని నోయిడా తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చారు. పిల్లలు చాలా సంతోషించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే అందరికీ తోడుగా ఉండండి సాయీ. ఎప్పుడూ నా మనసున మీ నామస్మరణ నడిచేలా చూడండి స్వామీ! మా ప్రయాణమంతా బాగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మీకు మాటిచ్చాను. మాటిచ్చినట్టుగానే ఇప్పుడు నా అనుభవాన్ని పంచుకున్నాను. థాంక్యూ సాయీ!"


అంతా బాబా చూసుకుంటారు, నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. బాబాపై నాకున్న నమ్మకం కొన్ని నెలల క్రితం ఇంకా దృఢమైంది. నేను ఈమధ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ, బాబా దయవల్ల సమస్యలన్నీ సమసిపోయాయి. ఇటీవల నాకు కొద్దిగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ సలహాతో టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ రిపోర్టు రావటానికి చాలా ఆలస్యం అయింది. రిపోర్టు వచ్చేలోపు అందులో ఏముంటుందోనని నాకు చాలా భయంగా ఉండేది. కానీ నేను బాబాకు గట్టిగా నా సంకల్పం చెప్పుకున్నాను. రిపోర్టు నార్మల్‌గా రావాలని బాబాను ప్రార్థిస్తూ, ప్రతిరోజూ బాబా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగేదాన్ని. అంతేకాకుండా, “రిపోర్టు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మాట ఇచ్చాను. బాబా దయవల్ల నా రిపోర్టంతా నార్మల్‌గా వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అంతా బాబా చూసుకుంటారు. బాబాపై నమ్మకం ఉంచడం మాత్రమే మన వంతు. “ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా!” నాకు ఇంకో సమస్య కూడా ఉంది. బాబా దయవల్ల అది పరిష్కారమైతే, ఆ అనుభవాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 


సాయినాథ్ మహరాజ్ కీ జై!



నారాయణ గోవింద్ షిండే



సాయిభక్తుడైన చోటూభయ్యా, నారాయణ గోవింద్ షిండేలు చిన్ననాటి స్నేహితులు. వారివురూ 1903వ సంవత్సరంలో గాణ్గాపురం వెళ్లి సంగమంలో స్నానమాచరించారు. తరువాత చోటూభయ్యా తన స్నేహితుడైన షిండేతో, "దత్తపాదుకలకు నమస్కరించుకుని, సంవత్సరంలోగా కొడుకు పుడితే, బిడ్డను తీసుకొచ్చి స్వామి పాదుకల వద్ద ఉంచుతానని మ్రొక్కుకో!” అని సలహా ఇచ్చాడు. అతనలా చెప్పడానికి కారణం, అప్పటికి షిండేకి ఏడుగురు కుమార్తెలున్నారుగానీ, పుత్రసంతానం లేదు. స్నేహితుని సలహాననుసరించి అలాగే మ్రొక్కుకున్నాడు షిండే. భగవంతుని ఆశీస్సులతో సంవత్సరంలోపు అతనికి పండంటి కొడుకు పుట్టాడు. కానీ, అతను తన మ్రొక్కును తీర్చుకోలేదు. మ్రొక్కును త్వరగా తీర్చుకోమని చోటూభయ్యా పదేపదే షిండేకు గుర్తు చేస్తున్నప్పటికీ అతను ఏవో సాకులు చెప్పి కాలయాపన చేస్తుండేవాడు. ఒకరోజు చోటూభయ్యా అతని చేయి మెలిపెట్టి, "అరే షిండే! భగవంతుడు ఏదో ఒక విధంగా తన మ్రొక్కులు రాబట్టుకుంటాడు. ఆ పరిస్థితి రాకముందే నీ బిడ్డను తీసుకొని గాణ్గాపురం వెళ్లడం మంచిది" అని చెప్పాడు. అయినా షిండే వినలేదు.

1911లో ఒకరోజు చోటూభయ్యా తన కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని షిండేని కూడా తమతో శిరిడీ రమ్మని అడిగాడు. కానీ షిండే అందుకు నిరాకరించాడు. ఆ రోజంతా షిండే విపరీతమైన అశాంతికి లోనయ్యాడు. దాంతో తన స్నేహితునితో కలిసి శిరిడీ వెళ్ళటానికి నిర్ణయించుకుని, సరిగ్గా వాళ్ళు శిరిడీ బయలుదేరే సమయానికి వాళ్లను కలుసుకున్నాడు. అందరూ కలిసి ప్రయాణమై మరుసటిరోజు సాయంత్రానికి శిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకున్నారు. ఆ మరుసటిరోజు వాళ్ళు మధ్యాహ్న ఆరతికి హాజరయ్యారు. అప్పుడు బాబా షిండే వైపు తీక్షణంగా చూస్తూ, "అరేయ్! నిన్ను నువ్వు చాలా తెలివైనవాడినని అనుకుంటున్నావు. నా పొత్తికడుపును చీల్చి నీకు కొడుకును ప్రసాదించాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే, ఎలాగైతే నీకు కొడుకునిచ్చానో అలాగే వాడిని వెనక్కి తీసుకోగల సామర్థ్యం నాకుంది" అని అన్నారు. బాబా మాటలు వింటూనే షిండే పశ్చాత్తాపపడి మనసులోనే తనను క్షమించమని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా చోటూభయ్యా వైపు తిరిగి, "నీ విషయంలో అంతా బాగుంది కదా" అని అడిగారు. ఆ విధంగా అడగడం ద్వారా షిండేని తమ చెంతకు తీసుకురావడంలో చోటూభయ్యా నిమిత్తమాత్రుడని తెలియజేశారు బాబా.

పై సంఘటనతో షిండే బాబాకు అంకిత భక్తుడై తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు. ఆ సంఘటన జరిగిన కొన్నిరోజులకి షిండే తన కుటుంబంతో కలిసి గాణ్గాపురం వెళ్లి దత్తపాదుకల వద్ద తన కొడుకును ఉంచాడు. ఆ తరువాత అక్కడినుండి ఇంటికి తిరిగి వెళ్లకుండా నేరుగా శిరిడీ వెళ్లి తన కొడుకును బాబా పాదాల చెంత ఉంచాడు. చంచల స్వభావం గల భక్తులపై బాబాకు ఉండే అపారమైన ప్రేమకు నిదర్శనమీ లీల.

సోర్స్: శ్రీసాయిలీల పత్రిక 1924 (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)

 

సాయిభక్తుల అనుభవమాలిక 667వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయే దిక్కు
  2. సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు
  3. నెలసరి వాయిదా పడేలా అనుగ్రహించిన బాబా ఊదీ

సాయే దిక్కు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే సాయిలీలలను చదువుకునే అవకాశం కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు.


