సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 644వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని కృప
  2. బాబా అనుగ్రహంతో నిముషంలో తగ్గిన కడుపునొప్పి
  3. రహస్యంగా చేసిన పనికి బాబా సహాయం

సాయినాథుని కృప


సాయిభక్తుడు శ్రీధర్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


అందరికీ సాయిరామ్! నా పేరు శ్రీధర్. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాను. నాకు 30 సంవత్సరాల నుండి సాయితో అనుబంధం ఉంది. కానీ, రెండు సంవత్సరాల క్రితమే నాకు శిరిడీ వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పటికి నేను పి.హెచ్.డి థీసిస్ సబ్మిట్ చేసి సంవత్సరమైంది. కానీ ఫారిన్ ఎవాల్యుయేషన్ అవలేదు. శిరిడీ ప్రయాణంలో కోపర్గాఁవ్ వద్ద ఉండగా కూడా ఇంకా ఎవాల్యుయేషన్ అవలేదని నాకు ఫోన్ వచ్చింది. నేను సాయిని సర్వస్య శరణాగతి చేసి ప్రతివారిలోనూ సాయిని దర్శించాను. శిరిడీ నుండి తిరిగి రాగానే యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి రిపోర్టులు వచ్చాయని నాకు ఫోన్ వచ్చింది. ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.  అప్పుడు నా జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తుండటం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ నాకు పి.హెచ్.డి అవార్డు వచ్చింది. అది ఆ సాయినాథుని కృపే!


మరొక అనుభవం:


మా పెద్దమ్మాయి సాయికి యు.ఎస్.ఏ లో ఎమ్.ఎస్ చేయాలని కల. బాబా దయవలన తనకి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. తను టెక్సాస్ వెళ్లాల్సి ఉండగా కరోనా వలన అది కాస్తా ఆగిపోయింది. రెండవసారి స్కాలర్‌షిప్ రాకపోయినప్పటికీ బాబా దయవల్ల వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. కానీ, అందుకు సంబంధించిన అన్ని పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులెన్నో వచ్చాయి. "నీవే మాకు దిక్కు" అని బాబాపైనే ఆధారపడ్డాము. బాబా ఎంతో ప్రేమతో మాకు దారి చూపిస్తూ అన్ని ఇబ్బందులనూ అధిగమింపజేశారు. వీసా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు లేకుండా అంతా సజావుగా పూర్తయ్యేలా సాయి కృప చూపారు. "బాబా! మీరు మా పాపతో ఉన్నారని మా నమ్మకం. తోడుగా తనతో యు.ఎస్.ఏ వెళ్లి తనకు అండగా ఉండండి. పాప భవిష్యత్తు అంతా మీకే అప్పగించాము బాబా".


ఇంకో అనుభవం:


ఒకసారి మా ఇంటి లోపలికి తేనెటీగలు వచ్చాయి. వాటివలన మాకు ఏమైనా ప్రమాదం కలుగుతుందేమోనని భయమేసింది. అప్పుడు మేము బాబాకు నమస్కరించుకుని, "బాబా! వాటిని బయటకు తరిమివేయడం చాలా కష్టం. నీదే భారం" అని చెప్పుకొని బాబా స్మరణ చేయసాగాము. అరగంటలో ఆ తేనెటీగలు వాటంతట అవే వెళ్లిపోయాయి. ఇది చిన్న సంఘటనే అయినా బాబా మాకు రక్షణ కల్పించారు. "థాంక్యూ బాబా!"


బాబా అనుగ్రహంతో నిముషంలో తగ్గిన కడుపునొప్పి


సాయిభక్తురాలు శ్రీమతి అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు అంజలి. బాబా అనుగ్రహంతో ఇటీవల కలిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. డిసెంబరు 7వ తేదీన మేము శ్రీశైలం వెళ్ళాము. నిజానికి డిసెంబరు 8వ తేదీన మా అబ్బాయి పుట్టినరోజు. అందువల్ల ఆరోజు శ్రీశైలం వెళదామని నేను అనుకున్నాను. కానీ మావారు డిసెంబరు 7, సోమవారంనాడు వెళదామన్నారు. సరే, తనెందుకలా అంటున్నారో అనిపించి బాబాకు చెప్పుకుని, “ఏదైనా నీ ఇష్టం బాబా” అనుకున్నాను. సోమవారం తెల్లవారుఝామున మేమంతా శ్రీశైలం బయలుదేరాము. బాబా దయవల్ల ఉదయం 10 గంటలకల్లా శ్రీశైలం చేరుకున్నాము. ఆరోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఆలయం భక్తులతో చాలా రద్దీగా ఉంది. దాంతో 150 రూపాయల టికెట్ తీసుకుని స్వామి దర్శనం కోసం వెళ్ళాము. అంతలో నాకు బాగా కడుపునొప్పి వచ్చి చాలా అనీజీగా అనిపించింది. నాకు వేరుశనగపప్పు సరిపడదు. కానీ, ఆరోజు ఉదయం ప్రయాణంలో వేరుశనగపప్పు కొంచెం ఎక్కువగానే తిన్నాను. ఆ కడుపునొప్పి నాకు వేరుశనగపప్పు తినటం వల్లనే వచ్చింది. అవి నాకు సరిపడవని తెలిసినా తిన్నాను. దాంతో నేను బాబాను తలచుకుని, “ఎలాగైనా నాకు కడుపునొప్పి తగ్గించి స్వామి దర్శనం చక్కగా జరిగేలా చేయమ”ని కోరుకున్నాను. బాబాను అలా ప్రార్థించిన వెంటనే, కేవలం ఒక్క నిమిషంలోనే బాబా అనుగ్రహంతో నా కడుపునొప్పి తగ్గిపోయింది. బాబా దయవల్ల స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. అంత రద్దీలో కూడా ఆలయంలో నేను దీపం వెలిగించాను. నిజంగా అది మర్చిపోలేని అనుభూతి. అది కేవలం బాబా అనుగ్రహమే. బాబా దయవల్ల దర్శనమంతా చక్కగా జరిగి మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. బాబా ప్రసాదించిన మరో అనుభవంతో త్వరలో మీ ముందుకు వస్తాను. జై సాయిరాం!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


రహస్యంగా చేసిన పనికి బాబా సహాయం


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్. కరోనా కారణంగా నేను మా ఇంటికి చేరుకున్నాను. చదువుకోవడానికి అనువుగా మా గదిలోని ఫర్నిచర్ సర్దుబాటు చేద్దామని నేను, నా సోదరి అనుకున్నాము. చిన్న సమస్యలకి సైతం మా నాన్న చాలా కోప్పడుతుంటారు. అందువలన మేము ఎప్పుడూ చాలా భయపడుతుంటాం. ఆయన లేని సమయంలో మేము అనుకున్నట్లు సర్దుబాటు చేద్దామంటే, లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి రాత్రి అందరూ నిద్రపోయాక ఫర్నిచర్ మారుద్దామని అనుకున్నాము. అయితే రాత్రి వేళలో నిశబ్దంగా ఉంటుంది, ఏ చిన్నశబ్దం అయిన నిద్రాభంగం అవుతుంది. మేము ఫర్నిచర్ కదుపుతున్నప్పుడు వచ్చే శబ్దాలకు నాన్న లేదా కుటుంబంలోని ఇతర సభ్యులెవరైనా మేలుకుంటారేమోనని మేము చాలా భయపడ్డాము. సాయిబాబాపై విశ్వాసమున్న నేను "ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. నా సోదరి తను నమ్ముకున్న గ్రామదేవతను ప్రార్థించింది. తరువాత మేము మా పనిని ప్రారంభించాము. బాబా దయవల్ల మేము అనుకున్నట్లు మా పని పూర్తి చేసాము. ఉదయం నాన్న నిద్రలేచి మా గది చూసి, 'నాకు మెలుకువ రాకపోవడమేమిటి?, నాకెప్పుడూ అంత గాఢ నిద్రపట్టదే' అని చాలా ఆశ్చర్యపోయారు. నేను ఆనందంతో ఫర్నిచర్‌ను మార్చడంలో చేసిన సహాయానికి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

"ఓ దేవా! దయచేసి నా చదువుకి అనుకూలమైన వాతావరణాన్ని ఇంటిలో కల్పించండి. అకస్మాత్తుగా ఇంటికి రావడం అనేది నా చదువును ప్రభావితం చేయకుండా చూడండి. దయచేసి రైళ్ళు తిరిగి నడిచేలా అనుగ్రహించి, నేను నా క్యాంపస్‌కు తిరిగి వెళ్ళేలా సహాయం చెయ్యండి. నేను అనుకున్నట్లు జరిగితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇక మీ దయ బాబా".



3 comments:

  1. Baba pleaseeee help me my mother sai sai sai

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo