- మన బాధ్యత బాబా తన భుజాలమీద ఎలా మోస్తున్నారో!
సాయిభక్తుడు రాజశేఖర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాజశేఖర్. ‘సాయి’ అంటే ‘సాయం చేసే చేయి’ అని నేను నమ్ముతాను. మన జీవితంలోని ఒడిదుడుకులను దాటడానికి సాయిబాబా మనకు చేసే సహాయాన్ని తోటి సాయిబంధువులతో పంచుకోవటానికి సహాయపడే ఈ వేదికను సృష్టించిన సాయికి నా తరఫున, సాటి సాయిభక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నా అనుభవాలను సాయిబంధువులతో పంచుకునేముందు, నా జీవితంలో బాబాను నాకు పరిచయం చేసిన శనివారపువాళ్ళకి సదా కృతజ్ఞుడిని. మాకు బాబా అంటే ఎవరో కూడా తెలియనిరోజుల్లో మమ్మల్ని ప్రతి గురువారం కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) నుండి ధవళేశ్వరంలోని సాయిబాబా గుడికి తీసుకెళ్ళి బాబా యొక్క సాన్నిహిత్యాన్ని మాకు పంచిన ఆ కొబ్బరిచెట్టువారికి (ఇంటిపేరు శనివారపు) ఎంతో ఋణపడివున్నాము. సుమారుగా 1988వ సంవత్సరం నుండి నేను బాబా గుడికి వెళ్ళటం, బాబాను దర్శించుకోవడం జరిగేది. చాలా తక్కువ సమయంలోనే బాబా నన్ను చేరదీయడం వలన నాకు బాబా మీద చాలా నమ్మకం పెరిగింది. నా 14వ సంవత్సరంలోనే (1991) ప్రతిరోజూ బాబా సచ్చరిత్ర పారాయణ చేసేవాణ్ణి. ప్రతిరోజూ నాతోపాటు బాబాకు కూడా టీ పెట్టమని అమ్మను ఒప్పించాను. అలా ఎవరు నన్ను ఏమనుకున్నా, ‘ఇతనికి బాబా అంటే పిచ్చి’ అని అనుకున్నా నవ్వి ఊరుకునేవాడిని. ఎందుకంటే, ‘బాబా మీద నా నమ్మకం వమ్ముకాదు’ అని నేను చాలా దృఢంగా నమ్మేవాడిని. నా జీవితంలోని ఎన్నో సాయి సాక్ష్యాలను పంచుకునేముందు ఈమధ్యనే జరిగిన ఒక సాయిలీలను ముందుగా మీతో పంచుకుంటాను.
నేను యు.ఎస్.ఏ లో ఉద్యోగం చేస్తున్నాను. ఒకరోజు నా స్నేహితుడు తను ఉద్యోగం చేసే కంపెనీలో ఒక పొజిషన్ ఖాళీగా ఉందని, దానికి దరఖాస్తు చేయవలసిందిగా నన్ను కోరాడు. పొజిషన్ మరియు కంపెనీ మంచిది కావడం వల్ల నేను నా స్నేహితుడికి నా CV (Curriculum Vitae) పంపించాను. వెంటనే ఇంటర్వ్యూ ఏర్పాటైంది. ఇంటర్వ్యూ జరిగేరోజు గురువారం వచ్చింది. నాకు వచ్చిన ఇ-మెయిల్‌లో నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళ పేరు చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే, నన్ను ఇంటర్వ్యూ చేసే అతని పేరు ‘సాయి’. అది చూస్తూనే చాలా ఆనందంగా అనిపించింది. ఎటువంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా ముందురోజు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యాను. గురువారం ఇంటర్వ్యూకి హాజరై 70 శాతం బాగానే చేశాను.
నేనిక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బాబా మనకు సహాయం చేస్తారన్నది ఎంత సత్యమో, మనం కూడా ఏదైనా పనిని మనవైపు నుండి ఎటువంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా పూర్తి శక్తిసామర్థ్యాలతో ప్రయత్నిస్తే బాబా మనకు విజయం అందించడం తథ్యం. మన ప్రయత్నంలో లోపం ఉండవచ్చుగానీ, బాబా సహాయంలో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యమూ ఉండదు.
ఇంటర్వ్యూ అయిన తరువాత నేను ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీవాళ్ళు నాకు ఇ-మెయిల్ చేశారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. కనీసం 3 సంవత్సరాలు యు.ఎస్.ఏ లో ఉన్నవాళ్ళకే ఈ ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ, నేను యు.ఎస్.ఏ వచ్చి అప్పటికి కేవలం 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అయింది. అందువలన ఈ ఉద్యోగం నాకు రాదని అనుకున్నాను. కానీ, ఎక్కడో బాబాపై నమ్మకంతో ఆయన మీద భారం వేసి ఉన్నాను. రెండు వారాల తరువాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని కంపెనీ నుండి ఇ-మెయిల్ వచ్చింది. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తరువాత కూడా, “వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల కండిషన్ చూసుకొని ఉండరు, అందుకే డాక్యుమెంట్స్ అడుగుతున్నారు” అని అనుకున్నాను. రెండు వారాల తరువాత ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోమని నాకు ఇ-మెయిల్ వచ్చింది. ఒక్కొక్క దశ దాటుతున్నకొద్దీ నాలో టెన్షన్ కూడా అలాగే ఉండేది. ఒకవైపు బాబాపై నమ్మకం, మరోవైపు ఏ నిమిషంలోనైనా ‘మీరు అమెరికా వచ్చి 3 సంవత్సరాలు పూర్తికాలేదు కదా, అందుకే రిజెక్ట్ చేస్తున్నాము’ అనే మాట వినాల్సి వస్తుందేమోనని భయం. ఏదైతే ఏంటి, విజయవంతంగా ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేశాను. ఇక్కడినుంచి ఈ మొత్తం పనిని బాబా తన భుజాలమీద ఎలా మోస్తున్నారో నాకు అనుభవపూర్వకంగా తెలిసింది.
ఐడి కార్డుకి దరఖాస్తు చేసిన ఒక వారంరోజుల తరువాత ఐడి కార్డ్ తీసుకోవడానికి రమ్మని కంపెనీవాళ్ళు ఫోనుగానీ, ఇ-మెయిల్ గానీ చేస్తారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. ఒక వారం అయిన తరువాత కూడా నేను ఎటువంటి మెయిల్ రిసీవ్ చేసుకోలేదు. ఆ తరువాత యు.ఎస్.ఏ లో ఎన్నికల మూలంగా మరో 2 వారాలు గడిచినా కూడా నాకు ఎటువంటి ఇ-మెయిల్ రాలేదు. ఇంక నాకున్న ఆశ పోయింది. “నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది, అందుకే కంపెనీ నుండి రెస్పాన్స్ రాలేద”ని అనుకున్నాను. కానీ 4 వారాల తరువాత, హెడ్ ఆఫీస్ నుండి ఐడి కార్డ్ జారీ చేయబడిందనీ, బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళి కార్డ్ తీసుకోవాలని మెయిల్ వచ్చింది. కానీ, బ్రాంచ్ ఆఫీస్ నుండి కూడా మనకు ఇ-మెయిల్ వస్తే దానిని ప్రింటవుట్ తీసుకుని వెళ్ళి అడగవచ్చు కదా అనే ఉద్దేశ్యంతో వెంటనే బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళలేదు. కానీ, నా స్నేహితుడు “ఇంకా వెయిట్ చేయడం మంచిది కాదు, మనమే నేరుగా బ్రాంచి ఆఫీసుకి వెళదాం” అన్నాడు. “ఐడి కార్డ్ కోసం గురువారం వెళదాము” అని చెప్పే ధైర్యం లేక, “సరే, రేపు మీ ఇంటికి వస్తాను, అక్కడనుండి ఇద్దరం కలిసి వెళదాం” అని అన్నాను. కానీ నా మనస్సులో మాత్రం ఆరోజు ససేమిరా వెళ్ళే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే, మరుసటిరోజు బుధవారం. ఒక్కరోజు ఆగితే గురువారం. గురువారంరోజు బాబా రోజని మనందరికీ ఉన్న నమ్మకం. కానీ నా స్నేహితునికి ఈ విషయం చెప్పడం ఎందుకులే అని ఏమీ చెప్పలేదు. అయితే ఒక గంట తరువాత నా స్నేహితుడు ఫోన్ చేసి, మరుసటిరోజు బుధవారం బ్రాంచ్ ఆఫీసుకి సెలవు కావడం వలన నన్ను గురువారం రమ్మని చెప్పాడు. ఇక నా ఆనందం చూడండి.
ఇక గురువారం ఉదయం 8.30 కి బాబా సచ్చరిత్ర చదివిన తరువాత నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. తనకు 10 గంటలకు ఒక మీటింగ్ ఉందని, ఆ మీటింగ్ అయిన తరువాత వెళదామన్నాడు నా స్నేహితుడు. తరువాత ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకో నా దృష్టి వాళ్ళింట్లో ఉన్న దీపంపై పడింది. “ఈరోజు గురువారం కదా, పూజేమైనా చేశారా?” అని నా స్నేహితుడిని అడిగాను. నా స్నేహితుని కుటుంబం ఒరిస్సాకు చెందినవాళ్ళు కావడం వలన వాళ్ళు బాబా గురించి చెబుతారని నేను ఊహించలేదు. ఆశ్చర్యంగా నా స్నేహితుడు నాతో, తన భార్య బాబా భక్తురాలని, గురువారంరోజు ఉపవాసం ఉండి, బాబాకు ఆరతి చేసిన తరువాత సాయంత్రం భోజనం చేస్తుందని చెప్పడంతో నాకు ఒక్కసారి ఒళ్ళంతా జలదరించింది. ఎంతో ఆనందంగా బాబా విషయాలు నేను వాళ్ళతో పంచుకున్నాను. ఇంతలో నా స్నేహితునికి మీటింగ్ పూర్తికావడంతో ఇద్దరం బ్రాంచి ఆఫీసుకి బయలుదేరాము. కానీ, బ్రాంచి ఆఫీసులో ఎవరిని, ఎలా సంప్రదించాలో ఇద్దరికీ తెలియదు. ఎందుకంటే నేను ఎటువంటి ఇ-మెయిల్ వాళ్ళనుండి రిసీవ్ చేసుకోలేదు కదా. బ్రాంచి ఆఫీసుకి వెళ్ళి మేము ఐడి కార్డ్ కోసం వచ్చామని చెప్పాము. “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు . నా ఫ్రెండ్ తానిదివరకు ఐడి కార్డ్ తీసుకున్న వ్యక్తి పేరు చెప్పమన్నాడు. నేను అదే చెప్పాను. వాళ్ళు మమ్మల్ని కాసేపు వేచివుండమన్నారు. ఇంతలో అనూహ్యంగా మా వెనుకనుంచి ఒక వ్యక్తి వచ్చి ఆఫీసులోకి వెళ్తున్నాడు. నా ఫ్రెండ్ అతనిని చూసి విష్ చేసి, “మీరే కదా ఐడి కార్డ్ ఇచ్చేది?” అని అడిగాడు. అతను ‘అవున’న్నాడు. వెంటనే మా సంగతి అతనికి చెప్పాము. “మీకు నేను ఇ-మెయిల్ పంపానా?” అని అడిగాడతను. మేము ‘పంపలేద’ని చెప్పాము. వెంటనే అతను ఆఫీసులోకి వెళ్ళి ఇ-మెయిల్స్ చెక్ చేసి, బయటకు వచ్చి మాకు సారీ చెప్పి, “నా వల్లనే ఆలస్యమైంది, మీ ఐడి కార్డ్ హెడ్ ఆఫీసు నుండి 3 వారాల క్రితమే వచ్చింది” అని చెప్పి ఐడి కార్డును నా చేతికి ఇచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను 4 వారాలు సెలవులో ఉన్నాడట. కానీ, ఆఫీసులో ఏదో పనివుందని, ఒక గంటకోసం ఆరోజు రమ్మని ఆఫీసువాళ్ళు రిక్వెస్ట్ చేశారని, అందుకే వచ్చానని, మీరు చాలా లక్కీ అని మాతో అన్నాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, నా స్నేహితునికి ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటుంది. ఎందుకో ఆరోజు 10 గంటలకు మార్చటం, దానివలన మేము 10.30 కి బ్రాంచి ఆఫీసుకి రావటం, సరిగ్గా అదే సమయానికి సెలవులో ఉన్న అతను ఒక గంటసేపటి కోసం ఆఫీసుకి రావటం... ఇవన్నీ బాబా చేసిన ఏర్పాటు కాకపోతే మరేంటి?
ఇక చివరగా, ల్యాప్‌టాప్ నాకు పంపడం కోసం ఆఫీసువాళ్ళు నా అడ్రస్ తీసుకున్నారు. ఐడి కార్డ్ వచ్చిన ఒక వారానికి ల్యాప్‌టాప్ వస్తుంది. కానీ 3 వారాలైనా నాకు ల్యాప్‌టాప్ రాలేదు. చెప్పానుగా, ఏమో, ఏ నిమిషంలోనైనా ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగానే ఉన్నాను. 3 వారాల తరువాత, ల్యాప్‌టాప్ పంపామని, మంగళవారం నాకు చేరుతుందని మెయిల్ వచ్చింది. నాకేమో ల్యాప్‌టాప్ గురువారంరోజు వస్తే బాగుండని ఉంది. ఇంతలోనే ఆశ్చర్యంగా, కోవిడ్ కారణంగా ల్యాప్‌టాప్ పంపడం ఆలస్యమవుతుందని, గురువారంరోజు నాకు చేరుతుందని మెయిల్ వచ్చింది. ఇంక నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ల్యాప్‌టాప్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వస్తుందని నా ఫోనుకి మెసేజ్ వచ్చింది. ‘ఇంకేముంది, వచ్చేస్తుందిలే’ అని ఇంట్లోనే వుండి ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నాను. కాసేపట్లో ఎందుకో ఉలికిపడి లేచి టైం చూసుకుని మొబైల్లో మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను. “ల్యాప్‌టాప్ రిటర్న్ అడ్రసుకి పంపిస్తున్నామ”ని అందులో ఉంది. వెంటనే తేరుకుని, పోస్టాఫీసుకి వెళ్ళి ఐడి చూపించి ల్యాప్‌టాప్ తెచ్చుకుందామని బయలుదేరాను. ఇంట్లోంచి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వెనక్కు వెళ్ళి బాబా సచ్చరిత్రను చేతిలోకి తీసుకుని కారులో బయలుదేరాను. పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నా ఎదురుగా కొరియర్ ట్రక్ కనిపించింది. వెంటనే కారును ప్రక్కన పార్క్ చేసి నా ల్యాప్‌టాప్ గురించి వాళ్ళను అడిగాను. వాళ్ళు నన్ను అడ్రెస్ చెప్పమని అడిగి నేను అడ్రస్ చెప్పిన వెంటనే ల్యాప్‌టాప్‌ను నాకు ఇచ్చారు.
ఇక్కడ నేను చేసిన, మనమందరం గుర్తుంచుకొనవలసిన విషయం ఏమిటంటే, నేను బయటికి వచ్చేటప్పుడు సాయిసచ్చరిత్రను చేతిలో పట్టుకుని రావడం. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ బాబాను విడువరాదని మనం గుర్తుపెట్టుకోవాలి. “సాయీ! మీరు లేని లోకం మాకు శూన్యసమానం. సదా మీ సేవలో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి”.
I am also waiting for baba blessings 🙏🙏🙏🙏. Baba! Plz bless me with technical Job.
ReplyDeleteJai sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteBaba amma ki manchi arogyani prasadinchu thandri nenne namukuna bharam nedhe thandri
ReplyDeleteOm sai ram happy new year.please bless us
ReplyDelete🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDeleteVery nice experience sir. Meeru cheppindi Nijam andi manam Baba ni nammukunte aa nammakam eppudu vommu kadu. Andariki mee blessings undela chudu Sai.
ReplyDelete