ఈమధ్యకాలంలో మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరం చిన్న చిన్న అనారోగ్యాలకు గురయ్యాము. అవడానికి చిన్నవే అయినప్పటికీ నన్ను మాత్రం అవి చాలా ఆందోళనకి గురిచేశాయి. మేము తప్పనిసరి పరిస్థితుల్లో మా దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. “బాబా! ఎలాగైనా మమ్మల్ని వెళ్లకుండా చేయి” అని ఎంత వేడుకున్నప్పటికీ మేము పెళ్ళికి వెళ్లక తప్పలేదు. దాంతో, పెళ్ళికి వెళ్ళడానికి బాబా అనుమతి ఉందని అనుకుని వెళ్లి వచ్చాం. అక్కడినుంచి వచ్చిన రెండు రోజుల తర్వాత మా అమ్మకు జ్వరం వచ్చింది. దాదాపు పది రోజుల వరకు జ్వరం తగ్గనేలేదు. అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ, బాబా ఊదీని నీళ్లలో కలిపి అమ్మకి త్రాగిస్తూ వచ్చాం. 10 రోజుల తరువాత అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము. అమ్మను పరీక్షించిన డాక్టర్, అమ్మకి జ్వరమేమీ లేదనీ, తనకు షుగర్ ఎక్కువైందనీ చెప్పి వేరే మందులు ఇచ్చారు. బాబా దయవల్ల అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. “సాయీ! నీకు శతకోటి ధన్యవాదాలు” 


ఈ మధ్యలో నాన్నకి కూడా ఒకరోజు కాస్త జ్వరం వచ్చింది. కానీ బాబా దయవల్ల త్వరగానే తగ్గిపోయింది. కానీ ఆ తరువాత నుండి ఆయన సరిగా తినటం లేదు. “సాయీ! నాకు నువ్వే దిక్కు. దయచేసి నాన్న త్వరగా కోలుకుని మళ్ళీ ఇంతకుముందులా ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు. నీ ఆశీస్సులు తప్పక మాపై ఉంచుతావని నేను నమ్ముతున్నాను”.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు


సాయిబంధువులకు నమస్తే! నా పేరు అంజలి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుందామనుకుంటున్నాను. 


2021, జనవరి 6వ తేదీ ఉదయం మా బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్వరం తగ్గడానికి మందులు వేస్తూనే ఉన్నాను. కానీ ఆ మందులతో జ్వరం తగ్గినట్టే తగ్గి మరలా వస్తోంది. అసలు మా బాబు మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడుకునే ఉన్నాడు. నేను ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను ప్రతిరోజూ చదువుతాను. ఎప్పటిలాగే ఆరోజు బ్లాగు ఓపెన్ చేసి బాబా లీలలు చదువుతుంటే పురంధరే అనుభవం వచ్చింది. అందులో, పురంధరే భార్య ఆరోగ్యపరిస్థితి విషమించినప్పుడు బాబా ఒక ఫకీరు రూపంలో పురంధరేకు దర్శనమిచ్చి ఆమెకు ఊదీతీర్థాన్ని ఇవ్వమని చెబుతారు. బాబా సూచనమేరకు పురంధరే బాబా ఊదీని నీటిలో కలిపి భార్యకు త్రాగించి, ఆమె శరీరమంతా ఊదీని రాస్తాడు. బాబా అనుగ్రహంతో కేవలం ఒక్క గంటలోనే ఆమె పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ పరిస్థితిలో ఆ లీలను చదివిన నాకు బాబా మా బాబుకి ఊదీతీర్థాన్ని ఇవ్వమని చెప్పినట్లు అనిపించింది. దాంతో వెంటనే బాబాను తలచుకుని, కొద్దిగా బాబా ఊదీని నీళ్ళలో కలిపి బాబుకి త్రాగించాను. తరువాత తన ఒళ్ళంతా ఊదీని రాశాను. బాబా అనుగ్రహంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే జ్వరం తగ్గిపోయి మా బాబు లేచి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అది చూసి ఆనందభాష్పాలతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నాకు బాబానే సర్వస్వం. ఎంతో దయామయుడైన మన సాయితండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. “బాబా! నన్ను, నా కుటుంబంలోని అందరినీ ఇలాగే కాపాడుతూ ఉండు తండ్రీ! దయామయా! నీ లీలలు మధురం”. మా బాబుకి జ్వరం తగ్గి నార్మల్ అయితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “కాస్త ఆలస్యమైంది. నన్ను క్షమించు తండ్రీ!” త్వరలోనే మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను. జై సాయిరాం! 


అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నెలసరి వాయిదా పడేలా అనుగ్రహించిన బాబా ఊదీ

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్.

మన సాయి మన ప్రతి ప్రార్థనను వింటారు. ఆయన మనకోసం దేనినైనా సాధ్యం చేయగలరు. స్వచ్ఛమైన మనస్సుతో సాయి తండ్రిని పిలిస్తే, ఆయన మనకు తన సహాయాన్ని అందించి రక్షనిస్తారు. సమస్య ఎంత పెద్దదైనా ప్రేమతో, విశ్వాసంతో సాయిని స్మరిస్తే ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది. ఇక నా అనుభవానికి వస్తాను.

నేను గత కొద్దిరోజులుగా నవ గురువార వ్రతం చేస్తున్నాను. మే 14న నా వ్రతం చివరిరోజు. అయితే మే 10న నా నెలసరి వచ్చే తేదీ. అది ఆ సమయంలో వచ్చిందంటే మే 14న నన్ను వ్రతం చేయనివ్వరు, బాబా మందిరానికి వెళ్లనివ్వరు. అందువలన నేను చాలా ఆందోళన చెంది, "బాబా! నేను ఏ కోరికతో ఈ వ్రతం చేస్తున్నానో, అందుకు నేను అర్హురాలిగా మీరు భావిస్తే దయచేసి నా వ్రతాన్ని పూర్తి చేయనివ్వండి. నా నెలసరిని వాయిదా వేయండి బాబా" అని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ నేను నిద్రపోయే ముందు, ఉదయాన  మేల్కొన్న వెంటనే ఊదీ నీళ్లు త్రాగుతుండేదాన్ని. బాబా అనుగ్రహించారు. మే 14, తెల్లవారు ఝామున లేచి వ్రతాన్ని పూర్తిచేసి, మందిరానికి వెళ్లి బాబాకు నైవేద్యం పెట్టి నమస్కారాలు అర్పించాను. బాబా దేన్నైనా నియంత్రించగలరని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 666వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  • సదా బాబా రక్షణలో

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


గురుమాలామంత్రం:


ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ

సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ఠ వినాశాయ

సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా


భావం: పరమపురుషుడును, సమస్త దేవతలను స్వాధీనముగా గలవాడును, సమస్త అమంగళములను పోగొట్టేవాడును, సమస్త మంత్రములను ఖండించెడివాడునగు సద్గురువునకు నమస్కారము. అట్టి పరమపురుషుండవగు ఓ సద్గురూ! నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుము. 


ఓం సాయీశ్వరాయ నమః. నా పేరు సంధ్య. ముందుగా సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకుంటాను. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు.


మొదటి అనుభవం:


2021, జనవరి 6వ తేదీ సాయంత్రం మావారు ఒక ప్లేటులో స్నాక్స్ తెచ్చుకుని తింటూ టీవీ చూస్తున్నారు. నేను కూడా తనతో కలిసి టీవీ చూస్తున్నాను. కొన్ని నిమిషాలలో ఊహించనిరీతిలో మావారి చేతినుండి ప్లేట్ క్రింద పడి శబ్దం వచ్చింది. నేను మావారి వైపు చూశాను. ఆయన కుర్చీలోనే స్పృహతప్పి పడివున్నారు. దగ్గరకెళ్ళి చూస్తే తల ప్రక్కకు వాలిపోయివుంది. చేయి కూడా స్పర్శ లేకుండా పడిపోయివుంది. “సాయీ, సాయీ, రక్షించు తండ్రీ!” అని గట్టిగా అరుస్తున్నాను. ‘సాయిరాం, సాయిరాం’ అంటూనే పిల్లలను పిలుస్తున్నాను. పిల్లలు కూడా పరిగెత్తుకుని వచ్చి, బాబా ఊదీని, ఊదీతీర్థాన్ని మావారికి ఇచ్చారు. అందరం కలిసి మావారిని తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టాము. నేను గురుమాలామంత్రాన్ని జపిస్తూ, “సాయీ! మీరే మాకు దిక్కు. నా భర్తను రక్షించండి” అని ఆర్తిగా బాబాను ప్రార్థిస్తున్నాను. అలా సాయిబాబాను పదేపదే ప్రార్థిస్తూ, బాబా ఊదీని మావారి కుడిచేతికి, తలకి వ్రాస్తూ ఉన్నాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి మావారు స్పృహలోకి వచ్చారు. తను స్పృహలోకి రాగానే సాయినామాన్ని పలకమని తనతో చెప్పాను. తను బలవంతంగా సాయినామాన్ని స్మరిస్తూ ఉన్నారు. సాయినామాన్ని స్మరిస్తూ ఉండమని చెప్పి, “బాబా! నాకు మీరే దిక్కు, సర్వం మీరే బాబా!” అంటూ బాబాకు చేతులు జోడించి నమస్కరించి, “మావారికి నయంచేయండి బాబా! ఆయన ఎప్పటిలాగా ఆరోగ్యంగా తిరిగేలా మీ కృప చూపండి తండ్రీ!” అని వేడుకుని, “మీరు మాకు ప్రసాదించిన కృపను, మాపై చూపిన ప్రేమను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకుంటాను తండ్రీ!” అని బాబాకు చెప్పుకున్నాను. వెంటనే మవారు చక్కగా లేచి కూర్చుని,నాకు ఏమైందో తెలియదు, ఏదో మైకం వచ్చినట్లు అయింది” అని చెప్పారు. రెండు గంటల తరువాత మా పిల్లలు, నేను, మావారు కలిసి భోజనం చేశాము. “సాయీ!” అని ప్రార్థించిన వెంటనే బాబా కరుణించి నా భర్తకు ప్రాణభిక్ష పెట్టి నా కుటుంబాన్ని రక్షించారు. “సాయీ! మీకు వేవేల కృతజ్ఞతలు. మీరు లేని మా జీవితాలు శూన్యం. మీ పాదాలు విడువకుండా మీ నామస్మరణతో మా జీవితాలు ప్రశాంతంగా సాగనీ తండ్రీ!” ఓం సాయిరాం!


మరుసటిరోజు నిద్రలేచాక “మీరు రాత్రి సరిగా నిద్రపోయారా?” అని మావారిని అడిగాను. “అవును, బాగా నిద్రపోయాను. రాత్రంతా సాయిబాబా కర్ర పట్టుకుని నా ప్రక్కనే ఉన్నారు. సాయి ఉండగా నాకు భయమెందుకు? సాయే నన్ను రక్షించారు” అని చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో ఆనందంగా బాబాకు మనఃపూర్వకంగా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 3 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాయినామాన్ని, గురుమాలామంత్రాన్ని జపిస్తూ తనను రక్షించమని మన సద్గురువును వేడుకున్నాను. సాయి మా వెంటే ఉండి మమ్మల్ని ఎన్నో ఆపదల నుండి, సమస్యలనుండి రక్షించి తమ పాదాల వద్దకు తీసుకున్నారు. ఓం సాయీశ్వరాయ నమః.


రెండవ అనుభవం:


నేను కొంతకాలం క్రితం, ‘మహాపారాయణ గ్రూపులో ఎలా చేరాలా?’ అని అనుకునేదాన్ని. నా మనసునెరిగిన బాబా నా కోరికను నెరవేర్చారు. మహాపారాయణ గ్రూపులో (MP-8192NI) ప్రతి గురువారం రెండు అధ్యాయాలు పారాయణ చేసే భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. “బాబా! మీకు శతకోటి ప్రణామాలు”. ఒకరోజు, ‘గురువారం అన్నదానం చేయాల’ని ఆ గ్రూపులో మెసేజ్ పెట్టారు. బాబా గుడికి వెళ్ళి బాబాకు నైవేద్యం సమర్పించి, శక్తికొలదీ అన్నదానం చేయాలనుకున్నాను. కానీ ఈ కరోనా సమయంలో భక్తులు ప్రసాదం తీసుకుంటారో లేదోనని సంకోచించాను. మావారు కూడా, ‘గుడికి ప్రసాదం తీసుకెళ్ళి భక్తులను ఇబ్బందిపెట్టకు’ అని చెప్పారు. “సకల జీవకోటిలో ఏ ప్రాణికి పెట్టినా అన్నదానమే, ఇంటి దగ్గరే భోజనం పెట్టు” అని నాతో చెబుతూ, “ఎవరికి తెలుసు? బాబా ఎవరినైనా పంపించవచ్చు” అన్నారు. సరేనని ఇంట్లోనే బాబాకు పూజ చేసి, మహాపారాయణలో 2 అధ్యాయాలు చదివి, భోజనం చేసే ముందు బయట కొంత ఆహారం పెడదామని బయటకు వచ్చాను. అద్భుతం! ఆశ్చర్యం! ఒక గోమాత మా ఇంటి ముందు నిల్చుని ఉంది. ఆ గోమాతను సాయిమాతగా అనుకొని ప్రార్థించి కొంత ఆహారం విస్తరిలో తీసుకెళ్ళి పెట్టాను. అంతలో ఒక దూడ కూడా వచ్చింది. ఆవు, ఆవుదూడ కలిసి భోజనాన్ని ఆరగించాయి. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. “ఎవరికి తెలుసు, బాబా ఎవరినైనా పంపించవచ్చు” అని మావారు అన్నమాట గుర్తొచ్చి సాయికి ఆనందంతో మనఃపూర్వకంగా నమస్కరించాను. మా ఇంటిముందుకు గోమాత రావడం అదే మొదటిసారి. ఆ గోమాత ఆరెంజ్ (ఎరుపు) రంగులో అందంగానూ, తన బిడ్డ చక్కని తెలుపురంగులోనూ ఆరోగ్యంగా, దృఢంగా, పుష్టిగా ఉన్నాయి. అలాంటి గోమాతను మా ఇంటిముందు చూడటం అదే మొదటిసారి. “భక్తుల మనసునెరిగిన బాబా! మీకు సాష్టాంగ దండప్రణామాలు తండ్రీ, సాయీశ్వరా!”


మరో అనుభవం:


2020, అక్టోబరు 1వ తేదీ గురువారం, పూర్ణిమరోజున నేను నవగురువారవ్రతం ప్రారంభించాను. డిసెంబరు 17వ తారీఖున నవగురువారవ్రతం ఉద్యాపన చేశాను. బాబా గుడికి వెళ్ళి, సాయి దయతో అయిదుగురికి నవగురువార పుస్తక ప్రసాదంతో తాంబూలం ఇచ్చి, శక్తికొలదీ అయిదుగురు బీదలకు అన్నదానం చేయగలిగాను. ఆరోజు రాత్రి 7 గంటల సమయంలో మావారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. నేను సాయిని ప్రార్థించి, “ఏమిటి తండ్రీ, ఎప్పుడూ ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా ఎందుకిలా జరుగుతోంది? మాపై దయవుంచండి బాబా! మావారు శ్వాస చక్కగా తీసుకునేలా చేయండి బాబా! మాకు మీరు తప్ప దిక్కెవరు?” అని ప్రార్థించి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని స్మరిస్తూ బాబా ఊదీని, ఊదీ తీర్థాన్ని మావారికి ఇచ్చాను. బాబా అనుగ్రహంతో కొద్ది క్షణాల్లోనే ఆయన మామూలుగా శ్వాస తీసుకోగలిగారు. తను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న సమయంలో నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. సదా బాబా తమ రక్షణలో మా కుటుంబాన్ని ఉంచారు. మేము అనుభవిస్తున్న ఈ జీవితం బాబా భిక్ష. ఆయన కృపతోనే జీవిస్తున్నాము. గతంలో మమ్మల్ని ఎన్నో సమస్యలనుండి రక్షించి తమ పాదాల వద్ద మాకు చోటిచ్చారు బాబా. “బాబా సాయీ! దయగల తండ్రీ! మీరే మాకు దిక్కు. నేను మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే. మమ్మల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చావు, ఏదో ఒకరోజు తీసుకెళ్తావు. ఈ మధ్యలో జరిగే జీవితమనే సంసార నౌకను సులువుగా దాటించు తండ్రీ! మీదే భారం సాయీశ్వరా!” ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి. సద్గురు చరణం భవభయ హరణం.


మరో చిన్ని అనుభవం:


“నేను పంచుకునే అనుభవాలు అదనంగా వ్రాస్తున్నానా? ఎక్కువ వ్రాసి భక్తులను ఇబ్బందిపెడుతున్నానా?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మావారు కూడా, “అనుభవాన్ని వీలైనంత చిన్నదిగా వ్రాయి” అని చెబుతుంటారు. అంతేకాదు, ఒకసారి నా అనుభవాన్ని బ్లాగులో ప్రచురించినప్పుడు ఒక సాయిబంధువు బ్లాగులోని కామెంట్ సెక్షన్లో, “మీరు అనుభవాన్ని కొంత కుదించి వ్రాస్తే బాగుంటుంది, ఇది కేవలం ఒక సలహా మాత్రమే” అని చెప్పారు. బాబా ప్రసాదించిన లీలలను (అనుభవాలను) వ్రాస్తున్నప్పుడు భావోద్వేగంతో, ఆనందాశ్రువులతో, వేవేల కృతజ్ఞతలతో బాబా మనపై చూపిన ప్రేమను వ్యక్తపరుస్తాము. ఒక్కోసారి ‘అనుభవం వ్రాస్తున్నామా? లేక బాబాతో మాట్లాడుతున్నామా?’ అనే భావన కలుగుతుంది. మనకు తెలియకుండానే బాబాతో మాట్లాడుతూఉంటాము. ఆయన ప్రేమను వర్ణిస్తూ, కష్టసమయంలో తండ్రివలె, తల్లివలె ఆదరించిన ఆయన ప్రేమకు మన ‘అహంకారం’ తొలగిపోయి, ‘సర్వం సాయే’ అనే ధ్యాసలో మనసు నిలిచిపోతుంది. “నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర ఉంచు, నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను” అని సచ్చరిత్ర రచన ప్రారంభించే ముందు హేమాద్పంతుతో బాబా అంటారు కదా! ఒకసారి నేను అదనంగా వ్రాసిన ‘సాయి కష్టనివారణస్తోత్రం’ మరో సాయిబంధువుకు ఉపయోగపడింది. ఆ సాయిబంధువు కూడా, “కష్టనివారణస్తోత్రం గురించి వెతికే సమయంలో సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మొదటి అనుభవంలోనే ‘సాయి కష్టనివారణస్తోత్రం’ పబ్లిష్ అయింద”నే తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ కష్టనివారణస్తోత్రం నా చేత బాబానే వ్రాయించడం మరో సాయిబంధువు కోసమేనని తెలియజేయడం ద్వారా, అనుభవాలను వ్రాసేది నేను కాననీ, నా మనసునెరిగిన బాబా తమ లీలలను తామే వ్రాయించుకుంటున్నారని మరోసారి ఋజువైంది. ఇప్పుడు కూడా గురుమాలామంత్రాన్ని అక్షరదోషాలు లేకుండా వ్రాయాలని భావించి ‘గురుగీత’ గ్రంథంలో ఆ మంత్రాన్ని చూద్దామని ఆ గ్రంథాన్ని తెరిచాను. గ్రంథాన్ని తెరిచే సమయంలో, “ఆ మంత్రం ఏ పేజీలో ఉందో, ఎక్కడ వెతకాలో” అనుకుంటూ ఉండగా గురుగీత తెరవగానే గురుమాలామంత్రం ఉన్న పేజీనే తెరుచుకుంది. అంతా బాబా లీల, బాబా దయ. మనం నిమిత్తమాత్రులం. “దయగల తండ్రీ! నా అనుభవాలను చక్కగా వ్రాసే శక్తిని దయతో, కరుణతో నాకు ప్రసాదించండి సాయీశ్వరా!”


సద్గురు చరణం భవభయ హరణం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 665వ భాగం.....



ఈ భాగంలో అనుభవాల:
  1. గర్భం దాల్చినప్పటినుండి మా పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం
  2. సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా

గర్భం దాల్చినప్పటినుండి మా పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం


సాయిభక్తురాలు శ్రీమతి రేవతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


ఓం శ్రీ సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు రేవతి. నేను ఇదివరకు నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. మళ్ళీ మరో అనుభవంతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.


2013 నుండి నేను బాబాకు అంకిత భక్తురాలిగా మారాను. చిన్నప్పటినుండి అందరి దేవుళ్ళతో పాటు బాబాను పూజించినప్పటికీ, పూర్తి సాయిభక్తురాలిగా మారింది మాత్రం 2013లోనే. 2013లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ప్రారంభదశలోనే కొన్ని సమస్యలు వచ్చాయి. డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకుంటే, “నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ఇంజక్షన్స్ చేయించుకుంటేనే గర్భం నిలుస్తుంది” అన్నారు. మొదటి ఇంజక్షన్ హాస్పిటల్లోనే వేశారు. అది చర్మానికి వేసే ఇంజక్షన్. నొప్పి భరించలేనిదిగా ఉంది. నా బాధను చూసిన నా భర్త, “ఒక్క ఇంజక్షన్‌కే ఇలా ఉంటే నెలరోజుల పాటు రెండు పూటలా ఇలా ఇంజక్షన్స్ వేస్తే నువ్వు భరించలేవు. ఎలా జరిగితే అలా జరగనీ, భగవంతునిదే భారం” అన్నారు. నేను బాబా వద్దకు వెళ్ళి, “బాబా! నేను ఇంజక్షన్ వేయించుకోలేను. ఇంజక్షన్ బదులు రెండుపూటలా మీ ఊదీతీర్థాన్ని త్రాగుతాను. మీదే భారం తండ్రీ!” అని చెప్పుకుని, నెలరోజుల పాటు రెండుపూటలా బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగాను. నెలరోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టరుకి చూపించుకుంటే, ‘బేబీ నార్మల్‌గా ఉందనీ, ఇక ఆ ఇంజక్షన్ చేయాల్సిన అవసరం లేద’నీ చెప్పారు. ఇదంతా సాయి కృప కాక మరేంటి? నా బాబానే నా బిడ్డను కాపాడారు. అప్పటినుండి డెలివరీ అయ్యేవరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగేదాన్ని. మధ్యమధ్యలో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా బేబీ మాత్రం నార్మల్‌గా ఉందనే రిపోర్టు వచ్చేది.


డాక్టర్ నాకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయినిని. అందువల్ల నేను సెలవుల గురించి భయపడితే బాబా సెలవులు కూడా మంజూరయ్యేలా చేశారు. ఎలక్షన్ డ్యూటీని కూడా రద్దయ్యేలా చేశారు. ఈ విధంగా నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా వచ్చిన అన్ని సమస్యలనూ బాబా పరిష్కరించారు. ఆ విధంగా బాబా ఆశీస్సులతో గురువారంనాడు, అనగా మే 29న మాకు చక్కటి పాప పుట్టింది. బాబా పేరు కలిసొచ్చేలా తనకు ‘విద్యాసాయిశ్రీ’ అని పేరు పెట్టుకున్నాము. మా పాప కూడా బాబాను బాగా నమ్ముతుంది. తనకు 2 సంవత్సరాల వయస్సున్నప్పుడు మేము మొదటిసారి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. మా పాప టీవీలో ప్రసారమయ్యే ‘సద్గురు సాయి’ సీరియల్ చూసి, “మమ్మీ! మనం శిరిడీ వెళదామా? ద్వారకామాయిలో కూర్చుందామా? ఎప్పుడు వెళ్ళి బాబాని చూద్దాం?” అని అడుగుతుంటుంది. “బాబా పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు శిరిడీ వెళ్ళగలమ”ని తనకు చెప్తాను. పాప పుట్టినప్పటినుండి తనకు ఎక్కిళ్ళు బాగా వస్తుండేవి. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అది చిన్న సమస్యే కదా అని మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకసారి నేను బాబా ముందు కూర్చుని, “బాబా! మా పాప ఎక్కిళ్ళ సమస్య తీరిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. నేను బాబాకు మ్రొక్కిన పదినిమిషాల నుండి బాబా దయవల్ల పాప ఎక్కిళ్ళ సమస్య పూర్తిగా తీరిపోయింది. ఇప్పటివరకు ఆ సమస్య మళ్ళీ రాలేదు. అలాగే మా పాపకి వచ్చిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని బాబానే పరిష్కరించారు. “ధన్యవాదాలు బాబా! మీ కృప అందరిపై ఇలాగే ఉండాలని ఆశిస్తూ..”


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నేను బాబాకు అంకిత భక్తురాలిని. 2019 నుండి నేను మహాపారాయణలో సభ్యురాలిని. ముందుగా బాబాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తీవ్రమైన ఆర్థిక సమస్యల నుండి బాబా మమ్మల్ని కాపాడారు. ఆ అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. 


నా భర్త ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి పెన్షన్‌కి సంబంధించి కొన్ని బకాయిలు రావాల్సి ఉన్నాయి. అందుకోసం ఆయన అన్నివిధాలా లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్న సమయంలో ఎటువంటి ఫలితమూ కనిపించలేదు. అందుకు ప్రస్తుత కరోనా మహమ్మారి కూడా ఒక కారణం. ఒకప్రక్క మేము ఈ బాధలో ఉంటే, మరోప్రక్క వృత్తిరీత్యా డాక్టరైన మా అమ్మాయి కరోనా మహమ్మారి కారణంగా ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అవి చాలదన్నట్టు మావారు కరోనా బారినపడ్డారు. తరువాత 3 రోజులకి నాకు కూడా కరోనా రావడంతో ఇద్దరమూ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అసలే పెన్షన్ బకాయలు చేతికందక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేము హాస్పిటల్ బిల్లులు ఎలా కట్టాలా అని చాలా ఆందోళన చెందాము. బాబా కృపతో మా దగ్గరి బంధువులు మా హాస్పిటల్ బిల్లులు కట్టడానికి ముందుకొచ్చారు.


కానీ, ఎప్పటికప్పుడు ఆఫీసువాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు రాకపోవడంతో మావారి మనసంతా దిగులుగా ఉంటుండేది. బాబాకు అంకిత భక్తురాలినైన నేను మాత్రం ఆశ వదులుకోకుండా విశ్వాసంతో బాబాను సదా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2020, డిసెంబరు 24, గురువారంనాడు నేను మహాపారాయణలో భాగంగా సచ్చరిత్రలో నాకు కేటాయించిన 28, 29 అధ్యాయాలు పారాయణ చేస్తూ, "బాబా! ఈ క్లిష్ట సమయంలో నేను మిమ్మల్నే గట్టిగా పట్టుకున్నాను. మీరు కూడా నన్ను గట్టిగా పట్టుకోండి. కరోనా కారణంగా ఈ హాస్పిటల్ మంచంపై పడివుండి కూడా నేను మీ పారాయణ చేస్తుండటం మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి మాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను.


బాబా అద్భుతం చేశారు. అదేరోజు మావారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మధ్యాహ్నం గం.2.30 ని.లకి, 'మీకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారమైంద'ని ఆఫీసు నుండి, ‘అకౌంటులో డబ్బు జమ అయింద’ని బ్యాంకు నుండి మావారికి మెసేజెస్ వచ్చాయి. వెంటనే మావారు నాతో, "రావాల్సిన డబ్బంతా నేరుగా బ్యాంకు అకౌంటులో జమ అయ్యింద"ని చెప్పి, అకౌంటు నాకు చూపించారు. ఇంకా ఆయన నాతో, "ఏ చింతా పెట్టుకోకు. ఎప్పటినుండో రావాల్సిన డబ్బంతా మనకి వచ్చేసింది. కాబట్టి నువ్వు డిశ్చార్జ్ అయ్యే సమయానికి నీ హాస్పిటల్ బిల్లు నేను చెల్లించగలను" అని ఆనందంగా చెప్పారు. అంత క్లిష్ట పరిస్థితిలో బాబా ఈ విధంగా మమ్మల్ని ఆదుకున్నారు. బాబాకు కృతజ్ఞతలు తెలపడానికి నా వద్ద పదాలు లేవు. ఇదంతా స్థిరమైన విశ్వాసంతో అవిశ్రాంతంగా నేను బాబాకు చేసిన ప్రార్థనల వల్లనే సాధ్యమైంది.



సాయిభక్తుల అనుభవమాలిక 664వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు
  2. ఎంత చెప్పినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే!

భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు


సాయిభక్తురాలు అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


నమస్తే! నా పేరు అంజలి. ముందుగా బాబాకు వేలవేల ప్రణామాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. ఈమధ్య నాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.


2020, డిసెంబరు నెల చివరిలో నా ఎడమకాలు బాగా నొప్పి పెట్టింది. బాబా ఊదీ రాసుకొని, "నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నొప్పి తగ్గింది. అయినప్పటికీ ఒక మూడుసార్లు బాబా ఊదీ కలిపిన నీళ్లు త్రాగాను. ఆ తర్వాత మా స్వస్థలానికి వెళ్లి చాలా హుషారుగా తిరిగాను. అప్పుడే నా అనుభావాన్ని బ్లాగులో పంచుకుందామనుకున్నానుగానీ, ఆలస్యమైంది. అంతలో మరలా ఆ నొప్పి మొదలయింది. "మీ బిడ్డను క్షమించండి బాబా. బ్లాగులో పంచుకుంటానని మాటిచ్చి వెంటనే పంచుకోలేదు. నన్ను క్షమించు బాబా. ఈ దీనురాలికి నీవే దిక్కు. నన్ను, నా కుటుంబాన్ని, ఇంకా అందరినీ చల్లగా చూడు తండ్రీ!"


మరో అనుభవం:


నేను ఇంతకుముందు పంచుకున్న ఒక అనుభవంలో బాబా నాతో శ్రీశైల దర్శనం ఎలా చేయించారో పంచుకున్నాను. నాకు డిసెంబరు 8న శ్రీశైలం వెళ్లాలని ఉన్నప్పటికీ డిసెంబరు 7నే వెళ్లేలా బాబా చేశారు. 'బాబా ఎందుకలా చేశారు? ఆయన ప్రణాళిక ఏదో ఉండే ఉంటుంది' అనుకొని అంతా ఆయనకే వదిలేసి డిసెంబరు 7న శ్రీశైలం వెళ్లి, దర్శనానంతరం అదేరోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక డిసెంబరు 8న భారత్ బంద్ అని మాకు తెలిసింది. మేముండే ప్రాంతంలో బంద్ చాలా స్ట్రిక్ట్‌గా జరిగింది. దాదాపు సాయంత్రం వరకు రోడ్లు, హైవేలు అన్నీ బ్లాక్ అయ్యాయి. మా ఇంటి నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆఫీసుకి కూడా నేను వెళ్లలేకపోయాను. మేము ఆరోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకునుంటే చాలా ఇబ్బందిపడేవాళ్లం. అందుకే బాబా మేము ముందురోజే శ్రీశైలం వెళ్లేలా చేశారు. భారం బాబా మీద వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు. "ఈ అనుభవం కూడా పంచుకోవడం ఆలస్యమైంది. నన్ను క్షమించండి బాబా!"


ఇంకో చిన్న అనుభవం:


2020 డిసెంబరు నెల చివరివారంలో మావారికి, మా అబ్బాయికి జ్వరం వచ్చింది. నేను బాబాను తలచుకొని, "తెల్లవారేసరికి ఇద్దరికీ జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. తరువాత వాళ్ళిద్దరికీ మందులతో పాటు బాబా ఊదీ ఇచ్చాను. బాబా దయవల్ల ఇద్దరికీ తెల్లవారేసరికి పూర్తిగా నయమైంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు". బాబా ప్రసాదించిన మరో అనుభవంతో మరలా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఓం సాయిరామ్!


ఎంత చెప్పినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తమకు ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి అభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు వందనాలు. కరోనా కారణంగా ఏ ఇబ్బందీ లేకుండా మేమంతా ఇండియా వస్తే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబాకి పని అప్పజెప్పితే ఇక మనకు భయమేల? బాబా ఆజ్ఞతో అన్నీ చక్కగా జరిగాయి. ఎయిర్‌పోర్టులో మాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. మేము క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా, కస్టమ్స్‌కు సంబంధించిన ఇబ్బందులు ఏమీ ఎదురవకుండా సమయానికి అన్నీ బాబానే చూసుకున్నారు. ఇంటికి వచ్చిన తరువాత మా మనవడితో సహా అందరం సాయి రక్షణలో ఆరోగ్యంగా ఉన్నాము. ఫ్లైట్‌లో అయితే మాకు రాజభోగాలే. పన్నెడుమంది ఉండవలసిన ఒక బ్లాక్ మొత్తం మేము అయిదుగురం మాత్రమే ఉన్నాము. మేము ఉన్నది ఒక ప్రత్యేక కూపే, మాకు ఆతిథ్యమివ్వడానికి నలుగురు ఎయిర్ హోస్టెస్‌లు. ఇవన్నీ బాబా ఏర్పాట్లే. ఎంత చెప్పినా, ఎన్ని వ్రాసినా బాబా ప్రేమ ముందు అన్నీ తక్కువే. “బాబా! నేను ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించు. ఏదైనా పంచుకోవాలనుకుని మర్చిపోయినా నీదే భారం బాబా!”


బాబా దయతో మా అబ్బాయి గ్రీన్ కార్డు ఫింగర్ ప్రింట్స్ కూడా అప్రూవ్ అయ్యాయి. చిన్నబ్బాయికి, కోడలికి బాబా దయతో వీసా స్టాంపింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టాంపింగ్ వేసేది కూడా బాబానే. ఇంతకుముందు మాకు కొంతమంది పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు, డబ్బు బాకీ ఉన్నారని పంచుకున్నాను కదా! బాబా దయవలన వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే బాకీ తీర్చడానికి సిద్ధపడుతున్నారు. బాబా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాను. 


త్వరలోనే మమ్మల్నందరినీ శిరిడీ రప్పించుకుని తమ దర్శనాన్ని అనుగ్రహించమని బాబాను మనసారా వేడుకుంటున్నాను. తిరుపతి, గాణ్గాపురం మొదలైన పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ప్రసాదించమని బాబాను కోరుకుంటూ..


ఇట్లు..

బాబా పాదసేవకురాలు.



సాయిభక్తుల అనుభవమాలిక 663వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా
  2. మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి

భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా


సాయిరామ్! నా పేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన చాలా అనుభవాలను మీతో పంచుకున్నాను. 2021, క్రొత్త సంవత్సరం తొలిరోజే బాబా నాకొక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు. దాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.


మా ఇంటిలో ఒక చిన్న బాబా విగ్రహం ఉంది. ఆ మూర్తికే నేను ప్రతిరోజూ పూజ చేస్తాను. సంబల్పూరులో నాకు తెలిసిన ఒక సాయిభక్తురాలికి ఆ బాబా విగ్రహం ఎంతగానో నచ్చి, "నాకు ఆ బాబా కావాలి" అని ప్రతిరోజూ నన్ను అడుగుతుండేది. ‘నేను పూజించుకునే బాబాని ఎలా ఇస్తాన’ని చెప్పినప్పటికీ తను, "మేడం, నాకు ఆ బాబానే కావాలి" అంటుండేది. తను కొనుక్కోవాలంటే బాబా విగ్రహాలు దొరుకుతాయి. కానీ, తనకు నా చేతుల మీదుగా బాబా కావాలి, అది కూడా మా ఇంటిలోని బాబానే కావాలి. ఎందుకంటే, మా బాబా తనను అంతగా ఆకర్షించారు. తను చాలా మంచి భక్తురాలు. తనకు బాబాపట్ల చాలా ప్రేమ. ఆ ప్రేమను చూసే చివరికి ఒకరోజు నేను తనతో, "సరే, మా ఇంట్లో ఉండే బాబా విగ్రహం నీకు ఇస్తాను. కానీ, శిరిడీ నుంచి క్రొత్త బాబా విగ్రహం నాకు వచ్చేవరకు ఇవ్వను. వచ్చాక మాత్రం తప్పకుండా ఇస్తాను" అని చెప్పాను. అందుకు తను అంగీకరించి, ప్రతి నిత్యం బాబాను త్వరగా రమ్మని ప్రార్థిస్తుండేది. ఇలా రోజులు గడుస్తుండగా 2020, డిసెంబరు 28న భువనేశ్వర్ నుండి నాకు తెలిసిన ఒక కుటుంబం శిరిడీ వెళ్తుంటే, "నాకోసం ఒక బాబా విగ్రహం తెస్తారా?" అని అడిగాను. వాళ్ళు ‘సరే, ప్రయత్నిస్తామ’న్నారు. వాళ్ళు డిసెంబరు 29న శిరిడీ చేరుకున్నారు. మూడురోజులు గడిచినా వాళ్ళనుండి నాకు ఏ ఫోనూ రాలేదు. ఆలోగా సంబల్పూరు భక్తురాలు తన ఆరాటం కొద్దీ, "శిరిడీ వెళ్లినవాళ్ళు బాబా విగ్రహం తీసుకున్నారా?" అని పదేపదే అడుగుతుండేది. నేను తనతో, "ఏమో తెలియదు. బాబా ఇష్టం, ఆయన రాదలుచుకుంటే వస్తారు" అని చెప్పాను.


2021, జనవరి ఒకటి, క్రొత్త సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు సాయంత్రం భువనేశ్వర్ నుంచి వెళ్లినవాళ్ళు బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒక షాపుకు వెళ్లారు. ఆ షాపతను, "మీకోసం ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, తీసుకోండి" అంటూ వాళ్ళను ఆహ్వానించాడు. అది విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెళ్లి చూస్తే, ఆ బాబా మూర్తి ఎంతో అందంగా ఉంది. వెంటనే అతను నాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పి, బాబాను చూపించారు. నిజంగానే బాబా ఎంతో బాగున్నారు. వాళ్ళు ఆ బాబాను నాకోసం తీసుకున్నారు.


