సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 652వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. చెంత ఉండి చింతలన్నీ దూరం చేస్తారు బాబా
  2. ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా
  3. సాయి ఆశీర్వాదం

చెంత ఉండి చింతలన్నీ దూరం చేస్తారు బాబా


ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. గత కొన్ని నెలలుగా ఈ బ్లాగును క్రమంతప్పకుండా చదివే భాగ్యాన్ని బాబా నాకు కల్పించారు. ఇందులో పంచుకుంటున్న సాయిభక్తుల అనుభవాలను ప్రేరణగా తీసుకుని నేనూ నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. బాబా ప్రతిక్షణమూ ఎన్నెన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు.


నా భార్య ఆరోగ్యానికి సంబంధించిన అనుభవం:


కొంతకాలంగా నా భార్య ఒక అనారోగ్యానికి చికిత్స తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఒక మందును ఆస్పత్రిలోనే తీసుకోవాలి. ఒకసారి లాక్‌డౌన్ కారణంగా సరైన సమయానికి మందు తీసుకోవటం వీలుకాలేదు. ఆ తర్వాత మరో పది నెలలు కూడా గడిచిపోయాయి. అప్పుడు బాబాపై భారం వేసి మేము హాస్పిటల్‌కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. డాక్టర్ని కలిసే ముందు కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంది. టెస్టులు చేసే చోట జనాలు ఎక్కువమంది ఉంటారు. అంతేగాక, చాలాసేపు వేచివుండాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి సమస్యేలేమీ లేకుండా ఆ సాయినాథుడే మమ్మల్ని కాపాడి టెస్టులు త్వరగా పూర్తయ్యేలా చేశారు. ఆ తర్వాత, ఆ రిపోర్టుల్లో ఏముంటుందో, డాక్టర్ ఏమి చెప్తారోనని ఆందోళనచెందాము. ‘పది నెలల వరకు ఆ మందు ఇవ్వకపోవటం వల్ల నా భార్య ఆరోగ్య పరిస్థితి దిగజారకూడదు’ అని బాబాను క్షణక్షణమూ ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. మొత్తంమీద ఆ సాయిదేవుని కృపవల్ల నా భార్యకు ఎటువంటి సమస్యా లేదని డాక్టర్ చెప్పారు. కేవలం మన బాబా దయవల్లే అంతా సవ్యంగా సాగింది. అడుగడుగునా చెంత ఉండి మన చింతలన్నీ దూరం చేస్తారు బాబా. మనం ఎంత ఆర్తిగా పిలిస్తే అంతగా ఆయన మనల్ని రక్షిస్తారు. మనం పిలవకపోతే వదిలేస్తారని కాదు. బిడ్డనొదిలి తల్లి ప్రశాంతంగా ఉండగలదా? మనందరి తల్లి, తండ్రి, గురువు, దైవమైన సాయి ఎలా ఉండగలరు? ఆయన మనల్నెప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. కావల్సిందల్లా కేవలం శ్రద్ధ, సబూరి.


ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా


రాజమండ్రి నుంచి సాయిభక్తుడు రాధాకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు రాధాకృష్ణ. నా చిన్నతనంనుండి చిత్రపటం రూపంలో సాయిబాబా మా ఇంటిలో కొలువై ఉండటం వల్ల నాకు ఆయనపై అపారమైన భక్తి ఏర్పడింది. సాయిబాబా ప్రసాదించిన దివ్యానుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనే దృక్పథంతో నా స్వీయ అనుభవాన్ని విశదపరుస్తున్నాను. మా పెద్దమ్మాయికి 2020, ఫిబ్రవరి నెలలో వివాహమైంది. మార్చి నెలలో దంపతులిద్దరూ కొత్త కాపురం పెట్టారు. ఆ సమయంలోనే (కరోనా లాక్‌డౌన్‌కి ముందు) మా నాన్నగారు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా తన 87వ యేట సాయిలో ఐక్యమయ్యారు. మా నాన్నగారు పరమపదించినరోజునే మా అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఇంతలో కరోనా వచ్చింది. దాంతో మా అమ్మాయి, తన భర్త, అత్తగారు వేరే రాష్ట్రంలో నాలుగు నెలలపాటు ఉండిపోయారు. గర్భం దాల్చిన మొదటి నెలల్లో మా అమ్మాయి వాంతులతో ఇబ్బందిపడుతుండటంతో, కరోనా పాస్ పర్మిషన్ తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆపై ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ, డిసెంబరు 17వ తేదీ, గురువారంనాడు ఆపరేషన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనుక్షణం బాబా ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్నారు. అన్నట్లు ఒక ముఖ్య విషయం చెప్పాలి, మా అమ్మాయి గర్భవతిగా ఉన్న సమయంలో "నేను మీ ఇంటికి మీ పాపకి బాబు రూపంలో పుడతాను" అని బాబా నాకు సంకేతం ఇచ్చారు. మా నాన్నగారు శిరిడీ సాయిని పూర్తిగా నమ్మినవ్యక్తి. ఆయన సాయిలో ఐక్యం చెందిన రోజే మా పాప గర్భం దాల్చడం, ముందుగానే బాబా నాకు సంకేతం ఇచ్చినట్లు గురువారంరోజున చంటిబిడ్డ రూపంలో మా ఇంటికి రావడంతో నాకు చాలా ఆనందం కలిగింది. ఈ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా పంచుకోవాలని అనుకొని ఇప్పుడు మీతో పంచుకోవడం కూడా నాకు సాయిలీలగా అనిపిస్తోంది. నా ఈ ప్రథమ అనుభవం ద్వారా ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో అడుగుపెట్టాను. కొద్దిరోజులలో ఎన్నో సాయి లీలలు మరల పంచుకుంటాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కృప ఎప్పుడూ మీపై ఇలాగే ఉండాలి".


సాయి ఆశీర్వాదం

హిమాచల్ ప్రదేశ్ నుండి సాయి భక్తురాలు శృతి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు;

మేము 2019 శీతాకాల సెలవుల్లో మహాబలిపురం సందర్శించాలని అనుకున్నాము. మా ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఊహించని విధంగా వాతావరణంలోని మార్పుల కారణంగా విమానాలు రద్దు చేయబడుతున్నాయి, లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. నాకసలే విమాన ప్రయాణమంటే భయం, పైగా వాతావరణం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో నేను, "మా ప్రయాణం ఎటువంటి ఒడిదుడుకులు లేకండా సాఫీగా సాగాల"ని మన ప్రియమైన సాయిని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా మేము ప్రయాణించాల్సిన రోజు వాతావరణం అనుకూలంగా మారింది. ఆరోజు ఎండ బాగా కాసింది. మా ప్రయాణం స్వల్ప ఒడిదుడుకులతో సంతోషదాయకంగా సాగింది. నేను భక్తుల అనుభవాల ద్వారా చెన్నైలోని మైలాపూర్ బాబా మందిరం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆ మందిరాన్ని సందర్శించాలని చాలాసార్లు అనుకున్నాను. ఆ విషయమై నా కోరిక నెరవేర్చమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయన ఆశీర్వాదం వలన మా ఈ ప్రయాణంలో ఆ భాగ్యాన్ని కూడా పొందాను. అంతటా మాకు మంచి దర్శనాలు జరిగాయి. తిరుగు ప్రయాణం కూడా సజావుగా సాగింది. మేము ఇల్లు చేరుకున్న మరుసటిరోజు వాతావరణం మునపటి కంటే దారుణంగా మారిపోయింది. అలా బాబా మా ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా మార్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సాయి నన్ను ఈ రీతిన  ఆశీర్వదిస్తారని నేనెన్నడూ ఊహించలేదు. "బాబా! మీకు చాలా చాలా కృతఙ్ఞతలు. మీరు లేని నా జీవితం అసంపూర్ణం. దయచేసి అందరినీ ఆశీర్వదించండి.

ఓం సాయిరామ్, జై సాయిరామ్.



4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo