- ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదు
- మొర విన్న సాయితండ్రి
- చాలాసార్లు రక్షణనిచ్చిన సాయి
ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదు
సాయిబంధువులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను బెంగళూరులో నివసిస్తున్నాను. బాబా దయవల్ల నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళి వచ్చాక మా ఇద్దరబ్బాయిల స్కూల్ విశేషాలు అడిగి తెలుసుకుంటూ, వాళ్ళను చదివిస్తూ ఉంటాను. బాబా దయవల్ల జీవితం సాఫీగా గడుస్తూ ఉండేది. ఒకరోజు ఆఫీసులో, “రాబోయే 6 నెలల్లో ఆఫీసును వేరేచోటికి తరలిస్తున్నామ”ని చెప్పారు. ఆఫీసును తరలించబోయే ప్రదేశం మా ఇంటికి చాలా దూరం. బెంగళూరు ట్రాఫిక్‌లో అంత దూరం ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దాంతో నాకు చాలా బాధేసింది. కానీ, ఏదో నమ్మకం, ‘బాబా ఉన్నారు, చూసుకుంటారు’ అని. ఎప్పుడు సమయం దొరికినా సాయి నామాన్ని స్మరిస్తూ ఉండేదాన్ని. “నువ్వే దారి చూపించాలి తండ్రీ!” అంటూ బాబాను వేడుకునేదాన్ని. సరిగ్గా ఆఫీసు తరలించబోయే సమయానికి కరోనా కారణంగా లాక్‌డౌన్ మొదలైంది. నాకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇచ్చారు ఆఫీసువాళ్ళు. సాయి చూపిన ప్రేమకు మనసులోనే సాయికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నానో నేను. సాయిని తలచుకోగానే కన్నీళ్ళు వచ్చేవి. 2020లో ఒకసారి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చింది. అప్పుడు కూడా బాబాను తలచుకోగానే సహాయం చేశారు. తనను నమ్మినవారికి తానెప్పుడూ తోడుగా ఉంటానని బాబా నా విషయంలో ఎన్నోసార్లు ఋజువు చేశారు. నా అనుభవం ద్వారా నాకు తెలిసింది ఒక్కటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా నామస్మరణ మాత్రం వదలకూడదని. నేను ఎప్పుడూ బాబాను కోరుకునేది ఒక్కటే, “ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా ఇవ్వు స్వామీ. కానీ, నీ నామస్మరణ మాత్రం నా చివరి ఊపిరి వరకు నా మనసులో నడిచేలా చూడు. ఎల్లప్పుడూ అందరికీ తోడునీడగా ఉంటూ అందరినీ కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ!".
మొర విన్న సాయితండ్రి
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీలత. మేము విశాఖపట్నంలో నివసిస్తున్నాము. నాకు బాబాతో చాలా అనుబంధం ఉంది. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. 2020వ సంవత్సరం, దీపావళిరోజు సాయంకాలం హఠాత్తుగా నాకు కొద్దిగా జ్వరం, జలుబు, దగ్గు, విపరీతమైన నీరసం వచ్చాయి. జ్వరం, జలుబు తగ్గటానికి రెండు రోజుల పాటు ఏవో మందులు వేసుకున్నాను. కానీ, కొంచెం కూడా తగ్గలేదు. దాంతో నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు మావారు. డాక్టర్ నన్ను ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. నాకు చాలా భయమేసింది. తరువాత కోవిడ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి ఇంటికి వచ్చాను. కానీ, భయంతో ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. “సాయి తండ్రీ! కోవిడ్ టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చేలా చేయండి” అని అనుక్షణం సాయిని వేడుకుంటూనే ఉన్నాను. నా సాయితండ్రి నా మొర విన్నారు. తన బిడ్డలు బాధపడుతుంటే చూడలేని నా సాయితండ్రి తన లీల చూపించారు. ఆ రాత్రి నా కోవిడ్ టెస్ట్ రిపోర్టు వచ్చింది. ఆశ్చర్యం! టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “ఎల్లప్పుడూ ఇలానే మమ్మల్ని కాపాడు తండ్రీ. మాతోనే ఉండు, మాలోనే ఉండు. ఎల్లప్పుడూ నీ నామం జపించుకునేలా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రీ. నీకు శతకోటి నమస్కారాలు తండ్రీ!”