తరువాత అతని భార్య, "అందరికోసం బాబా విగ్రహం తీసుకుంటారుగానీ మనకోసం మాత్రం ఎప్పుడూ తీసుకోరు. మనకోసం ఒక బాబా విగ్రహం తీసుకోండి" అని అతన్ని అడిగింది. అంతలోనే అతనికొక ఫోన్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే, "మీకోసం మేము ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, వచ్చి తీసుకెళ్లండి" అని అవతలివ్యక్తి చెప్పాడట. ఇతను ఆశ్చర్యపోతూనే, "అసలు మీరెవరు? మాకోసం బాబా విగ్రహం సిద్ధంగా ఉండటమేంటి?" అని అడిగాడు. అవతలి వ్యక్తి "నేను ఎవరో మీకు తెలియదుగానీ, నేను మీ ఫోన్ నెంబరు హోటల్లో తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు సంస్థాన్ 4వ నెంబరు గేటుకి దగ్గరగా ఉండే మా ఇంటికి రండి" అని చెప్పాడు. సరేనని విషయమేంటో తెలుసుకుందామని వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళను వివరాలడిగితే, అతనిలా చెప్పాడు: "మా అమ్మగారు గత 50 సంవత్సరాలుగా సంస్థాన్‌లో పనిచేస్తున్నారు. ఆమె సేవకు గుర్తింపుగా 2018 శతాబ్ది ఉత్సవాలలో ఒక బాబా మూర్తిని సంస్థాన్ వాళ్ళు మా అమ్మకు కానుకగా ఇచ్చారు. అది మీకివ్వాలని అమ్మ చెబితే, మీకు ఫోన్ చేసి రమ్మన్నాను" అని. అది విన్న వీళ్ళు, "అసలు మీరు బాబా విగ్రహాన్ని మాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు?" అని అడిగారు. అందుకు ఆ పెద్దావిడ, "రాత్రంతా బాబా, 'ఈ విగ్రహాన్ని మీకు ఇవ్వమని, నేను అక్కడికి వెళ్తాన'ని చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని పిలిపించమని మా అబ్బాయితో చెప్పాను. అందుకు మా అబ్బాయి, 'ఇన్నాళ్ళ నీ సాయిసేవకు గుర్తింపుగా నీకు ఇచ్చిన విగ్రహాన్ని, పైగా నువ్వు పూజిస్తున్న విగ్రహాన్ని ఇచ్చేస్తావా అమ్మా?' అని అడిగాడు. నేను, 'బాబా ఇవ్వమని, అక్కడికి వెళ్తానని చెప్తున్నారు', అందుకే వాళ్ళకి ఈ బాబాని ఇస్తున్నానని అన్నాను" అని చెప్పారు. అది విన్న వీళ్ళు ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. తరువాత ఆ విగ్రహాన్ని తీసుకుని మరుసటిరోజు భువనేశ్వర్ చేరుకున్నారు.


ఇంటికి చేరుకున్నాక నాకోసం తెచ్చిన బాబా విగ్రహాన్ని నాకు ఇచ్చారు. సంకష్ట చతుర్థి రోజు బాబా నా ఇంటిలో అడుగుపెట్టారు. ఇక నా కష్టాలన్నీ బాబా తీరుస్తారని విశ్వసిస్తున్నాను. ఇకపోతే సంబల్పూరు వాళ్ళు మా ఇంటికి వచ్చి బాబా విగ్రహాన్ని తీసుకొని వెళ్లడానికి మూడురోజుల ముందు ఆ భక్తురాలకి బాబా కలలో కనిపించి, "నేను మీ ఇంటికి వస్తున్నాను" అని చెప్పారు. ఈవిధంగా సంబల్పూరులోని భక్తురాలికి ఇష్టమైన మా ఇంటిలోని బాబా అక్కడికి వెళ్లారు. క్రొత్తది, పెద్దది అయిన మూర్తి రూపంలో బాబా నాకోసం శిరిడీ నుండి వచ్చారు. ఆ బాబాను తెచ్చిన వాళ్లకు బాబా స్వయంగా వచ్చారు. ఎంత లీల చూడండి. అందుకే బాబా లీలలు వర్ణించనలవికానివి.


ఓం సాయిరాం!

శిరిడీ నుండి మా ఇంటికి వచ్చిన బాబా మూర్తి


మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి


సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకోవాలనుకుంటున్నారు.


ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. నేను బాబా భక్తురాలిని. మేము దుబాయిలో నివసిస్తున్నాము. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. మా పెద్ద కొడుకు, కోడలు వాంకోవర్ సిటీలో ఉంటారు. 2021, జనవరి తొలివారాల్లో మా కోడలికి ప్రసవ సమయం ఉందనగా అందుకు కొద్దిరోజుల ముందు ఇండియా నుండి వాళ్ళ అమ్మగారు పుట్టబోయే పాప కోసం బట్టలు, మా కోడలి కోసం చీరలు, పచ్చళ్ళు, కొన్ని తినుబండారాలు కొరియరులో పంపించారు. 2020, డిసెంబరు 29న పార్సెల్ డెలివరీ చేయడానికి కొరియర్ బాయ్ మా కోడలికి ఫోన్ చేశాడు. అయితే, ఏదో కారణం చేత మా కోడలు ఆ సమయంలో ఫోన్ చూసుకోలేదు. తరువాత చూసుకుని తను ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా కోడలు మరోసారి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు, "మీ పార్సెల్ గోడౌన్లో ఉంది, చూస్తామ"ని చెప్పారు. మా కోడలు రోజూ కొరియర్ వాళ్లకు ఫోన్ చేస్తుంటే వాళ్లు అదే సమాధానం చెప్తూ ఉండేవారు. ఇలా 2021, జనవరి 5వ తారీఖు వరకు జరిగింది. ఆరోజు మా కోడలు నాకు ఫోన్ చేసి, "అత్తమ్మా! అమ్మ పంపించిన పార్సెల్ ఇంకా నాకు అందలేదు. అందులో, పుట్టబోయే పాపకోసం బట్టలు, నాకోసం చీరలు పంపింది అమ్మ. నావి లేకున్నా పరవాలేదుగానీ, పాపవి మిస్ అవుతున్నాయని దిగులుగా ఉంది" అని చెప్పి చాలా బాధపడింది. అప్పుడు నేను తనతో, "అలా ఏమీ జరగదు, రేపటికల్లా పార్సెల్ తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఆందోళనచెందకు" అని తనను ఓదార్చాను. తరువాత నా సాయితండ్రిని మనసులో తలచుకుని, "బాబా! ఆ పార్సెల్ ఎక్కడున్నా మాకు అందించవయ్యా. పార్సెల్ మా కోడలికి చేరితే ఈ అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా మీ బిడ్డలందరితో పంచుకుంటాను మేరే బాబా" అని మ్రొక్కుకున్నాను. అదేరోజు రాత్రి మా కోడలు, "అత్తమ్మా, పార్సెల్ వచ్చింద"ని మెసేజ్ పెట్టింది. అది చూసి నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రతి విషయంలోనూ నేను బాబాను తలచుకుని మనస్ఫూర్తిగా అడిగితే నా సాయితండ్రి నెరవేరుస్తున్నారు. "మేరే బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. కృపతో ఎల్లప్పుడూ నాతో ఉండండి. ఏ విషయంలో అయినా మీరే ముందుండి నడిపించండి. మేరే బాబా! నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరే మాకు దిక్కు తండ్రీ!"


ఓం సాయిరామ్!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo