- బాబా దయవల్ల నిమిషాల్లో తగ్గిన జలుబు
- సాయి దయవల్ల అంతా మంచి జరిగింది
బాబా దయవల్ల నిమిషాల్లో తగ్గిన జలుబు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా పేరు కుమార్. నేను హైదరాబాదులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా ఇంటి దగ్గరే వుండే సాయిబాబా గుడిలో పదిమంది సభ్యులతో కూడిన మా బృందం వాలంటీర్లుగా చిన్న చిన్న సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. మేము చేసే ప్రతి సేవాకార్యక్రమంలో బాబా ఆశీస్సులు మాకు చాలా స్పష్టంగా అనుభవమవుతూ ఉండేవి. ఆ అనుభవాలతో ఇంకా ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. కరోనా లాక్‌డౌన్ కారణంగా మా సామాజిక సేవాకార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. అందుకు మా బృందమంతా ఎంతో బాధపడేవాళ్ళం. నవంబరు నెలలో లాక్‌డౌన్ తీసివేసిన తరువాత, మళ్ళీ మా బృందమంతా కలిసి డిసెంబరు నెలలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. కానీ మనసులో ఒకప్రక్క కరోనా భయం మాత్రం వుండేది. అందరం కలిసి బాబాను ప్రార్థించి, మా సేవా కార్యక్రమాలు ప్రారంభించాము. మొదటిరోజు అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమం పూర్తయిన తరువాత ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకు జలుబు మొదలై, కొద్దిసేపటిలోనే బాగా తీవ్రంగా అయిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారి చాలా ఇబ్బందిపడ్డాను. కరోనా ఏమోనని చాలా భయపడ్డాను. అసలే నాకున్న “anxiety stress” కి ఇలా శ్వాససమస్య కూడా తోడైతే ఇంకా చాలా కష్టంగా వుంటుంది. 'పరిస్థితి ఇలాగే వుంటే ఇక ఈరోజు రాత్రికి నిద్ర కూడా పోలేను' అనుకొని, మనసులోనే బాబాను తలచుకొని, “బాబా! మీ సంతోషం కోసమే కదా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇబ్బంది ఎదురైతే ఎలా చేయగలం బాబా? శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా వుంది. నా జలుబును తగ్గించండి బాబా. మీ దయవల్ల జలుబు తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో ఈ అనుభవాన్ని అందరితో పంచుకుంటాను” అని వేడుకుని, పూజగదిలోకి వెళ్ళి కొంచెం బాబా ఊదీని నీళ్ళలో కలిపి తీర్థంలా తీసుకున్నాను. బాబా దయవల్ల సరిగ్గా పదిహేను నిమిషాల్లో అంతా సర్దుకుంది. జలుబు తగ్గిపోయి, శ్వాస తీసుకోవడం కూడా చాలా తేలికగా అయి, ఆ రాత్రికి హాయిగా నిద్రపోయాను. జలుబు వలన శ్వాస ఆడక అప్పటివరకు నేను చేసిన గందరగోళం చూసి మా ఇంట్లోవాళ్ళు వెళ్ళి ఏవేవో మందులు తీసుకొచ్చారు. కానీ నా సాయిబాబా నాకు జలుబు తగ్గించాక, ఇక నాకు ఏ మందులూ అవసరం లేదనిపించింది. నేను ఏ మందులూ వేసుకోకుండానే ప్రశాంతంగా నిద్రపోవడం చూసి మా ఇంట్లోవాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇక నేనయితే చెప్పనక్కర్లేదు, బాబా ప్రేమలో తడిసి (కన్నీళ్ళతో) ముద్దైపోయాను.
“బాబా! ఈ కలియుగంలో మీ వంటి దేవుడు లేకపోతే మా బ్రతుకులు ఎలా ఉండేవో ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా వుంది. అనుక్షణమూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మీరు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము బాబా. మీరు శిరిడీలో సశరీరులై వున్నప్పుడు, ప్లేగువ్యాధిని సమూలంగా నిర్మూలించి ఈ ప్రపంచాన్ని కాపాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా బారినుంచి ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారు. మీకు కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక, హృదయపూర్వక నమస్కారాలు ప్రభూ!
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయి దయవల్ల అంతా మంచి జరిగింది
అమెరికా నుండి సాయిభక్తురాలు శ్రీమతి సౌజన్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా కృతజ్ఞతలు. చిన్నతనంనుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా నాకు ఎన్నో అనుభవాలను, ఆనందాలను ప్రసాదించారు. నా ప్రస్తుత అనుభవానికి వస్తే.. మేము అమెరికాలో నివసిస్తున్నాము. ఇటీవల ఒకరోజు మావారు తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందని చెప్పారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ తనకు ఛాతీ దగ్గర నొప్పిగా ఉందన్నారు. తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు ఛాతీ వద్ద నొప్పి రావడంతో మాకు చాలా భయమేసింది. వెంటనే డాక్టరుకి చూపిద్దామని హాస్పిటల్లో అపాయింట్‌మెంట్ తీసుకుందామని ప్రయత్నిస్తే వారం రోజుల తరువాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అది కూడా గురువారంరోజు వచ్చింది. గురువారంరోజున అపాయింట్‌మెంట్ దొరకగానే బాబా ఆశీస్సులు మాపై ఉన్నాయని నాకు నమ్మకం కలిగింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! డాక్టరు మావారికి ఏ సమస్యా లేదని చెప్పేలా అనుగ్రహించండి. మీ దయవల్ల ఈయనకు ఏ సమస్యా లేకపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అన్నదానం కూడా జరిపిస్తాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత కొద్దిగా బాబా ఊదీని మావారి ఛాతీపై రాసి, మరికొంత ఊదీని నీళ్ళలో వేసి మావారికి ఇచ్చాను. బాబా నా బాధను విన్నారు. మావారిని పరీక్షించిన డాక్టర్, “ఏ సమస్యా లేదు, అంతా బాగానే ఉంది” అని చెప్పారు. నా సాయి దయవల్లనే అంతా మంచిగా జరిగింది. “థాంక్యూ బాబా! లవ్ యు బాబా! నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు బాబా!” బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపైన మరియు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Om sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba pleaseeee amma problem tondarga cure cheyi thandri sainatha
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete